Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 4


    కుర్రాళ్ళు పరీక్షలకి వ్రాస్తోవుంటే, కావిలి కూచున్నాను, ఈ పరీక్షకాయితాలకి మార్కులు వెయ్యడం యెక్కువ బాధో, లేక వీళ్ళు వ్రాస్తోవుండగా కావిలికాయడం యెక్కువ బాధో నిర్నయించుకోలేకుండా వున్నాను. ఈ కావలి కాయడంలోని యీ అనుమానంలో నైతిక నీచత్వం స్ఫురిస్తుంది. "మీరు దొంగలు మీకు నీతిలేదు. నేను చాలా నీతివంతుణ్ణి మీ దొంగతనాలు వట్టిచీల్చేందుకు ఇక్కడ కూచున్నాను. అంటున్నట్టుంటుంది. వాళ్ళు తలెత్తి నావంకచూసి, మళ్ళీ తలలువొంచి వ్రాస్తోవుంటే, అక్కడ కూచోడం సిగ్గు వేస్తుంది వీళ్ళందరూ యెవరిపనిమీద వాళ్ళుంటారు. పనిలేనివాణ్ణి, ఎవరితోను యే సంబంధంలేనివాణ్ణి, పైగా విరోధిని నేనే. పరదేశంలో భాష రానివూళ్ళో యేకాకి నై కూచున్నట్టుంటుంది. నిశ్చలంగా పనిలేకుండా సుఖంగా కూచోడం రెండురకాల వాళ్ళకే చాతనవుతుంది.......పసువులకూ.......రుషులకూ.......పైపెచ్చు, నాతోటి టీచర్లకూ.........ఇట్లా కూచోపెట్టి మమ్మల్ని రుషుల్ని చెయ్యలేరుగాని-పశువులంత గొప్పా చెయ్యలేరు. రాళ్లగా మారుస్తారు.
    నా మెదడుకి పనిలేదో, వెంటనే అప్రయత్నంగా 'Day dreaming పగటికలల్లో పడిపోతాను. నన్ను కావిలిపెట్టి ఏం లాభం.
    ఎందుకూ యీ యాతన! ఆ పిల్లలు ఆ ప్రశ్నల్నీ సాగతీసి సాగతీసి అట్లా లేనిపోని ప్రత్యుత్తరాలు వ్రాయడం, నేనీశూన్యాన్ని భరించలేక పంజరంలో పిట్టవలె కొట్టుకోవడం? ఎందుకోసం? ఎన్నాళ్ళకి, యెన్నేళ్ళకి యీ లోకం ఇట్లాంటి అనర్ధాలనించి బైట పడుతుంది? పైగా యింత నీచత్వంలో బాధలో నేర్చుకునే విద్య, యీకాయితాలలో కొలిచే జ్ఞానం, మనుష్యుల మెదళ్ళని వెలిగించి, లోకాన్ని ఉద్దరిస్తుందిట.
    ఏమో, నాగరికతంటారు, బందిపోట్లు, లోకాలు, దయ్యాలు, క్షామాలు, అన్నీ తగ్గాయి. ప్రజలు సౌఖ్యపడుతున్నారంటాడు. కాని యీ స్కూళ్ళు, యీ పరీక్షలు, యీ జైలు క్షామాలు, ఈ లెక్టనాఫీసులు, కోర్టులు, బ్యాంకులు-ఫ్యాక్టరీలు యెంత బానిసత్వం, యెంత అర్ధవిహీనమైన శ్రమ-యీ వంటిళ్ళు-యీ పడకగదులు-యెన్నటికీ మానవజాతికి విముక్తి!
    ఉండి, ఉండి, యీ కావిలివృత్తిని భరించలేక ఒక్క అరుపు అరిచి, యీ విద్యనీ, యీ పరీక్షకాయితాల్నీ గబగబా తిట్టి, బైటికి పారిపోవాలనిపిస్తుంది. ఎప్పుడో యీ నిగ్రహశక్తి అల్పమైపోయి, బాధ అమితమై, అట్లాంటి వుపద్రవం చేస్తానేమో! 'ఓ పిచ్చి' అని ఒక్కమాటతో నా పేరు కొట్టేస్తారు నావంటి వాళ్ళు నాకన్న సుకుమారమైన ఆత్మలు కలవారు, ఆరోగ్యవంతులు ఎందరు యిట్లా తిరగబడి లోకానికి పిచ్చివారై నారు కాను! బానిసత్వం నరాల్లో యింకి, లోక క్రూరత్వాన్ని చూచి జంకి, యే అదృష్టంలోనూ, దేవుడిలోనూ నమ్మకంలేక-నేనింకా యిట్లా యీ నిరర్ధక సేవకా వృత్తిలో నిలిచివున్నాను.
    ఊరికే కారణం లేకుండానే జరిగిన సంగతులూ, తెలిసిన మనుష్యులూ తటాలున జ్ఞాపకం వొస్తారు. ఎందుకా అని యోచిస్తే చెప్పలేను. మెదడులో ఆ Cell కదులుతుందో యేమో! లేక నేను చూసే మొహాల్లో ఏదో పోలిక నాకు తెలీకుండానే ఆ పాతపటం చూపుతుందో! లేక యీ గాలిలో, ఎండలో, చెట్లలో, ఏదో ఆ నాటి పోలికతోచి, ఆ విషయాలన్నీ స్ఫురిస్తాయో! అట్లా జ్ఞాపక మొచ్చింది బంగారమ్మ.
    నేను పసివాణ్ణి అంటే, యెనిమిదేళ్ళు ఆమెకి యిరవైయేళ్ళు. ఆమెని చూసిన మొదటి నిమిషాన్నే అధ్బుతమైన భక్తి కలిగింది ఆమె సౌందర్యం మీద.
    నేను నిద్రపొయ్యే స్తలాని కెదురుగా, రవివర్మ వ్రాసిన లక్ష్మివరం పెద్దదివుండేది. పొద్దున్నే బడివుందనే గొలుసుతో మేలుకునే, నా విషాధ నేత్రాలకి ప్రధమదర్శనం లక్ష్మి. ఆమెని ఆ లక్ష్మిని ప్రేమించాను. పెద్ద పద్మంలో నుంచుని కనపడేది నిశ్చలమైన నీటిమధ్య. ఆ పద్మంలో లేత ఎరుపురంగు తలుచుకుంటే యినాడూ ఏనాడూ నా మనసు యీ దృశ్యప్రపంచాన్ని వొదిలి, యేదో సగం యెరిగినదీ, యెరగరానిదీ ఐన యేదో వివిధవర్నాల నూత్న ప్రపంచాన్ని అందుకోవాలని బాధపడుతుంది. మరి చిత్రకారుడు ఆ పుష్పంలో ఏ అనుభవాన్ని సూచించాడో! పద్మం చూస్తేనే నా కేదో మధురమైన అసాధారణమైన పరిమళం తట్టుతుంది. అందువల్లనే ఆలోచిస్తాను. ఇంతకు పూర్వజన్మ వుందిగావును; లేక ఊర్ద్వ లోకాలు వున్నాయిగావును-అక్కణ్ణించి తెచ్చుకున్నానేమో యీ జ్ఞాపకాన్ని! అంతకుతప్ప కారణం కనపడదు. ఉంటే psycho analysts కనిపెట్టి చెప్పాలి. ఆ లక్ష్మీ ఆ పద్మంలోని భాగంలాగతోచేది. ఆ యెర్రని చీరనే ముద్రించక, ఆ పద్మంరంగులోనే ఆమె దేహాన్ని కలిపేసి వుంటే!
    బంగారమ్మని చూడగానే నాకు నా చిరపరిచితురాలు లక్ష్మి జ్ఞాపకం వొచ్చి, బంగారంమని ప్రేమించాను. కొన్నిరోజులు తలుపు సందుల్నించి, కొన్నిరోజులు, మావాళ్ళ కాళ్ళ సందుల్నించి ఆమె ముఖం,మీది చిరునవ్వుతో ఆడుకున్నాను. అంత చిన్నతనం లోనే నా పురుషత్వం నన్ను సిగ్గుపెట్టి బాధించేది. ఆసిగ్గువల్లనే ఎన్నో ఆనందాలు పోగొట్టుకున్నానా అని దిగులువేస్తుంది. ఆమెకీ సంతోషమే, సగం దక్కునే నామొహంతో దోబూచులాడడం! నన్ను మరిచి పక్క స్త్రీలతో ఆమె మాట్లాడితే తలుపుకి ముఖాన్నా నించి బాధ పడేవాణ్ణి. ఆచిన్న శరీరంలో పురుష హృదయం జెలసీ అంకురాలు అప్పుడే. ఎట్లాగో ఒక రోజు ఆమె వొళ్ళో వున్నారు. నన్ను మరిచి ఆమె నవ్వుతోంది, చుట్టూ స్త్రీలతో, ఆమె చుట్టూ మాగేవారు ప్రజ. ఆమె సౌందర్యానికి సంపద సాయపడ్డది. నా లక్ష్మి! ఎస్వీ చూపులతో తాగేవారు ఆమెని- ఆ దేహకాంతీ, బంగారపు మెరుగూ, ఆధిక్యత కోసం పడే తగువును. వొళ్ళో కూచున్న బాలుడి హృదయంలో అర్ధం కానివీ, భయం కలిగించేవీ, సగం కళ్ళు నిప్పుకున్నవీ, అయిన 'amotions' ని ఆమె యెరగదు. నా చెయ్యి ఆమె కంఠాన్నీ, చంపల్నీ, 'explore' చెయ్యడం, నాకళ్ళు పైకెత్తి ఆమె చిరునవ్వు కోసం నేను వెతకడం ఆమె యెరగదు. నే నెవరు? అనేక స్త్రీ పురుష హృదయాల్నించి ఆరాధనని నిరంతరమూ పొందే ఆ లావణ్యవిగ్రహానికి నా వెర్రి మమత యేం లక్ష్యం?


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS