"మద్రాసు నుంచి!"
"ఇదిగో జనా! నువ్వు కాస్త తిరుగుళ్ళు మాని యింటిపట్టున వుండవయ్యా!"
"వదినా ఆకలేస్తోంది!"
"ఊఁఇదొకటి! అయినా ఆ మూడుముళ్ళూ వేసి చెల్లాయిని తీసుకవస్తే నాకీ బాధ తప్పుతుంది!"
"వదినా! నాకు అన్నం పెట్టటం బాధగా వుందా?"
"అయ్యయ్యో నేనలా అన్లేదు. చెల్లాయి వస్తే నువ్వు యిలా నెలకోసారి రెండు నెలలకోసారి వెళ్ళే బాధ తప్పుతుందని అన్నాను!" నొచ్చుకుంటూ అందామె.
"వదినా! మనిషి ప్రయోజకుడు కావాలి! ఈ రోజుల్లో ప్రయోజకుడంటే డబ్బు సంపాదించినవాడే ప్రయోజకుడు. అంతకంటే కొలమానం లేదు.
అతనికి కంచంలో వడ్డించి డైనింగ్ టేబిల్ పై పెట్టి, "మనకెందుకయ్యా డబ్బు! మనకేం కొదువ. నువ్వు చూళ్ళేదు కానీ-బీరువా అరల నిండా డబ్బు పేర్చాడు మీ అన్నయ్య! అది చాలదూ మనకి?" అంది.
ఆ మాటలు వినగానే అతని కళ్ళు మిలమిలలాడాయి. "వదినా మనింట్లో లక్షలు మూలుగుతుండనీ-అది వేరు, లెక్కలోకి రాదు. స్వతహాగా సంపాదించి అనుభవించటంలో గల ఆనందం ఇతర్లు సంపాదించి ఖర్చు చేయటంలో వుండదు!"
"సరే! నువ్వు సంపాదిస్తానంటే వద్దంటామా?"
సమాధనం ఇవ్వలేదు జనార్ధన్. ఎలాగో భోజనం ముగించి బయటకి వచ్చాడు. అతనికి ఆ భోజనం రుచించలేదు. బేరర్లు కొసర కొసరి రకరకాల డిషెస్ తో వడ్డిస్తూ వుంటే తిన్న రుచి రాలేదిక్కడ.
వక్క పలుకు నోట్లో వేసుకోగానే సిగరెట్ కాల్చాలని పించింది. మేడపైకి వెళితే అక్కడికి వదిన వస్తుంది. నస పెడుతుంది. బయటికి వెళదామంటే అన్నయ్య వున్నాడు, అందుకే యిల్లువిడిచి అలా వెళ్ళాలని బయటికి వచ్చాడు జనార్ధన్.
సరిగ్గా ఆ సమయానికి కరణం శేషయ్య వచ్చాడు. నీరుకావి ముతుక ధోవతి, ముతుక చొక్కా, అలాటిదే టవల్ అతని వేషం ఆయన ఎప్పుడూ అలాంటి డ్రస్ వాడతాడు. చేనేత వస్త్రాలయంలో ఉగాదికి రిబేట్ యిస్తారనగానే వెళ్ళి రెండు జతలు తెచ్చుకుంటాడు. సంవత్సరం పొడుగునా ఆ నలుగు పంచలు, చొక్కాలు, టవల్స్ తోనే గడుపుతాడు. మధ్యన చచ్చినా మరో జత కొనడు.
వాటిని చాకిలికి వేయడు, స్వయంగా శుభ్రం చేసుకుంటాడు. ఎవరైనా ప్రశ్నిస్తే గాంధీ సిద్దాంతాలు చెబుతాడు. అసలెవరూ అడుగరు ఆయన్ని. ఎవరైనా ఆయనకి పదిగజాల దూరంలో ఉండాల్సిందే! లేకపోతే చెమట కంపు. మాసిన బట్టల కంపు ముక్కుపుటాలు బద్దలు చేస్తాయి. డబ్బు! డబ్బు! డబ్బు! ఎలాగైనా రోజుకి కొంత డబ్బు సంపాదించి బీరువాలో దాచందె ఆయనకి నిద్రపట్టదు ఎక్కడా లాభించకపోతే అయిదో పదో ఎవర్నో ఒకర్ని చేబదులు అడిగైనా, పెట్టి నింపేస్తాడు. వాళ్ళకీ తెలుసు, బదులని పేరేగాని తిరిగివ్వడని, అయినా చచ్చినట్టు యిస్తారు. అది అతని పదవి మహిమ.
"ఏరా! ఎప్పుడొచ్చావు?"
"చచ్చారా!" అనుకున్నాడు జనార్ధన్. అతనికి తెలుసు. అయన పడితే జీడిపిక్కలా వదలడని అయినా తప్పేదేవుంది?
"నమస్తే! ఇప్పుడే వచ్చానండీ!" అన్నాడు ఎక్కడ లేని వినయం ఒలకపోస్తూ.
"ఊఁ మద్రాసు నించేనా?"
"అవునండీ!"
"ఒరే! నువ్విన్నిసార్లు చెప్పీ, చెప్పకా చెన్నపట్నం వెళ్ళొచ్చావుగదా? నువ్వేం చేస్తున్నట్టురా అక్కడ? డబ్బు తగలెయ్యటం తప్ప. బ్రతుకుతెరువుకి ఏదయినా చూసుకున్నావా?
తలూపేడు జనార్ధన్.
"నీ ముఖం! కనిపించటంలా? పాచిపళ్ళవాడు కూడ బెడితే బంగారు పళ్ళవాడు ఖర్చు చేశాడట. మీ అన్న ఆ వడ్డీలనీ యీ వడ్డీలనీ రూపాయకు రెండు జత చేస్తూవుంటే నువ్వు ఠింగు రంగా అంటూ జల్సా చేస్తున్నావు!"
చౌదరి విన్నా విననట్టే వుండిపోయాడు.
