3
పంతులమ్మ ఆపరేషను సవ్యంగానే జరిగిపోయింది. అవసరమైన మందులూ, మాకులూ తెచ్చి పెడుతూ, చేదోడు వాదోడు గా ఉంటూ రాజు వారికి ఏంతో సహాయం చేశాడు. మగదిక్కు లేక, నిస్సహాయక స్థితి లో ఉన్న వారికి రాజు చేసిన సహాయం ఎంతో ఘనంగా కనిపించింది. వారికి ఎంతో అత్మీయుడై పోయాడు. ప్రతిరోజూ వార్డు కొచ్చి పంతులమ్మ ను పలుకరించి పోతుండేవాడు. ఆ సమయంలో వనజ ఉంటె మరికొంత సేపు కూర్చునీ అవీ ఇవీ మాట్లాడుకొనేవాళ్ళు.
ఆరోజు రాజు కేమీ తోచలేదు. అందులో రెడ్డి వారం రోజుల్నుంచీ ఊళ్ళో లేడు. రెడ్డి లేక పొతే సాయంత్రం వేళల్లో పొద్దు పోవటం చాలా కష్టం. రాజు కాసేపు పంతులమ్మ దగ్గర కూర్చున్నాడు. తర్వాత లేచి రెడ్డి వచ్చాడో లేదో తెలుసుకుందామని లైబ్రరీ కేసి వెళ్ళాడు. రెడ్డి రావడమైతే వచ్చాడు కాని చాలా 'బిజీ" గా ఉన్నాడు. "అర్జంటు పని మీద వెళ్తున్నాను ఎక్కడి కనీ మాత్రం అడగొద్దు వస్తా" అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. అతని అర్జంటు పనేమిటో రాజుకు తెలుసు రెడ్డి రసికుడు. అటువంటి విషయాల్లో వివరాలు అడగటం గాని చెప్పటం గానీ ఇద్దరికీ ఆలవాటు లేదు.
రాజు మెల్లగా సముద్రం కేసి నడవటం ప్రారంభించాడు. రామకృష్ణ మిషన్ దగ్గర కొచ్చేటప్పటికి కాళ్ళు నొప్పెట్టాయి. సముద్రపు వొడ్డున నిర్జన ప్రదేశ మొకటి చూసుకుని అక్కడ కూలబడ్డాడు. ఆహ్లాదకరమైన చల్లని గాలి మూర్యుడస్థమించాడు. కాని చీకట్లింకా పూర్తిగా వ్యాపించలేదు. వెలుగు చీకట్ల కలయిక సముద్రపు మీద వింత రంగు పులుముకుంది. ఉదయించ బోతున్న చంద్రుని కాంతి సాగర గర్భం లోంచి అప్పుడే బయటికొస్తోంది. నలుగురైదుగురు కాలేజీ అమ్మాయిలు కాబోలు అప్పుడే వచ్చి రాజుకు కాస్త దూరంలో కూర్చుని పెద్దగా నవ్వుకొంటూ కబుర్లు చెప్పుకోసాగారు. వాళ్ళు మినహా బీచి అంతా నిర్మానుష్యంగా ఉంది. కొంచెం సేపటికి వాళ్లలోంచి ఒక అమ్మాయి లేచి తన వైపు రావటం గమనించాడు రాజు మసక వెల్తురు తీరా దగ్గరి కొచ్చేప్పటికి వనజ !
"నమస్తే డాక్టర్"
రాజు కొంచెం తొట్రు పాటు పడుతూ "నమస్తే" అన్నాడు . "ఇప్పుడే మీ అక్కగార్ని చూసి వస్తున్నాను. అక్కడ మీరు కనుపించక పోయేసరికి ఇలా వచ్చాను."
వనజ నవ్వుతూ నేనిక్కడి కోస్తానని మీకెలా తెలుసు?" అన్నది.
రాజు సిగ్గుపడుతూ "అబ్బే అది కాదు..... మీరిక్కడ కొస్తారని నాకేం తెలుసు? నేను ఊరికే వచ్చాను ఏమీ తోచక అన్నాడు కంగారు పడుతూ.
అతని అవస్థ గమనించిన వనజ బలవంతాన నవ్వు అపుకొంటూ గంబీర్యాన్ని తెచ్చి పెట్టుకొని "పోనీండి ఏమీ తోచకపోతే అక్కడ మా స్నేహితులంతా ఉన్నారు. రండి పరిచయం చేస్తాను." అన్నది.
రాజు మరింత కంగారు పడుతూ "వద్దు, వద్దు నేను కొత్త వాణ్ణి మీ ఫ్రెండ్స్ కి ఇబ్బందిగా ఉంటుంది." అన్నాడు.
"వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు. మీకు వాళ్ళు తెలియకపోయినా మీ గురించి వాళ్ళకు తెలుసు."
"ఎలా తెలుసు."
వనజ నవ్వి "అదేమిటి మీరు నాకు కావలసిన వారు కదూ. అందుకని మా ఫ్రెండ్స్ కి తెలియటం లో విచిత్రమే ముంది?" అన్నది.
"అమ్మో! అప్పుడే నలుగురమ్మాయిలకి తనని గురించి తెలుసునన్న మాట! ఇంకా ఎంతమందికి తెలుసో, వనజ తనని గురించి ఏమి చెప్పిందో, రాజు కోక కొత్త అనుభూతి కలిగింది.
"పోనీ, నేనే ఇక్కడ కూర్చుంటాను. మీకేం అభ్యంతరం లేదుగా?"
'ఛా, ఛా మీరైతే నాకేం ఇబ్బంది. కూర్చోండి. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొందాం." అన్నాడు రాజు.
వనజ అతని పక్కనే చల్లని ఇసక లో కూర్చుని , చీర మడతలను పొందికగా అమర్చుకుంటూ "మీరు నన్ను అండీ గిండీ అనకండి. వనజా అని పిలిస్తే చాలు" అన్నది.
"సరే అలాగే పిలుస్తాను. మీ అక్కగార్ని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తానని లేడీ డాక్టరు చెప్పింది. మీకు తెలుసా?" అన్నాడు రాజు.
"అదుగో మళ్ళీ "మీ అంటున్నారు" వనజ నవ్వుతూ అక్క సంగతి నాకు తెలియదు. ఏదీ, ఈపూట ఇంకా హాస్పిటల్ కు వెళ్ళలేదు. స్నేహితులంతా బలవంతం చేస్తే ఇలా వచ్చాను. పోనీండి. శుభవార్తే తెచ్చారు. మీ నోట్లో రేపు పంచదార పెడ్తాను అన్నది నవ్వుతూ.
రాజుకు మొదట ఉన్న సంకోచం కాస్త తగ్గింది. తీయని ఆమె మాటలు అతన్ని కరిగించి వేశాయి. మసక వెల్తురు లో , అనిర్వచనీయమైన సౌందర్యంతో మెరుస్తున్న ఆమె ముఖం కేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు. చాలాసేపటికి వనజ సిగ్గుపడుతూ "అదేమిటి అలా చూస్తున్నారు?' అన్నది.
రాజు తేరుకుని "అబ్బే ఏమీ లేదు. మీ మతం లో ఆడవాళ్ళు, బొట్టు పెట్టుకోరు కదూ? మీ ముఖాన కుంకుమ బొట్టు ఉంటె చూస్తున్నాను" అన్నాడు.
"ఓ , అదా? నాకు అటువంటి పట్టింపులేవీ లేవు. బొట్టు నాకు అందంగా లేదూ?" కేవలం ఆడవాళ్ళ ప్రశ్నే!
"చాలా బావుంది"
బాగా చీకటి పడిపోయింది. చలి కూడా ఎక్కువైంది. రోడ్ల మీద దీపాలు వెలిగించారు. రామకృష్ణా మిషను లోంచి ఆధ్యాత్మిక విషయాల మీద ఎవరో ధారాళంగా ఉపన్యసిస్తున్నారు. వనజ తన సిల్కు చీరే కొంగును భుజాల మీద కప్పుకుని చలికి వణుకుతూ "యేమండీ ఇక్కడ చాలా బావుంది కదూ? ఉదయిస్తున్న ఆ చంద్రుణ్ణి చూడండి. నీళ్ళలో ఆ ప్రతిబింబం వెన్నెల బాట వేసుకొని ఎంత చక్కగా ఉందొ, ఎంతసేపైనా ఇక్కడే వుండి పోవాలని పిస్తుంది కదూ?" అన్నది.
'ఔను , చాలా బావుంది" అన్నాడు రాజు. తన స్వంత ఊహాలోకం లోంచి బయటపడటం ఇష్టం లేనట్లుగా.
వనజకు ఆ సమాధానం రుచించలేదు చీకట్లో అతని ముఖ బావాలేవీ స్పష్టంగా కనుపించక పోయినప్పటికీ అతను ఇంకా సంకోచ పడుతున్నాడని మాత్రం గ్రహించింది. చాలాసేపు ఇద్దరూ మౌనంగానే గడిపివేశారు. మాటలు పొడిగించటం లో స్త్రీల కన్న సహజ చాతుర్యాన్నంతా ఉఅపయోగించి కూడా వ్యర్దురాలై పోయింది వనజ. చటుక్కున పైకి లేస్తూ "మా వాళ్ళంతా నాకోసం ఎదురు చూస్తుంటారు.... నేనిక వెళ్తాను. గుడ్ నైట్" అంది.
"అప్పుడే వెళ్తారా'?"
అర్ధం లేని ప్రశ్న. వనజ తలూపి "వెళ్ళాలి చాలా పొద్దుపోయింది " అన్నది.
రాజు కూడా లేచి నిలబడ్డాడు. వనజ నాలుగడుగులు వేసి, మళ్ళీ వెనక్కు తిరిగి "మీరు మా ఇంటి కొకసారి వస్తానని ప్రామిస్ చేశారు. ఎప్పుడొస్తారు?" అని అడిగింది.
"తప్పక వస్తాను. పంతులమ్మ గార్ని కూడా హాస్పిటల్ నుంచి రానివ్వండి."
వనజ మరోకసారి గుడ్ నైట్ చెప్పి, తన స్నేహితురాళ్ళు కూర్చున్న వేపు వెళ్ళిపోయింది. మరి కొంచెం సేపటికి వాళ్ళంతా ఏమిటో చెప్పుకొని బిగ్గరగా నవ్వుకొంటూ వెళ్ళిపోయారు.
రాజు హృదయం ఎందుకో హటాత్తుగా బరువెక్కి పోయింది. వనజ ఒంటరిగా కనుపిస్తే ఏమేమో మాట్లాడాలనీ, తమాషాగా కబుర్లు చెప్పుకోవాలని ఏమేమో కలలు గన్నాడు. తీరా ఆ అవకాశం దొరికేసరికి నీళ్ళు కారిపోయాడు ఉత్త ఐస్ క్రీం లాగా, డామిట్ , ఏమిటి నేనింత 'డల్' గా తయారయ్యాను. అని బాధపడ సాగాడు.
వనజ కూడా అతణ్ణి గురించి సరిగ్గా అదే అనుకొంటుంది మనసులో.... ఉత్త ఐస్ క్రీమ్, ఆడపిల్లల్తో ఎప్పుడూ మాట్లాడలెదల్లె ఉంది" పైగా మెడిసిన్ చదువుతున్నాడు-- ఎందుకో!
స్నేహితురాళ్ళంతా కె.జి. హాస్పిటలు దగ్గర విడిపోయారు. వనజ అక్కయ్య దగ్గరకు వెళ్దామా, వద్దా అనే సందిగ్ధ అవస్తలో పడిపోయింది. అప్పటికే టైము ఎనిమిదైంది. ఇంత పొద్దు పోయేవరకూ ఏం చేస్తున్నావని అడిగితె, అదీకాక వనజ కు ఇప్పుడు మరొక సమస్య ఎదురైంది. పంతులమ్మ ఆనందరావు దగ్గర అప్పు తీసుకొని ఇచ్చిన డబ్బు చాలా వరకూ ఖర్చై పోయింది. సినిమాలు, బట్టలూ మొదలైన వాటికి , అక్కయ్య రేపు ఇంటి కొచ్చిన తర్వాత లెక్క అడిగితె తనేం సమాధానం చెప్పాలి? వనజ కొంచెం సేపు అలోచించి, ఆప్పటిక అక్కయ్యను చూసే ఉద్దేశం మానుకుని, ఒక రిక్షాను పిలిచి డాబా గార్డెన్స్ కు పోనీ' అన్నది. తీరా రిక్షా ఎక్కాక ఆమెకొక అనుమానం వచ్చింది. అతనీ సమయంలో గదిలో ఉంటాడో లేదో?- పోనీ వెళ్ళి చూస్తె సరిపోతుందిగా అని మనసు స్థిమిత పర్చుకొని కూర్చుంది.
రెడ్డి రూములో పడుకొని ఏదో ఇంగ్లీషు నవల చదువు కొంటున్నాడు. అతని పూర్తీ పేరు ఓబుల రెడ్డి అని చాలా మందికి తెలియదు. అందరూ రెడ్డి అనే పిలుస్తుంటారు. అతనిది రాయలసీమ లో ఏదో పల్లెటూరు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి . అతని మాటలు పైకి మొరటు గా వినిపించినా హృదయం మాత్రం నిష్కల్మషమైనది. నమ్మి స్నేహం చేశాడంటే ప్రాణాలైనా అర్పిస్తాడు. ఆడా, మగా స్నేహితులు కూడా అతనికి తక్కువేమీ లేరు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో చాలా సన్నిహితమైన సంబంధమే ఉందని కాలేజీ లో పుకారు. అతని మీద ప్రచారంలో ఉన్న ప్రణయ కధల్లో కొంత నిజమూ, కొంత అబద్దం కూడా ఉన్నది. ఏది ఏమైనా అతనిలో ఆడపిల్లల్ని ఆకర్షించే గుణం ఏదో ఉన్నది. కాలేజీ లో జరిగే నాటకాలు, మీటింగు లు విషయంలో ఆడపిల్లలంతా అతని సలహా కోసం మాటిమాటికి పరిగెత్తుతూ ఉంటారు.
స్వభావం లోనూ, ప్రవర్తన ల్లోనూ, రెడ్డికీ రాజుకీ ఎక్కడా పోలిక అనేది కనుపించదు. ఇద్దరివీ రెండు విభిన్న తత్వాలు. కాని తమాషా ఏమిటంటే, ఉత్తర, దక్షిణ ధృవాల తగ్గ వారిద్దరికీ మంచి స్నేహ మేర్పడింది. రాజులో ఉన్న పట్టుదలా, ఆత్మ నిగ్రహం రెడ్డిని ఆకర్షించాయి. రెడ్డి లో ఉన్న సరళ స్వభావం, కలుపుగోలు తనం రాజుని ఆకర్షించాయి. ఆ విధంగా , వారి స్నేహం గట్టి పునాదులతో బలపడి పోయి "బర్డ్స్ అప్జ్ ది సెమ్ ఫెదర్...." అనే సామెత అన్ని చోట్లా నిజం కాదని నిరూపించింది. ఐతే వారిద్దరి మధ్యా కొన్ని భేదాభిప్రాయాలు లేకపోలేదు. కాని వాటిని గురించి ఎప్పుడూ చర్చించుకోరు అటువంటి సందర్భాలేవైనా వస్తే జాగ్రత్తగా తప్పించు కొంటారు. అందువల్లనే రెడ్డి ప్రణయ కలాపాలను గురించి రాజూ కేమీ తెలియదు.
డిటెక్టివ్ నవల చదువు కొంటున్న రెడ్డి రిక్షా ఆగిన శబ్దం విని తలెత్తి చూశాడు. వనజ రిక్షా దిగి లోపల కోస్తోంది. రెడ్డి సంభ్రమితుడై లేచి నిలబడి తోట్రుపాటుతో "ఇదేమిటి వనజా, హటాత్తుగా ఇలా ఊడి పడ్డావ్?' అన్నాడు.
వనజ నిస్సంకోచంగా లోపల కొచ్చి , అక్కడున్న ఒకే ఒక మంచం మీద కూర్చుంటూ "ఏం , రాకూడదా?' అన్నది.
'ఆహా, రాకూడదని కాదు. ఇదివరకు బ్రతిమాలితే గాని వచ్చేదానివి కాదు. ఇప్పుడు నీ అంత నువ్వే వచ్చావని...."
"ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చునని మీరేగా చెప్పారు. స్నేహితులెవరైనా వస్తున్నారా ఏమిటి"
"అదేమీ లేదు ఏడు దాటితే మన రూము స్నేహితులందరికీ "ప్రోహిబిటేడ్ యేరియా" అని తెలుసు, ముందుగా చెప్తే తింటానికి అదీ ఏర్పాటు చేసి వుండేవాడ్ని కదా అని"
"సరేలెండి. ఆ అతిధి మర్యాదలన్నీ మరోకప్పుడు చేద్దురు గాని ఇప్పుడు నేను చాల అవసరం ఉండి వచ్చాను. నాకొక వందరూపాయలు కావాలి" అన్నది.
