Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 49


    కాంట్రాక్టర్


    అని సైన్ బోర్డ్ వుంది.


    అవంతి అతనితోపాటుగా నడిచింది.


    హాల్లో అడుగు పెడుతూనే మనోహర్, అతనితోపాటుగా అవంతీ ఆగిపోయారు.


    సోఫాలో కూర్చుని సిగార్ తాగుతూ గ్లాస్కో లాల్చీ, పంచెకట్టులో న్యూస్ పేపర్ చదువుతున్నారు రామదాసుగారు.


    ఎడంచేతి నాలుగు వేళ్ళకి బంగారపు వుంగరాలు వున్నాయ్.


    వయసు ఏభై అయిదు పైన వుంటుంది. ఆయన గంభీరంగానూ, దర్పంగానూ వున్నారు.


    "డాడీ?" అని పిలిచాడు మనోహర్.


    ఆయన న్యూస్ పేపర్లోంచి తలెత్తి చూశాడు.


    కొడుకు, కొడుకు పక్కనే నించొని వున్న అవంతిని చూసి -


    "ఈ అమ్మాయి గురించేనా చెప్పావు" అడిగారు.


    "అవును డాడీ, షీ ఈజ్ మిస్ అవంతి"


    "అవంతీ, మా డాడీ" అంటూ పరిచయం చేశాడు.


    అవంతి గౌరవంగా "నమస్కారమండీ?" అంది.


    తనొస్తున్న విషయాన్ని ముందుగానే మనోహర్ తండ్రికి చెప్పినట్టుగా అవంతి గ్రహించింది.


    "గుడ్. అబ్బాయి నిన్ను గురించి చెప్పాడు. ఇది నీ సొంతఇల్లుగానే భావించి వుండొచ్చు" అన్నారు రామదాసు.


    పని కుర్రాడు ఆమె బ్యాగ్ ని తీసుకొన్నాడు.


    "అమ్మాయిని గెస్ట్ రూంలోకి తీసుకెళ్ళు" అన్నారు రామదాసుగారు.


    "రండమ్మా?" అని పని కుర్రాడు పిలిచాడు.


    "వస్తానండీ?" అంటూ ఆ కుర్రాడి వెంట నడిచింది.


    ఇంట్లో ఎక్కడ చూసినా చాలా ఖరీదైన ఫర్నిచర్ ఉంది. ఇల్లు ఎంతో చక్కగా అలంకరించి వుంది.


    ఆ ఇంటికి ఆడదిక్కులేకపోయినా అంతతీరుగా అమరి వున్నదంటే అది మనోహర్ టేస్టేనని ఆమె అర్థం చేసుకొంది.


    మనోహర్ ఆమెని యూనివర్శిటీకి తీసుకెళ్ళి మార్క్స్ మెమో, ప్రొవిజినల్ సర్టిఫికేట్ తీసుకొన్నాడు అదే రోజున.


    నాలుగు రోజుల్లో అన్ని పనులూ స్వయంగా దగ్గరే వుండి పూర్తిచేశాడు మనోహర్.


    నాలుగు రోజులు కూడా అవంచి చాలా స్వేచ్ఛగా ఫీలయింది. అది తన సొంత యిల్లుగా అనిపించింది ఆమెకి.


    ఆమెకేవిధమైన ఇబ్బంది అనేది కలగనే లేదు.


    ఇప్పుడు తను లాయర్.


    లాయర్ అవంతి. బి.ఎ, ఎల్.ఎల్.బి.


    చాలా గర్వంగా వుంది ఆమెకి. అదంతా మనోహర్ కరుణతో తనకి పెట్టిన భిక్షగా ఆమె భావించింది.


    "నువ్వు చేసిన ఈ పరోపకారాన్ని నేను జీవితమంతా గుర్తుంచుకొంటాను మనోహర్" అంది.


    "ఇదేమంత గొప్ప విషయంగా నేను భావించడంలేదు. నువ్వు నా స్నేహితురాలివి. నీ కోసం నేను ఏమైనా చెయ్యాల్సిన బాధ్యత నాపైన వున్నదని నేను అనుకుంటున్నాను. అంతే?" అన్నాడు.


    అవంతి అతని భుజాలపైన చేతుల్ని వేసి సున్నితంగా అతని పెదవుల్ని అందుకుంది.


    అతని పట్ల తనకి గల అభిమానాన్ని వ్యక్తపరచడానికే తప్ప వేరే కోరికతో మాత్రం కాదు అతన్ని ముద్దు పెట్టుకొంది.    


    "నన్ను రేపు పంపించెయ్యాలి?" అంది అవంతి.


    "అలాగే?" అన్నాడతను.


    ఆ రాత్రి అవంతి బాల్కనీలో నించొని వుంది. కింద హాల్లో రామదాసు మనోహర్ తో మాట్లాడుతున్నాడు.


    "అవంతి గురించి నీ అభిప్రాయం!"


    "చాలా మంచి స్నేహితురాలు డాడీ" అన్నాడు మనోహర్.


    "మంచి స్నేహితురాలు కనుకనే నువ్వు తీసుకొచ్చావని నాకు తెలుసు. నీకు ఇంజనీరింగ్ పూర్తయింది. నువ్వు ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు. నాకున్న కాంట్రాక్టుల్ని నువ్వు చేసుకోగలిగితే చాలు. అలాగే ఇంటిలో ఆడదిక్కు అవసరం. అవంతిని యోగ్యురాలిగా నేను ఈ నాలుగు రోజుల్లోనూ గ్రహించాను"


    మనోహర్ ఆశ్చర్యంగా చూశాడు "డాడీ?" అన్నాడు.


    రామదాసుగారు చిరునవ్వు నవ్వారు.


    "ఇంతకాలం నువ్వు తిరిగిన తిరుగుళ్ళు ఎలాంటివో నాకు తెలుసు. అయినా నిన్ను అడ్డగిస్తే బాధపడతావని నేనేనాడూ నీదారికి అడ్డురాలేదు. అవంతి లాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలైతే నాకే చింతా వుండదు" అన్నారాయన.


    అవంతి నిరత్తురురాలైంది.


    మనోహర్ ఏం చెబుతాడో! ఆమె గొంతు పూడుకుపోతోంది.


    "సారీ డాడీ, మేమిద్దరం మంచి స్నేహితులం. మా ఇద్దరికీ అలాంటి ఆలోచన లేదసలు" అన్నాడు.


    రామదాసుగారి భృకుటి ముడిపడింది.


    "నీ ఇష్టం. పెద్దవాడిగా, బాధ్యత తెలిసిన వ్యక్తిగా నీకు చెప్పవలసింది చెప్పాను ఆలోచించుకో. అమ్మాయితో కూడా మాట్లాడు" అన్నారాయన.


    మనోహర్ మాట్లాడలేదు. మనోహర్ మౌనంగా మేడ మెట్లు ఎక్కి వస్తుంటే పక్కకి తప్పుకొంది అవంతి. ఆమెకి ఏం చెయ్యాలో అర్థంకాలేదు. మనోహర్ తనని గమనించిన సంగతి ఆమెకి తెలీదు.


    మనోహర్ బాల్కనీ షెడ్ లో నిలబడి వున్న అవంతిని చూసి మెత్తగా నవ్వాడు.


    అవంతి మనోహర్ కేసి చూసి తలొంచుకుంది.


    మనోహర్ సిగరెట్ వెలిగించి మెల్లగా అన్నాడు. "డాడీ నాతో మాట్లాడిన మాటలు విన్నావు సుమా?"


    అవంతి విన్నానన్నట్టుగా తలూపింది.


    "డాడీకి నేను చెప్పిన మాటకూడా విన్నావా!"


    "ఊ......"


    మనోహర్ ఆమె భుజంపైన చెయ్యివేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS