"విత్ ఫ్లైజర్" అంటూ లేచాడు.
ఇరువురూ బయటికి వచ్చారు.
సాజిత్ నిశితమైన చూపులు తిరిగి పావనికోసం వెదకటం మొదలుపెట్టాయి.
మొదటి చూపులోనే ఈ పిల్ల కలవరపెట్టిందే....' సాజిత్ మనసులో అనుకున్నాడు.
తన అంతరంగం ఎక్కడో ఇలాంటి పిల్ల ఆకారాన్నీ కోరుకుంటుంది. ఇలాంటి ఇండిపెండెంట్ వ్యూస్ వున్న గాళ్ నే వాంఛిస్తోంది. అందుకే తనకే తెలీకుండా తన మనసు ఆ పిల్లకోసం వెంటనే రియాక్ట్ అయింది.
ఆ అమ్మాయి బయట వెయిటింగ్ చాంబర్ లో కూర్చుని ఆ రోజు ఇంగ్లీష్ పేపర్ తిరగేస్తుంది.
సాజిత్ పరిశీలనగా చూసి అది 'హిందూ' పత్రికని తెలుసుకున్నాడు.
"మిస్టర్ శ్రీనివాస్....! మీ ఇన్ స్టిట్యూట్ కి ఏమేం న్యూస్ పేపర్లు వస్తూంటాయి?"
"టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎక్స్ ప్రెస్, హిందూ సర్!"
సాజిత్ ఏదో ఆలోచించినట్టు-మధ్య మధ్య పావన్ని చూస్తూ.
"హిందూలో ఏదో మెడికల్ ఆర్టికల్ పడిందనీ, నా ఫ్రెండ్ చూడమనీ అన్నాడు. అది ఈరోజుదో, నిన్నటిదో తెలీదు...."
"దానికేముంది సర్! నిన్నటి పేపరు కూడా యింకా ఇక్కడే వుంది చూద్దాం. తమరు యిలా కూర్చోండి" అంటూ శ్రీనివాస్ సాజిత్ ను అదే వెయిటింగ్ హాలులో కూర్చోబెట్టాడు. సాజిత్ కోరుకుంది కూడా అదే....
పావనికి ఎదురుగ్గా కూర్చొని ఆమెను పరిశీలించాడు. తను కోరుకున్న ఫీచర్స్ అన్నీ ఆమెలో వున్నాయి.
అమెరికానుండి వస్తుంటే తన తండ్రి తనతో అన్న విషయం ఇప్పటికీ గుర్తే....
"....ఏరా! అమెరికన్ గాళ్ ని చేసుకోవు, అమెరికాలో పెరిగిన ఇండియన్ గాళ్ నీ చేసుకోవు. కారణం అడిగితే__నేను ఇండియాలో స్థిరపడాలిగనుక .... అమెరికన్ వే ఆఫ్ లైఫ్ కి అలవాటుపడిన ఆ గాళ్స్ ఇండియా రారుగనుక.....చేసుకోనన్నావ్. సో...టోటల్ గా ఈ గడ్డమీది గాళ్స్ తో-ఈ గడ్డమీద మ్యారేజీ నాకు వద్దంటున్నావ్. నీవు ఇప్పుడు ఇండియా వెళుతున్నావ్. నీ టేస్ట్ కి తగ్గట్టు ఒకమ్మాయిని కూడా నువ్వే సెలెక్ట్ చేసుకొని....ఉత్తరం వ్రాయి. మేం ఇండియా వచ్చి, అక్షింతలేసి, 'శుభం' అనిపిస్తాం."
ఆ మాటల చివరి 'సారాంశం'....ఈ కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ లో తనకు దొరికినట్టు హృదయంలో ఏదో ఆరాటం మొదలయింది.
'పావని' పేరు కూడా తనకు నచ్చింది.
ఈమె అభిరుచులు ఎలా వున్నాయో....డాక్టర్స్ అంటే ఎలాంటి అభిప్రాయముందో! జర్నలిస్ట్స్ ఎవరయినా బోయ్ ఫ్రెండ్ వున్నాడేమో?!
వివరాలు తను మెల్లిగా సేకరించాలి.
తను మనసులో అనుకుంటూ అలాగే కూర్చున్నాడు. పావని అంతకుముందు వారి మాటల్ని విందేమో....తను చదివే హిందూ పత్రికను శ్రీనివాస్ చేతిలో పెట్టి- ఒకసారి సాజిత్ ను చూసి మరలా మరొ పత్రికను తీసుకుంది.
వాస్తవానికి ఏ పత్రికలోనూ ఆరోజు ఎలాంటి మెడికల్ ఆర్టికల్ రాలేదు. పావన్ని పరిశీలనగా చూడటంకోసమే సాజిత్ అలా అన్నాడు.
శ్రీనివాస్ రెండు రోజుల పేపర్లూ అతని చేతికిచ్చారు. తను పావన్ని మధ్య మధ్య చూస్తూ-పేపర్లు తిరగేస్తూ సాజిత్ అలాగే వెయిటింగ్ రూమ్ లో కాసేపు కూర్చున్నాడు.
పావని చాలా అందంగా వుంది.
'లవ్ ఎట్ ఫస్ట్ సైట్.....'ఉదయంచేంత ముచ్చటగా వుంది. ఆమె జర్నలిస్టు కావటంతో మాటకారి అయివుంటుంది. దానికి తగ్గట్టు ఇండిపెండెంట్ ఫ్యూస్. డేరింగ్ బిహేవియర్...ఎవరూ ఆమె ముందుకుపోయి 'ఐ లవ్ యూ' అని వుండరు.
ఇప్పుడు పరిస్థితులు అనుకూలిస్తే తను అంటాడు.
అయితే ముఖతా అనడు!
కానీ ముఖం మీదే అంటాడు.
ఆమెతో అనడు.
కానీ ఆమె ముందే అంటాడు.
తన ప్రేమ ఎంత గొప్పదో చెప్తాడు. ఆమె అందాలు తననెంతగా ఆకర్షించాయో చెప్తాడు.
ఆమెకు కోపం వస్తుంది.
కానీ అది ప్రదర్శించేందుకు తను కనిపించడు.
సాజిత్ బ్రెయిన్ లో ఒక సరిక్రొత్త హైటెక్ ఫార్ములా....రూపు దిద్దుకొని తనలో తాను నవ్వుకున్నాడు.
తర్వాత__
"సో....మిస్టర్ శ్రీనివాస్...నా ఫ్రెండ్ పొరపడి వుంటాడు. హిందూనో మరో పత్రికో...ఏది ఏమైనా రేపు వాడినే అడిగి తెలుసుకుంటాను. ఇక మీ ఇన్ స్టిట్యూట్ చూస్తాను. నా పని మొదలెడతాను...." అంటూ సాజిత్ లేచాడు.
అలా లేచిన సాజిత్ వంక పావని మరోసారి చూడటం......తనూ చూడటం.....ఒకరికొకరు కాస్సేపు అలా చూసుకోవటం సాజిత్ కు ఆనందం కలిగింది.
పావని తనను కాజువల్ గా చూసింది. తను మాత్రం పావనిని కాంక్షగా, ఫన్నీగా చూశాడు.
పావనే తరువాత తన చూపుల్ని మరల్చుకుంది.
ఇంతలో శ్రీనివాస్-
"లెటజ్ గో సర్!" అన్నాడు.
సాజిత్ శ్రీనివాస్ ను ఫాలో అయ్యాడు.
పావని రూపమే కాదు. ఆమె చూపులు కూడా తన గుండెల్లో గుచ్చుకున్నాయి.
మరి పావనికి...?
సాజిత్ బరువుగా కదిలాడు.
* * * *
అది జరిగిన మరుదినం_
సాజిత్ తను కంప్యూటర్ గ్రాఫిక్స్ కి, ఎక్కించాలనుకున్న మేటర్ ని 'నోడ్ నంబర్ వన్' లో కూర్చుని పూర్తిచేస్తున్నాడు.
అతడు ఒకదరిని ఆ పని చేస్తున్నా, అతని నిశితమైన కళ్ళు మాత్రం పావని కోసం ఎదురు చూస్తున్నాయి.
నిన్న ఇదే సమయంలో ఆమె ఇన్ స్టిట్యూట్ లో వుంది.
కానీ ఈ రోజు మరెందుకానో రాలేదు.
తను ఆమె టైమింగ్స్ విషయమై శ్రీనివాస్ ని అడిగితే, అతను మరో రకంగా భావించవచ్చు! ఇప్పటికే అతనిముందు పావనిని 'నైస్ గాళ్' అన్నాడు. ఓ గాళ్ నైసో - కాదో తను తొందరపడి మొదటి పరిచయంలోనే చెప్పటం అతని మనసును కొంత ఆశ్చర్యాన్ని కలుగజేసినా అది సహజమే!
సో....ఏది ఏమైనా ఈరోజు పావని టైమింగ్స్ కనుక్కొని వెళ్ళాలి. తనకు ఈ సమయంలో అంతకంటే బ్యూటిఫుల్ 'టైమ్ పాసింగ్' వుండదు!
అతని మనసులో పావని రూపం మెదులుతున్నప్పుడు.....
పావని త్రెష్ హాల్ట్ మిర్రర్ డోర్ నెట్టుకొని లోనికి ఎంటరయింది. ఆ రోజు మరింత స్మార్ట్ గా వుంది.
లైట్ బ్లూ పంజాబీ డ్రస్ వేసుకుంది. చెవులకు చారెడంత బంగారు రింగులు పెట్టుకుంది.
"విన్ సమ్ ఫీచర్స్!" సాజిత్ బ్రెయిన్ లో అప్రయత్నంగా మెదిలిన మాటలు!
తను పనిచేస్తున్న గదిలోకే ఎంటరయింది. తనతోపాటు గదిలో వున్న కుర్రవాళ్ళ కళ్ళన్నీ ఆమె రూపాన్ని ఒకసారి చూశాయి. తరువాత తిరిగి తమ తమ పనుల్లోకి వెళ్ళిపోయారు.
సాజిత్ మాత్రం కొంత పని అయినట్టూ- కొంత రిలాక్సింగ్ అవసరమన్నట్టూ - తన చైర్ లో ఈజీగా కూర్చుని పావని కదలికల్ని అలాగే గమనిస్తున్నాడు.
గదిలో వున్న మిగతా వాళ్ళేమయినా అనుకుంటారేమో అనే అభిప్రాయం వచ్చింది. అందుకు వెరసి తిరిగి తల దిన్చుకుంటే, ఇప్పటి తన 'మోటో' కు అర్ధం వుండదు.
తను వెదకే చిన్నదాని ఆచూకీ ఇప్పటికి చిక్కింది. తరువాతి ప్రయత్నం చిన్నదాన్ని చేజిక్కించుకోవటమే.....
ఆయనెవరో మహా రచయిత అన్నట్టు....
'మాట్లాడు__నిన్ను నేను చూస్తానన్నాడు' అంటే అందమైన బాహ్యరూపంకంటే, మరింత అందమైన అంతర్ రూపం కూడా చూడాలనేది ఆయన అభిప్రాయం. అది ఎదుటి మనిషి మాట్లాడటం వల్ల తెలుస్తుంది.
ఇప్పుడు పావనితో తను మాట్లాడాలి.
ఎవరికీ వినిపించకుండా మాట్లాడాలి.
తన బ్రెయిన్ లో రూపుదిద్దుకున్న 'నెట్ వర్క్' ను అప్లై చేద్దామనుకున్నాడు.
తనకీ విషయంలో యిక్కడి కంప్యూటర్స్ తో వున్న 'లోకల్ ఏరియా నెట్ వర్క్' ఉపయోగపడుతుంది.
సాజిత్ ఒకసారి ఆమె కూర్చున్న 'వర్క్ స్టేషన్' నెంబర్ ను చూశాడు. ఐదో నెంబరు!
సో....తను 'సెండ్' అనే కమాండ్ నుపయోగించి ఆమె పని చేస్తున్న 'నోడ్' నెంబర్ ఫైవ్ కి తన మనసులోని భావాన్ని 'డిస్ ప్లే' అయ్యేలా చేయవచ్చు!
ఆమెను ఆ మెసేజ్ ఏ నోడ్ నంబరు నుండి వచ్చిందీ తెలియాలి. లేకుంటే తన శ్రమ వృధా అవుతుంది.
సాహసం చేస్తే ఈ అందాల రాకుమారి అంతరంగం తెలుస్తుంది.
