ఎప్పటిలా రాత్రిళ్ళు ఆలస్యంగా వస్తాడనే అత్తా కోడలు యిటీవల ఎనిమిది గంటలకే భోజనాలు ముగించుకుని ఎవరి పడకలనివాళ్ళు చేరుతున్నారు.
అలవాటు ప్రకారంగా వినాయకం గదిలోకి వచ్చి మూలనున్న చాప కోసం వెతుక్కోసాగాడు. ఆ చాప వుండవలసిన స్తానంలో లేదు. ఆటక మీద కనిపించింది.
సుబ్బులే పెట్టివుంటుంది! అనుకుంటూనే మంచంకి ఓ చివరగా పడుకుని వున్న భార్యవైపుకి చూశాడు.
కళ్ళు మూసుకుని గాఢ నిద్ర నటించుతున్నదని వినాయకానికి తెలియదు. ఈ చివరగా మంచం పట్టె మీద నిలబడి అందుకోవచ్చుననుకుని నెమ్మదిగా మంచంఎక్కి మునివేళ్ళమీద నిలబడి అటకమీద చాపక్రిందకి తోయటం,బాలెన్సు తప్పి తను వెనక్కి విరుచుకుని పడిపోవటం ఒక్కసారే జరిగాయి.
ఆ పడటంలో సుబ్బులు మీద పడ్డాడు. అలా పడతానికే మంచాన్ని గట్టిగా ఊపింది.
పడిన వినాయకాన్ని గట్టిగా వాటేసుకుని మరి కదలనివ్వలేదు.
"నన్ను వదులు!" గింజుకోసాగాడు వినాయకం.
"ఎంత కాలం నువ్వక్కడ? నేనిక్కడ?.." తన నల్లటి కాటుక కళ్ళతో గుచ్చి గుచ్చి చూస్తూ అడిగింది సుబ్బులు.
వినాయకం జవాబు యివ్వలేదు. సుబ్బులు వైపుకి చూడకుండానే లేచేందుకు ప్రయత్నించసాగాడు.
"అంటే? నేను పనికి రానప్పుడు నన్నెందుకు చేసుకున్నారు? ఆ పారిపోయిన కావేరితోనే నువ్వా పోకపోయావా? నా ప్రాణం తెరిపినపడేది. నిన్ను చేసుకునే అవసరం తప్పేది."
సుబ్బులు ఎత్తి పొడుపు మాటలు వినాయకానికి ముల్లులాగా గుచ్చుకున్నాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో ముఖం ఎర్ర వారింది. అది చూసిన సుబ్బులు తను తొందరపడి అన్నందుకు నాలుక కొరుక్కోసాగింది. తానిలా దేప్పుతుంటే వినాయకం తనతో కాపురం చేస్తాడా? బుజ్జగించి లాలించి తన వశం చేసుకోవాలి. ఆ విషయం అనుకుంటూనే తీరా ఆ సమయం వచ్చేసరికి మరిచిపోయి వాడిగా వేడిగా మాటలు వదిలేస్తున్నది.
"ఆ సంగతి వెళ్ళి మా అమ్మని అడుగు!"
అంటూ బలవంతంగా గుంజుకుని సుబ్బులు కౌగిలిలో నుంచి విడిపించుకుని చాప తీసుకుని గబా గబా బయటికి వచ్చేశాడు.
వరండాలో ఆ చివరగా నిలబడి వున్న తల్లిని చూసి ముందు తెల్లబోయాడు. ఆ తరువాత చాప పరుచుకున్నాడు. తల్లి ఈ వేళప్పుడు అక్కడ నిలబడి వుందేమిటి? ఈ సరికి పడుకుని వుండేది? చాప మీద పడుకున్నాడే గాని తలక్రించ దిండు సంగతి, పక్కకి దుప్పటిని మరిచిపోయి వచ్చాడు.
"వినాయకం."
తల్లి దగ్గిరకు వచ్చి పిలిచేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
"నువ్విక్కడ పడుకోకూడదు!"
"మాట్లాడలేదు!
"పెల్లయినవాడివి! భార్యతో సంతోషాలు పంచుకోవలసిన వాడివి! నువ్విలా సుబ్బులుకి దూరంగా వుంటే తనూ బాధపడుతుంది. అదీగాక లోకం నీమీద వేసిన నింద నిజం అనుకునేలా ప్రవర్తించుతున్నావు. అయిపోయినదేదో అయిపోయింది. సుబ్బులుతో నువ్వు కాపురం చేయాలి!..."
"అమ్మా!...కావేరీని నేనెలా మరువగలనమ్మా?"
