Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 48

    రాత్రి కరిగిపోయింది. ఉదయం అయిదుగంటలకే నిద్రలేచాడు!

    ఎవరో తట్టిన విధంగా ఉలికిపడి లేచాడు.

    రాత్రి అత్తాయమ్మగారు రిపోర్ట్సు చదివి ఉంటారు. ఎలా రియాక్ట్ అయారో?

    ముఖం కూడ కడక్కుండా నిద్ర మంచం మీదినించే లేచి వెళ్ళిపోతున్న భర్తవంక మరోవైపుకి తిరిగి దిండుక్రింద తలదూర్చి పడుకుంది.

    వాల్మీకి పదినిముషాల్లో ఫాంహౌస్ కి వచ్చాడు. అత్తాయమ్మగారు నిద్రలేచిన జాడలేదు.

    వాకిలి ప్రక్కన టేబిల్ మీద అందమయిన అక్షరాలతో నిండిన రెండు గులాబిరంగు కాగితాలు కన్పించాయి.

    "ఇది అనివార్యమయిన పరిణామం! అల్లుడుగారూ! గాయత్రి అమాయకురాలు. జాగ్రత్తగా చూచుకోండి మీ మీద ఆ నమ్మకం నాకుంది! కూలిన ఆశలతో నా జీవితం శిధిలాలయం అయింది. ఇంక నేను ఈ లోకంలో వుండవలసిన పనిలేదు. పని తీరిపోయి వెళ్ళిపోతున్న నన్ను మన్నించండి" అని వ్రాసి వుంది.

    వాల్మీకి గుండెలు దడదడలాడాయి.

    రెండవ ఉత్తరం ఆమనిని ఉద్దేశించి వ్రాసిందామె.

    "చిన్నారీ! నీ శక్తి, చురుకుతనం నాకు తెలుసు! నీ చదువు పూర్తి అయిందాకా నేను చనిపోయాననే విషయం నీకు ఎవరూ చెప్పరు. ఆ తప్పు ఎవరిమీదా వేయకు. ఇది నా కోరిక. ఎవరెలా పోయినా నీ చదువుకి అంతరాయం కలుగకూడదు. నువ్వు కోరుకున్న విధంగా కలెక్టర్ వి కావాలి!

    నీకు అదనంగా మరో బాధ్యత అప్పగిస్తున్నానమ్మా! సమయం వచ్చినప్పుడు ఈ ఉత్తరం నీకు చూపుతారు.

    అప్పుడు నీవు ఈ ఇంటి సాంప్రదాయాన్ని, గౌరవాన్ని నిలబెట్టాలి! ఇంతకాలం ఈ రెండు కుటుంబాలకి వారసుడిని గాయత్రి, వాల్మీకి కలిసి మనకు అందిస్తారని ఆశతో బ్రతికాను. అది అడియాస అని ఈ రోజు అర్ధమయింది నాకు. ఇక వారు నా కోరిక తీర్చలేరు.

    నేను ఏ లోకంలో వున్నా ఈ వంశాంకురాన్ని నీవు అందించే సుముహూర్తం కోసం ఎదురుచూస్తుంటాను. ఆ పని నీవు చేసిననాడు ఏ లోకంలో వున్నా నా ఆత్మ శాంతిస్తుంది! ఈ కుటుంబాల భవిష్యత్తు గాయత్రి చేతులలోంచి నీ చేతులకు అప్పగించాడు మన కులదైవం జగదీశ్వరస్వామి! ఈ పవిత్ర బాధ్యత నీవు స్వీకరించినట్లుగా భావించి వెళ్ళిపోతున్నా ఆమనీ! కాని ఇందుకోసం నీ చదువు అభ్యంతరపడకూడదు.

    ఇంతకాలం డాక్టర్ రిపోర్ట్ నాకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు.

    ఈ భగవంతుడిచ్చిన పిలుపు రిపోర్టు నీ చదువు అయిందాకా కూడ రహస్యంగా ఉంచగలగాలి. అదే వారికి నేనిచ్చే తీర్పు! అని ఉందా ఉత్తరంలో.

    పైన సీలింగ్ ఫాన్ తిరుగుతోంది.

    మంచంవైపు చూచాడు వాల్మీకి!

    ఆమని అని అందమయిన అక్షరాలున్న దిండుమీద తల పెట్టుకుని ఉంది అత్తాయమ్మగారి శరీరం! ఆమె మీద ఆమని ప్రజంట్ చేసిన వెండి జరీ పూవులు షాల్ వేసి ఉంది. మురిపెంగా దాన్ని గుండెలకు చుట్టుకుని ఆమనిని కౌగిలించుకున్న అనుభూతిని పొందుతూ వెళ్ళిపోయారామె.

    వాల్మీకి అక్కడే కుప్పకూలిపోయాడు.

    పనివారు ఈ సంగతి కనిపెట్టేశారు.

    పరుగు పరుగున వెళ్ళి ఈ వార్తని గాయత్రికి అందించారు.

    ఆమె విరుచుకుని పడిపోయింది వార్తవినగానే!!

    చుట్టుప్రక్కల గ్రామాలవారు తండోప తండాలుగా తరలి వస్తున్నారు.

    దేవాలయాలు మసీదులు చర్చిలలో ప్రార్ధనలు జరుగుతున్నాయి.

    భవనంలో అయిదు దశాబ్ధాలపాటు దేదీప్యమానంగా వెలిగిన వెలుగు ఆరిపోయింది! అది కళావిహీనంగా మారిపోయింది. వర్ధనితోసహా పని వారందరూ వలవల ఏడ్చారు. ప్రతి ఇంటిలోనూ ఆత్మీయుల్ని కోల్పోయినట్లు విలపించారు. ఆ అయిదారు గ్రామాలలో సంతాతం సముద్రమై పొంగింది.


                                                                  *    *    *


    "బాబూ! అమ్మగారి కర్మకుండలు ముగిశాయి!

    వారు ఈ ప్రాంతంలో ప్రతియింట దీపాలు వెలిగించినారు. ఆ సాంప్రదాయాన్ని కాపాడగల చిట్టితల్లి ఈ గాయత్రి అమ్మగారు.

    మీరు కూడ వారి సాంప్రదాయాలకు అతికినట్టు సరిపోయారు.

    మేము కూడ ఆవిడగారు లేరు అనే విషయాన్ని మర్చిపోతాం!

    మీరే మా అందరికి అండదండలు అనుకుంటాం" అని చెప్పేసి చుట్టుప్రక్కల గ్రామాల పెద్దలు వెళ్ళిపోయారు.

    సాయంత్రం వరకు గాయత్రి చాటు చాటుగానే ఉండి పోయింది.

    అప్పటికి వాల్మీకి వ్యాపారం పనుల మీద పట్నం వెళ్ళి మూడు వారాలయింది. ఇంకా ఆ ఆలోచన మానేశాడు!

    అతడు పగలంతా పచ్చి గంగ కూడా ముట్టలేదని తెలిసి ఎదుటకు వచ్చింది గాయత్రి! తల్లి చనిపోయిన తరువాత మూడు వారాలుగా తప్పుకు తిరిగిందామె. భర్త ఎదుటపడలేదు.

    ఇప్పుడు వచ్చింది ఎదుటకు! జుట్టులోకి వ్రేళ్ళు పోనిచ్చి ఆత్మీయత చూపింది! మెడను కౌగిలించుకుంది పసి పాపాయిలా!

    "నామీద కోపం వచ్చింది కదూ?" అని ప్రశ్నించాడు వాల్మీకి!

    "మీరు కాక నాకింకెవరున్నారు?" అంది గాయత్రి!

    "ఇప్పుడు కోపం పోయిందా గాయత్రి!"

    "మనకు ఇంక ఎప్పటికి పిల్లలు పుట్టరనే విషయం నన్ను బాధించటంల్లేదు. అది ఎంత బాధాకరమయిన వార్త అయినా మీతో పంచుకోవాలనుకుంటాను. మీకు తెలిసిన విషయం నాకు చెప్పలేదు. అంటే నన్ను దూరం చేరారు. వేరుగా ఉంచారు. అవి బాధ కలిగింది" అంది అతన్ని అల్లుకుపోయి.

    "నీకు బాధ కలిగించకుండా ఈ విషయం కొంతకాలమే దాచి ఉంచుదామనుకున్నాను" అన్నాడు వాల్మీకి!

    "అప్పుడయినా చేదు నిజం తెలియక మానదుకదా! ఎంతకాలం దాచినా బయటపడక తప్పదు. అప్పుడేం చేద్దామనుకున్నారు?"

    "ఈలోగా ఆమని కలెక్టరు గారయి పోయి పెళ్ళిచేసుకుని ఓ బిడ్డను కంటే ఆమెను యాచించి ఆ బిడ్డను తెచ్చి పెంచుకుందాం అనుకున్నాను."

    గాయత్రి ముఖంలో వెలుగు కన్పించింది.

    "ఇంత అందమయిన ఆలోచన మీరు ఒక్కరే మనసులో ఉంచుతున్నారన్నమాట! నాతో పంచుకోవాలని అనిపించలేదా?"

    "గాయత్రి నగరంవెళ్ళి వొచ్చాక ఒంటరి వాడనై పోయి ఎంత చిత్రహింస అనుభవించానో నీకు తెలియదు" అతను చేతుల్లో ముఖం దాచుకున్నాడు.

    "ఊరుకోండి! భగవంతుడి శాపం ఇది! దీన్ని చెరి సగం పంచుకుందాం. అమ్మలేని ఈ ఇంటిలో నన్ను ఒంటరిదాన్ని చేయవద్దు!

    మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంకెప్పుడు ఏ విషయమూ నా దగ్గర దాచవద్దు నేను భరించలేను. పట్నంవెళ్ళి పనులు చూచుకోరా?

    మూడు వారాలయింది!" అంది గాయత్రి!

    "ఈ రెండు కుటుంబాల సంపదలు చాలు! నేనింకా ఎవరి కోసం సంపాదించాలి" మాటాడకుండా అతని నోరు మూసిందామె!

    "తప్పు మగవాళ్ళు అలా అనకూడదు. అదే పురుషంకారం అంటే! పిల్లలు పుట్టరని సోమరులు కాకూడదు. వూరికే కూర్చోవటం మా అంతస్థుకి తగిన పనికాదు. నేను మొద్దు రాచ్చిప్ప ననుకున్నారు కదూ! నేనూ అలోచిస్తానండీ!

    లోపం అంతా నాలోనే ఉందట కదా! నా లోపానికి మిమ్మల్ని బలిచేస్తానా? అవసరమయినప్పుడు మీకు మళ్ళీ పెళ్ళిచేస్తాను! అందుకోసం అవుసరమయిన ఈ ప్రపంచాన్నుంచి తప్పుకోవటానికి అయినా సిద్ధపడతాను.

    నన్ను తక్కువగా అంచనా వేయకండి" అంది గాయత్రి!

    అతడు ఈసారి ఆమె చేతుల్లో ముఖం దాచుకుని దుఃఖించాడు.

    "తమాషాకి కూడ ఆ మాట అనకు. పిల్లలు కలగరు. కారణం ఎవరు అనేది చర్చనీయాంశం కాదు. భార్యాభర్తలలో ఎవరు కారణమైనా ఒక్కటే!

    ఆ శిక్ష ఇద్దరూ సమంగా అనుభవించాలి గాయత్రి!

    ఇంకెప్పుడూ ఇలాంటి ప్రస్తావన తీసుకురానని నా చేతిలో చెయ్యివేసి చెప్పు! కాకపోతే నేనసలు పట్నం వెళ్ళను అన్నాడు.

    "అలాగే! మీరు యధావిధిగా మీ పనులు చూచుకోండి!" అంటూ అతని చేతులలో చేతులు వేసింది!

    నాలుగు చేతులు కలిశాయి. నాలుగు కళ్ళు కలిశాయి.

    రెండు శరీరాలు కలిశాయి. మనసులు రెండు ఒక్కటిగా అయాయి! తీరని దుఃఖాన్ని అనుభవించి బరువు మోయలేని వార్తలు తెలుసుకుని ఎంతో అలసిపోయి ఉన్నారు ఇద్దరూ! ఆ పరిష్వంగంలో కొంత అలసట తీరినట్లు అనిపించింది.

    తట్టుకోలేనివి జరుగుతాయి.

    భరించలేనివి వింటూంటాం. కాని మళ్ళీ గాయాలు మాన్పుకుని మామూలు జీవితంలోకి రాక తప్పదు. అనివార్యం అది. జీవిత ప్రవాహం అగనిది.

    మానవ జీవితం మరణంతో గాని ముగియదు.

    మిగిలిన వన్నీ మలుపులేకాని మజిలీలు కావు!

    గాయాలు మానిపోయి మచ్చలు మిగులుతాయి. వచ్చిన మనస్తాపాలు తీరిపోయి జ్ఞాపకాలుగా చిరకాలం వెలుగుతాయి!

    కాలమే చెప్పగల జవాబులు కొన్ని ఉన్నాయి.

    కొద్దినెలలు జరిగాక గాయత్రి వాల్మీకి కొద్ది వరవడిలోకి వచ్చారు. జీవిత ప్రవాహ వేగాన్ని అందుకున్నారు. వాస్తవాలను స్వీకరించారు. వాటిని సమంగానే జీర్ణించుకోగలిగారు. పగలంతా ఇంటి మెయిన్ టెయినెన్స్ గ్రామాల ప్రజల వ్యవహారాలు చూచుకుంటూ తల్లి గదిలో వుంటుంది గాయత్రి! ఆ సమయమంతా ఆ జ్ఞాపకాలతో వుంటుంది. సాయంత్రం ఆరుగంటలయితే క్రమం తప్పకుండా వచ్చేస్తాడు వాల్మీకి!! తిరిగి ఉదయం ఎనిమిది గంటల వరకు అతనితోనే ప్రపంచం!
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS