Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 4

  

          పావని నవ్వేసి..... "నీ అనుభవం నిన్ను బాగా భయపెట్టేసింది పిన్నీ! ఎంతమంది ఈ ప్రపంచంలో హాయిగా వుండడం లేదూ?" అన్న భావం వచ్చేట్లు మాట్లాడింది. సుందరి వాదించలేదు. మౌనంగా వూరుకుంది.
   
    "హాయి" రెలిటివ్ టర్మ్. ఏ భవిష్యత్ అనుభవం పావనికి 'హాయి' తాలూకు నిర్వచనం చెపుతుందో కాలమే నిర్ణయించాలి.
   
                        *    *    *

   
    పావని పదవ తరగతిలోకి వచ్చింది. ఒక్కొక్క రెక్క విచ్చుకుంటున్న గులాబీలా ఆమె అందాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ముట్టుకుంటే మాసిపోతుందేమోనన్నంత అమ్ధమిఅన గులాబీరంగు శరీరం ఆమెది.
   
    ఆమెను చూస్తుంటే అరుంధతికి ఆనందం, ఆశ్చర్యం కూడా కలిగేవి. ఈమె నిజంగా తమ బిడ్డనా అని అనుమానం కూడా వచ్చేది. ఆ ముక్కు చూస్తే ఎక్కడో చూసినట్టు గుర్తువచ్చేది. జ్ఞాపకశక్తి వుంటే తనతోపాటు ఒకే గదిలో ప్రసవించిన స్త్రీ ముక్కు కదా అని గుర్తొచ్చి వుండేది.
   
    పావని పదవతరగతి సెకండ్ క్లాస్ లో పాసయ్యింది. అదయినా సుందరి పట్టుబట్టి కూర్చోబెట్టీ చదివించడం వల్లనే.
   
    "ఇక పావనికి పెళ్ళి చేసేస్తే మంచిదేమో" అన్నాడు విశ్వపతి భార్య, సుందరిలను కూర్చోబెట్టి.
   
    "మీ ఇష్టం ఎలా తోస్తే అలా చేయండి. నేను పోయేలోపల దాని పెళ్ళి చూసే అదృష్టం అయినా కలుగుతుందేమో" అంది అరుంధతి మంచంమీద నుంచి.
   
    "వద్దు బావా! పావని వయసెంతని? పదహారేళ్ళు కూడా నిండలేదు. దాన్ని ఇంకా చదివించండి. ఇప్పటినుంచి పెళ్ళీ, పిల్లలూ, బాధ్యతలూ దాని నెత్తిన వేయకండి" అంది సుందరి.
   
    "నాకు దాన్ని చదివించాలనే వుందమ్మా! కాని మన ఊళ్ళో ఒకటే జూనియర్ కాలేజీ వుంది. అది కో- ఎడ్యుకేషన్ మగపిల్లల మధ్యకు దాన్ని పంపించదానికి మనస్కరించడం లేదు" అన్నాడు విశ్వపతి. సుందరి తెల్లబోయింది. విశ్వపతి ఇలా ఆలోచిస్తాడని ఆమె వూహించలేదు.
   
    "పదిమందిలో తిరిగితేనేకదా దానికి ప్రపంచజ్ఞానం కలిగేది" అంది.
   
    "ఉహు! మీకు తెలియదు సుందరీ! అప్పటి రోజులు కావు. కాస్త అందంగా, వయసులో వున్న అమ్మాయంటే అబ్బాయిలు ఎలా వెంటపడతారో నేను చూశాను. అదసలే ఒట్టి పిరికిది."
   
    "నేను చదువుకుంటాను నాన్నా! మా ఫ్రెండ్సందరూ కూడా కాలేజీలో చేరుతున్నారు" అంది పావని గారంగా.
   
    కాలేజీ స్టూడెంట్ ననిపించుకోవాలన్న ఉబలాటం ఆమెది. అంతేకానీ చదువుమీద ఉత్సాహం లేదు.
   
    "పోనీ చేరనివ్వండి. మంచి సంబంధం కుదిరితె అప్పుడే 'మాన్పించవచ్చు' అంది అరుంధతి.
   
    "సర్లే చూద్దాంలే" అన్నాడు విశ్వపతి అసంతృప్తిగా.
   
    అదృష్టవశాత్తూ ఆ సంవత్సరమే ఉమెన్స్ కాలేజీని తెరవడంతో సమస్య పరిష్కారమైంది. పావని ఇంటర్ లో చేరింది. కాలేజీ ఊరికి కాస్త దూరంగా సముద్ర తీరానికి దగ్గరలో వుంది.
   
    పదేళ్ళుగా ఇల్లు, ఇంటి పక్కనే వున్న స్కూలు తప్ప ఏమీ తెలియని పావనికి రెక్కలు విచ్చుకుంటున్న స్వేచ్చ లభించినట్లనిపించింది.
   
    ప్రపంచంలాగే లైబ్రరీలో మంచి పుస్తకాలు, మామూలు పుస్తకాలు అని రెండు రకాలు వుంటాయి. మనిషిని మామూలు జీవితం ఆకర్షించి నట్టే మామూలు పుస్తకాలు త్వరగా ఆకర్షిస్తాయి.
   
    ఇంతకాలమూ ఆమె పుస్తకాలు చదవటానికి విశ్వపతి అనుమతించలేదు. సుందరి చదివి అప్పుడప్పుడూ కథలు చెపుతుండేది.
   
    పావని మొదట చదివిన పుస్తకం "అసమర్ధుని జీవయాత్ర" అది చదివి మూడు రోజులు రచయితని తిట్టింది. ఎందుకిలాంటి కథలు రాస్తారు? అనుకుంది. "మిల్స్ అండ్ బూన్" టైపులో తెలుగులో వచ్చిన ప్రేమ కథల పుస్తకాలూ, సస్పెన్స్ థ్రిల్లర్ ఆమెకు బాగా నచ్చాయి.
   
    పావనికి రోజులు చాలా త్వరగా గడుస్తున్నాయనిపిస్తోంది. జీవితం హాయిగా, సాఫీగా గడుస్తోంది. తనూ, తన ఇల్లూ, తోటా, సముద్రం అన్నీ అందమైన కళా రూపాలే. ఆ కళా ప్రాంగణంలో తనని మెచ్చి వచ్చేవాడు- ఇంటిని ప్రేమ అనే పునాదితో, అభిమానం అనే గోడలతో, ఆత్మీయత అనే పైకప్పుతో నిర్మిస్తాడు. ఆ యింటి ప్రాంగణంలో గడ్డిపూలు కూడా కళాత్మకంగా నృత్యం చేస్తాయి. కాలుష్యం అంటని గాలి సన్నాయి గీతాలు పాడుతుంది.
   
    "నువ్వీ మధ్య కలల్లో తేలిపోతున్నావు పావనీ! ఒంటికి అంత మంచిది కాదు" అంది స్నేహితురాలు శైలజ.
   
    క్లాసు లేకపోతె సముద్రం ఒడ్డున కూర్చున్నారిద్దరూ.
   
    "నాది ఊహా ప్రపంచం, కలల లోకం కాదు శైలూ! ఇంటిని తీర్చి దిద్దుకోవడం- చుట్టూ వాతావరణాన్ని అనుకూలంగా మలచుకోవడం మన చేతుల్లోనే వుంది. నేను రాజభోగాల గురించి కలలు కనడంలేదు. నాక్కాబోయేవాడు నన్ను నన్నుగా ప్రేమించి వస్తాడు. అలాంటివాడిని నేనూ ప్రేమిస్తాను. మాలో పరస్పర అవగాహన వుంటుంది. కలలను ఇజం చేసుకోవాలనే పట్టుదల వుంటుంది. చాలా చిన్న కోరిక ఇది."
   
    "అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు పావనీ! జీవితం స్త్రీకి పెద్ద సస్పెన్స్. ఈ సముద్రంలాగే అగాధమూ.... అనంతమూ లోపల ఏముందో కళ్ళకు కన్పించదు."
   
    "సముద్రం నించేగా అంతులేని సంపదను బయటకు తీస్తున్నాం. అది మనం తీసుకునే కృషిలో వుంటుంది."
   
    'చెప్పడం, కలలు కనడం సులభమే....! అనుభవంలోకి వస్తేగానీ కష్టం తెలిసిరాదు."
   
    "ఎందుకు రాదు? వస్తుంది. ఇప్పటికే మాకు అనుభవం లేదంటావా? మా యింటి పరిస్థితి చూడు. అమ్మ పన్నెండేళ్ళుగా క్యాన్సర్ తో బాధపడుతోంది. నాన్న ఆదాయం కూడా అంతంత మాత్రమే. అయినా మా ఇంట్లో సుఖ సంతోషాలకేం తక్కువయింది?" ఎంత అన్యోన్యంగా వుంటామో నువ్వూ చూస్తూనే వున్నావుగా."
   
    "మీ ఇంటి పరిధి చాలా చిన్నది పావనీ! అదే ప్రపంచం కాదు. అందరూ మీ నాన్నలాంటి వాళ్ళే వుండరు"
   
    'అందరూ వుండకపోవచ్చు కొందరయినా వుంటారుగా. అలాంటి వాళ్ళకోసమే నాన్న గాలిస్తారు. ఆయన సెలక్షన్ మీద నాకు నమ్మకం వుంది."
   
    "అలాంటి నాన్నగారుండడం నీ అదృష్టం. నువ్వు కావాలనుకుంటున్న సంబంధమే కుదరాలని కోరుకుంటున్నాను."
   
    'అందరికీ తన కుటుంబాన్ని చూస్తే ఈర్ష్య వాళ్ళిళ్ళు అలా వుండవు కాబట్టి. అందుకే తనుకూడా బాధపడితే ఆనందించాలని చూస్తారు' అనుకుని నవ్వుకుంది పావని. విశ్వపతి సంబంధాల వేటలో పడ్డాడప్పటికే. ఆమె ఇంటర్ పూర్తి చేయడానికి కొద్ది నెలలే ఉంది. ఈ లోపలే అన్ని ఏర్పాట్లుచేసి సెలవులలో పెళ్ళి చేయాలని ఆయన ఉద్దేశ్యం.
   
                             *    *    *
   
    ప్రపంచమంతా ఆనందమాయం అనుకున్న ఆమె అభిప్రాయానికీ ఆ సాయంత్రమే చిన్న దెబ్బ తగిలింది.
   
    అఫ్ కోర్స్, చాలా చిన్నదెబ్బ-
   
                             *    *    *
   
    "సుందరి వుందా? నా పేరు కాంతారావు. సుందరి అన్నయ్యను" అన్నాడతడు.
   
    "రండి, కూర్చోండి- పిన్నిని పిలుస్తాను" లోపలకు పరుగెత్తింది పావని.
   
    "మా అన్నయ్యా! ఎందుకొచ్చాడిప్పుడు?" సాలోచనగా బయటకు వచ్చింది సుందరి. వస్తూ "నువ్వెళ్ళు కాలేజీకి టైమవుతోంది" అంది.
   
    సాయంత్రం పావని ఇంటికి తిరిగి వచ్చేసరికి విశ్వపతి హాల్లోనే కూర్చుని వున్నాడు. అతడి మొహం గంభీరంగా వుంది.
   
    పావని వంటింట్లోకి వెళ్ళింది. సుందరి మొహంలో నవ్వు లేదు. సీరియస్ గా కూరలు తరుగుతోంది.
   
    "ఏం జరిగింది? అందరూ ఎందుకలా వున్నారు?"
   
    "ఏం లేదు నువ్వెళ్ళి చదువుకో, నాకు పనుంది" విసిగించకు అన్నట్టు సమాధాన మిచ్చింది. సుందరి ఎప్పుడూ అలా వుండలేదు. పావని లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది. అరుంధతి వాడి పోయిన మొహంలో విషాదచ్చాయలు ఏర్పడినట్లు కళ్ళు తెలుపుతున్నాయి.
   
    "ఏం జరిగిందమ్మా! ఎందుకలా వున్నావ్? అందరూ కోపంగా వున్నా రెందుకని?"
   
    "కాంతారావు మావయ్య వచ్చాడు. సుందరిని తీసుకెళ్ళి పోతానంటున్నాడు."
   
    "ఎందుకట?"
   
    "వాళ్ళమ్మ ఆరోగ్యం అసలు బావుండలేదట. మంచంలోనే వుందట. చూసుకునే వాళ్ళెవరూ లేరని. అత్తయ్య ఉద్యోగం చేస్తోంది. ప్రొద్దుట వెళితే సాయంత్రంగాని తిరిగిరాదు. ఇంట్లో ఎవరయినా వుండాలిగా."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS