Previous Page Next Page 
అనైతికం పేజి 4


    ఆ తరువాత నేను నా తరఫు సాక్షుల్ని ప్రవేశపెట్టాను.

 

    "మీ పేరు?"

 

    "మార్గరెట్".

 

    "వివాహం జరిగిందా?"

 

    "జరిగింది. నా ఇరవయ్యవ ఏట. ఆ తరువాత మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకున్నాను. అప్పటినుంచి ఇప్పటివరకూ- అంటే దాదాపు ముప్పై అయిదు సంవత్సరాలుగా ఒంటరిగా బతుకుతున్నాను".

 

    "మీరు సంతోషంగా వున్నారా?"

 

    "ఉన్నానని నిశ్చయంగా చెప్పగలను".

 

    "ఏ విధంగా?"

 

    "నా వైవాహిక జీవితంలో ఆ మూడు సంవత్సరాలూ నేననుభవించినంత నరకం ఎవరూ అనుభవించి వుండరు. నా భర్త ఒక పెద్ద శాడిస్టు. ఆ గతపు రోజులు తల్చుకుంటేనే ఇప్పటికీ నా శరీరం భయంతోనూ, జుగుప్సతోనూ జలదరిస్తుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత రెండు సంవత్సరాలపాటు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కొంత కష్టపడిన మాట నిజమే. కానీ ఇప్పుడు నేననుభవిస్తున్న సంతోషానికి దాన్నొక పెట్టుబడిగా భావిస్తున్నాను" అంటూ మార్గరెట్ ముగించగానే కోర్టు హాలంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఇంగ్లండ్ లోని ఒక మిలియన్ ఇళ్ళలో ఈ సంఘటనని కొన్ని లక్షలమంది చూస్తున్నారని నాకు తెలుసు. జడ్జి కూడా ఈ పాయింట్ ని ఏకాగ్రతతో రాసుకోవడం నాకు సంతృప్తిని కలిగించింది.

 

    క్రాస్ ఎగ్జామినేషన్ కోసం సూర్యమ్ లేచాడు. "మిస్ మార్గరెట్, మీ ఒంటరి జీవితంలో ఎంతమంది మగవాళ్ళు ఇప్పటివరకూ ప్రవేశించారు?" అని ప్రశ్నించాడు.

 

    నేను చివుక్కున లేచి, "అబ్జెక్షన్ మిలార్డ్!" అని గట్టిగా అరిచాను. నా గొంతు నాకే కీచుగా ధ్వనించింది.

 

    "అబ్జక్షన్ సస్టెయిన్డ్!" జడ్జి అంది.

 

    సూర్యమ్ ఓడిపోయినట్టు తలదించుకుని ఒక క్షణం తర్వాత, మరో ప్రశ్న వేశాడు. "మీ ఒంటరి జీవితంలో, మీకెప్పుడూ తోడు కావాలనిపించలేదా?"

 

    "లేదు". మార్గరెట్ ఖచ్చితంగా చెప్పింది.

 

    "మీ ఇంట్లో ఎన్ని కుక్కపిల్లలున్నాయి?"

 

    ఆమె తటపటాయించి, "ఆరు" అంది.

 

    "దట్సాల్ మిలార్డ్!" అని కూర్చున్నాడు సూర్యమ్.      

 

    వెనుక వరుసలోకూర్చున్న కొంతమంది స్త్రీవాదులు కూడా ముసిముసిగా నవ్వుకోవడం నాకు చిరాకును కలుగజేసింది. నా రెండో సాక్షి వనజాక్షి. బ్రిటీష్ రెసిడెంట్. యాభై ఏళ్ళ అవివాహితురాలు.

 

    "ది వుమన్ అన్న పుస్తకంపై మీ అభిప్రాయాన్ని ఒక్క వాక్యంలో చెప్పగలరా?" అని అడిగాను.

 

    "ఆ పుస్తకాన్ని చింపి, ప్రతి కాగితాన్నీ కాల్చి ఆ మసిని కాఫీ పొడిలో కలిపి ఫిల్టర్ చేయకుండా తాగాలని నాకు అమితమైన కోరిక కలిగింది".

 

    "మీ గురించి కొంచెం చెప్తారా?"

 

    "పుట్టిందీ, పెరిగిందీ ఇంగ్లండ్ లోనైనా చదివింది భారతీయ ఫిలాసఫీ. నాకు వివాహం కాలేదు. చాలా హాయిగా వున్నాను. గౌరవనీయులైన న్యాయవాది గారన్నట్టు మా ఇంట్లో కుక్కలు కూడా ఏమీలేవు" అంది సూర్యమ్ వైపు చూస్తూ.

 

    "ఈ పుస్తకం మీద మీకు ఇంత ద్వేషం ఎందుకు కలిగింది?"

 

    "జీవితంలో వివాహం చేసుకోని స్త్రీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు లేరు అని రచయిత తన అమూల్య అభిప్రాయాన్ని పాఠకుల మనసులపై ముద్రించడానికి ప్రయత్నం చేశాడు. గర్భం దాల్చే సమయంలో ఎక్కువకాలం సెలవు తీసుకునే హక్కు న్యాయబద్ధంగా వుంది కాబట్టి అవివాహితలకు, కొత్తగా వివాహం జరిగిన స్త్రీలకు ఉద్యోగం ఇవ్వడానికి అమెరికన్ కంపెనీలు వెనుకాడుతున్నాయని రాస్తూ, ఆ విధంగా మరొక కొత్తసమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. అమెరికాలోని ప్రతి వెయ్యిమంది పెళ్ళికాని అమ్మాయిల్లోనూ తొంభై ఆరుమంది గర్భవతులవడానికి కారణం వారి తల్లిదండ్రులనుంచి సరియైన ప్రేమ లభ్యమవకపోవడమేననీ, దీని వెనకవున్న అసలు కారణం తల్లి కూడా ఉద్యోగస్తురాలవడమనీ వాదించాడు. ఇంతకన్నా స్టుపిడ్ వాదం మరొకటుండదు". ఒక్కక్షణం ఆగి, ఊపిరి పీల్చుకుని వనజాక్షి తిరిగి చెప్పడం ప్రారంభించింది.

 

    "భారతీయ సుప్రీమ్ కోర్టు షాబానో కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ని కూడా ఈ రచయిత తన పుస్తకంలో తప్పు పట్టాడు. ఇంగ్లండ్ లో దేశాధ్యక్షుడుగా స్త్రీకన్నా ఒక నీగ్రోని ప్రిఫర్ చేస్తామని దేశంలో 72 శాతం మందికి పైగా భావిస్తున్నారని రాసి ఇటు స్త్రీలనూ, అటు నీగ్రోలనూ అవమానపరిచాడు. పురుషుడి జ్ఞాపక శక్తిలో స్త్రీ జ్ఞాపకశక్తి కేవలం సగం మాత్రమే వుంటుందని అవాకులూ చవాకులూ రాశాడు. అంతేకాదు, ఒకే పరిస్థితిని పదిమంది స్త్రీలకీ, పదిమంది పురుషులకీ కలిగిస్తే అందులో ఇద్దరు పురుషులు, ఎనిమిది మంది స్త్రీలు రోదించడం కానీ, భయపడటం కానీ చేస్తారని ఒక సూడో సైంటిఫిక్ విశ్లేషణ పాఠకుల ముందుంచాడు. ఒక స్త్రీని ఏదైనా ఒక పెద్ద సంస్థకి సర్వాధికారిణిని చేసినా ఆమె ఆ సంస్థబాగోగులకన్నా కుటుంబానికే ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుందని, భర్త ఆరోగ్యం నుంచి, మనవరాళ్ళ పెళ్ళివరకూ రకరకాల కారణాలు ఆమెకు ముఖ్యమవుతాయనీ ఈ రచయిత అన్నాడు. అందుకే నేనీ పుస్తకాన్ని ఒక పురుగుని చూసినదానికన్నా హీనంగా చూడాలనుకుంటున్నాను" అంటూ చెప్పడం ముగించింది వనజాక్షి.

 

    నేను గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాను. వనజాక్షి చెప్పిన అభిప్రాయాలు జడ్జిలోనూ, జ్యూరీ సభ్యుల గుండెల్లోనూ గాఢంగా నాటుకున్నాయని వారి హావభావాలు చూస్తూంటే అర్థమైంది. నా పని సులువు చేసినందుకు వనజాక్షివైపు అభినందనగా చూశాను. సూర్యమ్ ఏదో ఫైల్ చదువుకుంటున్నాడు. వనజాక్షిని ప్రశ్నించడానికి అతడి దగ్గర ఏ వాదమూ లేదని నాకు తెలుసు. వనజాక్షిని మాటలతో కదిపితే తను మరింత ఓడిపోతానని అతడి అభిప్రాయం అయుండవచ్చు. నేననుకున్నట్టే అతడు క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. సాక్షి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయింది.

 

    నేను నా అంతిమవాదం కోర్టుకు సమర్పించడం కోసం ఆయత్తమయ్యాను. "మిలార్డ్! వుమన్ లిబరేషన్ మూవ్ మెంట్ అనేది దాదాపు 250 సంవత్సరాల క్రితం 1772లో ప్రారంభమైనది. 1772లో 'స్త్రీ హక్కుల పరిరక్షణ' అన్న పుస్తకాన్ని ఊల్ స్టోన్ క్రాఫ్ట్ అనే రచయిత్రి రాయడంతో స్త్రీజాతి మేల్కొన్నదని ఉద్యమకారులు చెప్తారు. ఈ 250 సంవత్సరాల్లోనూ అదృష్టవశాత్తూ పురుషాహంకారాన్ని ఎదుర్కొంటూనే స్త్రీలు ఎంతో అభివృద్ధి సాధించారు. చాలా హక్కుల్ని సాధించుకున్నారు. ఇటువంటి సమయంలో ఈ పుస్తకం రాయడం స్త్రీకే కాదు. మానవజాతికే అవమానకరం. స్త్రీ పురుషుడితో ఎప్పుడూ సమానం కాదనీ, వారిని ఎక్కడ వుంచాలో అక్కడే వుంచాలి అనీ రచయిత తన ప్రారంభవాక్యంలోనే పేర్కొనడం అతడి సంకుచిత దృష్టిని తెలియజేస్తోంది. ఇతడు మరింత లోతుకువెళ్ళి మతాల్ని కూడా తన వాదానికి అనుగుణంగా తిప్పుకున్నాడు. ఈవ్ వల్లే ఆడమ్ నాశన మయ్యాడని ఆరోపించాడు. పురుషుడి వంగిన రొమ్ము ఎముకనుంచి స్త్రీ సృష్టింపబడిందనీ కాబట్టి అటువంటి స్త్రీని సరిచెయ్యాలనుకుంటే అది విరిగిపోతుందనీ మహమ్మద్ ప్రవక్త అన్నట్టు రాసి ఈ సమాజంలో స్త్రీ స్థానాన్ని నిర్దేశించడానికి ప్రయత్నం చేశాడు. విడాకుల చట్టం ఆధారంగా స్త్రీలు తమ మాజీ భర్తల ఆదాయాల్ని కొల్లగొట్టుకునే అవకాశాన్ని పొందుతున్నారని దారుణమైన ఆరోపణ  ఒకటి చేశాడు. ఇటువంటి పుస్తకం రాయడంలోనే రచయిత అపరిపక్వత, దృష్టిరాహిత్యం, పురుషాహంకారం, స్త్రీలపై కోపం, ఈర్ష్య, అసూయ గోచర మవుతున్నాయి. ఒక స్త్రీలో తల్లినీ, చెల్లినీ, భార్యనీ చూడవలసిన ఈ రచయిత కేవలం ఒక బానిసని మాత్రమే చూడడం విచారకరం! జనారణ్యంలో కూడా ఆటవిక న్యాయమే చెల్లుతుందనీ, పురుషుడు స్త్రీకన్నా బలవంతుడు కాబట్టి, ఎలాగూ అతడినుంచి ఆ అల్పప్రాణి దూరంగా పారిపోలేదు కాబట్టి, పురుషుణ్ణి బ్రతిమాలో, భంగపడో అతడితోనే కలిసి వుండాలని రాశాడు. దీనికోసం తన ఆయుధాలుగా తన సహనాన్నీ, ఓర్పునీ వాడుకోవాలన్నట్టు సూచించాడు. కోపము, చిరాకు, ద్వేషము మొదలైనవన్నీ పురుషుడి సహజ లక్షణాలైతే, శాంతము, సౌశీల్యము మొదలైన గుణాలతో అతడిని ఓదార్చి లాలించకపోతే స్త్రీకి మనుగడే వుండదని కొత్త సూత్రాన్ని సభ్యసమాజానికి తెలియజెప్పాడు. ఇటువంటి పుస్తకాన్ని వెంటనే నిషేధించకపోతే స్త్రీ విముక్తిని నాశనం చేయడం కోసం మరెన్నో చీడపురుగులు ఇటువంటి పుస్తకాలరూపంలో వెలువడే ప్రమాదం వుంది. కాబట్టి మిలార్డ్. నేను ప్రవేశ పెట్టిన సాక్షుల అభిప్రాయాల ఆధారంగా... ఈ పుస్తకం చదివి మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాల ఆధారంగా సరియైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ నా వాదాన్ని ముగిస్తున్నాను".

 

    కూర్చుంటూ ప్రేక్షకుల గ్యాలరీవైపు చూశాను. సర్వత్రా హర్షం ప్రకటిత మవుతోంది. ప్రకాష్ బొటనవేలు పైకెత్తి "గెల్చావు సుమా?" అన్నట్టు అభినందించాడు. వాడు నాకన్నా రెండేళ్ళు చిన్నవాడు. ఎక్కడో దూరపు బంధుత్వం కూడా వుంది. నన్ను 'అక్కా' అని పిలిస్తూంటాడు.

 

    నేను ఓరగా సూర్యమ్ వైపు చూశాను. నుదుటిమీద చెయ్యిపెట్టుకుని కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలో వున్నట్టున్నాడు. ప్రతివాదం సమర్పించడం కోసం కుర్చీలోంచి లేచే ప్రయత్నం కూడా చేయలేదు. వాదించడానికి కూడా అతని దగ్గర ఏమీలేదని నాకు తెలుసు. నిజానికి పుస్తకం అంత దారుణంగానూ వుంది. వనజాక్షి చెప్పినట్టు కాల్చి కాఫీలో కలపాల్సిన పుస్తకమే!

 

    జడ్జి సూర్యమ్ వైపు తిరిగి 'ఇక మీ వంతు' అన్నట్టు చూసింది. సూర్యమ్ ఇంకా అదే భంగిమలో నిరాసక్తంగా కూర్చుని వున్నాడు.

 

    అప్పుడొక చిన్న సంఘటన జరిగింది.

 

    సూర్యమ్ తాలూకు జూనియర్ లాయరు కొన్ని కాగితాలు, పుస్తకాలు తీసుకొచ్చి అతడికందజేశాడు. వాటిని చూడగానే సూర్యమ్ మొహం విప్పారటం గమనించాను. జడ్జి అనుమతితో అతడు వనజాక్షిని తిరిగి బోనులోకి పిల్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం ప్రారంభించాడు.

 

    "మీరు చదివింది భారతీయ ఫిలాసఫీ అన్నారుకదా!"

 

    "అవును".

 

    "మనుధర్మ శాస్త్రం చదివారా?"

 

    "చదివాను".

 

    " 'న స్త్రీ స్వాత్రంత్య మర్హతి' అంటే అర్థమేమిటి?"

 

    వనజాక్షి సమాధానం చెప్పడానికి ఒక క్షణం తటపటాయించింది.

 

    సూర్యమ్ రెట్టించాడు. "మీకు సంస్కృతం తెలుసు. దయచేసి సమాధానం చెప్పండి".

 

    "స్త్రీకి స్వతంత్ర అర్హతలేదు అని" అంది.

 

    "అంటే స్త్రీ ఎప్పటికైనా పురుషుడిమీదే ఆధారపడి వుండాలి అనేగా?"

 

    "అబ్జెక్షన్ మిలార్డ్!" అంటూ లేచాను... "మనం ఇక్కడ చర్చిస్తున్నది 'వుమన్' అన్న పుస్తకాన్ని నిషేధించడం గురించి తప్ప మనుధర్మ శాస్త్రం గురించి కాదు".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS