Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 4


    తల్లి కోరిక అతడికి తెలుసు. అందుకే చదువుని ఒక కర్తవ్యంగా భావించాడు. తనేదో గొప్ప కష్టపడుతున్నానని అతడు అనుకోలేదు. ఫ్యాక్టరీ నుంచి వచ్చి రోజూ ఒక గంటసేపు చదివాడు. ప్రైవేటుగా మెట్రిక్యులేషను చదివేడు. కాస్త మంచి మార్కులతోనే ప్యాసయ్యాడు. చదువు అయ్యాక రెండో కర్తవ్యం చెల్లెలి పెళ్ళి.... అతడికి చెల్లి అంటే ప్రాణం. తనకి తల్లి మిగిల్చి ఇచ్చిన తీపిగుర్తుగా మృదులని భావించేవాడు. అందుకే ఈ రోజు ఇంత ఆదుర్దాగా వున్నాడు.

    స్ప్రింగ్ డోర్స్ తెరచుకోవడంతో వేణు ఆలోచనల్లోంచి తేరుకొని అటువైపు ఆత్రంగా చూశాడు. బోయ్ లోపలికి రమ్మన్నట్టూ సైగ చేసేడు. వేణు లోపలికి ప్రవేశించాడు.

    డాక్టర్ వెంటనే ఏమీ చెప్పకుండా కొంచెంసేపు మౌనంగా వుండి చివరకి ఒకేమాట అన్నాడు__ "సారీ మిస్టర్ వేణూ! నీ చెల్లెలికి ఏమీ బావోలేదు."

    "అంటే...." అన్నాడు వేణు.

    "నేనూ ముందు తలనొప్పే అనుకున్నాను. కాని పరీక్షలో తెలిసిందేమిటంటే ఆమె తలలో ఒక నరం దెబ్బతిన్నదని. దీనివలెనే రోజు రోజుకి దృష్టి మందగిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగిన పక్షంలో ఆమె రెండు కళ్ళూ పోయేరోజు దూరంలో లేదు."

    వేణు మాట్లాడలేదు. స్థిరంగా కూర్చుని ఉన్నాడు. అప్పటికి సూర్యుడు బాగా క్రిందికి కృంగిపోయాడు. నీడలు కిటికీలోంచి లోపలికి పాకి అతడి మొహంమీదకు చేరుకుంటున్నాయి. నిర్వికారమైన అతడి మొహాన్ని చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఐతే అతడికి కనబడుతున్నది పై ఆకారం మాత్రమే. బాహ్యభావాలను అతీతమవటాన్ని జీవితం వేణుకి ఎప్పుడో నేర్పింది. తన మాటలు అతడిలో ఎంత అగ్నిపర్వతాల్ని సృష్టించాయో డాక్టర్ కి తెలీదు. అతడు అన్నాడు__ "ఇప్పటికైనా మించి పోయిందేమీలేదు. దీన్ని వెంటనే ఆపరేట్ చేస్తే గుణం కనబడుతుంది. కళ్ళకే ప్రమాదమూ లేదు" ఆ మాటలకు ఒక్కసారిగా వెంటనే వేణు తలెత్తి ఆశగా, "థాంక్యూ డాక్టర్- థాంక్యూ" అని అంటాడనుకున్నాడు డాక్టర్. కానీ వేణు అలాంటి పని ఏదీ చెయ్యలేదు. చేతిలోని పేపర్ మీద నుంచి దృష్టి మరల్చకుండా, "దానికి ఎంత ఖర్చవుతుంది, డాక్టర్?" అని అడిగాడు.

    "ఆ ఆపరేషన్ మేమెవరం ఇక్కడ చెయ్యలేం. స్పెషలిస్ట్ చేత చేయించాలి. ఆపరేషన్ అయిన తర్వాత అక్కడ పదిహేను రోజులు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచాలి. మొత్తానికి అంతా కలిసి పాతికవేలదాకా అవుతుంది."

    పాతికవేలు....

    వేణు లేచి, "థాంక్స్ డాక్టర్ గారూ! వెళ్ళొస్తాను" అంటూ బయటకు కదిలాడు. బయట టేబుల్ మీద మృదుల కూర్చొని వుంది. కళ్ళెత్తి అన్న వైపు చూసింది.... కళ్ళు.

    ఆ అమ్మాయికి అందమంతా కళ్ళలోనే ఉంది. అవి అమాయకమైనవి. గుండ్రటి మొహాన్ని తమ అరవిందాకారంలో మరింత గుండ్రంగా తీర్చిదిద్దేవి.

    వేణు చప్పున దృష్టి మరల్చుకొని, "పదమ్మా" అన్నాడు.

    మృదుల లేస్తూ, "ఏమన్నారన్నయ్యా డాక్టరుగారు?" అంది.

    వేణు జవాబు చెప్పలేదు.


                                   2


    బ్యాంక్ పాస్ బుక్ తీసి చూసుకున్నాడు వేణు. రెండువందలా పదిరూపాయలు వుంది. ఫ్యాక్టరీ చాలా రోజుల్నుంచి స్ట్రయిక్ లో ఉండటం వలన మూడువేల నుంచీ రెండువందలకి దిగింది. చాలా సంవత్సరాలుగా కూడబెట్టిన డబ్బు అది. చెల్లెలి పెళ్ళికోసం.

    అతడికి బాధేసింది.

    కష్టపడటం అతడికి కొత్తకాదు. కానీ కష్టఫలితం ఈ విధంగా నిర్వీర్యమయిపోతూంటే బాధగాక మరేమి మిగులుతుంది? పెళ్ళికి తోడు ఇప్పుడు ఆపరేషన్ ఖర్చు ఈ స్ట్రయిక్ ఇంకా కొంతకాలం పాటు ఎటూ తేలకపోతే, ఇంకో పార్ట్ టైం ఉద్యోగం చూసుకోవాలనుకున్నాడు. ఖర్చుల కోసం బ్యాంక్ లో మిగిలిన డబ్బు డ్రా చెయ్యటానికి బయల్దేరాడు.

    అతడు బ్యాంక్ చేరుకునేసరికి పదకొండు కావస్తూంది. బ్యాంకు పెద్ద రష్ గా లేదు. పేమెంట్ కౌంటర్ ముందు ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడి వెనకే టోకెన్ పట్టుకుని నిలుచున్నాడు వేణు. బ్యాంక్ క్లర్క్ వందరూపాయల నోట్లు వంద లెక్క పెట్టి వృద్ధుడికిచ్చి 'నెక్ట్స్' అంటూ వుండగా జరిగింది.

    స్పీడ్ గా ముందొకరు ప్రవేశించి, అదే వేగంతో మానేజర్ రూంలోకి ప్రవేశించాడు అతడిని చూసి అప్పటివరకూ కస్టమర్ లాగా కూర్చున్న మరో ముగ్గురు కళ్ళక్రింద చేతి రుమాలు అడ్డుపెట్టుకుని లేచారు. ఏం జరుగుతుందో బ్యాంక్ సిబ్బంది గ్రహించేలోపులో వాళ్ళచేతుల్లో పిస్తోళ్ళు మెరిసినయ్. అందులో కొద్దిగా నాయకునిలా వున్నవాడు కర్కశంగా, "ఎవరూ కదలకండి! మేం మీకు హానిచెయ్యం. కానీ మీలో ఎవరన్నా పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యటానికి ప్రయత్నిస్తే మాత్రం నిర్ధాక్షిణ్యంగా పేల్చి పారేస్తాం. మాకు కావాల్సింది బ్యాంకు డబ్బు మాత్రమే" అంటూ క్యాషియర్ వైపు నడిచాడు.

    సిబ్బంది అంతా కుర్చీల్లో లేచి నిలబడ్డారు. క్యాబిన్ లోంచి మేనేజర్ వణుకుతూ, చెమట్లు కక్కుతూ పరిగెత్తుకు వచ్చాడు. వెనుకే పిస్తోల్ తో ఆగంతకుడు.

    తమతోపాటూ తెచ్చిన సంచిలో క్యాషియర్ అందించిన డబ్బు వేసుకుంటున్నాడు మరొకడు. అంతా కనురెప్పపాటులో పూర్తయింది.

    "మేము వెళ్ళిపోయాక రెండు నిమిషాలపాటు ఎవరూ కదలకండి. ఎవరైనా అరిచినట్టు మాకు వినబడితే మళ్ళీ లోపలకివచ్చి అందర్నీ కాల్చేస్తాం" అన్నాడు మేనేజరు రూంనుండి వచ్చిన ఆగంతకుడు. సిబ్బంది ఎవరూ మాట్లాడలేదు. ఎంత డబ్బు పోయిందో అంతకు అంతా ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది. కాబట్టి ఎవరూ పెద్దగా బాధపడినట్టూ కనిపించలేదు. అందరి భయమూ తమ ప్రాణాల గురించే ఎప్పుడు ఏ పిస్టల్ పేలుతుందో అన్న భయంతో ప్రాణాలుగ్గబట్టుకుని ఆ ఆగంతకులవైపు చూస్తున్నారు.

    సంచి ముడెయ్యటం పూర్తయ్యాక దాన్ని భుజాన వేసుకుని ఒక దొంగ కౌంటర్ వెనుకనుంచి వచ్చాడు. అందరూ ఒక్కో అడుగూ వెనక్కి వేసుకుంటూ గుమ్మం దగ్గరికి చేరుకున్నారు. అందరికీ నాయకుడిలా కనబడుతున్న వాడు కూడా రెండడుగులు వేసి అంతలో ఆగిపోయాడు. వాడి దృష్టి వేణు ప్రక్కన నిల్చున్న ముసలాయనమీద పడింది.

    "ఏయ్ ముసలోడా! ఆ డబ్బు కూడా ఇలా ఇవ్వు" అన్నాడు. ముసలాయన తన చేతిలో వున్న నోట్లకట్టవంక చూసుకున్నాడు. అప్పుడే కౌంటర్ నుండి తీసుకున్న డబ్బు.... అది పదివేలు. ఈ కంగార్లో ఆయన దాన్ని చేతిలోనే పట్టుకొని వున్నాడు.

    ఆయన దగ్గర్నుంచి దాన్ని లాక్కోవటానికి వెళ్తూ దొంగ తన దగ్గరకొచ్చేసరికి, వేణు- "మీరు మా డబ్బు ఏమీ ముట్టుకోనన్నారుగా" అన్నాడు. ఆ ఆగంతకుడు దానికి సమాధానంగా ఓ వంకర నవ్వుతో వేణుని పక్కకుతోసి మరో అడుగు ముందుకు వేసేడు. అతడు అంత దగ్గరకు రాగానే వేణు అనూహ్యమైన వేగంతో కదిలి, జరిగిందేంటో ఆ దొంగ గ్రహించే లోపులో చెయ్యి వెనక్కి విరిచిపట్టుకున్నాడు. మిగతా దొంగల్లో ఒకడు ఈ హఠాత్సంఘటనకి బెదిరి పిస్తోలు పేల్చాడు. ఆ పాటికే వేణు తను పట్టుకున్నవాణ్ణి తన ముందుకు లాగటంతో గుండువాడి భుజాన్ని రాచుకుంటూ వెళ్ళింది. ఈ హడావుడిలో క్యాషియరు కుర్రవాడు గుమ్మంలోంచి బైటకు పరుగెత్తి "దొంగలు__దొంగలు!" అని హిస్టీరిక్ గా అరవటం సాగించాడు.

    వేణు చేతుల్లో చిక్కుకున్న దొంగకి చావు ధైర్యం వచ్చి విదిలించుకుని గుమ్మంవైపు పరిగెత్తాడు. బైట కారు స్టార్టయిన చప్పుడు వినిపించింది. మిగతా దొంగలు కూడా హడావుడిగా బైటకు పరుగెత్తారు. అయితే క్యాష్ బ్యాగ్ తమతోపాటు తీసుకోవటం మర్చిపోలేదు.

    బ్యాంక్ సిబ్బందికీ, అక్కడున్న మిగతా వారికి ఈ షాక్ నుంచి తేరుకోవటానికి దాదాపు అయిదునిముషాలు పట్టింది. అందరికన్నా ముందు తెరుకున్నది ముసలాయన. వేణు వైపు తిరిగి, "ఏదో ఇంగ్లీషు సినిమా చూసి దొంగతనానికి వచ్చిన వాళ్ళలా వున్నారు కాబట్టి సరిపోయింది కాని- లేకపోతే నువ్వు చేసింది చాలా దుస్సాహసం అబ్బాయ్!" అన్నాడు.

    "ఎంత చేసినా వాళ్ళ డబ్బు వాళ్ళకి దొరికిందిగా!" అన్నాడు వేణు.

    "మొత్తం ఎంతపోయిందీ!" ఎవరో లోపలికి వచ్చిన క్యాషియర్ ని అడుగుతున్నారు.

    "లక్షా యాభై వేలు ఉండవచ్చు."

    మేనేజర్ పోలీసులకి ఫోన్ చేస్తున్నాడు. బ్యాంక్ బైట జనం గుమిగూడి మాట్లాడుకుంటున్నారు.

    "లక్షపోతే పోయింది లెండి. బ్యాంకు డబ్బేగా! మీది పదివేలూ దక్కింది అదే చాలు" అన్నాడు క్యాషియరు ముసలాయనతో. అతడో కుర్రవాడు, ముందు కాస్త బెదిరినా ఇప్పుడు థ్రిల్లింగ్ గా ఫీలవుతున్నాడు.

    మాట్లాడకుండా నిలబడ్డ వేణుతో ముసలాయన, "నువ్వు మీదపడేటప్పుడు అతడు జాగ్రత్తగా వున్నాడు. లేకపోతే నీ ప్రాణాలు నీకు దక్కివుండేవి కావు" అన్నాడు.

    "అతడు మాట తప్పేసరికి నాకు ఏదో తెలియని ఆవేశం వచ్చింది. దాంతో ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు" అన్నాడు వేణు.

    "అంటే....నువ్వెప్పుడూ మాటే తప్పలేదా?"

    "లేదు. నేనింతవరకూ అబద్ధం చెప్పలేదు" అన్నాడు వేణు. అతడికి తన తల్లి గుర్తొచ్చింది. 

    అంతలో దూరంగా పోలీసు సైరను వినిపించింది.

    దాన్ని వినగానే 'ఇక్కడుంటే మళ్ళీ సాక్ష్యాలూ గొడవ' అనుకుంటూ చాలామంది వెళ్ళిపోయారు__ ముసలాయనతో సహా.

    క్యాషియర్ వేణువైపు తిరిగి, "చూసారా? అంత ప్రాణాలకు తెగించి పదివేలు రక్షిస్తే కనీసం థాంక్స్ అన్నా చెప్పలేదు ఆయన" అన్నాడు.

    వేణు నవ్వి వూరుకున్నాడు.

    ఇంతలో పోలీసులు లోపలికి ప్రవేశించారు.


                       *    *    *    *


    ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో వున్న ఫ్యాక్టరీ అది.

    వేణు తండ్రి చనిపోయే సమయానికి చిన్న కర్మాగారంగా వున్న ఆ ఫ్యాక్టరీ పాతిక సంవత్సరాల్లోనూ చాలా అభివృద్ధి చెందింది. దాదాపు రెండువేల మంది కార్మికులు అక్కడే చిన్న చిన్న ఇళ్ళు కట్టుకోవటంతో అదొక టౌన్ లా మారింది. మరిన్ని ఫ్యాక్టరీలు వెలిశాయి. ఈ ఫ్యాక్టరీకి మానేజరు దయానందం. పేరుకు మానేజరు అయినా ప్రొప్రయిటరులాగానే వ్యవహరిస్తాడు. అసలు ప్రొప్రయిటరీకి ఇలాంటి ఫ్యాక్టరీలు ఎన్నో వుండటమే దానికి కారణం. ఆయన ఎప్పుడో నెలకి ఒకసారి దయానందాన్ని పిలిచి విషయాలు కనుక్కుంటూ వుంటాడు. అంతే! అందులోనూ ఫ్యాక్టరీకి లాభాలు బాగా వుండటంతో ఆయనకి దయానందంమీద నమ్మకం కుదిరింది. అతని పనితో సంతృప్తి చెందాడు కూడా.

    సంతృప్తి చెందనిది కార్మికులు ఒక్కరే.

    ఫ్యాక్టరీ అంతగా లాభాలు గడిస్తున్నా తమకు బోనస్ సరిగ్గా ఇవ్వలేదని స్ట్రయికు మొదలుపెట్టారు. దానికి సారధ్యము వహిస్తున్నది రామయ్య. అతడిప్పుడు ముసలివగ్గు అయిపోయాడు. వేణు తల్లితండ్రులు చచ్చిపోయాక ఆ అన్నా చెల్లెళ్ళిద్దర్నీ తనే ఆదుకున్నాడు. వేణు తనకాళ్ళ మీద తను నిలబడేవరకూ సాయం చేశాడు.స్ట్రయికు కొనసాగినకొద్దీ కార్మికుల్లో అసంతృప్తి పెరగసాగింది. ఇలా అహింసాయుత పద్ధతుల్లో స్ట్రయికు సాగిస్తే ఎంతకాలానికీ యాజమాన్యం దిగిరాదని, ఏదో కొంత అలజడి సృష్టించాలనీ కార్మికులలో వేడి రక్తం వున్నవాళ్ళు వాదించటం మొదలుపెట్టారు.ఈ పరిణామంతో, తను రాజీనామా ఇస్తానన్నాడు రామయ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS