Previous Page Next Page 
కావేరి పేజి 49

    ఇంక అందరూ తననూ, తన కొడుకునీ ఎందుకూ కొరగానివాళ్ళుగానే చూస్తారనిపించింది. సుబ్బులు బజారునపడకుండానే సుబ్బులుని ఓదార్చుకోవాలనిపించింది.

    తన మానాన తను లోపల పడుకుంటున్నది. బయటికివెళ్ళిన కొడుకు ఎప్పటికి వస్తున్నాడో ఇప్పటివరకూ తను గమనించలేదు.

    పనివుంటేనే పొలం వెళ్ళేవాడు! ఇప్పుడలాకాదు! పనిలేకపోయినా పొలంలోనే మధ్యాహ్నంవరకూ వుండి ఆ తరువాత ఇంటికి వస్తాడు. బావి దగ్గిరే నీళ్ళని చేదుకుని స్నానంచేసివచ్చి-

    "అమ్మా! అన్నంపెట్టు!"

    అని అడగగానే తను అలవాటుప్రకారం గబగబావచ్చి అన్నం వడ్డించేది. కొడుకు తినివెళ్ళి పోయినతరువాత తనూ, కోడలు తినేవారు. తింటున్నంతసేపూ సుబ్బులుకి ఎన్నో విషయాలు హితబోదలుగా చెప్పేది...అన్నీవిని "ఊఁ.." కొట్టేదిగాని ఎదురు సమాధానం ఇచ్చేది కాదు!

    తన మేనకోడలు కావేరీ కంటే కూడా సుబ్బులు ఎంతో మంచిదన్న అభిప్రాయం కలిగింది కామాక్షమ్మకి.

    కోడలికి తనే తల దువ్వి జడవేసేది. పెరటిలో పూచిన పూలన్నీ మాలకట్టి జడలో పెట్టేది. కాటుక ఎక్కువగా పెట్టుకో కూడదని, సన్నగా పెట్టుకోవాలని, ఎలాగో తను పెట్టి చూపించేది. తన పట్టు చీరలన్నీ సుబ్బులుకి ఇచ్చేసింది. అప్పుడే తన మనసులోని మాటను కూడా బైట పెట్టింది సుబ్బులు!

    "కావేరీకి వడ్డాణం! ఆరు జతల గాజులూ, పదిహేను కాసుల పెద్ద గొలుసూ పెట్టారట. మరి నాకెందుకు పెట్టలేదు అత్తయ్యా!"

    "అలాంటి పెద్ద వస్తువులు యింక లేవమ్మా! వినాయకం ముచ్చట పడుతున్నాడని నా వస్తువులన్నీ పెట్టాను. అదలా చేసింది. ప్రత్యేకించి పెట్టగలంత సంతోషంగా జరగలేదుగా ఈ పెళ్ళి? అయినా యివన్నీ నీకేగా సుబ్బులూ?"

    "మాటల్లోనే తప్ప అసలు నాకిక్కడ ఏమున్నది? మీ అబ్బాయి నాతో మాట్లాడతారా పెడతారా?"

    "చిన్నప్పటినుంచీ కావేరీ అంటే వినాయకానికి ప్రాణం! అదలా చేసిపోయిందన్న బాధతోనే వాడలా అయ్యాడు గాని నువ్వంటే ఇష్టంలేక కాదు!"

    "ఎడ మొహం పెడ ముఖంగా వుంటే నాకెలా వుంటుంది? నేను మా పుట్టింటికి వెళ్ళి అక్కడే వుంటాను. ఆ కావేరీని మరిచిపోయినప్పుడే నా దగ్గిరకు వస్తారులే?" అంటూ విసురుగా లేచింది.

    పెళ్ళి కానప్పుడూ రభస అయి, అయినా తరువాత కూడా రభస పడటం కామాక్షమ్మకి యిష్టంలేదు. అదీగాక వెంకయ్య సీతమ్మలు తొందరగా బైటపడే మనుష్యులూ.

    యిప్పటికే తనను గురించి నానా రకాలుగా చెప్పటం, కావేరీకి ఎంతో బంగారం పెట్టి తన కూతురికి సూత్రం గొలుసు నల్లపూసల గొలుసు తప్ప యింకేమీ పెట్టలేదని మేనకోడలికి ఎంతో బంగారం పెట్టిందని, ఆ వినాయకానికి బంగారంలాంటి తన బిడ్డను యివ్వటం ఇష్టం లేక పోయినా కామాక్షమ్మ బ్రతిమాలటంతో తప్పలేదని, అసలు మా సుబ్బులుని వప్పించేసరికి మాకు నెలరోజుల దీర్ఘ రోగంతో తీసుకుంటే కలిగే డీలా, నీరసం కలిగాయని.

    తననిష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించటాలు రాజమ్మ ద్వారా విన్న కామాక్షమ్మ నీరయిపోయేది.

    తను అడిగే సుబ్బులుని చేసుకున్నఃది. అది తన అవసరం! తన పరువు నిలబెట్టుకోవటానికే! వినాయకానికి అసలు ఇష్టం లేదు. సుబ్బులుని పెళ్ళి చేసుకోవటం. తనూ, శంకరం ఎన్నో విధాలుగా చెప్పి వప్పించేసరికి తెగ నీరసం కలిగింది.

    అలాగని తను ఎవరికీ విమర్సించుతూ చెప్పుకోలేదుగా? అందుకే సీతమ్మ నోరు పెద్దదయి పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. ఇప్పుడు సుబ్బులు కూడా పుట్టింటికి వెళ్ళిపోతే యింక ఆ తల్లీ తండ్రీ రోడ్డునే పడతారు....ఇప్పుడు సుబ్బులుని ఆపటం ఎలాగన్న సమస్య కలిగింది. వేటిని చూస్తే ఆడదాని నోరు మూత పడటం! అలుకమానటం చేస్తుందో? యిప్పుడు అంతకంటే మరో మార్గం లేదు తనకి! తనకేమీ లేకపోయినా ఫరవాలేదు! సుబ్బులు ఈ యింటి గడప దాటి వెళ్ళకూడదు.

    అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి తన బొడ్లోనే అంటి పెత్తుకుని వున్న తాళాల గుత్తిని సుబ్బులు చేతిలో వుంచి అంది.

    "బీరువాలో కొద్దొ గొప్పో వస్తువులు వున్నాయి. నీకేం కావాలో తీసుకుని పెట్టుకో సుబ్బులూ....నువ్వు సంతోషంగా వుండటమే నాకు కావలసింది. వినాయకానికి నేను నచ్చ చెప్పుతాను. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళనవసరం లేదు."

    అనుకోకుండా తాళాలగుత్తి తన చేతిలో పడగానే ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది. అసలు పెత్తనం తన హస్తగతం చేసుకుంది. అంతకంటే కావలసింది ఏమున్నది? ఇంకా మిగిలింది తన భర్త వినాయకం! అతడిని తన గుప్పిటలో పెట్టుకోవటం ఏమంత సమస్యకాదు! అసలుకే సామ్రాజ్జిం అయినప్పుడు వినాయకం గొప్పా? అయినా తను తేలినట్లు కనిపించకూడదని అంది.

    "ఆ వస్తువులు ఏవో మీరే తీసి ఇవ్వకూదదూ?"

    "నీకు నచ్చినవి తీసుకో సుబ్బులూ?"

    అలాగాన్నా అంటే కొంత సంతృప్తి పడుతుందని కామాక్షమ్మ ఆశ!

    "తరువాత తీసుకుంటానులే!"

    అంటూ ఆ తాళాల గుత్తిని తిరిగి తనకి యిచ్చేస్తుందేమోననుకున్న కామాక్షమ్మ సుబ్బులు తన బొడ్డున దోపుకోవటం చూసి నిర్వీర్ణురాలయి పోయింది. ఇంక తన పెత్తనం, తన ఆయుధం అంతా కోడలి పరమయిపోయిందని బాధపడింది. ఆ తరువాత తనను తాను సమాధాన పర్చుకున్నది.

    "తన సొమ్ముని ఎవరికీ ఇవ్వదు సుబ్బులు! చాలా జాగ్రత్తగలది" అనుకుంది కామాక్షమ్మ. సుబ్బులు యింక అక్కడ వుండకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఎంతో గర్వంగా.

    ఆ రాత్రి వినాయకం వచ్చేవరకూ మెలుకువగా వుంది సుబ్బులు, ఎప్పటిలా తను నిద్రపోయినట్లు నటించింది. లైటు తీసేసి చీకటి చేసింది గదిని. బయట నుంచి వినాయకం రావటం, తల్లిని అన్నం పెట్టమని అడగటం, ఆ తరువాత పీట వాల్చిన శబ్దం వినిపించే సరికి ఎంతో కోపం వచ్చింది.

    "అమ్మా అన్నం పెట్టు!"

    అనే వినాయకం.

    "సుబ్బులూ అన్నం పెట్టు!"

    అనేలా చేయకపోతే యింక మిగిలిన పెత్తనంతో పాటు భర్తని కూడా తన అదుపులో వుంచుకుంటేనే తప్ప లాభం లేదు. తాళాల గుత్తి తన చేతికి వచ్చింది. యింక భర్త తన రెండు చేతుల్లోనూ యిముడ్చుకోవాలి! ఆ తరువాత గాని తన తడాఖా చూపించదు. అత్తగారెలాగూ తన చేతికి చిక్కిపోయింది. యింక మిగిలింది భర్త.

    కన్నీళ్ళతో కరిగించి ఆ తరువాత శిలలాగా మారిపోవచ్చును.

    అనుకుంటున్న సుబ్బులుకి తల్లీ కొడుకూ మాట్లాడుకోవటం అస్పష్టంగా వినిపించింది. తలుపు చాటున వుండి వినాలనిపించింది సుబ్బులుకి, "యిప్పుడే అంత అవసరం లేదులే!" అని తనకి తానే జవాబు చెప్పుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS