ఈ చెన్నై మొన్న మొన్నటిదాకా సౌతిండియా కంతా సినిమా కేపిటల్ కదా!
ఇప్పుడయితే, తెలుగు సినిమాలన్నీ హైదరాబాద్ లో , మలయాళం కేరళలో, కన్నడం కర్ణాటకలో తీస్తున్నారుగానీ, ఒకప్పుడు ఇది సినిమా ఫీల్డుకి సాగర సంగమంలా వుండేది. నిజం!
అయినా సరే. ఇప్పటికీ చెన్నై ప్రభ పూర్తిగా తగ్గలేదు.
'సాగరసంగమం' అనుకోగానే తక్షణం మెరీనా బీచ్ కి వెళ్ళాలనిపించింది సునయనకి.
నడిచి వెళ్తేగానీ వూరు తెలియదు.
నడుస్తోంది సునయన.
ప్యారీస్ కార్నర్...
హైకోర్టు...
పక్కకి తిరిగితే...
బర్మా బజారు...
అక్కడ ఒక వైపంతా రోడ్డు - మధ్యలో బీచ్ - రెండో వైపంతా ఆకాశం అంచుదాకా కనబడుతున్న సముద్రం!
ఇంకొంచెం దూరం నడిస్తే మెరీనా!
మెరీనా లో కనబడింది ఆమె!
కనీసం వందేళ్ళ వయసు ఉండవచ్చుననిపించే మొహం!
ఆ మొహంలో ఎన్నేసి ముడతలో!
'వృద్ధాప్యం' అన్న టైటిల్ తో ప్రైజు కొట్టేసిన ఫోటోగ్రాఫ్ లాగా!
ఒక్కొక్క ముడతలో - శిథిలమైపోయిన జీవితం తాలూకు ఒక్కొక్క మలుపూ గోచరిస్తోంది.
కలతలూ - కష్టాలూ- కన్నీళ్ళూ కృంగిపోయిన ఆశలూ- ఆశయాలూ- అన్నీ కలిసిపోయిన ఆందోళన.
బహుశా ఇదంతా తన ఊహాచిత్రమే కావచ్చును.
సునయన మొహంలోకి చూసింది ఆ పెద్దామె. వెంటనే తల తిప్పుకుంది.
మళ్ళీ చూసింది.
ఏదో అడగాలని ఉన్నా, అడగలేకపోతున్న వైనం.
అది గ్రహించి, తనే ఆమె దగ్గరికి వెళ్ళింది సునయన.
"ఏమన్నా ప్రాబ్లెమా?" అని అడిగింది అనునయంగా. ఎయిర్ హోస్టెస్ గా తనకి అనుభవమే! పెద్ద వయసు వాళ్ళ ప్రాబ్లెమ్స్ రకరకాలు - మెడికల్ - సైకలాజికల్ - అందులోనూ ఆడవాళ్ళకి మరీనూ!
తెరిపిన పడ్డట్లుగా చూసింది ఆ వృద్ధురాలు.
"నేను ఒక్కసారి టాయిలెట్ కి వెళ్ళి రావాలి. ఈ బ్యాగు..."
సునయనకి అర్థం అయింది. పాపం! దైపహతురాలు! చిన్న మూటలాంటి ఆ ఒక్క పాత బ్యాగే తన సర్వస్వం అయినట్లు...
పిల్లలు పెద్దలయ్యాక, వాళ్ళ నిరాదరణతో పెద్దలు చిన్నవాళ్ళలా నిస్సహాయులుగా మారి - అన్నీ ఉన్న అనాధలుగా రోడ్డున పడిపోతూ వుంటారు కొందరు అభాగ్యులు.
బహుశా అలాంటి పరిస్థితిలోనే ఉండి ఉండవచ్చును ఈమె.
"మీ బ్యాగు నేను భద్రంగా చూస్తూ వుంటాను. వెళ్ళిరండి అంది ఆర్ద్రంగా.
ఎంతో రిలీఫ్ గా సునయన వైపు చూసింది ఆమె. ఆ తర్వాత తన సర్వస్వం లాంటి ఆ పాత బ్యాగుని సునయనకి అందించి, పరుగులాంటి నడకతో టాయిలెట్స్ వైపు వెళ్ళింది.
చేతిలో ఉన్న బ్యాగు వైపు విషాదంగా చూసింది సునయన.
పాపం! ఈ పాత బ్యాగుకోసం ఎంతటి ప్రాకులాట!
నిమిషాలు గడిచాయి.
ఆమె తిరిగి రాలేదు.
వాచ్ చూసుకుంది సునయన.
ఐదు...ఆరు...ఏడు... ఎనిమిది..
ఆమె రాదేం? ఏమన్నా అయిందా?
ఆందోళనతో పక్కకి తిరిగి చూసి, ఒక్కసారి ఉలిక్కిపడింది సునయన.
తనకి రెండువైపులా ఇద్దరు వ్యక్తులు నిలబడి వున్నారు. ధృడకాయులు.
"దయచేసి మాతో అటుపక్కకి వస్తారా?" అన్నాడు ఒకతను. ఆ 'దయచేసి' అన్నది ఉత్తుత్తి మర్యాద వాచకం. అంతే!
"వస్తావా? ఛస్తావా?" అన్నట్లు కర్కశంగా వినబడుతోంది ఆ గొంతు.
కంగారుగా అంది సునయన.
"ఎందుకు? ఏమయింది?"
"మూవ్" అన్నాడు రెండో అతను. ఏమాత్రం మర్యాద కూడా లేకుండా.
జనం పలుచగా ఉన్న ఓ మూలకి నడిచారు.
వాళ్ళ వెనకే తొట్రుబాటుతో వెళ్ళింది సునయన.
"బ్యాగ్ లో ఏముంది?" అన్నాడు మొదటి అతను.
"నాకు..నాకు తెలియదు"
"ఎక్టసీ... కదా?"
"ఎక్టసీనా?" అని కొద్దిక్షణాలపాటు బ్లాక్ గా చూసి, అంతలోనే షాక్ కొట్టినట్లుగా,
"ఎక్టసీ? ఓహ్! యూ మీన్ డ్రగ్స్! నోనో నోనో! ఇది పాపం ఆ ముసలామె బ్యాగు" అంది కంగారు కంగారుగా.
"యూ! ముసలామె! ఆ చెయిన్ లో నువ్వెన్నో లింకువి?"
"సీ! ఆబ్వియస్ లీ దేర్ ఈజ్ సమ్ మిస్ అండర్ స్టాండింగ్! ఆ ఓల్డ్ లేడీ టాయిలెట్ కి వెళ్తూ ఈ బ్యాగ్ ని నాకు..
"ఆవిడ ఏదీ?"
నిస్సహాయంగా చూసింది సునయన.
మొరటుగా సునయన చేతిలోని బ్యాగ్ ని తీసుకుని ఓపెన్ చేశాడు రెండో అతను.
లోపల ఎక్టసీనే కాదు - స్పీడ్ - మాడ్రాక్స్... వగైరా...వగైరా..దివర్క్స్!
"డ్రగ్స్! దీనికి శిక్ష ఎన్నేళ్ళో తెలుసా?" అన్నాడు అతను.
ఒక అందమైన అమ్మాయి తాలూకు వాటర్ కలర్స్ చిత్రం మీద నీళ్ళుపడి రంగులు అల్లుకుపోయినట్లుగా, సునయన మొహంలో రంగులు మారాయి. భయంతో చెంప గులాబిరంగు కాస్తా తెల్లగా పాలిపోయింది. రాబోతున్న కన్నీళ్ళతో కళ్ళలో ఎర్రజీరలు ఏర్పడ్డాయి. ముక్కుపుటాలు తడితడిగా అయిపోతున్నాయి. క్షణాల్లో డిస్ ఓరియంటెడ్ గా అయిపోయింది సునయన.
"డ్రగ్సా? ఈ బ్యాగ్ లోనా?" అంది హీనస్వరంతో.
ఇంతలో -
"హై ఆరుముగం!" అని వినబడింది ఒక గొంతు. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ వారి అనౌన్సర్ వాయిస్ లాగా ఎంతో చక్కటి కంఠస్వరం. అయితే, 'ఆరుముగం' అన్న పేరుని మాత్రం కాస్త చిత్రంగా ఉచ్చరించాడు అతను.
"అండ్ హై వరదరాజన్! హౌ ఆర్యూ ఫోక్స్ టుడే?" అంటున్నాడు చాలా ఫ్రెండ్లీగా.
చటుక్కున తలతిప్పి చూసింది సునయన.
అతను బాగా పొడుగు. ఆరున్నర అడుగుల పైనే వుంటాడు. అయితే, అందుకు తగిన శరీర సౌష్టవం ఉండడం వలన అంత పొడుగని వెంటనే అనిపించదు.
అతన్ని చూడగానే ఆరుముగం, వరదరాజన్ అనే ఆ ఇద్దరూ సాఫ్ట్ గా అయిపోయారు.
"హై" అన్నారు వాళ్ళిద్దరూ.
"గో స్లో ఫోక్స్! షీ ఈజ్ మై ఫ్రెండ్!" అన్నాడు ఆ అపరిచితుడు. చాలా చురుగ్గా సునయని కవర్ చేసేస్తూ.
ఆ తర్వాత మళ్ళీ అన్నాడు. "విల్ యూ లీవ్ అజ్ ఫర్ ఏ మూమెంట్?"
వాళ్ళిద్దరూ కాస్త తటపటాయించి కొంచెం పక్కకి వెళ్ళిపోయారు. ఆ ముసలామె తాలూకు బ్యాగ్ మాత్రం వాళ్ళ దగ్గరే వుంది.
ఎగశ్వాసతో అంది సునయన.
"నన్ను నమ్మండి! ప్లీజ్! ఆ ముసలామె...."
ఇంక చెప్పనక్కరలేదన్నట్లుగా వారిస్తూ చెయ్యి చూపించాడు అతను.
"ఇదిగో! నా తలమీద ఎన్ని వెంట్రుకలు వున్నాయో అన్నేసి రకాల మనుషులని చూశాను నేను. అకారణంగా అమాయకులను అనుమానితులుగా మార్చడం కూడా అనేకసార్లు చూశాను."
అతికష్టం మీద ఒక్క గుటక మింగింది సునయన.
"మీరు డ్రగ్స్ తీసుకెళ్తున్నారని కదా వీళ్ళ ఆరోపణ?"
అవునన్నట్లుగా తల వూపింది సునయన.
చిన్నగా నవ్వి అన్నాడు అతను.
"ఆ డ్రగ్స్ కి ఒక రేటు వుంది. అట్లాగే ఆ ఆరుముగంకీ, వరదరాజన్ కీ కూడా ఒక రేటు వుంది. అయితే, ఆ రేటు నేను వీళ్ళకి పే చేయను. ఎందుకంటే.." అని ఆగాడు.
