Previous Page Next Page 
కౌసల్య పేజి 4


    గంట సేపటి నుంచి వీధి మొగలో వేచి ఉన్న చిన్ననాటి మిత్ర బృందమంతా , తిలక్ కనిపించే సరికి చుట్టూ చేరి అభినందించారు.
    ఒక్కొక్కళ్ళ కే కృతజ్ఞతలు చెబుతున్న తిలక్ ను ఉద్దేశించి అందులో ఒకడు "ఇప్పటికే గంటన్నర ఆలస్యం అయిపొయింది. అసలు సంప్రదాయం ఏమిటంటే "పాస్' అని ఓ పక్క నుంచి ప్రకటిస్తూనే 'స్వీట్స్' అని ఇంకో పక్క నుంచి అర్దరివ్వాలి. పద పద హోటల్ కి" అన్నాడు.
    "అగరా. మనకి ప్రస్తుతం హోటల్కి అనుమతి లేదు.' అన్నాడు తిలక్.
    "అనుమతి లేదంటే?" అందులో ఒకడు స్పదించాడు. "ఏం , బడ్జెట్ శాంక్షన్ కాలేదా?"
    "విటమిన్ ఎమ్ చేతిలో పడలేదా?"
    "వెధవ్వేషాలేయ్యకు , టీపార్టీ ;లేదు, నీ మొహం లేదు, అవతలికి పోమ్మందా మీ అమ్మ?"
    "చెప్పరా, అలా నీళ్ళు నములుతావేం?"
    "అదేం కాదురా మాట్నీ చూస్తె చూడు, మీ స్నేహితులతో కలిసి, టీపార్టీ మాత్రం వద్దంది."
    "అదేమిటిరోయ్ -- సినిమా పార్టీ ఇచ్చి , టీ పార్టీ మానేస్తావా?"
    "అది కాదు , రేపు పొద్దున్న ఇంట్లో ఏర్పాటు చేద్దాం అంది టీపార్టీ."
    "ఏమిటీ? మీ ఇంట్లోనా?"
    "ఊ!"
    "మే మోవళ్ళమూ రావాలనా వద్దనా?"
    "ఏం?"
    "సర్లే. మీ ఇంటికి గుక్కెడు కాఫీ నీళ్ల కాని కక్కుర్తీ పడి వచ్చామా, చచ్చామన్న మాటే!"
    "అదేమిటిరా -- అలా అంటావు?"
    "చెంచాడు కాఫీ నీళ్లు పోసి చెక్క పూటుగా తిడుతుంది మీ అమ్మ. చాలు చాల్లే."
    తిలక్ చిన్న బుచ్చుకున్నాడు.
    "ఒరేయ్ తిలక్ ఒక్క విషయం చెబుతాను విను. తల్లి తండ్రుల మీద గౌరవం ఉండవలసిందే, కాదనను. కాని మరీ అంత చిన్నపిల్లాడి లాగ ప్రతిదానికీ వాళ్ళు చెప్పిందే వింటూ , వాళ్ళు గీసిన గిరిలోనే తిరిగితే నువ్వో మనిషిగా పెరిగే దెప్పుడు? నీకో వ్యక్తిత్వం వచ్చే దెప్పుడు?"
    "పైగా నీ జన్మంతా మైనారిటీ తోనే గడుస్తుంది. నువ్వెప్పుడూ కేరాఫ్ గానే మిగిలిపోతావు!"
    "ఉండండిరా. వాడిని కొంచెం గాలి పీల్చుకో నివ్వండి. ఏదీ, మొన్న మొన్ననే కదా ఈ రామచంద్ర పురం వీధులు వదిలి కాకినాడ మహా నగరంలో స్వేచ్చా వాయువులు పీల్చడం మొదలెట్టింది?"
    "తిలక్ చిరునవ్వు నవ్వాడు.
    "పి.యు.సి ఫెయిల్ అయి, తన స్వేచ్చా ధ్వజాన్ని కూడా ఓమాటు ఎగరవేశాడు" అని పూర్తీ చేశాడు ఇంకొకడు.
    "అవునా? ఈ ఏడు పోనీ. మెడిసిన్ లో చేరాక చూడు మనవాడి సంగతి. తన పరుగు అందుకోమంటాడు."
    "కబుర్ల తో కాలక్షేపం చెయ్యకండిరా. అవతల సినిమా టైము దాటుతుంది." అని ఒక హెచ్చరిక.
    "సినిమా చూసే ఓపిక రావాలంటే ఈ జీవుడికి కాఫీ కషాయం గొంతులో పడాలి."
    "దానికి తోడు రెండు టాబ్ లెట్స్ ఇడ్లీ కూడా పడాలేమో!"
    'ఆ సమయం కదా అని అడగలేదు. అనుగ్రహించాం. సేకరిస్తే సరి. స్వీకరించడానికేం అభ్యంతరం లేదు."
    "పాపం! ఈ స్వాముల వారిని కాఫీ దేవాలయం వేపు మళ్ళించండిరా" అన్నాడో భక్తుడు.
    తాన నీవిధంగా ఓ పక్క నుంచి రెచ్చ గొడుతూ మరో పక్క నుంచి ఉత్సాహ పరుస్తూన్న మిత్ర బృందాన్ని తీసుకుని, కాఫీ హోటల్ కు వెళ్లి అక్కడ నుంచి సినిమా కు బయలుదేరాడు తిలక్.
    సినిమా చూస్తున్నంత సేపూ అతనికి స్నేహితులు అన్న మాటలే జ్ఞప్తికి రాసాగాయి. అవును, తనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు. తన ఊహలు, అలవాట్లు , అభిరుచులు అన్నీ అమ్మ నిర్దేశించి పెట్టినవే కాని, తనకు తానై ఏర్పరచుకొన్నవేవీ లేవు. ఆఖరికి పి.యు.సి. లో ఆప్షనల్ సబ్జక్టు కూడా అమ్మ నిర్ణయించిందే! బాటనీ-- జువాలజీ గ్రూపు తనకు అసలు ఇష్టం లేదు. 'తప్పదు తీసుకోవాల్సిందే!' అంది. 'నేను మెడిసిన్ చదవను మొర్రో ' అన్నాడు. 'వీల్లేదు అంది. ఎందుకేనా మంచిదని, కాకినాడ కాలేజీ కి ఏడువేల రూపాయలు డొనేషన్ కూడా కట్టేసింది. తను చదవలసిన కాలక్షేపం పుస్తకాలు చేయదలచిన స్నేహాలు, వేసుకోవలసిన బట్టలు, ఇవన్నీ కూడా అమ్మ సెన్సారు కు గురి కావలసిందే! హైస్కూలు లో చదినన్నాళ్ళూ స్కూలు, ఇల్లు తప్ప ఇంకో చోటికి వెళ్ళ నిచ్చేది కాదు. సాయంత్రం అడుకోవాలన్నా ఇంట్లోనే, బాట్, బంతి తీసుకుని , గోడకు పుటికీలు కొడుతూ ఆడుకునే వాడు తను, అంతా హాయిగా కేరింతలు కొడుతూ గ్రౌండు లోనూ అక్కడా ఆడుకుంటుంటే.
    అందుకే పి.యు.సి లో చేరడానికి గుమస్తా గారితో కలిసి మొదటిసారిగా కాకినాడ వచ్చినప్పుడు తనకేదో కొత్త లోకంలోకి వచ్చినట్లనిపించింది. హాస్టల్ లో చేర్చి గుమస్తా గారు వెళ్ళిపోయాక, తృప్తి తీరా వారం పది రోజులు ఊరంతా తిరిగాడు. కొంచెం డాబుగా కనిపించిన ప్రతి హోటలు దర్శించాడు. సరే, ఇంక సినిమాలు లెక్కే లేదు. బయలుదేరే టప్పుడు అమ్మ ఇచ్చిన సలహాలన్నీ విస్మరించాడు. నెల తిరక్కుండానే తనకు దాదాపు పది పదిహేను మంది స్నేహితు లేర్పడ్డారు. ఓహ్! వాళ్లతో బోలెడు కాలక్షేపం. కబుర్లు, నవ్వులూ , కేరింతలు , రెండు పూట్లా వాళ్ళనందర్నీ హోటల్ కు తీసుకు పోవడం, మధ్యాహ్నం క్లాసులు ఎగగొట్టి అప్పుడప్పుడు మాట్నీలు చూడడం, క్లాసులో లెక్చరర్ల నూ, బయట అమ్మాయిలనూ ఏడిపించడం -- భలే సరదాగా గడిచిపోయింది. ఎనిమిది నెలలూ ఎనిమిది నిమిషాల్లా తిరిగి పోయాయి.
