Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 4


    "అతడు ఫారిన్ వెళ్ళి ఫీలాసఫీలో పి.హెచ్. డి. తీసుకొంటున్నాడని మరిచావా?"

    "చదువుకూ జీవితానికీ లింకేమిటి? అది ఆసక్తి. సరదా. ఫిలాసఫీ విద్యార్థులంతా బైరాగులైపోతారనా?"

    "కాడు, శ్రీలూ! కేవలం ఆసక్తి సరదా కాదు. అతడి తత్వమే అది. అతడు నిజంగా విరాగి. మన ఆశలవల్లా, ప్రలోభంవల్ల దేవ పారిజాతాన్ని మనతల్లో పెట్టుకొనే మామూలు మల్లెపువ్వుగా భ్రమించడం వంచనే అవుతుంది" అన్నారాయన గంభీరంగా.

    కాదని వాదించడానికి ధైర్యం చాల్లేదు శ్రీలక్ష్మికి. తను నెలలపిల్లవాడి అప్పటినుండీ చూస్తూనే ఉంది. భార్గవుడిని. తన పెళ్ళిలో భార్గవుడు నెలపిల్లవాడు. తనకు సంతానం చాలా ఆలస్యంగా కలిగింది. కృష్ణవేణి బాబుతో యిక్కడికి వచ్చిందంటే తను వాడిని వదిలేదికాదు. పసి వయసులో సహజమైన అల్లరీ. ఏడుపూ లేవు. తల్లే వాడి ఆకలి గుర్తించి పాలుపట్టేది గాని పాలకోసం కూడా ఏడ్చేవాడు కాదు. ఆట బొమ్మో, ఏదో చేతికి పట్టిస్తే ఆడుకొంటూ వుండేవాడు. అక్షరాభ్యాసం చేయించి బళ్ళో వేశాక చదువుకూ, అతడికే తెలుసు. కాలేజీ చదువులకు వెళ్ళాక తల్లితో ఒకటి రెండుసార్లే వచ్చాడిక్కడికి. తన మందనుండి విడి కొత్త మందలోకి వచ్చిపడ్డ జంతువులా అందరికీ దూరదూరంగా తిరిగేవాడు. "భార్గవుడెక్కడా కనిపించడం లేదేమమ్మా" అని వెదకబోతే డాబా పిట్టగోడలమీదనో, తోటలో మల్లెపందిళ్ళ చాటునో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చొని కనబడేవాడు.

    "భార్గవుడు అందరినీ తప్పించుకొని అలా తిరుగుతాడేం వదినా? సిగ్గా?" అని అడిగితే కృష్ణవేణి బాధపడుతూ చెప్పేది "అక్కడా ఇంతే. కొత్తచోట అనేంకాదు. చివరికి జీవితంలో ఆ వంటరితనమే మిగుల్చుకొంటాడేమో!"

    ఎం. ఎ. ఫస్ట్ క్లాసులో పాసై ఉన్నత విద్యకు విదేశాలకు వెడతానని పట్టుబట్టి కూర్చొన్న భార్గవుడికి ఆ ఉద్దేశం నుండి మరల్చలేక, అతడి మీద అలిగి పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి వచ్చింది కృష్ణవేణి, వారంరోజుల తరువాత భార్గవుడు కూడా వచ్చాడు తల్లివద్ద సెలవుతీసుకోడానికి. కృష్ణవేణి తండ్రితోటి. తమ్ముడితోటి నచ్చజెప్పించింది కొడుక్కు. చనువు తీసికొని తనూ చెప్పింది.

    "కాలే నొచ్చే. కడుపే నొచ్చే. కాకితో కబురంపితే వచ్చేటట్లుండాలి గాని పరదేశాలు పట్టిపోతానంటావేమిరా? మాకు ఏళ్ళొచ్చాయి. ఉన్నది ఒకడివి కంటి ఎదుటుండకుండా ఇంకా ఏం చదువులు కావలసివచ్చాయి నీకు. బాబూ? కన్నవారి బాధకంటే ఆ చదువులే ముఖ్యమయ్యాయా?" ఎన్నో వలపోస్తూ వలవలా ఏడుస్తున్న కృష్ణవేణి శోకం చూసి అందరి హృదయాలు తరుక్కుపోయాయిగాని ఆమె కన్నకొడుకుపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. అతడిదెంత బండ హృదయమో, అదెంత జడ ప్రవృత్తో? ఎవరితోటి ఒక్కమాట కూడా వాదించలేదు అతడు. అందరు చెప్పిందీ మౌనంగా విన్నాడు. తన నిశ్చయంలో మార్పు మాత్రం తెచ్చుకోలేదు.

    మరునాడు తల్లివద్ద వీడ్కోలు తీసుకోబోతే ఆమె గదిలోకి వెళ్ళి తలుపేసుకొంది.

    గది బయటనుండి అన్నాడు అతడు. "అమ్మా. నేను వెడుతున్నాను."

    "ఏ మమతానుబంధమూ, ఏ బాంధవ్యమూ నిన్ను బంధించకూడదనుకొంటే నీఅమ్మా నాన్నలకు నీళ్ళొదలి నిశ్చింతగా వెళ్ళు తండ్రీ!" ఏడుస్తూనే లోనుండి చెప్పింది కృష్ణవేణి.

    కొన్ని క్షణాలు మాత్రం నిశ్శబ్దంగా అక్కడ నిలబడి గంభీరంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయి బండిలోకూర్చొన్నాడు భార్గవరామ్.

    ఆ తరువాత నెల్లాళ్ళదాకా మామూలు మనిషికాలేదు కృష్ణవేణి.

    గతం తడుముకొని అప్రయత్నంగా నిట్టూర్పు విడిచింది శ్రీలక్ష్మి. కూతురి పెళ్ళి చేయాలని అనుకొన్నప్పటినుండి ఆ విరాగినే అల్లుడిగా ఎంచుకొందామె. అతడి ప్రవర్తనలో అతడి మనుసు స్పష్టపడుతూవున్నా తన ఆశలకు విరుద్ధంగా భావించుకోలేదు.

    పరిస్థితులు కొంతవరకు భవితవ్యాన్ని సూచిస్తున్నా తన ఆశలకు, ఆశయాలకు అనుగుణంగానే భవిష్యత్తును ఊహించుకొనడమన్నది మనిషి బలహీనతల్లో ఒకటేమో!

    వైద్యుడు కాలు తోముతూంటే బాధతో మూలుగుతున్నారు శ్రీనివాసరావుగారు. ఆయన చేతిని ఒక ఒళ్ళో ఉంచుకొని నిమురుతూ కూర్చోనుంది కృష్ణవేణి. ఆయన మూలిగినప్పుడల్లా ఆమె మనసు విలవిల్లాడిపోతున్నది.

    గోవిందస్వామి వచ్చాడు. "అమ్మా! పెదబాబుగారు, దేవతమ్మగారు వచ్చారు."

    కృష్ణవేణి కళ్ళలో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి. ఆపదలో ఆపదర్శనమన్నది మేఘాన్నిసోకి వర్షింపజేసే శీతలపవనం వంటిదేమో!

    కళ్ళు తుడుచుకొంటూ బండిదిగి ఇంట్లోకి వస్తూన్న తండ్రికి ఎదురేగింది కృష్ణవేణి. గాద్గద్యం పట్టుకొంటూన్న గొంతును అతి ప్రయత్నంతో పెగల్చుకొని, "బాగున్నారా, నాన్నా? మీ ఆరోగ్యం బాగున్నదికదా!" అని అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS