Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 49

    "అబ్బ! విసిగించక అడగదలచుకున్నది  అడుగు సరోజా" అన్నారు.

    "మీకు కొంతకాలం  మతిభ్రమించిందని  అంటారు. నిజమేనా?" అని అడిగాను.

    "ఆఁ. కొంతవరకూ నిజమే. కానీ  మరీ పిచ్చి వాణ్నయిపోయానని చెప్పడానికిలేదు. మొట్టమొదటిసారి  విదేశీ యాత్ర  ముగించుకొని  జన్మభూమి  మీద కాలు  పెట్టానోలేదో  అన్ని దిక్కులనుండి  ఆంధ్రదేశం నామీద దండయాత్ర చేసింది.

    అవి 1955వ సంవత్సరం ఎలక్షన్ రోజులు. నేను కమ్యూనిస్టుపార్టీ  తరపున  ప్రచారానికి  బయలుదేరాను. పెట్టుబడిదారీ  పత్రికలన్నీ  నామీద  తమ విద్వేషాగ్నిని  కురిపించాయి. ఒక్క విశాలాంధ్ర పత్రిక  మాత్రమే నన్ను మొదటినుండి  సమర్ధిస్తూ వచ్చింది.

    ఆనాటి ఎన్నికల  సమయంలో  ఒక అమ్మాయి  నేను 'కుక్క చావు ఛస్తాన'ని  రాసిన  ఉత్తరం కూడా  ప్రచురణ గౌరవం పొందింది.

    'ఎందుకిలా  రాశావ'ని  ఒకరడిగితే' శ్రీశ్రీని  తిడితే  పత్రికలో  తన పేరు పడుతుంద'ని రాసిందట. అంతేగానీ నేనెవరో  ఆమెకి ముక్కూ మొహం కూడా తెలీదుట.

    ఈ గాలిదుమారాల మధ్య ఎన్నికల ప్రచారం ఉధృతంగా  సాగుతున్నప్పుడు  నాకు మతి భ్రమించిపోయింది.

    విజయవాడ నుంచి  ఎవరు ఎలాగ నన్ను మద్రాసు చేర్పించారో  తెలీదు. కానీ మద్రాసు చేరుకున్నాను. మద్రాసులో ఆరుద్ర  నన్నొక మెంటల్ క్లినిక్ లో ప్రవేశపెట్టాడట.

    విజయవాడలో పోయిన  స్మారకం అయిదారు  వారాల దాకా తిరిగి రాలేదు.

    ఆ మధ్య కాలంలో  ఏమయిందో  నాకు స్పృహలేదు. తర్వాత కొన్నాళ్ళకు  మద్రాసులో డాక్టర్ ధైర్యం  క్లినిక్ లో నా గది తలుపు  తాళం తీస్తూ  ఒక వార్డ్ బోయ్ 'నేనెవరినో  తెలుసా? పోలీసు వాడిని' అని అనడంతో  మళ్ళీ నా మనసు తేరుకుంది" అని చెప్పారు. "ఇంతకూ  మీరు ప్రచారానికెళ్ళిన  పార్టీ గెలిచిందా  లేదా" అని అడిగాను. "చిత్తుగా  ఓడిపోయిందని  పత్రికల ద్వారా  తెలిసింది. మొదటిరోజు గూడూరు ఎలక్షన్ సభలో  ఒక సంఘటన జరిగింది.

    అదే నా మనస్సుని ప్రగాఢంగా చీకాకు పరచింది.

    గూడూరు రైల్వే స్టేషన్  ఎదుట  మైదానంలో  ఎన్నికల సభ  ప్రారంభమవుతూండగా వెనుకవైపు నుండి రాళ్ళు  రువ్వడం  మొదలైంది. సభ పూర్తి కావడానికి ముందు వేదిక వెనుక  భాగాన్ని కాపాడుతున్న వాలంటీర్లలో  ఒకతని  తలను పగలగొట్టడం  జరిగింది.

    రక్తం  కారుతున్న  ఆ యువకుని  తలకి కట్టు కట్టడం  చూసాను. అహింసా భావాలకు అలవాటుపడిన నా మనస్సు ఈ కఠోర దృశ్యాన్ని సహించలేకపోయింది. ఆ నిమిషం  నుండే  ప్రారంభమయ్యింది. నాలోని చిత్త చాంచల్యం.

    అక్కడ ప్రారంభమయ్యింది, హనుమాన్ జంక్షన్ దగ్గర పరాకాష్టనందుకుంది.

    లక్షమంది ప్రేక్షకుల ముందు  ఉపన్యాసించాను. అప్పట్లో  నాకున్న ఉపన్యాసధోరణి అంతంత మాత్రమే.

    ఎలక్షన్ ఫలితాలను తారుమారు  చెయ్యడం  కోసం  పని  కట్టుకొన్న  వాళ్ళందరిమీద  నా అక్కసంతా  వెలిబుచ్చి తీవ్రంగా  విరుచుకుపడ్డాను. మిత్రుడు వల్లం  నరసింహారావు నన్ను  అహోరాత్రులు కనిపెట్టుకొని  తిరిగాడు.

    సభల్లో  ఉపన్యసించే  ఓపిక  పోయింది. అక్కడ నుండి  నరసింహారావు విజయవాడకి  చేరిస్తే, ఒకనాటి  అర్దరాత్రి బయలుదేరుతున్న  ట్రక్కుమీద  నన్ను  అనిపెట్టి సుబ్బారావు మద్రాసుకి చేర్చాడట" అని కొనసాగించారు.  
   

                                   కొంపెల్ల  జనార్ధనరావు


    "నా మీద చేతబడి ప్రయోగాలు  జరిగినట్లు  పుకార్లు  బయలుదేరాయి. నేనొక రకమైన యోగ నిద్రలో  మునిగిపోయాను. ఇది మూడోసారి నేను మృత్యువుతో జరిపిన యుద్ధం. ఈసారి కూడా  నాదే గెలుపైంది. ఈ మూడోసారి నన్ను రక్షించింది డాక్టర్ ధైర్యం" అని  చెప్పారు శ్రీశ్రీగారు.

    "ఇది ఎప్పుడు జరిగిందండీ" అని అడిగాను.

    "నలభై అయిదవ ఏట" అని చెప్పారు.

    "అంటే నేను మీ దగ్గర ప్రవేశించడానికి  ఏడాదో, ఏడాదిన్నర  ముందో నన్నమాట" అన్నాను.

    "1955వ సంవత్సరం  మొదటిలోనే  ఈ గొడవలన్నీ" అన్నారు.

    "ఏవండీ. ఇంకో విషయం అడగనా?" అన్నాను.

    "ఇప్పుడా?" అన్నారు.

    "ఏం. మీకు నిద్ర వస్తోందా?" అని అడిగాను.

    "లేదనుకో" అన్నారు.

    "టైమెంతయ్యింది  చెప్పండి" అని అడిగాను.

    "చూసుకో" అని చేతికున్న  వాచీ చూపించారు.

    "మూడున్నర  అవుతోంది" అన్నాను.

    "సరే. ఏమిటి అడగదల్చుకున్నావో  అడుగు" అన్నారు.

    "మీకంత కీర్తినార్జించి పెట్టిన  మహా ప్రస్థానాన్ని కొంపెల్ల జనార్ధనరావు గారికే అంకితం ఇవ్వడానికి కారణం ఏమిటండీ. ఆయన మీకంత  ఇష్టమైన మిత్రులా? ఆ విషయం చెబుదురూ. టైం పాసవుతుంది" అన్నాను.

    "కొంపెల్ల జనార్ధనరావుతో  నాకు మొట్టమొదటిసారి 1928వ సంవత్సరం మద్రాసులో  తంబుచెట్టి వీధిలో పరిచయమయ్యింది. ఆ ఏడే కొత్తగా నేను చదువుకోసం  మద్రాసులో అడుగు పెట్టాను. మా నాన్న నన్ను హాస్టల్ లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS