Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 4

 

    గాడ నిద్రలో ఉన్న వాసు వదనం లోకి జాలిగా చూసి అతని తల మృదువుగా స్పృశించిన ప్రసాదరావు కి రాజశేఖరం అన్నాడన్న మాట గుర్తువచ్చి చిన్నగా నవ్వుకున్నాడు.

                        *    *    *    *
    ఆరోజు బస్సు అన్నవరం దాటి వేగంగా పరుగెడుతుంది.
    కండక్టర్ ప్రసాదరావు 'టికెట్, టికెట్ ' అంటూ చెయ్యి చాచాడు.
    ఒళ్ళో ఉన్న ఐదేళ్ళ కుర్రాణ్ణి నిలుచో బెట్టి బాగ్ తీసి పదిరూపాయల కాగితం ఇస్తున్న ఆమె వైపు చూసిన ప్రసాదరావు చిన్నగా చలించి దీర్ఘంగా నిట్టూర్చాడు.
    టిక్కెట్టు, చిల్లరా ఇస్తూన్న అతని వైపు చూసిన ఆమె తుళ్ళిపడ్డట్టయి బాధగా నిట్టూర్చి , 'మీరా?!" అన్నట్టు చూసింది.
    చప్పున చెమ్మగిల్లిన ఆమె కళ్ళు చూసిన అతను చలించాడు.
    ఆమె అనుమతి లేకుండానే ఆమె కొడుకుని తన ఒళ్ళో కూర్చో పెట్టుకున్నాడు. తన సీట్లో కూర్చుని కండక్టర్.
    గుండెల కదుముకుని తలా బుగ్గలూ ముద్దులతో నిమ్పెస్తున్న అతని వైపు వింతగా చూశాడా అబ్బాయి.
    "తాతగారు బాగున్నారా , బాబూ!" అడిగాడు కండక్టర్.
    "తత్తిపోయాలు." జవాబు.
    "ఎప్పుడు?" ఆ గొంతు కంపించింది. అతని కన్నుల్లో అప్రయత్నంగా నీటి తెర.
    'చాలా నాల్లె అయింది." జంకు లేని కుర్రాడి జవాబు.
    ఒక్కసారి ఆమె వైపు చూశాడు కండక్టర్.
    వెనుదిరిగి కూర్చున్న ఆమె సిగలో నలుపు, తెలుపు వెంట్రుకలు కష్టసుఖాలు కలబోసుకున్న ఆమె జీవితం లా కనుపిస్తున్నాయి.

                                      
    ఒక్కోసారి ప్రసాదరావు వైపు చూస్తూ, అతను చూడగాన్రే చూపులు తిప్పుకుంటుంది ఆమె.
    "అయితే తక్కిన వాళ్ళంతా బాగున్నారా?' మళ్ళీ ప్రశ్నించాడు కండక్ట రాబ్బాయిని దగ్గరగా హత్తుకుంటూ.
    "బాగుందలం అంటే? తత్తిపోకుందా ఉన్నాలనా?' ఎదురు ప్రశ్న.
    నవ్వాడు కండక్టర్, బిడ్డ ముద్దు మాట విని తండ్రి నవ్వినట్టు.
    "కండక్టరెటో మైకంలో పడ్డాడు. టిక్కెట్టు కోయ్యడేటి?' అన్నాడో ఆసామి నవ్వుతూ.
    "బాబూ, ఇలా రా!" పిలిచిందామె.
    తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడా అబ్బాయి.
    పిఠాపురం లో బస్సు ఆగింది. ఆ అబ్బాయి నెత్తుకుని హోటలు వైపు నడిచాడు కండక్టర్.
    తిరిగి వచ్చిన అబ్బాయి బిస్కెట్ పాకెట్టు తో ఆమె ఒళ్ళో కూర్చున్నాడు.
    బాబు తల నిమురుతున్న ఆమె కళ్ళ నిండుగా నీళ్ళు తిరిగాయి.
    "కాఫీ కావాలా?" కండక్టరామెను అడిగాడు. ఆ గొంతులో మార్దవం, గుండె లోతుల్లో ధ్వనించే మమత.
    ఆమె తల అడ్డంగా ఊపింది.
    "ఇదిగోనమ్మా!" కాఫీ గ్లాసందించాడు హోటలు కుర్రాడు.
    "నేను అడగలేదే!" కంగారుగా అందామె.
    "ఆ బాబు మీ కిమ్మన్నారండి." కండక్టర్ ని చూపించాడా కుర్రాడు.
    మౌనంగా తీసుకుందామె.
    బస్సు కదిలింది. టిక్కెట్లివ్వడం , ప్రయాణికుల్ని సీట్ల లో కూర్చో బెట్టడం తో బిజీగా ఉన్నాడు కండక్టర్.
    "మామయ్యా! " పిలిచాడబ్బాయి.
    "ఛీ తప్పు. మామయ్య కాదు....' ఆమె మందలింపు విన్న అతని ఎండిన పెదవుల పై హాసరేఖ విరిసింది.
    ధూళి దూపరితమైన కాకీబట్టలు, చెరిగిన జుట్టూ, ఎండిన చెంపలు, లోతుకు పోయిన కళ్ళూ, ఆ కళ్ళ కింద నల్లని నీడలు -- అతని వదనం లో నైరాశ్యం కొట్టవచ్చినట్టు కనుపిస్తుంది.
      జాలిగా అతని వైపు చూసింది ఆమె. ఒకనాడు పెళ్ళి కొడుకుగా పదేళ్ళ క్రితం సిల్కు సూటులో అతను హుందాగా అతని ఫ్రెండ్స్ మధ్య కూర్చుని నవ్వుతూ మాట్లాడుతుంటే, అతన్ని పరిశీలనగా చూసిన ఒక అవ్వగారంది, ఆమె బుగ్గ చేత్తో నొక్కి -- "మన్మధుళ్ళా ఉన్నాడే, మధూ. నీ మొగుడూ! ఎంత అదృష్టవంతురాలివే నువ్వూ !' అని.
    ఆనాటి సంఘటన ఆమె దృక్పధం లో మెదిలి, మళ్ళీ అతని వైపు చూసి బాధగా నిట్టూర్చింది మధుమతి.
    బస్సు ఆగడంతో "మీరు దిగవలసిన స్టేషనిదే" నని గుర్తు చేశాడు కండక్టరు.
    సూట్ కేసు, బాగ్ తీసుకుని ఆమె దిగింది.
    ఆ అబ్బాయి నెత్తుకుని ఆ బాబు బుగ్గలు రెండూ గట్టిగా ముద్దు పెట్టుకుంటూ, "మరి, ఉంటాను. టాటా చెప్పవూ?' అని రుద్ద కంఠం తో అన్నాడు కండక్టర్.
    ఆమె దగ్గరలో నిలుచున్న అబ్బాయి "తా,తా" అన్నాడు.
    అతని జీవితంలో ఎండమావులైన అనంతమైన కోర్కెల్లో ఒక్కటి నెరవేరింది. ఆ బాబు ముద్దు మాటలు కొన్ని క్షణాలు విన్నాడు.
    రుమాలుతో గబగబా కళ్ళూ మొహం తుడుచుకుంటున్న కండక్టర్ ని , "ఏమండీ, వారు మీ బంధువులా?" అని ప్రశ్నించాడో ప్రయాణికుడు.
    "అవును, తెలిసిన వాళ్ళు." మొహం చాటు చేసుకున్నాడు కండక్టర్.

                       *    *    *    *
    తరువాత కొన్నాళ్ళ కి విశాఖపట్నం మెయిన్ రోడ్డు మీద మిలాస్ హోటల్లోంచి వస్తున్న వ్యక్తిని "బాగున్నావా, గోపాలం?' అని ప్రశ్నించాడు బస్సు కండక్టర్ ప్రసాదరావు ఆప్యాయంగా.
    "ఓహ్ మీరా? మధు అక్క చెప్పింది. కొన్నాళ్ళ క్రితం మీరు....." అంటూ ఆగాడా వ్యక్తీ.
    'అవును బస్సు కండక్టర్ గా పని చేసేవాణ్ణి.... నాన్నగారు పోయారని విన్నాను...ప్చ్.... ఏమిటో?... అంతా బాగున్నారు కదూ?' అన్నాడు ప్రసాదరావు.
    "ఆ. బాగున్నారు . ఇప్పుడు డెక్కడ పనిచేస్తున్నారు?" ఎదుటపడి నిలేసి మాట్లాడే మనిషితో ఏదో మాట్లాడాలని ఇబ్బందిగా కదులుతూ అడిగాడు గోపాలం.
    పెన్, చిన్న కాగితం జేబులోంచి తీసి అడ్రెసు వ్రాసి, "ఇదిగో నా అడ్రెసు " అంటూ ఇచ్చాడు ప్రసాదరావు మరి వెళతానని నిష్క్రమిస్తూ.
    కాని ఆ నిష్క్రమణ లో ఎన్ని గతానుభూతులు భారంగా కదిలిపోయాయో ప్రసాదరావు మనః పధం లో .....
    భారంగా అడుగులు వేస్తూ ముందుకీ సాగిపోతున్న అతని వైపు చీత్కారంగా చూస్తూ, "ఛీ భ్రష్టుడు!" అని గొణిగాడు గోపాలం.

                       *    *    *    *
    వాసు వత్తిగిలిన వాడు మళ్ళీ వెల్లకిలా పడుకున్నాడు. గతం క్షణం లో చెదిరిపోయింది. వాసు నిర్మలమైన వదనం లోకి తృప్తిగా చూసి తేలిగ్గా నిట్టూర్చి, గోపాలానికి అడ్రేసిచ్చిన క్షణం ఎంత పవిత్రమైనది! ఎంత గట్టిది! భగవాన్! ఏకాంతంగా, విరాగి లా బ్రతుకుతున్న నాలో యేవో ఆశలు రేపుతున్నావ్. మరి నా జీవితంతో ఆడుకోకు. నన్నేడిపించి నవ్వబోకు. మానవ జీవితంలో దొర్లే కొన్ని మధురాను భూతులన్నా నన్ననుభవించనీ!' అని గట్టిగా కళ్ళు మూసుకుని చేతులు జోడించాడు ప్రసాదరావు.
    అతని జీవితంలో విధి ఎలా అడుకుందో మరి.

                           *    *    *    *
    ఆరోజుల్లో ఆ తాలూకా తాహసీల్దారు వెంకట్రామయ్య గారికి మంచి పలుకుబడి ఉండేది. అతని పేరా చుట్టూ పక్కల గ్రామాల్లో మారు మ్రోగేది.
    అంతేకాక తోటా, దొడ్డీ, బార్యా, కూతురు , ఇద్దరు కొడుకులూ గల పచ్చని సంసార మాయనది.
    ఓ నాటి ఆదివారం సాయంత్రం కాఫీ ఫలహారాలు ముగించిన తరవాత భార్యాపిల్లలతో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు వెంకట్రామయ్య గారు.
    పెరటి గుమ్మం వైపు చూస్తూ, "రండి, బామ్మగారూ" అని ఆహ్వానించింది వెంకట్రామయ్య గారి కూతురు మధుమతి చిరునవ్వుతో.
    "ఎవరమ్మా ?" అడిగారు కూతుర్ని వెంకట్రామయ్య . నాన్నా! ఆవిడ మనింటికి పూజ పూల కోసం వస్తుంటారు." అంది మధుమతి.
    ఇంతలో ఆ గదిలోకే వచ్చేసింది ఆ బామ్మగారనబడే నర్సమ్మ గారు. వస్తూనే "నమస్కారం , బాబూ!" అంది చేతులు జోడిస్తూ.
    "అహహ పెద్ద వారు. దయచెయ్యండి, కూర్చోండి" అన్నాడు వెంకట్రామయ్య ప్రతి నమస్కారం చేసి, వినయంగా లేచి నిలుచుని కూర్చుంటూ.
    కొన్ని పరిచయవాక్యలయ్యాక, ఉపోద్ఘాతం గా దగ్గి, గొంతు సవరించుకుని అంది నర్సమ్మ గారు! "మా మనవడు బి.ఎ పాసై ఉద్యోగం దొరక్క తిరుగుతున్నాడు , బాబూ! మీతో చెపితే మీరేదన్నా పని ఇప్పిస్తారని వెళ్ళమన్నాను మీ దగ్గిరికి. రెండు సార్లు ఆఫీసుకి, ఓసారి మీ ఇంటికి వచ్చాడట. తమ దర్శనం కాలేదు. మీరు లక్ష వ్యాపకాల్లో ఉంటారు, బాబూ మరి. ఏదో తల్లినీ, తండ్రినీ పోగొట్టుకున్న ఆ నలుసుని పెంచి పెద్ద చేశాను. మీకన్నా ఈ ఉపకారం చేసేవారు మాకు కనుపించలేదు, బాబూ!" అని ప్రాధేయ పూర్వకంగా వారి అసహయతనూ, అవసరాన్ని విన్నవించు కుంది నర్సమ్మ గారు.
    "అబ్బాయి వో సారి ఆఫీసు కొచ్చి నన్ను కలియ మనండి. అప్లికేషన్ వ్రాసి ఇస్తే ప్రయత్నిస్తాను.' అన్నాడు వెంకట్రామయ్య హుందాగా.
    వెళుతూ "మరి మీ దయ , బాబూ. వాడు తప్పించి నా కెవ్వరూ లేరు" అంది నర్సమ్మ గారు.
    "చూస్తా వెళ్ళి రండి" అన్నాడు వెంకట్రామయ్య .

                       *    *    *    *
    రెండు రోజుల తరువాత "బామ్మగారు , మీ మనవడు , నాన్నగారిని కలిశారా?" అని అడిగింది మధుమతి, ఆమె సజ్జలో పూలు వుంచుతూ.
    "ఆ, కలిశాడటమ్మా. ఓ వారంలో ఎందుకో పిలుస్తారట." అంది నర్శమ్మ గారు.
    'ఆహా! సెలక్టయితే ఉద్యోగమిస్తారు" అంది నవ్వుతూ మధుమతి.

                                        *    *    *    *
    ఒనాటి సాయంత్రం వీధి తలుపు తెరుస్తూ "ఎవరు?' అని ప్రశ్నించింది మధుమతి.
    "నాన్నగారు ఉన్నారండి?" అన్నాడు వినయంగా అందమైన పాతికేళ్ళ యువకుడు.
    అతన్ని ఓసారి చకితయై చూసిన మధుమతి "ఇంకా యింటికి రాలేదండి . క్లబ్బు కెళ్ళారేమో?" అంది తడబాటుగా.
    "సరే, మళ్ళీ వస్తాను. నే వచ్చి వెళ్ళినట్లు చెప్పండి." వెనుదిరిగాడా యువకుడు.
    "మీరంటే ఎవరని చెప్పాలి?" ప్రశ్నించింది మధుమతి. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి.
    ఆమె తియ్యని గొంతు అతన్ని నిలవేసింది. ఆమె చూపు అతన్ని ఆకర్షించాయి. వెనుతిరిగి ఆమె వైపు చూసిన అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి.
    చిన్నగా నవ్వుతూ , "నేను ....నేనాండీ? మీ బామ్మగారి మనవడినని చెప్పండి" అన్నాడు.
    "ఓహ్! మీరా? .... మీ పెరండి?' అప్రయత్నంగా అడిగింది నవ్వుతూ.
    చామనచాయ రంగు, కోల, గుండ్రమూ కాని మొహమూ, విశాలమైన ఫాలం, నోక్కునోక్కుల నల్లని ముంగురులూ , హరివిల్లు లా వంగిన అందమైన కనుబొమలూ, సోగ కళ్ళూ , ఎత్తైనా నాసికా , సొట్టలు పడ్డ బుగ్గలూ , కొనదేరిన గడ్డం. ఇంకా పద్దెనిమిదేళ్ళ అందమైన అమ్మాయిని పరిశీలనగా చూసిన ప్రసాదరావు , వివేకం వెన్ను తట్టగా , తప్పనుకుని, అంతరాలు గుర్తు తెచ్చుకుని, టక్కున , "సారీ.... ప్రసాదరావండి" అంటూ గబగబా వీధి గేటు తెరుచుకుని వెళ్ళిపోయాడు ప్రసాదరావు.
    "సారీ.....ఎందుకు?" నవ్వుకుంది మధుమతి.

                           *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS