ప్రశాంత్ తనకేసి అలా తినేసాలా చూడ్డం ఆమెకి ఇబ్బందిగా అనిపిస్తోంది.
కానీ నిస్సహాయంగా నిలబడిపోయింది. కారణం తను, తల్లి అతనిపైన ఆధారపడి జీవిస్తున్నారు.
ఇదివరలో ఎప్పుడూ ఇలా తనని శల్య పరీక్ష చేస్తున్నట్టు చూడలేదు ప్రశాంత్.
ఈ రోజు అతని చూపులే కొత్తగా వున్నాయి.
ఆడది మగాడి చూపునిబట్టి గ్రహిస్తుంది. వాడి మనసులో ఏమున్నదో!
ప్రశాంత్ అసలెందుకు వచ్చాడో?'ఈ నెలలో ఇచ్చే డబ్బుని వారం క్రితమే పంపించేశాడు.
ఇంకేం పనుంది?
అడిగే సాహసం చేయలేకపోతోంది.
అమ్మ వుంటే బాగుండేది?
చాలా ఇబ్బందిగా వుంది కామినీకి.
ప్రశాంత్ కిటికీ దగ్గరకి వెళ్ళి బయటికి చూసాడు.
ఆ ఇంటికి చివర వీధి మలుపుదగ్గర కారుని ఆపాడు.
కారు సందు చివర పార్క్ చేసి అక్కడనుంచి నడిచిరావడం అలవాటతనికి.
చీకటి పడింది. వీధి దీపాలు వెలిగాయి.
రోడ్డు పక్క మట్టిలో రెండు కుక్కలు ఆడుకొంటున్నాయి.
"పనేమన్నా వుందా?" మెల్లగా అడిగింది కామినీ. ప్రశాంత్ వెనక్కి తిరిగి నవ్వాడు.
"నిజం చెప్పాలంటే బోల్డు పనుంది. ఇంతకీ అమ్మ గుడికి వెళ్లి ఎంతసేపయ్యింది?" అడిగాడతను.
'అరగంట దాటింది" మెల్లగా చెప్పింది.
"రావడానికి ఇంకెంతసేపు అవుతుందో!"
"తెలీదు. గుడిలో భగవద్గీత చెప్పడానికి ఎవరో వచ్చారట. వినడానికి వెళ్లింది"
ప్రశాంత్ అదోలానవ్వాడు.
ఆ నవ్వు ఆమెకి వెగటుని కలిగించింది.
"పాపం పెద్దావిడ. ఈ వయసులో ఆమెకి ఇంతకంటే కాలక్షేపం ఏం కావాలి!"
అయినా నీకు తెలుసా?
ఇలా వయసొచ్చిన అమ్మాయిలకి, అమ్మమ్మల గుడులకీ, తీర్ద యాత్రలకీ వెళ్తేనే మనలాంటి వాళ్లకి లాభం?"
ఆమె విస్మయంగా చూసిందతనికేసి.
ఖచ్చితంగా అతను మనసులో ఏదో దౌర్బాగ్యపు ఆలోచన పెట్టుకుని అలా మాట్లాడుతున్నాడని కామినీ అనుకుంది.
"ఇందులో లాభం ఏముంది?"
కోపాన్ని అణుచుకొంటూ అంది కామిని.
ప్రశాంత్ నవ్వాడు.
"లాభం లేక ఏమిటంటావ్ కామినీ, వయసులో వున్న వాళ్లకి అడ్డుగా నట్టింట కూర్చుంటే ఇబ్బందిగా వుండదూ!
ఏమాటకామాట. వయసులో వున్న అమ్మాయివి. నాలాంటి వాళ్లతో కాస్త హాపీగా మాట్లాడుకోవడానికి అవకాశం దొరకాలి కదా!"
కామినీ నొసట్లు చిట్లించింది.
"నాకు అలాంటి సరదాలపైన కోరిక లేదులెండి."
"అలాని నువ్వనుకొంటే సరికాదు కామినీ! మనసనేది వుంటుంది చూడు.
అది చాలా చెడ్డది.
ఎవరితో పడితే వాళ్లతో కాకపోయినా కనీసం నాలాంటి ఏ పబ్లిక్ ఫిగర్ తోనో అవకాశం వచ్చినప్పుడైనా ప్రైవసీ అనేది కావాలి కదా!"
అతని మాటలు ఆమెకి ముళ్లు గుచ్చుతున్నాయి. ఉద్రేకం వస్తోంది. అతన్ని బయటికి వెళ్ళిపొమ్మని చెప్పాలనిపిస్తోంది.
కానీ సంశయం.
ఎలా చెప్పగలదు?
పోషిస్తున్నవాడే.
"మాట్లాడవే?" అడిగాడు కొంచెం ముందుకు నడిచి వస్తూ.
కామినీ అడుగు వెనక్కి వేసింది.
"ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా పరాయి మగాళ్లతో చర్చించ వలసిన విషయాలు నాకేం లేవు"
ఆమెకి ఎంతో ఇబ్బందిగా వుంది అతనికి సమాధానాలు చెప్పడానికి.
అమ్మ వచ్చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంది.
అతను పైత్యంతో వాగుతున్నాడు.
ఏదోలా తనని లొంగదీసుకోవడానికి ఆట ప్రారంభించాడు.
అతని ప్రయత్నాన్ని సాగనివ్వకూడదు.
"నీకింకా కొత్త. మనం మాట్లాడాలనుకోవాలేగానీ ఎన్నో కొత్త విషయాలు వుంటాయి. "
"అవన్నీ నాకు అనవసరం" ఆమె నవ్వడానికి ప్రయత్నించింది. ఆ మాటలని సాధ్యమైనంత సౌమ్యంగానే అన్నది కూడా.
"అనవసరం అనుకుంటే ఎలా, చాలా ఉపయోగపడతాయి. అనుభవం లేక అలా అంటున్నావు.
కామినీ అర్దం చేసుకుంది.
మాటమీద మాట అనవసరంగా పెరుగుతోంది.
