Previous Page Next Page 
తప్పు పేజి 4


    చెల్లెలు యివాళ అత్తవారింటికి వెళ్లి పోగానే తండ్రి తన ముందు పరచిన గతాన్ని సింహవలోనకం చేసుకుంటుండిపోయాడు అతను. ఇప్పుడు యిన్నేళ్ళ కి అతను సంఘానికి దూరంగా, యేకాకిలా వూహించుకుని కళ్ళ నీళ్ళతో శూన్యంలోకి చూస్తుండి పోయాడు. మీనాక్షి పేదయింటి ఆడపిల్ల. గౌరీపతి బియ్యే పాసైన తన కొడుక్కి కానీ కట్నం లేకుండా చేసుకుంటాననడం మీనాక్షి తల్లితండ్రులకి మెరుపు యేక్కినట్లుగా అనిపించింది. బుద్దిమంతుడూ, రూపవంతుడూ అయిన అల్లుడిని చూసి పొంగి పోయారు . మీనాక్షి చేసుకున్న పూజా ఫలం అన్నారు స్నేహిరురాళ్ళు.
    విశ్వనాధం మాత్రం మనసులో మరో విధంగా అనుకున్నాడు. "పూర్వజన్మ లో ఏదో తప్పిదం చేసి యిలా తెలియని శిక్ష అనుభవిస్తున్నావు మీనాక్షి . నేను ఎవర్నో నీకు చెబితే కధలో సోమయాజులు గారమ్మాయి సుశీల మాదిరిగా కుక్క ముట్టిన కుండని అగ్నితో దగ్ధం చేస్తావని నాకు తెలుసు. నాలోనే ఉండనీ ఈ రహస్యాన్ని.
    మీనాక్షి అతని పరధ్యానానికి కారణం అడిగేది. చెల్లెలు యెంతో దూరం వెళ్ళి పోవడం తప్ప అతను యింకేదీ చెప్పేవాడు కాడు. ఆఫీసులో అతను పెట్టిన సెలవు కాలం పూర్తీ కాగానే అమలాపురం వెళ్ళిపోయాడు భార్యతో సహా.
    హైదరాబాదు లో విష్ణుమూర్తి పేరు పొందిన ఎలక్ట్రిసిటీ ఆఫీసులో యింజనీరు గా పని చేస్తున్నాడు. సెలవు పెట్టి పెళ్లికి వెళ్ళి అతను అప్సరస లాంటి భార్యతో బాంక్ స్ట్రీట్ లో పెద్ద మెడ అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టడం స్నేహితుల్ని ఆనందపరిచింది. ఒకానొక సాయంత్రం అతను స్నేహితులనీ, ఆత్మీయుల్నీ, అందర్నీ పిలిచి విందు చేసి భార్యని నలుగురికీ పరిచయం చేశాడు.
    అమలాపురం  తప్ప మరో ప్రాంతం యెరుగని గోవింద భర్తకు గల పలుకుబడినీ, నగరపు వాతావరణాన్ని చూసి సంబర పడింది. విష్ణుమూర్తి ఉదయం లేచింది మొదలు రాత్రి తొమ్మిదిన్నర గంటలైనా వూపిరి సలపని పనులతో సతమతమై పోతుంటాడు. అటువంటప్పుడు గోవింద భర్తకి దగ్గరగా చేరి నేను కూడా చేస్తాను. ఆ రాతకోతలు నాకు అర్ధం కానివి అంటారా?' అని అడిగింది.
    విష్ణుమూర్తి భార్య కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. 'నీకు అర్ధం కాదని కాదు గోవిందా. ఈ జంజాటం నీకు కూడా దేనికి? యింటి పనులు యేలాగూ వున్నాయి నీ పాలిట .  వీటిని కూడా నెత్తిన వేసుకుంటే ఆ బరువు మోయలేవు నువ్వు. నువ్వు రెస్టు తీసుకో."
    గోవింద మాట్లాడకుండా అతను రాస్తున్న ఫైళ్ళ వంక చూస్తుండి పోయింది. అతనికి జీతం కూడా చాలా ఎక్కువే. అందంగా తననంత అపురూపంగా చూసే భర్తకి ఏ విధంగా చేయూత నివ్వాలో తోచింది కాదు.
    'నాకు వుద్యోగం చెయ్యాలని వుంది,' అన్నది కాస్సేపు అయేక.
    అతను నవ్వాడు. గలగలా నవ్వే అతని నవ్వుకి గది గోడలు ప్రతిధ్వనిస్తుంటే గోవింద చిన్నబుచ్చుకుంది. అతను లేచి అమాంతం ఆమెను లేవనెత్తి తిరిగి కూర్చో బెడుతూ నెమ్మదిగా అన్నాడు. 'మొత్తానికి చదువుకున్నావనిపించావు.  చూడు గోవిందా మన యిద్దరి సంపాదనా యెక్కువై పోదంటావా చెప్పు. నా జీతమే మిగిలి పోతోంది. నువ్వూ సంపాదించడం ప్రారంభిస్తే పాపం బియ్యే లూ, ఏం ఏ లూ పాసైన వాళ్ళంతా ఆడవాళ్ళందర్నీ దుయ్యబడుతూ పేవ్ మెంట్ల మీద అఘోరిస్తారు. యెందుకు చెప్పు పేదవాళ్ళ కడుపులు కొడుతూ వున్న వాళ్ళు వుద్యోగాలు చేయడం?'
    గోవింద నోరెత్తలేదు. అతను తమాషాగా అనలేదు. ప్రపంచాన్ని చూస్తూ నలుగురి లో తిరుగుతున్న అతనికి సామాన్యుడి సాధక బాధకాలు తెలుసు. తొమ్మిది గంటలు దాటుతుంటే మోటారు సైకిల్ స్టారు చేసి వీధి గేటు లోంచి యించుమించు పరుగులు తీయించాడు వాహనాన్ని.
    గోవిందా, విష్ణుమూర్తుల సంసారం సాఫీగా గడిచిపోతూ కాలండర్లో ఆరు కాగితాల్ని మార్చి వేశాయి.
    విష్ణుమూర్తి వుంటున్న మేడ క్రింది భాగంలో ఎం.ఏ పాసైన లెక్చరర్ దంపతులు కాపురం వుంటున్నారు. యిద్దరూ కలిసి ఉద్యోగానికి వెడుతున్నప్పుడు గోవింద మనసులో లీలా మాత్రంగా తను కూడా వుద్యోగం చేయాలనే తలపు వచ్చేది. యింట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు అన్నా వదినల మీదికి ధ్యాస మళ్లేది. కేవలం డబ్బు సంపాదించిందుకు కాకుండా ప్రొద్దు వెళ్ళబుచ్చేందుకు వుద్యోగం చేస్తే ఏం? అనుకునేది. విష్ణుమూర్తి నిర్మలమైన మొహంలోకి  చూస్తూ తన కోరికని మనసులోనే అడిమేసేది. యింటి నిండా టేబిల్ క్లాతులూ, డోర్ కర్టెన్ గుడ్డలూ తీసుకు వచ్చి అతను పడేయగానే అతను తనని గుంభనంగా చదువు తున్నాడని , తనకి విరామ సమయం చిక్కకుండా సంతోష పెట్టిందుకు ప్రాకులాడుతున్నడనీ తేలికగా గ్రహించేది.
    శనివారం నాడు మధ్యాహ్నం కుట్టుకుంటూ ఆలోచిస్తున్న గోవింద కమ్చీ దెబ్బ తిన్నదాని మాదిరిగా అదిరిపడింది. క్రింద యింట్లోంచి అరుపులు మేడ పైభాగానికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆవిడ యేడుస్తున్న శబ్దం కూడా విన్నది. కుడుతున్న పని మరి సాగలేదు. సాయంత్రం అయేవరకూ గోలగానే వుంది. గోవింద క్రిందికి వెళ్ళి చూడాలనే కుతూహలాన్ని బలవంతంగా అణుచుకున్నది. లెక్చరర్ చంద్ర శేఖరం భార్య మీద చేయి చేసుకుంటాడని పనిమనిషి చెప్పినప్పుడు విన్నది కాని ప్రత్యక్షంగా యీ రోజు తన చెవులతో వినే వరకూ ఆ విషయానికి అంతగా ప్రాధాన్యత యివ్వలేదు.
    సాయంకాలం యేడు గంటలు దాటాక అతను వెళ్ళిపోవటం కిటికీ లోంచి చూసింది. భర్తకి కాఫీ ఫ్లాస్కు లో పోస్తుండగా పార్వతి పైకి వచ్చింది. పార్వతి కీ గోవిందకి మొదటిసారి ఏదో  పేరంటం లో పరిచయం అయింది. అప్పటి నుంచి అడపాతడపా పార్వతే పైకి వచ్చేది. కానీ మాతమాత్రంగా గోవిందని రమ్మని యెన్నడూ అనలేదు. మొహం యేరుపెక్కి కళ్ళు వాచిపోయిన పార్వతి వూసురుమంటూ సోఫాలో కూర్చోగానే గోవింద అడగదలుచుకున్న ప్రశ్నలకి సమాధానాలు పార్వతే చెప్పడం ప్రారంభించింది.
    'లోకంలో నాలాంటి నిర్భాగ్యురాలు వుండరండి. ఆయన నెలలో రెండు మూడు సార్లయినా యిలా నా ఒళ్లు హూనం చేయందే నిద్ర పోలేరు. చెప్పుకునేందుకు స్నేహితులంటూ వుంటే ఈ పడ్డ బాధలో సగం మరిచిపోతాను అనిపిస్తుంది.
    గోవింద కాఫీ అందించింది. పార్వతి అందుకుని కృతజ్ఞతగా చూసింది. 'కాఫీ కాచుకునేందుకు కూడా వోపిక లేదు నాకు. మీరు కాఫీ యిచ్చి నన్ను ఋణగ్రస్తురాల్ని చేశారు.
    'ఛ! యిందులో ఋణాల వరకూ పోయేదేమీ లేదు. మీ బాధ అర్ధం అయింది నాకు.'
    'వుద్యోగం చేయనంటే విన్నారు కాదు. యింటి పట్టున హాయిగా వుండడం లో వున్న తృప్తి ఆనందం ఆయనకి విడమరిచి చెప్పినా అర్ధం కాదు. వుద్యోగం చేసిందుకంటూ బయలుదేరాక యెంతో మంది పరిచయం అవుతారు. కాలేజీ లోనే యిటు జమాజెట్టి ల్లాంటి స్టూడెంట్స్ దగ్గర్నించి అటు క్లర్కు ప్రిన్సిపాల్ వీళ్ళందరి తోటీ ప్రమేయం పెట్టుకోకుండా కాలం గడపడం కష్టం కాదంటారా.
    గోవింద విస్మయంగా చూడసాగింది.
    'ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తగిన శాస్తి అయింది. కన్నవాళ్ళని, వున్న ఊరుని వదిలి వచ్చినందుకు మంచి బహుమతి లభించింది.
    గోవింద ఆశ్చర్యానికి అవధులు లేవు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను ఆవిడని మరీ యింత క్రూరంగా చూడడం ఆవిడ మేధస్సుకే అతీతంగా వుంది. వుండబట్ట లేక అన్నది. 'ప్రేమించి చేసుకున్నారా మీరు. ఆశ్చర్యంగా వుంది. అయన మిమ్మల్ని చేయి చేసుకోవడం చిత్రం అనిపిస్తోంది.'
    పార్వతి వ్యర్ధంగా నవ్వింది. కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లోనే యింకి పోయేందుకు సిద్దంగా వున్నాయి. మొదట్లో చాలా రకాలుగా తీపి మాటలు చెప్పి తేనెలూరిస్తారు. వయసులో వున్న రక్తపు పొంగు కొంత చల్లారాక వాస్తవం బయట పడుతుంది. అప్పుడు నాలాంటి వాళ్ళు చేయి దాట వేసుకుని విచారపడి లాభం లేదు. మనిషి మనస్పూర్తిగా ప్రేమించడం అంటూ జరుగుతే అనుమానాలకి ఆస్కారం వుండదు. కానీ మా అయన నిలుచున్నా కూర్చున్నా కూడా అనుమానపడి ఆర్బాటం చేస్తారు. వుద్యోగం మాని యింట్లో వుంటే నెలకి నాలుగైదు వందల రూపాయల నష్టం. అందుకే అటు ఆ చాకిరీ చేయాలి. యిటు యీయన విధించే శిక్షకి సిద్డంగానూ వుండాలి.' పార్వతి ఆ తరువాత మాటల్ని ఆపేసింది. గోవింద వైపు పరిశీలనగా చూస్తూ నెమ్మదిగా అన్నది. ఐదు నిమిషాల తరువాత; 'మిమ్మల్ని చూసి ఈర్ష్య పడుతున్నా ననుకోవద్దు. మీరు చాలా అదృష్టవంతులు. యిప్పుడని పిస్తోంది. మంచీ చెడూ ఆలోచించకుండా యుక్తా యుక్త విచక్షణజ్ఞానాన్ని కోల్పోయి ప్రేమలంటూ మొదలు పెట్టి నాలాంటి అభాగినులు యెంతమంది చదువుల పేరిట బలి అయిపోతున్నారో అని.'
    'చదువులు యేవీ చేయలేదండి. యిది వ్యక్తిగత అభిప్రాయాలతో కూడిన విషయం. యెంతమంది చదువు కోవడం లేదు.'
    'హు' పార్వతి చిత్రంగా నవ్వింది: ' మా అమ్మ, వాళ్ళ అమ్మ, నాయనమ్మ చివరికి మా మేనత్త లూ, పిన తల్లులూ కూడా కనీసం ధర్డు ఫారం వరకూ చదువుకోలేదు. పన్నెండేళ్ళు రాగానే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ముక్కు పచ్చలారని ఆ వయసులో పెళ్లి అంటే వేడుక అనే తప్ప మరో నిర్వచనం తెలియదు. తల్లీ తండ్రి కుదిర్చిన సంబంధాల్ని తల వొంచుకుని చేసుకోవడం, సుఖపడడం మాత్రమే నేను చూశాను.'
    'నాన్న అబ్బారాన పుట్టేనని ఎం.ఎ వరకూ చదివించారు. ఫైనల్ యియర్ లో వుండగానే రిజిష్టర్ మేరేజి చేసుకుని యిలా వచ్చేశాను. మా పుట్టింటి తలుపులు మూసుకు పోయాయి. ఆదరించే తల్లితండ్రులు వున్నా లేని వారయ్యారు. ఆత్మీయంగా చూసే మనుష్యులే కరువై పోయారు. చావలేక బ్రతకడం . ఏడవలేక నవ్వడం యిలా కృత్రిమంగా సంతోషాన్ని నటిస్తూ బ్రతకడం యెంత కష్టమో.... కాదంటారా.' పార్వతి చెక్కిళ్ళు తడిసి పోయాయి. గోవింద పార్వతి పక్కగా వచ్చి భుజం మీద చేయి వేసి, 'తప్పు కదు. మీరు ఏడవ కూడదు. యింత చదువుకునీ ప్రయోజనం లేదని తెలిసీ దుఃఖించడం బాగులేదు. తలరాత అని సరిపెట్టుకోవాలి.' అన్నది.
    మరో పది నిమిషాలు కూర్చుని వెళ్ళి పోయింది పార్వతి.
    ఆ రాత్రి గోవింద కి నిద్ర పట్టలేదు. విష్ణుమూర్తి క్లబ్బు లో స్నేహితులతో వున్నట్టూ మరో గంట ఆలశ్యంగా వస్తున్నట్టూ ఫోను చేశాడు.
    ఆరాత్రి పూర్తిగా పార్వతి యేడుపు వినిపిస్తూనే వుంది. అతను నోటికి వచ్చిన దుర్భాషలు ఆడుతున్నాడు. మగవాడి అనుమానం కారణం గానే పార్వతి జీవితం యిలా అయోపోయింది. అనుకుంటుంటే గోవింద కి నిరాశ కలిగింది. ఒకవేళ విష్ణుమూర్తి కూడా అదే తరగతికి చెందలేదు కద. వులిక్కి పడింది గోవింద. అందుకే తనని వుద్యోగం చేయనీయడం లేదేమో అని కూడా ఒకటి రెండు సార్లు అనుకుంది.
    మధ్య రాత్రి తెలివి రాగానే గోవింద ఖంగారు పడ్డది. విష్ణుమూర్తి యెప్పుడు వచ్చాడో కూడా ఆవిడకి తెలియదు. తన పక్కనే మంచం మీద చిరునవ్వు నవ్వుతూ నిశ్చింతగా నిద్రపోతున్న అతని పట్ల తన అపోహాలకి సిగ్గుపడింది. యిటు కదిలి కళ్ళు తెరిచిన అతడు గోవిందని గట్టిగా వాటేసుకుని చిన్న పిల్లాడి మాదిరి ఆమె గుండెల్లో కి దూరిపోయి పడుకున్నాడు.
    విష్ణుమూర్తికి యెంతోమంది స్నేహితులున్నారు. అతని చుట్టూ తిరిగిందుకు ప్రాణం లా చూసుకునే యిద్దరు ఆప్త మిత్రులున్నారు. అందర్నీ అతను ఇంటికి తీసుకు వస్తాడు. గోవింద సిగ్గుపడి మాట్లాడడం మానివేస్తే కేకలు వేసి బలవంతంగా నలుగురి మధ్యకి తీసుకు వచ్చి కూర్చో బెడతాడు. తన స్నేహితుల మధ్య ఆవిడ కూర్చుంటే అతనికి యేమీ అనిపించదు. గోవింద చంద్రశేఖరం గురించి చెబుతుంటే అతను తేలికగా నవ్వేశాడు. 'విదేశాలకి వెడితేనే హృదయం లో విశాల దృక్పదం యేర్పడుతుందని నువ్వు అపోహ పడుతున్నావు. మనిషి మీద మనిషికి నమ్మకం వున్నంత వరకూ ఏ చికాకులూ వుండవు.'
    'మనస్తత్వాల మీద రిసెర్చి చేయాలనిపించేది ఒకప్పుడు నాకు. కానీ యిప్పడని పిస్తోంది . అదంతా వ్యర్ధం అని. 'లోకోభిన్నరుచి' అన్నారు పెద్దలు. అచ్చా మనకెందుకు పరాయివాళ్ళ గొడవలు. సినిమాకి వెడదాం పద. పారడైజ్ దూరమే అనుకో. మంచి పిక్చరు కనక వెడదాం. ఒక మంచి వస్తువు ని అందమైన విగ్రహాన్ని చూసేందుకు యెంత దూరం అయినా వెళ్ళాలిట' అంటూ హడావిడి పెట్టారు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS