ఆమె తన 'వర్క్' నోడ్ నంబర్ ఫైవ్ దగ్గర కూర్చుని మొదలెట్టింది.
నెట్ వర్క్ టోపాలజీలో సాజిత్ సెండ్ కమాండ్ నొక్కి- "యూ ఎల్యూరింగ్! డోటాన్ విత్ యూ" అనే మెసేజ్ ఆమె వర్క్ చేస్తున్న కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రింట్ అయ్యేట్టు చేశాడు.
తను వర్క్ చేస్తున్న పదాలు కాక ఒక్కసారిగా తన టెర్మినల్ స్క్రీన్ మీద వేరే సెంటెన్స్ పడటం చూసి పావని బిత్తరపోయింది.
తన పనిలోకి ఈ 'ట్రాప్' ఎందుకు వచ్చిందో, ఈ 'డిస్ట్రబెన్స్' కు 'అర్ధం ఏమిటో ఆమెకు తెలీలేదు.
"యూ ఎల్యూరింగ్.....డోటాన్ విత్ యూ."
"యూ ఎల్యూరింగ్" అంటే- 'ఆకర్షణీయమైన నీవూ' అనే అర్ధం వచ్చినా, డోటాన్ అంటే ఆమెకు తెలీలేదు.
సరీగ్గా అప్పుడే శ్రీనివాసన్ గదిలోకి ఎంతరయ్యాడు. అలా ఎంటరయిన తన యంగ్ సార్ ను పిలిచి-
"సర్! మధ్యలో ఈ వాక్యాలేమిటి?"
శ్రీనివాస్ కూడా వచ్చి చూశాడు. ఆయనకూ అది మెదట అర్ధం కాలేదు.
కావాలనే ఎవరో ఈ వాక్యం ఈమె పనిచేసే నోడ్ స్క్రీన్ మీద పడేట్టు చేశారని ఆయన కనిపెట్టాడు.
తన మొదటి పని అయిపోయిందన్నట్టు సాజిత్ తరువాత తన పనిలోకి వెళ్ళిపోయాడు.
ఈలోపు శ్రీనివాస్ 'సర్వర్' లోని 'యూజర్' ఆప్షన్ ని సెలెక్టుచేసి ఏ నోడ్ నుండి ఆ మెసేజ్ వచ్చిందో చూశాడు.
నోడ్ నంబర్ వన్ నుండి ఆ మెసేజ్ నేరుగా పావని పనిచేసే టెర్మినల్ కి చేరింది.
అది పొరపాటుగా చేరటంమాత్రం కాదు!
అయితే....ఆ సెంటెన్స్ కర్ధం ఏమిటో ఆ సమయంలో ఇరువురికీ తెలీలేదు.
"సర్! ఈ సెంటెన్స్ స్క్రీన్ మీదకి ఎలా వచ్చింది?"
శ్రీనివాస్ ఒకసారి సాజిత్ వంక చూశాడు. అతను తనకేం తెలీదన్నట్టు తన పని తాను చేసుకుంటున్నాడు.
పావనిని శ్రీనివాస్ ఆఫీస్ రూమ్ లోకి రమ్మని చెప్పి తను అక్కడ వెయిట్ చేయకుండా చకచకా నడుచుకుంటూ ఆఫీసులోకెళ్ళాడు.
లోపలి నిర్మాణం మొత్తానికి మిర్రర్ వాడటంతో ఎవరు ఎక్కడ వున్నా అందరికీ కనిపిస్తుంది. అన్ని గదులూ సౌండ్ ఫ్రూప్స్!
శ్రీనివాస్ ఆఫీసు గదిలోకి వెళ్లటం, ఆయన్ని పావని ఫాలో అవ్వటం సాజిత్ ఒకదరిని గమనిస్తూనే వున్నాడు. "చూద్దాం ఈ చిన్నదాని రియాక్షన్" అనుకున్నాడు.
గదిలో శ్రీనివాస్ ముందు పావని కూర్చుంది.
"చూడు పావనీ! అది 'నోడ్ నెంబర్ వన్' నుండి వచ్చింది. దీని మీద పని చేసేది డాక్టర్ సాజిత్. నిమ్స్ లో ఇప్పుడు మంచి పేరున్న యంగ్ వన్! వారి కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన బుద్దుపూర్వకంగానే ఆ మెసేజ్ ని సెండ్ కమాండ్ నొక్కి నీ నోడ్ మీద డిస్ ప్లే అయ్యేట్టు చేశారు."
"డోటాన్ అంటే ఏమిటి?" శ్రీనివాస్ పావాన్ని అడిగాడు.
"ఆయన్నే పిలవండి అడుగుదాం" పావని కోపంగా అంది.
"వద్దు...వద్దు...! ఒక పని చేద్దాం. ఆయన బుద్దిపూర్వకంగానే అక్షరాల్ని అస్త్రాలుగా ప్రయోగిస్తే....నీవూ తిరిగి ప్రయోగించు. మన ఇన్ స్టిట్యూట్ లోని స్టూడెంట్స్ అంటే ఏమిటో నిరూపించు."
పావని కాసేపు ఆలోచించింది.
సాజిత్ తనను నిన్న ఫాన్సీగా చూశాడు. తనూ అతని చూపుల్ని గమనించింది. అంటే తనని ఆట పట్టించే కార్యక్రమం ఏదయినా తీసుకొని వుండాలి.
'హైటెక్ నాలెడ్జి' బ్రెయిన్ లో వుంది గనుక అక్షరాల్ని సార్ అన్నట్టు అస్త్రాలుగా వదిలాడు. అర్ధం తెలియకుండా తిరిగి రియాక్ట్ అవ్వడం మంచిదికాదు. అసలీ 'డోటాన్ విత్ యూ' అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం.
పావని మనసులో అనుకుంది.
సరిగ్గా ఆ సమయంలో ఆమెకు ఎక్కడో ఒక ఇంగ్లీషు నవల్లో చదివిన ఒక వాక్యం గుర్తుకువచ్చింది. అందులో ఇరువురు దంపతులు, అతడు తన భార్యను గాఢంగా ప్రేమిస్తాడు. నవలా రచయిత అతన్ని గురించి పాఠకులకు ఒక వాక్యంలో చెప్తాడు. ఆమె కతడు "డోటింగ్ హజ్ బెండ్" అంటే వెరీ లవింగ్ హజ్ బెండ్ అని.
పావనికి ఒక్కసారిగా శరీరం కంపించింది.
"డోటాన్ విత్ యూ" అంటే నీయడల అపారమైన ప్రేమ వుందీ అని.
ఇంకా నయం. ఈ అర్ధం మాస్టారుకు తెలీకపోవటమే మంచిది. పావని ముఖంలో రంగులు మారటం శ్రీనివాస్ గమనించాడు. వెంటనే అడిగాడు.
"ఏమిటి పావనీ....నీ ముఖంలో మారుతున్న ఫీలింగ్స్?"
పావని తనను తాను కంట్రోల్ చేసుకుని నార్మల్ కండిషన్ కొచ్చింది.
"నో.....సర్! ఏంలేదు" అంటూ నవ్వింది. ఆయన దగ్గర సెలవు తీసుకుని తిరిగి తను వర్క్ చేసే టెర్మినల్ దగ్గరకు బయలుదేరింది.
వెనగ్గా శ్రీనివాస్ "టేకిట్ ఈజీ" అన్నాడు.
"ఈ ఇంటిల్ జంటిల్ యంగ్ మాన్ తనను గురించి ఏమనుకుంటున్నాడు? అమెరికన్ టైప్ ప్రేమను అప్లై చేసి ఆడపిల్లతో ఆడుకోవాలనుకుంటున్నాడా? తేలుస్తాను" మనసులో అనుకుంది.
తనూ అతని టెర్మినల్ కి అక్షరాల్ని అంతకంటే పదునయిన అస్త్రంగా ప్రయోగించి, తిరిగి తన జోలికి రాకుండా చేయాలి.
పావని కొంచెం కోపంగానే కూర్చుంది.
ఆమె శ్రీనివాస్ తో ఆఫీస్ రూంలోకెళ్ళటం, తిరిగి కోపంగా రావటం అంతా అలవోకగా సాజిత్ గమనిస్తూనే వున్నాడు.
పావని తిరిగి తన నోడ్ దగ్గర కూర్చుంది.
లోకల్ ఏరియా నెట్ వర్క్ లో సెండ్ కమాండ్ ని తిరిగి వుపయోగించి తనూ తిరిగి "యూ అమెరికన్ ఎమోరస్, యువర్స్ ఈజ్ కప్ బోల్డ్ లవ్ ఐహేటిల్"
సాజిత్ వుపయోగించే నోడ్ నెంబర్ వన్ స్క్రీన్ మీద తిరిగి ఆ వాక్యం పెద్ద అక్షరాలతో పడ్డాయి.
అవి చదివిన సాజిత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
కానీ అతనికి పావని మరింత అందంగా కనిపించింది. ఆమె విషయంలో అతనికి మరింత ఆసక్తి పెరిగింది.
వియోరస్ అంటే కేవలం ప్రేమను కామం చల్లార్చుకోవటానికే కోరేవాడని అర్ధం. ఆ తరువాత మాటకూ సాజిత్ కు అర్ధం తెలుసు. కప్ బోర్డ్ లవ్ స్వార్ధంతో కూడిన ఇష్టం తప్ప ఆ ప్రేమలో నిజాయితీ వుండదు.
ఒక పిల్లవాడికి కప్ బోర్డ్ మీద ప్రేమ వుంటుంది.
ఎంత వరకూ?!
దానిలో వున్న కేక్ అందేవరకూ, ఆ కేక్ చేతికి అందాక ఆ కప్ బోర్డ్ ను క్రింద పడేసి తన దారిన తను వెళతాడు.
కప్ బోర్డ్ లవ్ కూడా అలాంటిదే.
స్త్రీలో కావాల్సినవి పురుషుడికి దొరకాక, అవి అనుభవించి అతడు వెళ్ళిపోతాడు. అందుకే అలాంటి ప్రేమను తను ద్వేషిస్తానని చెప్పింది.
సాజిత్ ముఖంలో చిరు చెమటలు.
పాంటు జేబులోంచి కర్చీఫ్ తీసి ముఖం రుద్దుకున్నాడు.
పావని తన విషయంలో అలా తలచటం అతనికి కొద్దిగా బాధగా అనిపించినా, ఓ సిన్సియర్ గాళ్ ఎలా రియాక్ట్ అవ్వాలో అలా అయిందనుకున్నాడు.
మరి తను తిరిగి ఏం చెప్పకపోతే ఆమె తనను అపార్ధం చేసుకుంటుంది.
ఏది ఏమయినా తను ఆశించిన దారిలోకి పావని వచ్చింది. ఇప్పుడే తమ మధ్య "కంబాటింగ్ ఎన్ డియర్ మెంట్స్" మొదలయ్యాయి. పావని యింత త్వరగా రియాక్టు అయి తన అభిప్రాయాన్ని తెలియచేస్తుందని తను అనుకోలేదు. ఈపరిణామం తనకు మరింత అనుకూలం.
సాజిత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి సెండ్ కమాండ్ ద్వారా నోడ్ నెంబర్ ఫైవ్ లోకి ఒక వాక్యాన్ని డిస్ ప్లే అయ్యేట్టు చేశాడు.
పావని ముందున్న టెర్మినల్ స్క్రీన్ మీద__
"యూ విన్ సమ్! హీయర్ మై బ్రూయిట్ - ఓన్లీటచ్ సాంగ్" అనే అక్షరాలు పడ్డాయి. పావనికి బ్రూయిట్ అనే పదం క్రొత్తగా కనపడింది.
ఆమెకు అయోమయమయింది.
సాజిత్ తరువాత ఆ గదిలో వుండలేదు. లేచి నిలబడ్డాడు. పావని అతని వంక చూసింది. ముఖంలో కాస్త ఖంగుతిన్న గ్లూమీసెస్. చిన్నవాడయిన పెద్ద డాక్టర్. మనిషి స్మూత్ గా వున్నాడు. పట్టుకుంటే కందిపోయేటట్టు, రెడ్డిష్ గా వున్నాడు. నిజంగానే ఇంటెలిజెంటిల్ మాన్. అఫాలం విశాలంగా వుంది. ముద్దొచ్చే ముఖం.
తను తిరిగిచ్చిన సమాధానానికి బాధ పడినట్టు ఆయన ముఖంలోని ఫీలింగ్స్ తెలుపుతున్నాయి. ఆ సమయంలో సాజిత్ చూసిన పావనికి ఎక్కడో తన హృదయం కదిలి సాజిత్ వైపు తన అదృశ్య హస్తాల్ని చాచినట్టు ఒక వింత ఫీలింగ్.
సాజిత్ అక్కడనుంచి బయటకు నడిచి__
శ్రీనివాస్ దగ్గర సెలవు తీసుకుని తిరిగి రేపు వస్తానని వెళ్ళి పోయాడు.
సాజిత్ అంత త్వరగా వెళ్లటం కూడా శ్రీనివాస్ కు ఆశ్చర్యం కలిగింది. తనతో రెండు గంటలు వుంటానన్నాడు. అరగంట కూడా గడవకుండానే వెళ్ళిపోయాడు.
గదిలో పావని అలాగే తన టెర్మినల్ దగ్గర వుండిపోయింది.
వర్క్ స్టేషన్ నంబరువన్ దగ్గర ఇప్పుడు బండి లేదు. తను అందుకోవాల్సిన బండి అదే అయితే....ప్రస్తుతం స్టేషన్ ఖాళీ అయిపోయింది. రేపు తిరిగి ఇదే టైమ్ కు తిరిగి అదే నంబరు వర్క్ స్టేషన్ కు ఆ సుకుమారమైన టెక్నికల్ బండి చేరితే తను ఏం సిగ్నల్ యివ్వాలి?
