Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 4

ఒక్కమాటలో చెప్పాలంటే...
చైతన్యం, నోరూ, మెదడూ - మూడిట్లో కనీసం ఏదో ఒకటి ఎక్కువగా వున్నవాళ్ళు అక్కడ వున్నారు. వాళ్ళ ఆలోచనలు అన్ని వర్గాలలో అలజడి కలిగించగలవు.
వాళ్ళ వాళ్ళ రంగాలలో -వాళ్ళు మేధావులే!
అయితే -
ప్రస్తుతం వాళ్ళందరి మొహాల్లోనూ కనబడుతోన్న భావం ఒక్కటే!
భయం!
వాళ్ళని చూస్తున్న సాహస్ మనసులోనే అనుకున్నాడు.
తనది అడ్వెంచరస్ లైఫ్!
తను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవడం -
ఒక్కోసారి తనే ఇంకొకళ్ళని ఇలాంటి పరిస్థితిలో ఇరికించడం కూడా - తనకి ఇది మొదటిసారి కాదు.
కానీ -
ఇక్కడున్న వాళ్ళలో అనేకమందికి - ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఇదే మొదటిసారి అని తెలుస్తూనే వుంది.
అందుకే - అందరి కళ్ళలోనూ భయం!
కాళ్లలో వణుకు!!
ఆ అమ్మాయి వైపు తిరిగాడు సాహస్.
"ఏమిటిదంతా?" అన్నాడు అసహనంగా.
ఆ అమ్మాయి అపహాస్యంగా జవాబు చెప్పింది. "తొందరపడకు! తీరిగ్గా తెలుస్తుంది!"
ఆమె అలా అంటూ వుండగానే, గది తలుపు ఆటోమాటిక్ గా క్లోజ్ అయిపోయింది.
వెంటనే -
ఒక గోడకి ఫిక్స్ చేసి వున్న జెయంట్ సైజ్ టీవీ స్క్రీన్ ప్రకాశవంతంగా అయింది.
అందరి తలలూ అటు తిరిగాయి.
ఆ స్క్రీన్ మీద కనబడుతున్నాడు -
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి!
సౌండ్ సిస్టమ్ లో మొదట్లో కాస్త డిస్టర్ బెన్సు.
తర్వాత అది సెట్ రైట్ అయింది.
క్రమంగా, ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి వాయిస్ చాలా క్లియర్ గా వినబడటం మొదలెట్టింది.
"లేడీస్!...
అండ్ జెంటిల్మన్!..
గుడ్ డే!"
అని ఒకక్షణం ఆగాడు సర్వాధికారి.
అందరూ చెవులు రిక్కించి వింటున్నారు.
అక్కడున్నవాళ్ళలో, రెగ్యులర్ గా పేపర్ లు చదివేవాళ్ళు మాత్రం ఫీల్డ్ మార్షల్ సర్వాధికారిని గుర్తుపట్టారు. చాలా కొద్దిమందికి మాత్రమే, అతనెవరో తెలియదు.
అలాంటి వాళ్ళని వుద్దేశించి చెప్పాడు సర్వాధికారి.
"ఐయామ్ సర్వాధికారి! ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి!"
అందరూ ఒక్కసారిగా ఊపిరి లోపలికి పీల్చుకున్న శబ్దం! ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి అప్పుడా టీవీ స్క్రీన్ మీద ఎందుకు కనబడుతున్నాడో అర్థం కాక, మొహమొహాలు చూసుకున్నారు.
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి గొంతు సవరించుకున్నాడు.
"తీరిగ్గా మాట్లాడ్డం, తియ్య తియ్యటి కబుర్లు చెప్పడం నాకు అలవాటు లేదు! నేను మిలిటరీ మనిషిని! అలా కబుర్లు కక్కడం పొలిటీషియన్ ల పద్ధతి! ఆ పద్ధతులకి ఇంక ఫుల్ స్టాప్! అలాగే పొలిటీషియన్ లకి కూడా!
సర్వాధికారి మాటలు మాత్రమే వినబడుతున్నాయి. అదితప్ప హాలంతా నిశ్శబ్దం.
సర్వాధికారే మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు.
"పొలిటీషియన్స్! పాలిట్రిక్స్! - ఈ రెండు పదాలంటేనే నాకు అలర్జీ!" అని ఆగి, "అందుకే ఇంక పొలిటీషియన్ లకీ, వాళ్ళ డర్టీ ట్రిక్స్ కీ ఎండ్!"
వింటున్న, అందరి మొహాల్లో టెన్షను!
గొంతు పెద్దది చేసి చెప్పడం మొదలెట్టాడు సర్వాధికారి.
"ఈ రాజకీయవేత్తలు దేశాన్ని ఎలా రొచ్చుగుంటలా మార్చేశారో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!
ఈ దేశంలో వున్న పెద్ద లోపం ఏమిటంటే, ఏ రంగంలోనూ, ఎందుకూ కొరగాని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి రాణించగలగడం!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS