"మీరా అన్నావ్. నేను గాక మరెవరూ ఈ గదిలోకి రారు. పైగా భుజం మీద చేయి వేయరు. మీరా అంటే అర్ధం ఎవరో అనుకున్నాను మీరా అన్నట్లు లేదూ!" సతీదేవి చేయి పుచ్చుకుని మంచం దగ్గరకు తీసుకువెళుతూ రవ్వంత వ్యంగ్యంగా అన్నాడు మాధవ్ గురుదేవ్.
"పరధ్యానంగా ఆలోచిస్తూ మీరా అన్నా అంతే." సతీదేవి చెప్పింది.
"పరధ్యానంగ ఆలోచించే అవసరం ఏమొచ్చింది."
"ఏదో మామూలు విషయమే."
"మామూలు విషయం ఆలోచిస్తూ పరధ్యానంలో పడతారా?"
"ఎందుకు నన్నిలా మాటలతో వేధిస్తారు మీరాకకోసం ఎదురుచూస్తూ వున్నాను"
"ఏమిటి విశేషం ఈరోజు రతీదేవిలాగా అలంకరించుకున్నావు చిలకా."
"మర్చి పోయారా"
"ఏమిటి మర్చి పోవటం."
"మీరు మీరేనా!"
"నీకెన్నో సార్లు చెప్పాను. అదేం మాట అసలు నీఉద్దేశ్యం ఏమిటి?" మాధవ్ గురుదేవ్ కోపంతో సతీదేవి భుజం పట్టుకుని బలంగ వూపుతూ అడిగాడు.
"నా పుట్టింరోజు నాకన్నా మీకేబాగా గుర్తువుంటుంది కదా! ఈ రోజు పుట్టింరోజు అంటే క్రితం రోజునుంచే పాట మొదలు పెట్టేవారు. రేపే అమ్మాయి పుట్టేది, ఆ అమ్మాయే నా పెళ్ళాం అయేది వుళవుళ హాయీ అనేవారు మర్చిపోయారా" సతీదేవి నవ్వుతూ అడిగింది.
సతీదేవి భుజాన్ని గట్టిగ పట్టుకున్న మాధవగురుదేవు చెయ్యి అప్రయత్నంగా జారిపోయింది.
"ఓహ్ ఈరోజు నీ పుట్టిన రోజుకదూ! నాతలకి దెబ్బ తగిలిన దగ్గరనుంచీ వెధవ మతిమరుపు పట్టుకుంది. ప్రతిదానికీ విసుగు కోపంకూడా ఎక్కువ అయ్యాయి" అంటూ బాధతో తల పట్టుకున్నాడు మాధవ్ గురుదేవ్.
"మీరలా బాధ పడవద్దు" సతీదేవి అంది.
"నేను బాధపడటం కాదు నిన్ను బాధపెడుతున్నాను, అదే నాబాధ"
"ఈరోజు నాకోసం బాధ పడకూడదు"
"అవును బాధపడకూడదు. నీపుట్టిం రోజు కూడాను"
"అయితే నవ్వండి"
మాధవ్ గురుదేవ్ నవ్వాడు. సతీదేవి రెండు భుజాల మీదచేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు "ఈరోజు నీవు ఎలా వున్నావో తెలుసా, రతీదేవిలా వున్నావు. ఈరాత్రి నిన్ను నిద్రపోనీయను." అన్నాడు.
"మీకు తెలియని ఒకరహస్యం, మీకు తెలియని ఒక సత్యం, మీరు వూహించని ఓ నిజం చెప్పనా!" సతీదేవి నవ్వుతూ అంది.
"ఏమిటది?"
"ఈ రాతఃరికి నేను నిద్రపోవడం లేదు."
"అదేమి!" మాధవ్ గురుదేవ్ నొసలు ముడేసి అనుమానంగా అడిగాడు.
"ఇంతకు ముందు మీరేగా ఈ రాత్రి అంతానిద్రపోనీయనని చెప్పారు. యింకెలా నిద్రపోతాను!" కిలకిల నవ్వుతూ అంది సతీదేవి.
మాధవ్ గురుదేవ్ నవ్వాడు "నా పాఠం నాకే అప్పగించావ్!" అన్నాడు.
"నను మరీ అంత తీసిపారేయకండి." అంది సతీదేవి. మాధవ్ గురుదేవ్ చేయి సతీదేవి పమిట మీదకి పోయింది.
"ఒక్కసారి ఆగండి."
"ఎందుకు!"
"చెపుతాగా!" అంటూ సతీదేవి మంచం దిగివెళ్ళి బాదం ఘీర్ కప్పునిండా తీసుకుని వచ్చింది.
"ఇదేమిటి?"
"బాదం పప్పులతో చేసిన స్పెషల్ స్వీట్. తాగటానికి చాలా రుచిగా వుంటుంది. పైగా... ...
"పైగా ఊ...ఏమిటి!"
మాధవ్ గురుదేవ్ చేతికి బాదం ఘీర్ వున్న వెండికప్పుని అందించి చెవిలో చెప్పింది. "మీరు...అలసి పోకుండా... ... ఇది నాలుగు చుక్కలు తాగితే...మీకు...అలా అన్నమాట..."
మాధవ్ గురుదేవ్ నరాలు జివ్వున లాగాయి. వాహ్ వాహ్ అని ఫక్కున నవ్వాడు. రెండు గుక్కల్లో కప్పు బాదంఘీర్ తాగేశాడు. "ఇదీ నేను కోరింది. మైనం ముద్దని కాదు, మన్ను తిన్న పాముని కాదు. నన్ను కవ్వించాలి. నాకు ఎదురు సూచనలు యిస్తుండాలి. అది యివాళ నీలో చూడబోతున్నాను ..." అన్నాడు ఆనందంగా.
సతీదేవి కప్పు అవతల పెట్టి వచ్చింది.
"ఏంటి అక్కడే నుంచుని ఆలోచిస్తావ్! రా సతీదేవి!" చేతులు చాచి ఆహ్వానించాడు మాధవ్ గురుదేవ్.
చేత్తో పొట్టని నొక్కుకుంటూ "రెండు నిమిషాలు' కడుపులో యిదిగా వుంది వెళ్ళి వస్తాను." అంటూ సతీదేవి అవతలికి వెళ్ళింది.
మాధవ్ గురుదేవ్ రాత్రి గురించి మధురంగా వూహిస్తూ తలకింద రెండుచేతులు పెట్టుకుని కాళ్ళాడిస్తూ మంచం మీద వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాడు.
అయిదు నిమిషాల తర్వాత.
సతీదేవి వచ్చింది. మాధవ్ గురుదేవ్ ని పిలిచింది. అతను లేవలేదు. మంచం మీద కూర్చుని మాధవ్ గురుదేవ్ ని కుదుపుతూ "ఏమండి! లేవండి అప్పుడే నిద్ర పోతున్నారా!" అంది. అతనులేవలేదు గిల్లిచూసింది. అయినా లేవలేదు.