"తప్పదు నాయనా?...లోకనిందకి భయపడి, యిప్పుడు తప్పితే నీకు ఆ తరువాత పెళ్ళి అయ్యే అవకాశం వుండదనే ఉద్దేశ్యంతో సుబ్బులుని నీకిచ్చి పెళ్ళిచేయవలసి వచ్చింది. యిష్టం లేకపోయినా సుబ్బులు మేడలో మూడు ముళ్ళూ వేశావు. కాబట్టి చేయక తప్పదు. ఈ చాపను చుట్టేసి వెళ్ళి గదిలో పడుకో! యిది నీ తల్లి ఆజ్ఞ!"
కామాక్షమ్మ యింక అక్కడ వుండకుండా లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్నది.
తల్లి చెప్పిన మాటలను గురించే ఆలోచించసాగాడు వినాయకం!
మనసుని ఎంత సరిపెట్టుకోవాలన్నా సరిపెట్టుకోలేకపోతున్నాడు. కావేరీని యింకా తన మనసులో నుంచి తొలగించుకోలేకపోతున్న ఈ సమయంలో సుబ్బులుతో తను!....యింక ఆపైన ఆలోచించలేకపోయాడు.
తనిమ్తగా కావేరిని గురించి బాధపడుతున్నాడు. మరి కావేరి తనను గురించి ఒక్క పిసరంతయినా ఆలోచించిందా? పెద్దల ఎదుట తామిద్దరినీ భార్యాభర్తలుగా చేయాలనుకుని లగ్నంపెట్టి, ఎంతో ఆడంబరంగా విందు భోజనాలు కూడా పెడితే యింకా పెళ్ళి నాలుగురోజులుందనగా బంగారం డబ్బూ మూట కట్టుకుని వెళ్ళిపోతుందా?....పోయేది యివన్నీ కాకముందే వెళ్ళవలసింది.
అంతలోనే మెరుపులాంటి ఆలోచన కలిగింది.
"ఇవన్నీ కాకముందు వెళ్ళితే డబ్బు ఎక్కడనుంచి వస్తుంది? బంగారం అంటూ లేదుగా?....బంగారాన్ని చూడగానే కావేరీకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశ్యం కలిగి వుంటుంది. వీటికోసమే కాబోలు తన ప్రయాణం పెట్టుకుంది. కనీసం తనను కూడా కాదని వెళ్ళిపోయినా దానికోసం తను పరితపించటం దేనికి?"
లోపలనుంచి సన్నగా ఏడుపు వినిపించేసరికి వినాయకంలోని ఆలోచనలు జ్ఞాపకాలు చెదిరిపోయాయి. లోపలికి తొంగిచూశాడు.
మంచం మధ్యలో కూర్చుని మోకాళ్ళ మధ్యలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి పడుతున్న సుబ్బులుని చూసేసరికి వినాయకం మనసు బరువెక్కిపోయింది. కావేరీమీద అప్పుడు కూడా కోపం రాలేదు! తల్లి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.....సుబ్బులుని ఓదార్చాలన్న తపన బయలుదేరింది వినాయకంలో!
ఇష్టం వున్నా లేకపోయినా తను చేసుకున్నందుకు సుబ్బులుకి న్యాయం చేకూర్చవలసిన బాధ్యత తనమీదనే వుంది! అలా తన మనసుని తనే సమాధాన పరచుకుని ఆ చాపని అక్కడే వదిలివేసి నెమ్మదిగా గదిలోకి వెళ్ళి తలుపులకి గడియపెట్టి నెమ్మదిగా సుబ్బులు వైపుకి రాసాగాడు. దగ్గిరవుతున్న కొలదీ సుబ్బులు ఏడుపుతోపాటు వెక్కిళ్ళు కూడా ఎక్కువ చేసింది.
దగ్గిరకు వచ్చి సుబ్బులుకి ఎదురుగా మంచంమీద కూర్చుని గెడ్డం పట్టుకుని పైకి లేపి అన్నాడు లాలనగ!
"ఇంకా నువ్వు కన్నీరుంచటానికి వీలులేదు! యిప్పటి వరకూ నీ మధ్యా నా మధ్యా వున్న దూరం యింక వుండదు!"
ఇదే అదను అనుకున్న సుబ్బులు అమాంతంగా వినాయకాన్ని కౌగిలించుకున్నది!....
23
సైకిల్ మీద వేగంగా వస్తున్న వినాయకం కొంతదూరం వచ్చి సైకిల్ ని ఆపాడు. ఒక కాలిని నేలమీద ఆన్చి వెనుతిరిగి చూశాడు, తన నెవరో పిలుస్తున్నట్టు వుండటంతో!
ఆ పిలిచేది నాగులు! స్కూటర్ కి ఆనుకుని మరీ నిలబడివున్నాడు. రెండువేళ్ళను వంచి నోటిలో పెట్టుకుని ఈలవేసి చెయ్యి ఊపాడువెనక్కి రమ్మనమని!
