Previous Page Next Page 
కావేరి పేజి 48

    "కొత్త తారలతో తీయబోయే నా పద్దెనిమిదవ చిత్రంలో నువ్వే హీరోయిన్ వి! యింక ఆ తరువాత వరుసగా తీయబోయే నా చిత్రాలలో నువ్వే హీరోయిన్ వి! ఒక్కొక్క సినిమాకి రెండు లక్షలు! నా కంపెనీ పర్మనెంట్ ఆర్టిస్టువుగా ఇకనుంచి నువ్వే!" అన్నాడు కావేరీని తన వడిలోకి తీసుకుంటూ!

    అడ్డుచెప్పలేదు కావేరి! కాని ఆమె మనసులో ఓ చిన్న సందేహం ఏర్పడింది. ఆపుకోలేక అడిగేసింది ఎంతో చనువుగా!

    "వెంకట్రావు చెప్పటం పన్నెండు పిక్చర్సు తీశారన్నాడు. మీరేమో నా పద్దెనిమిదవ చిత్రంలోనుంచి నువ్వే హీరోయిన్ వి అన్నారు?"

    "కొన్ని తమిళ మళయాళ పిక్చర్సుకూడా తీశాను. వాటిని లెక్క వేసుకుని వుండడు. ఇప్పటివరకూ జంతువులతో తీసి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ని అనిపించుకున్నాను. యికనుంచి నీలాంటి అందమయిన టీనేజ్ గర్ల్ ని హీరోయిన్ గా పెట్టి బ్రహ్మాండంగా పబ్లిసిటీ ఇప్పించి సినిమా మొదలుపెడతాను!"

    "ఎప్పటినుంచీ?" ఆత్రుతగా అడిగింది.

    "నువ్వు పరిచయం అయింది ఇప్పుడేగా? యిక ఆలోచించి ప్లాన్ చేస్తాను. ఈలోగా నిన్ను ఔట్ డోర్ షూటింగ్ లకి తీసుకెళతాను. కెమెరా అంటే భయంలేకుండా చేస్తాను! ఆ జయశీలకంటేకూడా గొప్పతారగా ఈ సినీప్రపంచం అసూయపడేటంతగా తీర్చిదిద్దుతాను. నీ బాగోగులు యింక నావే! రేపు సాయంత్రానికే కొత్తతార వెలిసింది....అన్న హెడ్డింగుతో అన్ని సినీపత్రికలు వ్రాసేస్తాయి చూడు! నీ దర్సనభాగ్యమే కరువయిందంటారు!"

    అంటూ ఫేడీల్ మంటూ నవ్వాడు. అలా వుండి వుండి నవ్వుతుంటే సన్నని వర్షపుతుంపరులులాగా నోటిలోనుంచి కారాకిళ్ళీ తాలూకా మిగిలి వున్న ఉమ్ము ఈ రూపేణాగా వెలువడడం భరించలేకపోతోంది. నల్లటి ఆ చేతులు ఉక్కు కడ్డీలుగా తన శరీరాన్ని ఏ వంపుకి ఆ వంపుకి వంచేయటం!

    భారీ శరీరంలో పిచ్చుకలాగా యిముడ్చుకోవటం ఎంతో ఆబగా, సుకుమారమయిన ఆ శరీరాన్ని ఆక్రమించుకోవటానికి లేనిశక్తిని పుంజుకునే ప్రయత్నంలో ఆయాసపడుతూ, ఆ భారీశరీరంక్రింద నల్లిలా నలిగి పోతున్నది కావేరి.

                              22

    బండి వెంకయ్యకూతురు సుబ్బలక్ష్మిని కామాక్షమ్మ తనకోదలిగా చేసుకున్నదన్న వార్త ఆ చుట్టుప్రక్కల గ్రామప్రజలకి చాలా ఆలస్యంగా తెలిసి ఎంతో విస్తుపోయారు.

    "వినాయకం ఆడంగివాడని, అందుకే ఆ అమ్మాయి తనకి ఈ మొగుడు వద్దని లేచి వెళ్ళిపోయిందని."

    పనిగట్టుకుని యింటింటికీవెళ్ళి ప్రచారంచేసి వచ్చిన వెంకయ్య యిప్పుడు తన కూతురిని యిచ్చి ఎలా వివాహంచేశాడో? ఎవరి ఊహకీ అందలేదు.

    తమ పిల్లని యివ్వాలని అనుకున్నవాళ్ళుకూడా వెంకయ్య చెప్పటంతో మనసు మార్చుకున్నవాళ్ళుసైతం ముక్కుమీద వేలువేసుకున్నారు. ఆ తరువతః ఎవరికివాళ్ళు ఆలోచించుకున్నారు.

    "ఎవరూ తమపిల్లని ఇవ్వకుండావుంటే తన కూతురినియిచ్చి చేయవచ్చునని వెంకయ్య పన్నిన పన్నాగం!"
అని అర్ధంచేసుకుని ఎంతో బాధపడ్డారు.

    విన్నమాటలుకంటే చెప్పుడుమాటలువింటే ఎంత నష్టమో అర్ధం చెసుకున్నవాళ్ళు వెంకయ్య పన్నిన పన్నాగం ఎంత స్వార్ధపూరితమయినదో గ్రహించి, ఈసారి ఏ అవసరానికయినా వెంకయ్య వస్తే ఏ విధంగా బుద్ది చెప్పాలనేది ఆలోచించుకుని వున్నారు ఎవరికివాళ్ళు!

    తను పన్నిన పన్నాగం పారినందుకు, తన కూతురు వినాయకం భార్య అయినందుకు ఎంతగానో ఆనందించాడు వెంకయ్య.

    ఇంకా తనకేమిటిలోటు? తను యింకెవ్వరిదగ్గిరకూ వెళ్లవలసిన అవసరంలేదు! కిరాయికి బండికూడా కట్టనవసరంలేదు! వినాయకంలాంటి ఆస్థిపరుడికి తన కూతురు భార్య అయినందుకు, కూతురుతోపాటు తనూ లక్షాధికారి అయినట్లుగానే భావించుకున్నాడు.

    అదీగాక తనచేత నయాపైసాకూడా కామాక్షమ్మ ఖర్చుచేయనీయలేదు. అలా మలిచాడు వాళ్ళ అవసరాలకి వారిని!

    ఆ యింటనే పెళ్ళిచేసి కూతురిని ఆ యింటనే వుంచేశాడు.

    కూతురికి చెప్పవలసిన లోపాయకారి విషయాలు, తీసుకోవలసిన జాగ్రత్తలూ, పెత్తనం ఏ విధంగా తన గుప్పిటలోకి తీసుకోవాలన్న కిటుకులు అన్నీ అడపాతడపా నూరిపోశారు ఆ తల్లిదండ్రులు!

    అసలే పెంకెది! దానికితోడు తల్లిదండ్రులు సూచించిన కిటుకులు, తన కళ్ళముంచే కావేరికి ఎన్నెన్నో కొనుక్కునివచ్చి ఇవ్వటం! ఇద్దరూ నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడుకోవటం లాంటివన్నీ చూసివున్న సుబ్బులు ఒకనాడు తనను కోడలిగా చేసుకోవటానికి నిరాకరించటమేకాక తన అంతస్తు ఏమిటో గుర్తుపెట్టుకోమన్న ఈ కామాక్షమ్మను ఏ విధంగా పరాభవించాలి?

    అన్న ఆలోచనతో వేగిపోతున్న సుబ్బులుకి వినాయకం తనతో అసలు మాట్లాడకపోవటం, ఎక్కడెక్కడో తిరిగి తిరిగి అర్దరాత్రికి ఇల్లు చేరటం, చాపా, దుప్పటి, దిండు తీసుకుని ముందు వరండాలోకివెళ్ళి పడుకోవటంతో మరింత అవమానకరంగా వుంది.

    తను నోరుచేసుకుని అరవకూడదు. మంచిమాటలుతోనే వినాయకాన్ని దారికితెచ్చుకోవాలని, అతను తనచేతికి చిక్కినతరువతహగాని ఆ తల్లీకొడుకుల భరతం పట్టను! అనుకునేది.

    ఎప్పటిలా వినాయకం వచ్చేసరికి నిద్రపోకుండా అలాగే కూర్చుని వుంది ఆ రోజురాత్రి తన పడకగదిలో!

    రోజులాగా తను నిద్రపోలేదు. నిద్రపోయినా తనను లేపుతాడన్న అభిప్రాయం వుండేది.

    అలా ఏరోజుకారోజు అనుకుంటూనే నిద్రపోయేది. తెల్లవారిన తరువాత చూసుకుంటే తను గదిలోని మంచంమీదను, వినాయకం వరండాలో పడుకున్నట్టుగా చాపా, దిండూ, దుప్పటీ వుండటంచూసి కోపం తెచ్చుకునేది.

    కాని యిది సమయంకాదని తనకోపాన్ని దిగమ్రింగుకునేది.

    మానసికంగా తనెంతో బాధపడుతున్నట్టు అందరికీ తెలియాలని చివ్వుమంటూ లోపలికి వెళ్ళిపోయేది సుబ్బులు!

    అదిచూసి కామాక్షమ్మ ఎంతో బాధపడేది.

    సుబ్బులు తనగదిలో గోడకి ఆనుకుని పమిటి చెంగుతో ముఖం దాచుకుని అత్తగారు వినాలని వెక్కి వెక్కి పడసాగింది.

    అదివిన్న కామాక్షమ్మ సుబ్బులుని ఏమని ఓదార్చగలదు?

    "కోడలినోరు పెద్దదని, అయినదానికీ, కానిదానికీ నోరు పారేసుకుంటుందని, అలాంటి పిల్లని కోడలిగా చేసుకుంటే గెలవగలవా?"

    అని యిరుగమ్మా, పొరుగమ్మా సుబ్బులుమీద ఎన్నో చెప్పారు. తను వారి మాటలు విన్నట్లయితే ఇంకీజన్మకి వినాయకానికి పెళ్ళి అయివుండేదికాదు! కొడుకు నిరాకరించినా తనలోతనే బాధపడటం మినహా తననుగానీ, తన కొడుకునుగానీ నిందించకపోవటంతో సుబ్బులుమీద ఎంతో సదభిప్రాయం కలిగింది.

    తనుకూడా చూస్తూ వూరుకుంటే నిజంగానే తన కొడుక్కి మొగతనం లేదని, పోట్లాడి పుట్టింటికి వెళ్ళిపోయిందంటే? అంతోయింతో మిగిలివున్న పరువుకాస్తా బజారున పడుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS