"ఏమోనమ్మా నాకు మాత్రం ఏం తెలుసు ఎందుకు చేసుకుంటానన్నాడో-అతని ముక్కు మొహం నాకు తెలీదు ఈనాటివరకు. నన్నడిగితే ఏం చెప్తాను" వాణికీ పరిస్థితి అర్ధం కాక చిరాగ్గా వుంది.
"అయితే ఏం చేద్దామంటావు-" సత్యవతమ్మ అన్నం ముందు కూర్చుందన్న మాటేగాని ముద్దనోటికి దిగడంలేదు. ఆనందమో, దుఃఖమో ఏదోగాని ఆవిడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూంది.
"ఏమో నీవు చెప్పు-" వాణి మజ్జిగ వేసుకుంటూ అంది.
"నేను చెప్పడానికి ఏముందే అదృష్టం వెతుక్కుంటూ కాళ్ళముందుకువస్తే నేలతన్నుకునే తెలివితక్కువ దాన్నిటే, చేసుకునేదానివి నీవు-అతన్ని చూశావు-అతనంతా చెప్పాడు అంటున్నావు. ఊ అనాల్సిందానివి నీవు-మరోజన్మ ఎత్తినా మనకు యిలాంటి అవకాశం దొరుకుతుందా-ఏనాడో ఏదో మంచిపని చేస్తుంటావు- అందుకే ఆలశ్యం అయినా వెతుక్కుంటూ అదృష్టం చక్కావచ్చింది."
వాణీ ఆలోచిస్తూంది-నిజమే యింతకంటే మంచి సంబంధం మరో జన్మఎత్తినా దొరకదు. రెండో పెళ్ళి అన్నమాట తప్ప అతనికేం వంక!
"ఏమిటే అంత ఆలోచిస్తున్నావు?" సత్యవతమ్మ అనుమానంగా అడిగింది.
"ఏం లేదమ్మా నాపాటికి నేను పెళ్ళి చేసుకువెడితే మీ సంగతి !" వాణి ఆలోచిస్తున్న విషయం కాక మరోటి నోట్లోంచి వచ్చింది ఏదో అంది.
"అతనేదో సత్యానికి పని వేయిస్తాడన్నావుగదా- వేయిస్తే మంచిమాటే లేకపోతే మా తిప్పలుమేం పడ్తాం- రెండిళ్ళలో ఏదో వంటన్నా చేస్తాణు-ఏదో మా పాట్లు మేం పడ్తాం. నీవయినా ఒకయింటి దానివయితే రేపు యింకా పద్మ మిగులుతుంది. దానికి నీవే కాస్త ఏదో సంబంధం చూసి అయిందనిపిద్ధువుగాని, మొగాడు సత్యం ఎలాగో బతకకపోడు" సత్యవతమ్మ ఏదో తిన్నాననిపించుకుని విస్తరి మడిచింది-ఆవిడకి ఈ కబురు వినగానే కడుపు నిండిపోయిందసలు- వాణికి యింకేం అనడానికి మిగలలేదు- కంజి ఆమె అంతరాంతరాలలో ఏదో అసంతృప్తి- ఏదో ఆందోళన- చోటుచేసుకొన్నాయి.
* * * *
రాజారావు వచ్చి వాణి తల్లితో మాట్లాడాడు. ఆవిడ పదేపదే కృతజ్ఞతలు చెప్తూ, కాబోయే అల్లుడి మంచితనాన్ని ఉదారతని మెచ్చుకుని వాణి అదృష్టాన్ని పొగిడింది. అతను అదంతా వినడం యిష్టం లేదన్నట్టు "సరే-సరే-మీ అంగీకారం తెల్పారు కనక ముహూర్తం పెట్టిస్తాను వీలయినంత త్వరలో-" అన్నాడు తుంచేస్తూ.
"మీ అమ్మగారు..." సత్యవతమ్మ సందేహిస్తూ అడిగింది.
"అదంతా నేను చూసుకుంటాను- ఆవిడకి చెప్తాను- ముహూర్తం నిశ్చయించి రాస్తాను- ఆర్భాటాలేమివద్దు. అంతా ఒక గంటలో జరిగిపోవాలి- వెంటనే వాణిని తీసికెడతాను- నా వెంట మహావస్తే ఐదారుగురుకన్న రారు-" చెప్పడం పూర్తిచేసి లేచి నించున్నాడు.
వాణి తలవంచుకుని మరో కుర్చీలో కూర్చుంది. "వాణీ అలా ఒకసారి బయటికి రా-" అంటూ కారు దగ్గిరకి వెళ్ళాడు. వాణి బిడియపడ్తూనే వెంట వెళ్ళింది.
రాజారావు కారులో కూర్చుని జేబులోంచి పర్సుతీసి వెయ్యిరూపాయలు వాణి చేతిలోపెట్టాడు. "పెళ్ళి ఖర్చులకి మీ దగ్గిర డబ్బుండదేమో తీసుకో" అన్నాడు. వాణికి మనసు కలుక్కుమంది- అలా చెప్పకపోతే సౌమ్యంగా ఏదన్నా అవసరం వుంటుందేమో వుంచు అనకూడదా అన్పించింది- ఆ డబ్బు అక్కరలేదని చెప్పాలనుకుంది. కాని కాని యింట్లో దమ్మిడిలేదు.....తిరస్కరించి యిబ్బంది పడడంకంటే పుచ్చుకోవడంలో చిన్నతనం లేదని అన్పించింది.
"ఊ-తీసుకో" అన్నాడు మరోసారి- వాణి యింకేం ఆలోచించకుండా చెయ్యిజాపి తీసుకుంది.
"ఒక్కమాట-" వాణి గాభరాగా అంది "మీరు.....మా తమ్ముడికి ఏదన్నా ఉద్యోగం యిప్పించేమాట మరచిపోకండి - నేను లేకపోతే యీ యిల్లు గడవదు" అంది వాణి ప్రాధేయపడ్తున్నట్టు-అతనివంక దీనంగా చూసింది.
"చెప్పావుగా- చూస్తాను- ప్రయత్నిస్తాను- యింకా ఏదో చెప్తావనుకున్నాను యింతేనా?" అన్నాడు అదోలా నవ్వి- వాణికి ఆ నవ్వు ఏదోలా అన్పించి తలదించుకుంది.
అతను వాణివంక ఒకసారి చూసి, కారు తలుపుమీద ఆనించివున్నా వాణి చేయిమీద చేత్తో నొక్కి- "గుడ్ బై మై డార్లింగ్ - త్వరలో నిన్ను నాదాన్ని చేసుకుంటా- గుడ్ బై" అంటూ చెయ్యి వదిలి కారు స్టార్ట్ చేశాడు. ఆ హఠాత్ సంఘటనకి వాణి చకితురాలైంది. మొహం ఎర్రబడింది. చటుక్కున చేయి లాక్కుంది. వాణి కళ్ళెత్తి చూసేసరికి కారు కదిలిపోయింది. అతని స్పర్శకి కలగవలసిన పులకింత కలగలేదు. "డార్లింగ్" అన్న పిలుపులో మార్దవం-ప్రేమ కనపడలేదు ఆమెకి- అంతా తన ఊహేనా? మొత్తంమీద వాణికి ఎందుకో ఏదో అసంతృప్తిగా వుంది.
* * * *
వాణీ పెళ్ళికి నెలా పదిహేను రోజుల తరువాత ముహూర్తం నిశ్చయించి రాశాడు రాజారావు. ఆ తరువాత పదిహేను రోజులకి వాణీకి రాజారావు నించి ఒక ఉత్తరం వచ్చింది. అందులో సారాంశం హఠాత్తుగా అతని తల్లికి పక్షవాతం వచ్చింది- అతను అర్జంటు పనిమీద వూరు వెడ్తున్నాడు పదిరోజులు. యింట్లో పనివాళ్ళు తప్ప ఎవరూలేరు- రోగిష్టి తల్లిని యిల్లూవాకిలిని పనివాళ్ళమీద వదలడం యిష్టంలేదు. వెంటనే నీవు వచ్చి పదిరోజులు అమ్మ దగ్గర తోడుగా వుండాలి-అంటూ రాశాడు-వాణి పెళ్ళి కాకుండా ఎలావెడ్తాను బాబూ అంటూ గునిసింది- కాని అతను అభిప్రాయం అడగకుండా ఖచ్చితంగా నిర్ణయించి రావాలి' అని రాశాక వెళ్ళకుండా ఎలా? సత్యవతమ్మకీ పెళ్ళి కాకుండా అలా పంపడం యిష్టంలేదు -కాని ఏం చెయ్యగలదు!- భర్త పోయిన దగ్గిరనించి మాటమంచికి వరుసకి అన్నగారైన ఆంజనేయులు గారిని పిలుస్తూ వుంటుంది సత్యవతమ్మ-ఆంజనేయులు గారువచ్చి అతను పంపమని రాశాక పంపకపోవడం బాగుండదని' రేపో మాపో ఆ యింటికే వెళ్ళాల్సిన పిల్ల ఈనాడు వాళ్ళ అవసరం కోసం పిలిస్తే పంపననడం బాగుండదని' పంపడం మంచిది అని నచ్చచెప్పారు.
సత్యాన్ని తోడిచ్చి పంపుదామనుకుంది తల్లి. అనవసరమైన ఖర్చెందుకని వాణి తనే వొంటరిగా బయలుదేరింది.
* * * *
