"సరే అలాగే అనుకో. కాని దీన్ని నేను పాఠశాలకు పోనివ్వను" అన్నది అత్తగారు విరక్తి చెంది.
"చదువు నేర్చుకోదా?"
ఏం చేస్తుందే నేర్చుకొని? ఎంత చదువుకోవాలే కోడలా? ఇకటీ అరా ఉత్తరం ప్రత్యుత్తరాలు రాసుకోవడం, రామాయణం, మహాభారతం చదువుకోవడం చాలు! నీ పత్తో జడ్జీ అవుతుందా లేక వకీలు అవుతుందా?"
చివరకు కోడలు కూడా మౌనంగా వుండిపోయింది. ఆ దేవదాసు చాలా భయపడుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. పార్వతి మొదటి నుంచి చివరి దాకా జరిగిన సంఘటనంతా తప్పకుండా చెప్పి వుంటుందనుకున్నాడు. అందులో అతడికేమీ సందేహంలేదు. కాని ఇంటికి వచ్చిచూస్తే లేశ మాత్రం కూడా దాని ప్రతిబింబం కనిపించలేదు. పైగా ఈ రోజు గోవింద్ పండితులవారు పార్వతిని బాగా కొట్టాడనీ అంచేత ఇప్పుడు ఆమె కూడా పాఠశాలకు వెళ్ళదనీ తల్లి చెప్పగా విన్నాడు. ఈ ఆనందాతి రేకంతో అతడు సరీగా భోజనం కూడా చేయలేకపోయాడు. ఏదో విధంగా గబగబా తిన్నాననిపించాడు. పరుగుతీస్తూ పార్వతి దగ్గరకు వచ్చాడు.రొప్పుతూ, రోజుతూ "నీవు ఇక పాఠశాలకు వెళ్ళవా?" అన్నాడు.
"వెళ్ళను!"
"ఎంచేత?"
"పండితులవారు కొడుతున్నాడు" అని నేను చెప్పాను.
దేవదాసు ఒక్కసారి బాగా నవ్వి, ఆమె వీపు చరిచి "ఆమె వంటి తెలివిగలది ఈ భూమిమీద మరొకరులేరు" అన్నాడు. తరువాత అతడు నెమ్మదిగా పార్వతి చెంపమీద పడిన నల్లని వాతల్ని యత్నపూర్వకంగా పరీక్షించి నిట్టూర్పు విడుస్తూ "ఆహా!" అన్నాడు.
పార్వతి కొంచెం నవ్వి అతడి ముఖం వైపు చూసి "ఏమిటీ" అన్నది.
"బాగా దెబ్బలు తగిలాయి గదూ పత్తో?"
"పార్వతి తలవూపి ఊఁ" అన్నది.
"నీవు యెందుకు అలా చేస్తావు? అందుకే నాకు కోపం వస్తుంది. అందుచేతనే కొడుతున్నాను కూడా."
పార్వతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏం చేయాలో అడగాలని మనసులో అనిపించింది. కాని అడగలేకపోయింది.
దేవదాసు ఆమె తలమీద చేయి ఉంచి "ఇక ఎప్పుడూ కూడా అలా చేయకు, సరేనా?" అన్నాడు.
దేవదాసు తలవూపి "చేయను" అన్నది.
దేవదాసు మరోసారి పార్వతి వీపుచరిచి, సరే ఇక నేను ఎన్నడూ నిన్ను కొట్టను" అన్నాడు.
3
రోజులకు రోజులే గడిచిపోతున్నాయి. ఈ ఇరువురు బాల బాలికల ఆనందానికి అవధిలేకుండా పోయింది. రోజంతా అటూ ఇటూ తిరుగుతూ వుండేవాళ్ళు. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చి మందలింపులూ, దబాయింపులే కాకుండా దెబ్బలు కూడా బాగా పడేవి. మళ్ళీ తెల్లవారడంతోనే ఇంట్లో నుంచి పరుగుతీస్తూ పోయే వాళ్ళు. రాత్రికి వచ్చి దెబ్బలూ, చీవాట్లూ తినేవాళ్ళు. రాత్రిపూట హాయిగా నిద్రపోయేవాళ్ళు. మళ్ళీ తెల్లవారగానే పరుగుతీస్తూ పోయి ఆడుతూ, పాడుతూ, ఎగురుతూ, దుముకుతూ ఉండేవాళ్ళు. వీళ్ళకు వేరే మిత్రులెవరూలేరు. అవసరం కూడా లేదు. ఊళ్ళో ఉపద్రవాలు సృష్టించడానికీ, అల్లరి చేయడానికీ వీళ్ళిద్దరే చాలు. ఆ రోజు ప్రొద్దు పొడవగానే ఇరువురూ చెరువులో దిగారు. మధ్యాహ్నందాకా కళ్ళు ఎర్రబడేటట్లుగా చెరువంతా చిలికి చిలికి పదిహేను చేపలు పట్టుకున్నారు. తమ తమ సామర్ధ్యాన్ని బట్టి పరస్పరం వాటాలు తీసికొని ఇళ్ళకు తిరిగి వచ్చారు. పార్వతి తల్లి కూతురును చావబాది ఇంట్లో బంధించింది. దేవదాసు విషయం నాకు బాగా తెలియదు. అతడు ఇటువంటి విషయాలను ఏ విధంగానూ వెల్లడించడు. పార్వతి ఏడుస్తూ వుంది. అప్పటికి సమయం రెండూ, రెండున్నర గంటలవుతుంది. దేవదాసు వచ్చి ఒకసారి కిటికీ క్రిందగా మృదువుగా మధురంగా "పత్తో, పత్తో" అని పిలిచాడు. పార్వతి వినే వుంటుంది. కాని కోపంతో వుండడం చేత జవాబియ్యలేదు. అప్పుడతడు దగ్గరలో వున్న రావిచెట్టు మీద కూర్చొని ఆ పగలంతా అక్కడే గడిపేశాడు. సాయంకాలం పూట ధర్మదాసు వ వచ్చి, నచ్చ జెప్పి యెంతో కష్టంమీద అతణ్ని దించి ఇంటికి తీసికొని పోయాడు.
ఇది కేవలం ఆ రోజు మాత్రమే జరిగింది. మరుసటి రోజు తెల్లవారిన దగ్గర నుంచి పార్వతి, దేవదాసు కోసం అల్లాడిపోతూ వుంది. కాని దేవదాసు రాలేదు. అతడు తండ్రితోపాటు దగ్గరలో వున్న గ్రామానికి ఆహ్వానం రాగా వెళ్ళాడు. దేవదాసు రాకపోయేసరికి పార్వతి ఉదాసీనురాలై ఇంట్లో నుంచి బయటకు బయలుదేరింది. నిన్న చెరువులో దిగేటప్పుడు ఎక్కడైనా జారిపోతాయేమోనని దేవదాసు మూడు రూపాయలు పట్టుకోమని పార్వతికి ఇచ్చాడు. ఆ మూడు రూపాయలు పార్వతి కొంగున కట్టుకొన్నది. ఆమె ఆ మూడు రూపాయలు ఉన్న మూటను అటూ ఇటూ త్రిప్పుతూ, తాను కూడా అటూ ఇటూ తిరుగుతూ అనేక క్షణాలు గడిపింది. ఎవ్వరూ తోడు దొరకలేదు. అప్పుడు పార్వతి ప్రక్కనే వున్న మరో గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలో మనోరమ ఇల్లు వుంది. ఆమె వయసులో కొంచెం పెద్దది. అయితే ఆమె పార్వతికి స్నేహితురాలు చాలా రోజులనుంచి ఒకరి నొకరు చూసుకోలేదు. ఈ రోజు, పార్వతి అవకాశం చూసుకొని ఆమె ఇంటికి వెళ్ళి "మనో ఇంట్లో వుందా?"అని అడిగింది.
"పత్తో!"
"అవును నేనే. మనో ఎక్కడున్నది అత్తయ్యా?"
"పాఠశాలకు వెళ్ళింది__నీవు వెళ్ళడం లేదా?"
"నేను పాఠశాలకు వెళ్ళడంలేదు. దేవదాదా కూడా వెళ్ళడం లేదు."
మనోరమ అత్త నవ్వుతూ__"అయితే మంచిదే! నీవూ పాఠ శాలకు వెళ్ళడంలేదు. దేవదాదా కూడా వెళ్ళడంలేదు" అన్నది.
"లేదు, మేము ఎవ్వరమూ వెళ్ళడంలేదు."
"మంచిదే, కాని మనో పాఠశాలకు వెళ్ళింది."
అత్త కూర్చోమన్నది. కాని ఆమె కూర్చోలేదు. తిరిగి వచ్చింది. దారిలో రసిక్ పాల్ దుకాణం వద్ద ముగ్గురు వైష్ణవ స్త్రీలు నుదుట తిలకం దిద్దుకుని, చేతిలో ఖంజరి (వాద్యం) తీసికొని బిచ్చం అడుగుతున్నారు. పార్వతి వాళ్ళను పిలిచి "మీకు పాటలు వచ్చునా?" అని అడిగింది.
ఒక వైష్ణవ స్త్రీ తిరిగి చూసింది "ఏమిటమ్మా, పాటలు వచ్చు" అన్నది.
"అయితే పాట పాడు!" ముగ్గురూ నిలబడిపోయారు!" ఇట్లా పాడమంటే ఎట్లా పాడతాము" అన్నది ఒక స్త్రీ.
"వద్దు, ఇక్కడే పాడండి!"
"పైసా ఇచ్చుకోవాలి!"
పార్వతి తన కొంగున ఉన్న ముడి చూపిస్తూ "పైసా కాదు, రూపాయి వున్నది."
కొంగు చివర ముడివేసిన రూపాయల మూట చూసి ఆ స్త్రీలు దుకాణం దగ్గర నుంచి కొంచెం దూరం వచ్చి కూర్చున్నారు. ఖంజరి వాయిస్తూ ముగ్గురూ గొంతులు కలుపుకొని పాట పాడారు. ఏమి పాడారు, దాని అర్ధమేమిటీ, ఇదంతా పార్వతి ఏమీ అర్ధం చేసుకోలేదు. అర్ధం చేసుకోవాలనుకున్నా చేసుకోలేదు. కాని అదే క్షణంలో ఆమె మనసులో దేవదాదా మెదిలాడు.
పాట పూర్తిచేసి ఒక వైష్ణవ స్త్రీ "ఇక భిక్ష వేస్తావా! అమ్మా!" అన్నది.
పార్వతి కొంగున ఉన్న రూపాయల మూట విప్పి వాళ్ళకు ఆ మూడు రూపాయలూ ఇచ్చేసింది. ముగ్గురూ అవాక్కయిపోయి ఆమె ముఖం వైపు కొన్ని క్షణాలు చూస్తూ వున్నారు.
"ఈ రూపాయలు ఎవరివమ్మా?" అన్నది ఒకామె.
"దేవదాదావి."
"ఆయన నిన్ను కొట్టడా?"
పార్వతి కొంచెం ఆలోచించి "కొట్టడు" అన్నది.
"వర్ధిల్లు తల్లీ" అన్నది ఒకామె.
పార్వతి నవ్వుతూ "మీ ముగ్గురికీ సమానంగా బాగాలు కుదిరాయి గదా!" అన్నది.
ముగ్గురూ తల లూపారు. "అవును కుదిరాయి. రాధారాణి నీకు మేలు చేయుగాక!" అని ముగ్గురూ "దాతృత్వం కలిగినటువంటి ఈ చిన్న బాలిక ఏమీ శిక్ష అనుభవించవలసి రాకూడదని అంతరంగంలో అభిలషిస్తూ ఆశీర్వదించారు. పార్వతి ఆ రోజు త్వరగా ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజు ఉదయమే దేవదాసును కలుసుకొన్నది. అతడి చేతిలో దారం చుట్టే గిలక ఒకటి వుంది. కాని గాలిపటం లేదు. అది కొనాలి. "పత్తో, రూపాయి ఇవ్వు." అన్నాడు.
పార్వతి తల వంచుకొని "రూపాయి లేదు" అన్నది.
"ఏమయింది?"
"వైష్ణవ స్త్రీలకు ఇచ్చేశాను. వాళ్ళు పాట పాడారు."
"అన్నీ ఇచ్చేశావా?"
"అవును, అన్ని మూడు రూపాయలే గదా వున్నది?"
"ఓసి పిచ్చిదానా, అన్నీ ఇచ్చుకుంటారా?"
"ఓహో! వాళ్ళు ముగ్గురు స్త్రీలున్నారు. మూడు రూపాయలు ఇవ్వకపోతే ముగ్గురూ సమానంగా ఎలా పంచుకుంటారు?"
దేవదాసు గాంభీర్యంగా "నేనయితే రెండు రూపాయలు కన్నా ఎక్కువ ఇచ్చేవాణ్ని కాదు-అన్నాడు. ఈ మాట అని అతడు ఆ గిలక పిడితో మట్టిమీద అంకెలు గీస్తూ ఇలా చేస్తే అందులో ప్రతి ఒక్కరికీ పది అణాలు రెండు డబ్బుల వాటా వచ్చేది.
పార్వతి ఆలోచించి "వాళ్ళకు నీలాగా లెక్కలు తెలుసా....?" అన్నది.
