Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 50


    ఇంత సిస్టమేటిక్ గా ప్రతి అడుగూ వేస్తున్న శశాంక సామాన్యుడు కాడని అప్పటికి పూర్తిగా అర్థమైంది యమగూచీకి.


    "జాకీ... నువ్వు సెల్లరీలోకి వెళ్ళి రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ పనిచేయకుండా డేమేజ్ చెయ్"


    జాకీ ఆ పని పూర్తిచేసి తిరిగి రావడానికి పట్టింది నాలుగు నిమిషాలు.


    జాకీని దగ్గరగా రమ్మని సౌంజ్ఞ చేసి కెప్టెన్ని కేబిన్ లోకి నడిపించాడు. ఐరన్ సేఫ్ తాళాలు తీసుకుని పాళీలుగా పోతపోయబడిన బంగారాన్ని ఓ ఏస్బెస్టాస్ బేగ్ లో సర్దమన్నాడు జాకీతో.


    ఆ తర్వాత అనుకున్నది అక్షరాలా అమలు జరిపించడానికి శశాంకకి పట్టింది ఏడు నిమిషాలు మాత్రమే.


    బంగారాన్ని జంక్ (మోటార్ బిగించబడి వున్న చిన్న పడవ)లో ఎక్కించి డెక్ పై వున్న క్రేన్ తో సముద్రంలోకి దింపించాడు చీఫ్ ఆఫీసర్ సహాయంతోనే.


    నిచ్చెన ద్వారా శశాంక యమగూచీతో సహా జంక్ ని చేరుకున్నాడు ముందుగా.


    అప్పుడు జాకీని దిగమన్నాడు. ఈ ప్రాసెస్ లో ఎక్కడా శశాంక అజాగ్రత్త చూపలేదు. రివాల్వర్ ట్రిగ్గర్ పై వేలు వుంచే అవి జరిపించుకుపోయాడు. అంతసేపూ చేష్టలుడిగి నిలబడ్డ సెకండ్ ఆఫీసరు చివరగా కొద్దిపాటు తొందరపాటును ప్రదర్శించి జాకీని అడ్డగించబోయాడు.


    అంతే శశాంక ఎడం చేతిలోని రివాల్వర్ నిప్పులు కక్కడమూ తూటా అతడి భుజాన్ని గాయపరచడమూక్షణాల్లో జరిగిపోయింది.


    అక్కడ సెకెండాఫీసరు అలాంటి అవివేకాన్ని ప్రదర్శించింది శశాంక గురి విజయంలో తక్కువగా అంచనా వేసి.


    మరో షూటర్ కైతే సాధ్యం కానిది అపారమైన అనుభవంతో శశాంకకి మాత్రమే వీలుపడేది అరంగుళం గేప్ లో నుంచి కూడా తూటాని ప్రయోగించడం.


    అందుకే తనను గాయపరచాలనుకుంటే జాకీకి తగులుతుందని డెక్ అంచుమీది నుంచి అరంగుళం వారగా నిలబడి జాకీని పైకి లాగే ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు సెకెండాఫీసర్.


    జంక్ కదిలింది మరో రెండు నిమిషాల తర్వాత.


    కేవలం ఇరవైరెండు నిమిషాల్లో ఇంత పెద్ద పథకాన్ని చకచకా అమలుచేసి తమ కళ్ళముందే కెప్టెన్ని లాక్కుపోతుంటే నిరుత్తరులై పోయిన ఏ ఒక్క వ్యక్తీ ఇప్పుడు జరిగిందంతా నిజమని నమ్మలేకపోతున్నారు.


    దశాబ్దాల అనుభవం గల సముద్ర యానంలో ఇలాంటి సంఘటన జరగడం తొలిసారి కావడంతో దిక్కుతోచని దీనిలో నిలబడినట్టు అంతా కనుమరుగౌతున్న జంక్ ని చూస్తూ వుండిపోయారు.


    "మిస్టర్ యమగూచీ" మోటార్ బోట్ బడుపుతున్న కెప్టెన్ని ఉద్దేశించి అన్నాడు శశాంక. "తెల్లవారిపోతున్న ఈ సమయంలో అతి తెలివిని ప్రదర్శిస్తే నీ బ్రతుకూ తెల్లవారిపోతుంది. అక్కడ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ పనిచేయని స్థితిలో వుంది కాబట్టి ఇంకా మీ వాళ్ళు నిన్నేదో ఉద్ధరిస్తారనుకోకు. త్వరగా ఒడ్డుకు చేర్చవా నువ్వూ ఒడ్డున పడతావు. లేదా నీ భాగోతం కూడా బయటపడుతుంది" చాలా అందమైన బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ అందమైన యువకుడు రాక్షసుడిలా కూడా ప్రవర్తించగలడని అప్పటికే అర్థం చేసుకున్న యమగూచీ అతితెలివి ప్రదర్శించలేదు. స్థానబలం లేనిచోట దిక్కుతోచని స్థితిలో అలాంటి సాహసం ఇక చేయకుండా తీరానికి చేర్చాడు మరో పది నిమిషాలలో.


    ముందు జాకీ గోల్డ్ ని ఒడ్డుకి తీసుకెళ్ళాక యమగూచీతో చివరగా అన్నాడు శశాంక "మిస్టర్ యమగూచీ. నువ్వుగాని, నీకీ పని పురమాయించిన జయచంద్రగాని ఎవ్వరితో చెప్పుకోలేని మీ స్థితిని చూస్తుంటే జాలేస్తుంది. ఎప్పుడన్నా నా రూపం గుర్తుకొస్తే నా పేరు కూడా జ్ఞప్తికి తెచ్చుకోడానికి ప్రయత్నించు. అయామ్ శశాంక"


    భీమిలి రోడ్డు ఇరవై ఆరో కిలోమీటరు రాయి దగ్గరకి చేరుకున్న శశాంక దూరంగా సాగిపోతున్న బోట్ ని చూస్తూ విజయగర్వంగా నవ్వాడు తొలిసారి కాదు రెండోసారి.


    అయితే, పదిహేను సంవత్సరాల పోరాటంలో ఓటమి ఎరుగకుండా అంచెలంచెలుగా పైకెదిగిన జయచంద్ర సామ్రాజ్యపు పునాదులు కదలడం మాత్రం రెండోసారి కాదు, ఇదే తొలిసారి.


    "వెల్ కమ్"


    సుమారు పధ్నాలుగు గంటల టాక్సీ ప్రయాణం తర్వాతం బంగారంతోబాటు భద్రంగా ఇంటికి చేరిన శశాంకని పరవశంగా ఆహ్వానించింది సోఫియా.


    అప్పటికే రాత్రి ఎనిమిది కావస్తుంటే టాక్సీ సిటీలో అడుగుపెట్టగానే జాకీని దింపి శరణాలయానికి పంపేశాడు శశాంక.


    సోఫియాతో బాటు ఆమె పర్సనల్ ఛాంబర్ లోకి నడుస్తున్న శశాంక గుర్తించాడు ఆమె తాగి వుందన్న విషయాన్ని.


    మాటే కాదు. కాళ్ళు తడబడుతుంటే అమాంతం అతడిపై వాలిపోయింది. "బ్రేవో మై డియర్... బ్రేవో... ఈ ఇరవై నాలుగు గంటలూ ఎంత టెన్షన్ అనుభవించానో ఎలా చెప్పను. సాధించావు. రియల్ హిమాన్" చేతులు కాంక్షగా అతడి మెడను చుట్టేసాయి.


    "నా పని పూర్తి చేశాను" భావరహితంగా అన్నాడు.


    "పూర్తి చెయడమేంటి డియర్. ఇది ప్రారంభం మాత్రమే" ఆమె గొంతులో అభినందన పూర్వకమైన సన్నని వివశత్వం. అవును మరి... గడిచిన అయిదేళ్ళ కాలంలో సోఫియా ఇంతటి సంతోషాన్ని ఏనాడూ రుచి చూడలేదు. "చెప్పు శశాంకా. నీ వాటా సంగతి అటుంచు. ఇంకా ఏం కావాలీ అది చెప్పు. ఆనందంగా ఇస్తాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS