Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 49


    ఇంకా కలలోలా వుంది. అయినా మననం చేసుకున్నాడు మరో మారు.
    
    ముందు 'బికినీ' కథ చెప్పమంది. ఈ రాత్రికే జవాబు చెప్పగలిగితే మరేదో ఇస్తానంది.
    
    'షాక్ లో అయితే చివరిదాన్ని ఇన్ స్ట్రుమెంటుగా అయితే ముందు వుంచేదాన్ని మిస్ దగ్గర మిస్ కాకూడని రెండింటినీ కానుకగా...'
    
    అంటే? లోతుగా ఆలోచిస్తున్న కొద్దీ అశ్లీలంగా అనిపిస్తూంది తప్ప మరో అర్ధం తోచడంలేదు.
    
    ఇన్ స్ట్రుమెంట్ అయితే ముందు ఉంచేదాన్ని' అన్న వాక్యం కంటే 'మిస్ దగ్గర మిస్ కాకూడని రెండింటినీ' అన్న వాక్యమే చాలా వల్గర్ గా అనిపించింది.
    
    "ఇంతసేపూ ఏం చేసింది ప్రబంధ? చిన్న అలలా వచ్చింది. పిల్ల కాలువలా చప్పుడు చేసింది. చివర నిజంగానే షాక్ సృష్టించి ఆ తుఫానులో తను ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే జారుకుంది.
    
    ఏమిటి ఆ యిచ్దేది?
    
    వాచీ చూసుకున్నాడు. సాయంకాలం నాలుగున్నర కావస్తూంది. అంతర్ముఖుడిలా బ్రతకటం అలవాటైనా ఇప్పుడిప్పుడే పోటీ మనస్తత్వం కూడా డెవలప్ అయిపోతుంది అతడిలో బికినీ గురించి తెలుసుకోవాలనుంది.
    
    ఎలా? ఎన్ సైక్లోపీడియాలో తప్ప లభ్యంకాని వివరాలు ఇప్పటికిప్పుడు ఎలా సేకరించగలడు?
    
    ప్రణయ గుర్తొచ్చింది. రెండు రోజులుగా ప్రణయని కలుసుకోలేదన్న విషయమూ స్ఫురణకి రావడంతో అన్యమనస్కంగా ముందుకు నడవబోయాడు.
    
    అప్పుడు ఎదురొచ్చాడు సూరి. "శభాష్! మగాడివైపోతున్నావ్!"
    
    తనకున్న ఆత్మీయుల్లో అతి ముఖ్యుడు సూరి. అలాంటివాడు అందరిముందూ తనను ఆటపట్టించడం నచ్చలేదు. తప్పించుకు వెళ్ళబోతుంటే సూరి ఆ అవకాశం యివ్వలేదు.
    
    "ఆగరా ఆదిత్యా! ఎంత పరవశంలో చిక్కుకుంటే మాత్రం మిత్రుల్ని ఇలా తప్పించుకు తిరగటం ఏం బాగోలేదు."
    
    "నాకు పనుంది."
    
    "అయితే మరి మా పని కొనసాగించమంటావా?"
    
    అర్ధంకానట్టు చూశాడు ఆదిత్య.
    
    "అదేరా....." వివరించాడు సూరి, "రెండుసార్లు నువ్వు ప్రణయతో కార్లో వెళ్ళినందుకే శౌరి అక్రమసంబంధం అంటగట్టి గోడలమీద రాయించాడుగా! నువ్వు సరేనంటే ఇప్పుడు నీకూ, ప్రబంధకూ ఏదో వుందని ఈ రాత్రికే రాస్తాను."
    
    "అవును" మిగతా స్నేహితులు వంతపాడేరు.
    
    "వద్దు.... ప్లీజ్!"
    
    "అదేం?"
    
    "ఎవరో చేశారని అదే పొరపాటు నువ్వూ చేయడంలో అర్ధంలేదు."
    
    "అర్ధం ఉందో, లేదో నాకు తెలీదు ఆదిత్యా! శౌరికి మన సంగతి అర్ధం కావాలీ అంటే అదొక్కటే మార్గం."
    
    "మధ్యలో నేను ఇబ్బందిపడతాను సూరీ!"
    
    "అదెలారోయ్?" మరో స్నేహితుడు అందుకున్నాడు. "దీనితో నిన్ను నిశ్శబ్దంగా ఆరాధిస్తున్న యూనివర్శిటీ విద్యార్ధినులకి అర్ధమయిపోతుంది."
    
    "ఏమని?" అడిగాడు ఆదిత్య వ్యంగ్యంగా.
    
    "మనవాడి మనసు పుష్పక విమానమని, సాలభంజికలు ఎందరెంద రొచ్చినా ప్రేమ పజిల్స్ ని సాల్వ్ చేసుకుంటూ సింహాసనందాకా సాగిపోతాడని."
    
    "ప్లీజ్..." అడ్డంపడుతున్న మిత్రులతో అన్నాడు.... "నన్ను వెళ్ళనివ్వండి."
    
    "వెళ్ళాలీ అంటే ముందు మా ప్రశ్నకి జవాబు చెప్పు..." సూరి ఖండితంగా అన్నాడు. "ప్రబంధ నీ దగ్గరికి ఎందుకొచ్చింది....? ఎంత కాలంగా ఈ పరిచయం కొనసాగుతూంది...? ఈ రోజు ప్రత్యేకించి ఏం మాట్లాడింది? మళ్ళీ ఎప్పుడు కలుస్తానంది?"
    
    తల పట్టుకున్నాడు ఆదిత్య.
    
    "వద్దు..... అలా తల పట్టుకోవద్దు.... మేం వూహించినదానిలో తప్పు ఉంటే మా గొంతులు పట్టుకోగాని అలా తల పట్టుకుని ఏమీ లేనట్టు నటించేయకు."
    
    "సూరీ....!" నచ్చచెప్పబోయాడు. "నా సంగతి నీకు తెలుసు."
    
    "అలా అని ఇంతకాలం పొరపాటు పడ్డాన్రా! కాని ఇప్పుడిప్పుడే అర్ధమవుతూంది. నువ్వు అసాధ్యుడివి. ప్రాణస్నేహితుడిననుకున్న నన్ను కాదని, పబ్లిక్ గా అమ్మాయిలతో కాలక్షేపంచేసే నీ పద్దతి చూస్తుంటే మరి కొంత కాలానికి నన్ను పూర్తిగా మరిచిపోయేట్టున్నావ్!"
    
    మృదువుగా నవ్వేశాడు ఆదిత్య- "నీకు చెప్పకుండా నేనే నిర్ణయమూ తీసుకోను సూరీ. ఎందుకంటే..."
    
    "చెప్పు..."
    
    "నువ్విప్పుడు చూస్తున్న ప్రపంచంలోకి నన్ను నెట్టినవాడివి నువ్వే కాబట్టి."
    
    "వెధవ కబుర్లు మానేసి ఏదన్నా న్యూస్ ఉంటే చెప్పు" అన్నాడు సూరి ఉత్సాహంగా.
    
    "మీరంతా నన్ను ఆపింది నా నుంచి ఏదో తెలుసుకోడానికి....అవునా?"
    
    "అవును."
    
    "నాకూ చెప్పాలనే వుంది."
    
    "అమోఘం....!"
    
    "కాని సూటిగా కాదు."
    
    "అదేం?"
    
    "చెప్పటానికి టైమ్ రాలేదు కాబట్టి."
    
    "పోనీ ఏ టైంలో చెబుతావో అది చెప్పు."
    
    "ఆ టైం చెప్పాలీ అంటే ముందు మీరు కొంత టైం స్పేర్ చేయాలి" నవ్వుతూ చూశాడు ఆదిత్య.
    
    "సరే....అఘోరించు! మేం టైం స్పేర్ చేయాలి. అంతేగా...? సూరి అసహనంగా అన్నాడు.
    
    "అవును టైంకి సంబంధించే చిన్న ప్రశ్నకి జవాబు చెప్పాలి."
    
    "అంతేగా! అడుగు."
    
    "వాట్ టైమ్ ఈజిట్ వెన్ ద క్లాక్ స్ట్రయిక్స్ థర్టీన్?"
    
    సూరి నొసలు చిట్లించాడు. "గడియారం పదమూడు కొట్టేది ఏ టైంకో చెప్పాలా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS