"ఏం బాబూ? చూస్తే కాలాలు ఏం బాగాలేవు. ఎప్పుడు అనుకొన్నవి అప్పుడు అయిపోవలసిందే. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు?"
"మీరెప్పుడంటే అప్పుడే, ఈ క్షణంలో నేను సిద్దం"
"అయితే రేపు బ్రాహ్మణ్ని పిలిపించి లగ్నం పెట్టిస్తాను. రామాలయంలో మీ పెళ్ళికి ఏర్పాట్లు చేయిస్తాను."
"మంచిదండీ?"
అనుకొన్నట్టుగానే మరునాడు లగ్నం నిర్ణయం అయింది. నాటికి అయిదురోజులుంది వాళ్ళ వివాహం.
గిరిధర్ ఆ సంతోషంలో పారును తనతో సినిమాకు పంపమని అడిగాడు.
"పెళ్ళికిముందు ఇలాంటి తతంగాలు నడవడం నాకు నచ్చదు బాబూ! స్త్రీ పురుషులు కలిసి తిరగడంలో తప్పేముందని ఈనాటి యువతరం వాదం.? కాని. అది మంచిపద్దతి అని నేననుకోను. వయసు ఎంతటి వివేకినైనా వంచించి ఎన్ని చెడ్డపనులైనా చేయిస్తుంది. ఆపిల్ల నా కూతురు కాకపోయినా, బంధువులపిల్ల కాకపోయినా జరిగే మంచి చెడ్డలకు బాధ్యత వహించాల్సింది నేనే."
"ఎవరినో నాతో సినిమాకు పంపమంటున్నానా నాకు కాబోయే భార్యనే నాతో పంపమంటున్నాను" కొంచెం కోపం తెచ్చుకున్నాడు గిరిధర్.
"ఏదీ అయ్యేదాకా నమ్మకంలేదు."
"మీ కలా అయిందని అన్నీ అలా అనుకోవలసిందేనా?"
"అయినా జాగ్రత్త అనేది అవసరం?"
"మీకు నా మీద నమ్మకం లేదా? మా అమ్మ నాన్నకు ఇష్టం లేకపోయినా నేనీ పెళ్ళికి అంగీకరించినప్పుడు ఈ పెళ్ళి జరగదని ఎలా అనుకొంటున్నారు?"
"మీ అమ్మనాన్నకు ఇష్టం లేదు కాబట్టే, ఈ పెళ్ళి రహస్యంగా జరుగుతూంది కాబట్టే."
"ఎవరడ్డం వచ్చినా మా పెళ్ళి ఆగదు. మీరలా భయపడాల్సిన అవసరంలేదు. సరదాగా అలా చూసివస్తాం, అయినా పారుకు నేనేమైనా కొత్తా?"
"అయితే నీ ఇష్టం! పారు వస్తానంటే తీసుకెళ్ళు."
"అమ్మమ్మ! మీరు చెప్పందే ఆ పిల్లరాదు."
"నువ్వు బలవంతం చేస్తున్నావు కాబట్టి పారును నీతో సినిమాకు పంపడానికి అంగీకరిస్తున్నాను!" కోమలమ్మ హుందాగా నవ్వింది.
పారిజాతను పిలిచి ఈ సంగతి చెప్పి వెళ్ళమంది. ఆ పిల్ల తల అడ్డంగా ఊపి తన అయిష్టాన్ని వ్యక్తం చేసింది.
"వెళ్ళు పారూ! గిరిధర్ నొచ్చుకుంటాడు. కాబోయే మొగుడికి కోపం తెప్పించకూడదు!"
కోమలమ్మ బలవంతంతో గిరిధర్ తో బయల్దేరింది పారిజాత.
కార్నర్ లో గిరిధర్ రిక్షా బేరమాడుతోంటే పారిజాత వారించింది "రిక్షాలో వద్దు నడిచి వెడదాం."
"భలే దానివే ఈ ప్రక్కనే ఉందనుకొన్నావా?" రిక్షా బేరమాడి "ఎక్కు" అన్నాడు.
పారిజాత ఓ పక్కకు ఒదిగి కూర్చొన్నా అతడిని తాకకుండా కూర్చోలేక పోయింది. ఆ పిల్లకు ఎదోలా కంపరంగా ఉంది అతడి స్పర్శ. కాని, తనను తనే తిట్టుకొంది. జీవితాంతం ఇతడితో గడపవలసిందే కదా? ఇలా అసహ్యించుకొంటే అతడితో కాపురం ఎలా చేస్తాను? అనుకొంది.
గిరిధర్ ముఖం ఎందుకో సీరియస్ గా తయారైంది.
"మనోహర్ తో సినిమాలకూ, షికార్లకూ వెళ్ళేదానివటగా? అతడిలో కలిగిన ఆకర్షణ నాలో కలగలేదన్నమాటేగా?"
పారిజాత ముఖం వెలవెల బోయింది.
"అతడితో తిరగడానికి లేని సిగ్గు నాతో రావడానికి వచ్చిందా" ఎత్తి పొడిచాడు. "ఆ ముసల్ది ఎంత ఉపన్యాసం ఇచ్చింది నిన్ను నాతో పంపమంటే? ఆవిడ కొడుకు సంగతీ, నీ సంగతీ ఎవరికి తెలియదనుకొందో? ఆ ఉపన్యాసమంతా తన కొడుక్కిచ్చుకోకూడదూ?"
"అన్నీ తెలిసిన వాడివి నన్ను పెళ్ళెందుకు చేసుకొంటున్నావు గిరిధర్?" చురుగ్గా ప్రశ్నించింది పారిజాత.
"నువ్వు ఎలాంటి దానివలైతే నాకేమిటి? దానితో నాకేమీ సంబంధం లేదు. నేను నిన్ను చూసి చేసుకోవడం లేదు. నీ సౌందర్యం చూసి చేసుకొంటున్నాను. వెల కట్టలేని అందం నీది" అతడి నవ్వు ఎలాగో ఉంది.
అతడి నుండి వెలువడిన తన సౌందర్య ప్రశంస పారిజాతకు పులకింప జేయలేదు సరికదా జుగుప్సతో నింపివేసింది. అతడి చూపులూ, మాటలూ వెగటుగా ఉన్నాయి. రిక్షాదూకి పారిపోదామనిపిస్తోంది.