    మధ్య మధ్య సెలవులకు ఇంటికి వచ్చినపుడు అమ్మ గట్టిగా చివాట్లు పెట్టేది డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నానని. 'వచ్చే నెలలో డెబ్బై -- రూపాయల కంటే ఎక్కువ పంపించేది లేదు' అనేది. కాని తీరా తను వెళ్లి ఉత్తరం వ్రాస్తే వంద కాదు, నూట ఏభై అయినా పంపించేది.  కానయితే మధ్య మధ్య గుమస్తా గారిని పంపేది కాకినాడ. తను ఎలా చదువుతున్నాడో చూచి రమ్మని. అయన వచ్చిన రోజున, తను బుద్దిగా పుస్తకాల ముందు కూచునేవాడు. దానితో అయన 'కుర్రాడు బుద్దిగా చదువుకుంటున్నా' డనుకొని వెళ్ళిపోయేవాడు.
    సంక్రాంతి సెలవులకు వెళ్లినప్పుడు కాబోలు, అమ్మ అంది; 'గుమస్తా గారు చెబుతున్నారు కాని నా కళ్ళతో నేను వచ్చి చూస్తె కాని నాకు నమ్మకం లేదు. ఆ! ఇంక నేను స్వయంగా ఆ ఊరు వచ్చి కొడుకుని చదివించుకోవాలి . ఫలానా పెరుమాళ్లయ్య గారి అమ్మాయి -- పాపం! అంటూ ప్రతి వాళ్లూ పలకరించడం, పరామర్శలు . ఛ, అందుకే కుర్రాణ్ణి తండ్రి ఉండి చూసుకుంటే ఉండే సుఖం వేరు.'
    తండ్రి! తన తండ్రి! అయన పేరేమిటో అలా ఉంచి, అధమం అయన ఊరైనా తనకు తెలియనివ్వలేదు అమ్మ. ఊళ్ళో వాళ్లను కొనే మాటలను బట్టి కోనసీమ లో ఓ పల్లేటూరని మాత్రం తెలిసింది తనకు. అధమ పక్షం అయన ఫోటో అయినా లేదు ఇంట్లో. తండ్రి ఈ లోకంలో ఉన్నారు. కాని తనకు మాత్రం లేరు. ఈ ఆలోచనతో తిలక్ మనస్సు వికలం అయింది.

                                     3
    గురువారం ఉదయం ఇంకా కాకులు కూయకుండానే వీరుగాడు సత్తెయ్య నూ, సుందరమ్మనూ కామందుల ఇంటికి నడిపించుకుని తీసుకు వచ్చాడు, యజమానులకు దణ్ణాలు పెట్టిద్దామని. అప్పుడే పొలం నుంచి తిరిగి వచ్చిన వెంకట్రామయ్య, కాఫీ పూర్తీ చేసి ముందు హల్లో పడక కుర్చీ లో కూర్చున్నాడు. మామూలు ప్రకారం భాగవతం తెచ్చి బాబయ్య కిచ్చి, తనేమో బియ్యం చేట ముందు పెట్టుకుని కూచుంది, హాల్లోంచి లోపలి వసారా లోకి వచ్చే గుమ్మం దగ్గర లోపలగా, విశాలాక్షమ్మ. ఓ తలుపు ఒరగిలా వేసి బియ్యం ఏరుతూ, వెంకట్రామయ్య చదువుతున్న భాగవతం వింటూ ఉంది. పక్క గదిలో ఆనందం, తను చదివేసిన బి.ఎ . పుస్తకాలన్నీ కట్ట కట్టి బీరువా లో పెడుతూ, అందులో ఎమ్.ఎ.కు అవసరమైన పుస్తకాలు వేరేపెడుతున్నాడు. నేలమీద పడిన మంచుకు పరికిణీ కుచ్చిళ్లు తడిసిపోకుండా చేత్తో పట్టుకుని, పల్లె వాటు కొంగు వెనకవాటుగా తెచ్చి బోడ్డులోదోసి చామంతులూ, బంతి పువ్వులూ కొయ్యడానికి ఇంటి ముందున్న పెరట్లో కి వెళ్లింది జానకి. ముకుందం మాత్రం పడంటింట్లో పడుకొని ఇంకా గుర్రు పెడుతూనే ఉన్నాడు.
    "పలికెడిది భాగవతమట.
    పలికించెడి వాడు రామ భద్రుండట నే
    పలికిన భవహర మగునట    
    పలికెద వేరొండు గాధ పలుకగనెలా?"
    అని తన్మయత్వంతో చదువుతున్న వెంకట్రామయ్య వీరిగాడినీ వాళ్ళ నూ చూసి భాగవతం మూసేసి, కళ్ళ జోడు తీసి చేత్తో పట్టుకున్నాడు. సత్తేయ్యా, సుందరమ్మ వచ్చి దణ్ణం పెట్టారు. వెంకట్రామయ్యకు. అతని కళ్ళు అర్దలయ్యాయ వాళ్ళిద్దరి ని చూసి.
    పంచె చెంగుతో కళ్ళు తుడుచుకుని "ప్రధానం బాగా జరిగిందా?" అన్నాడు వెంకట్రామయ్య.
    "బాగానే జరిగిందండి మీ దయవల్ల. సత్తేయ్యేమో పిల్లకో అరకాసు బంగారం పెట్టాడండి" అన్నాడు వీరి గాడు.
    "ఊహూ!" చిరునవ్వుతో వెంకట్రామయ్య సత్తెయ్య కేసి చూశాడు. వాడి నల్లటి ముఖంలో కొట్టవచ్చినట్లు కనిపించే ఆ తెల్లని కళ్ళు, మరింత తెల్లగా మెరిశాయి. స్తంభం వార నిలబడ్డ సుందరమ్మ ఒళ్ళంతా సిగ్గుతో జలదరించింది. నేల కేసి చూస్తూ తల వంచుకొని నిలబడింది. పువ్వులు కొయ్యడం సగంలో మానేసి, సజ్జ పట్టుకు వచ్చి తాతయ్య కుర్చీ పట్టుకొని వెనకాల నించుంది జానకి. సుందరమ్మ కొంచెం తలెత్తి జానకి కేసి చూసింది. జానకి మౌనంగానే మందహాసం తో పలకరించింది. సుందరమ్మ కు సిగ్గు ముంచు కొచ్చింది. చీర చెంగు వేలికి చుట్టుకుంటూ అలాగే నిలుచుండి పోయింది సుందరమ్మ.
    "అలా కూచోండర్రా" అన్నాడు వెంకట్రామయ్య. "అయ్య" అంటూ సత్తెయ్య కూర్చున్నాడు. వీరిగాడు మాత్రం కూర్చోకుండా "అమ్మగారేరండి?" అన్నాడు.
    "లోపల ఉన్నట్టుంది. అమ్మా! విశాలక్షి! సత్తెయ్య, సుందరమ్మా వచ్చారు" అన్నాడు బిగ్గరగా , వెంకట్రామయ్య. తలుపు వెనకాలే ఉన్న విశాలాక్షి నెమ్మదిగా "అవును, చూశాను. ఏం వీరిగా అంతా లక్షణంగా జరిగిందా?' అంది.
    "చిత్తం. ఒరేయ్--అమ్మగారికి దణ్ణం పెట్టండి."అన్నాడు వీరిగాడు. లేవబోతున్నసత్తెయ్య ను వారిస్తూ "నాకు వద్దు . బాబయ్య కి పెట్టారుగా?" అంది విశాలాక్షి డగ్గుత్తికతో తన వైధవ్యాన్ని తలచుకొని. ఒక్క క్షణంలో ఆ వాతావరణం అంతా విషాద చ్చాయలు కమ్ముకున్నాయి. వెంకట్రామయ్య శూన్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు. జానకి బెంగగా అటు తల్లి కేసి, ఇటు తాతయ్య కేసి చూసింది.
    వీరిగాడు కండువా తో కళ్ళు వొత్తుకుంటూ "ఆ పాపిష్టి దేవుడికి కనికరం లేకుండా పోయింది. సూరయ్య బాబుగారు, కాకినాడ నుంచి ఎప్పుడొచ్చినా దొరలా వచ్చేవారు. ఆ తాసీల్దారీ , ఆ ఠీవి తో వీధిలో నడుస్తుంటే అందరూ అనుకొనేవారు విశాలక్షమ్మ ఎంత అదృష్ట వంతురాలో అని. పెద్ద బాబుగారు ఎంత ఇదయేవారని? 'నాకేమిట్రా లోటు మా అల్లుడు తాసీల్దారు!' అనేవారు. అంతా కలలో విషయంగా అయిపొయింది" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS