Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 48


    "నాన్నగారు ఇంట్లో వున్నారా?" భయపడుతూనే అడిగింది అనూష.
    "నాన్నగారి గురించి అడుగుతున్నావు. ఉన్నట్టుండి తండ్రిమీద నీకెప్పుడు ప్రేమ పుట్టిందే?" అంది నిష్ఠూరంగా ఉమాదేవి.
    అక్కకు తన జీవితం మోడుబారిపోయినా కన్నతండ్రి పట్ల ప్రేమాభిమాలు ఏమాత్రం తగ్గలేదనుకుంది అనూష.
    "నాన్నగారి మీద నాకెప్పుడూ గౌరవమే ఉంది. ఎటొచ్చీ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావు. నా బాధ అంతా ఎవరి జీవితం వాళ్ళు తీర్చిదిద్దుకునే వయస్సు వచ్చినప్పుడు ఆయన మన అభిరుచులను తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారనే! అంతవరకే నా వ్యతిరేకత. అయినా, నేను తీసుకున్న నిర్ణయం తప్పంటావా అక్కా?"
    ఉమ మౌనంగా ఉండిపోయింది. చాలాకాలం తరువాత చెల్లి ఇంటికి వచ్చింది. ఆమెతో మళ్ళీ గతాన్ని గురించి తర్కించడం వలన మనస్తాపానికి గురికావడమే తప్ప ప్రయోజనం ఏమీ లేదనిపించింది.
    ఆమెనుంచి వెంటనే సమాధానం రాకపోవడంతో_ "అక్కా! నేను తీసుకున్న నిర్ణయం తప్పంటావా?" రెట్టిస్తూ అడిగింది అనూష.
    "జన్మనిచ్చిన తండ్రికి మన మంచి చెడ్డలు తెలియవా? ఆయనకు ఉన్న అనుభవంలో తమ తెలివితేటలు, ఆలోచనలు ఏపాటివి? ఇక నువ్వు చేసిన పని తప్పో, ఒప్పో నువ్వే ఆలోచించుకోవే అనూషా!"
    అక్క తనను చూసి ఈర్ష్యపడుతుందనీ, తన జీవితాన్ని చక్కదిద్దుకోలేనందుకు సిగ్గుపడుతుందనీ అనుకుంది. కానీ తననే వేలెత్తి చూపుతుందనుకోలేదు అనూష.
    "నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుందే, అనూషా! నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోకపోవడం కూడా ఆత్మవంచనే అవుతుంది. తెలుసా?" అంది ఉమ వ్యంగ్య ధోరణిలో.
    "నేను తీసుకున్న నిర్ణయం తప్పయినా, ఒప్పయినా ప్రస్తుతం నేను మాత్రం క్షేమంగా వున్నాను. సుఖంగానే జీవిస్తున్నానే! మనిషికి వ్యక్తిత్వాన్ని మించిన అలంకారం ఏముంది?" అంది ఆత్మస్థయిర్యంతో అనూష.
    "పిచ్చిపిల్లా! ఎదుటివాళ్ళంతా కష్టాల్లో ఉన్నారనుకోవడం పొరపాటు. నేనిప్పుడు ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పినా, నువ్వు భ్రాంతిలో ఉన్నంతకాలం అవి నీకు రుచించకపోవచ్చు!" అంది ఉమ పెద్దరికంతో.
    "అక్కా! నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. భర్తను వదిలేసిన స్త్రీగా నీకు ఈ సమాజంలో ఎంత ఆదరణ ఉందో! పుట్టింటిలో వంటలక్కపని చేయడానికి నీ మనసుకు ఎలా ఉందోగాని, నాకు మాత్రం..."
    "ఆపవే! ఆపు!" మధ్యలోనే అడ్డుపడింది ఉమ.
    "మనిషి జీవితాన్ని మనిషే శాసించడం కష్టమే! అదే జరిగితే మనిషి ఇన్ని సమస్యలను ఎదుర్కోవలసిన పని ఉండదేమో!" తను చెప్పదలచుకున్నదేదో సూటిగానే చెప్పింది ఉమ.
    "అక్కా! ఇప్పుడు నాకేం సమస్యలు ఉన్నాయంటావు? నా జీవితాన్ని నేను శాసించుకున్నాను. నా గమ్యం నేను చేరుకుంటున్నాను. ఎవరన్నా కాదనగలరా?"
    "పిచ్చిపిల్లా! సుఖంగా ఉన్నామనుకున్నంతకాలం సుఖంగానే ఉండొచ్చు. ఎటొచ్చీ కష్టాలు పడుతూ కూడా సుఖంగా ఉన్నామనుకోవడం ఆత్మవంచనే అవుతుంది. అసలు మనందరి జీవితాలను ఆడించే శక్తి ఒకటి ఉంటుందని మరచిపోవద్దు."
    "ఆ శక్తే ఉంటే, నీ జీవితం అడవికాచిన వెన్నెల్లా ఎందుకు మోడువారిపోతుందే? నీ కాపురాన్ని చక్కబరచలేని నాన్నగారి పెద్దరికమూ ఓ పెద్దరికమేనా?" ఎత్తిపొడుస్తూ అంది అనూష.
    "పిచ్చిదానా! నాకేమి లోటే? నాకు అన్నీ ఉన్నాయి. నేను సుఖంగానే ఉన్నాను. అయినా నువ్వు మా సుఖసంతోషాల గురించి ఆలోచించే దానివైతే, ఇన్నాళ్ళూ ఈ ఇంటివైపు కన్నెత్తి చూడకుండా ఎలా వున్నావే?"
    సంభాషణ కొనసాగుతూండగానే బయట కారు హారన్ మోగింది.
    ఉమ హడావుడిగా బయటకు పరుగెత్తింది.
    తండ్రి వచ్చివుంటాడన్న అనుమానంతో తలుపు పక్కగా నిలిచి తొంగి చూసింది అనూష.
    తన ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసిన అనూష ముఖంలో రంగులు మారాయి.
    సాయంత్రం సినిమాకు వెళ్ళడానికి తయారై వుండమని గుర్తుచేయడానికే అతను వచ్చినట్టు వాళ్ళిద్దరి సంభాషణను బట్టి అర్థమయింది అనూషకు.
    అతను వెళుతూ ఉమ ముఖాన్ని దగ్గరకు తీసుకున్నాడు.
    అనూష ఆపైన చూడలేనట్టు చీదరించుకుంది.
    "అక్కా! అతను..." తిరిగివచ్చిన ఉమను నిలదీసి అడిగింది అనూష అసహనంగా. ఆమె స్వరంలో అనుమానం, అసహ్యం అన్నీ చోటుచేసుకున్నాయి.
    "అతను నా బోయ్ ఫ్రెండ్! బావున్నారా?" కన్నుగీటుతూ అంది ఉమ.
    "ఛీ! ఛీ! ఇదా నీ జీవితం? ఇంత నీచానికి దిగజారావా?" ఆవేశంగా అడిగింది అనూష.
    "ఇక కట్టిపెట్టవే నీ పిచ్చి వాగుడు! ఇక ఒక్క చెడుమాట అన్నావంటే..." ఉమ ముఖం ఆవేశంతో ఎరుపెక్కింది.
    అనూష అయోమయ పరిస్థితిలో పడింది. తను తొందరపడి అక్కను చులకన చేసి మాట్టాడింది. తనకు తెలిసి తన అక్క ఎప్పుడూ తప్పు చేయదు.
    తన ఆలోచనలో ఎక్కడో, ఏదో లోపం ఉందనిపించింది. అందుకే అక్క తనమీద అంతగా విరుచుకుపడుతోంది.
    "పిచ్చి చెల్లీ! ఊహాలోకంలో జీవిస్తూ, ఎప్పుడూ చెడునే ఊహిస్తూండడం నీకు అలవాటయిపోయిందే! నీ అక్క తప్పు చేస్తుందనుకున్నావా? ఆయన ఎవరనుకున్నావు? గతంలో నాకు పెళ్ళి ఎవరితో జరిగిందో తెలుసా? ఓ దగాకోరు, కారెక్టర్ లేని వ్యక్తితో. మీ బావ అప్పటికే పెళ్లయిన యిద్దరు పిల్లల తండ్రి! నేను ప్రేమించినవానితో నా పెళ్ళి జరిగిందన్న ఆనందం ఎంతోకాలం లేదు. కేవలం అతను మన ఆస్తిని చూసే నన్ను ప్రేమించినట్టు నటించాడు. జీవితాన్ని శాసించుకోవడం అంటే ఇదేనే! తెలుసుకోకుండా అతనికి మనసివ్వడం నాదే పొరపాటు. జరిగిన మోసాన్ని ఎవరితోనైనా చెబితే నన్నే ఛీ కొడతారని ఇంతవరకూ ఈ విషయం ఎవరికీ తెలియనీయకుండా, కాపురానికి పోకుండా ఇంటివద్దే ఉండిపోయాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS