Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 48

సుందరాచారి తాళం చెవి తీసుకుని రయ్యిన బస్సు వైపుగా పరుగుతీశాడు.
"అమ్మాయ్! అన్నంలోకి ఆ ధరువులు ఏమేం చేశాడో హోటల్ వాడిని కనుక్కు వస్తాను. నువ్వు ఈ ప్రక్కగా నుంచొని వుండు!" అని కూతురిని అక్కడే విడిచి హోటల్లోకి వెళ్ళింది వకుళాంబ.
గోడ మీదవున్న సినిమా వాల్ పోస్టర్స్ ని చూస్తూ బాగా గోడ ప్రక్కకి జరిగింది శ్రీమహాలక్ష్మి.
అక్కడే నుంచున్న ఇద్దరు ఆడవాళ్ళు ఈ తల్లీకూతుళ్ళని గమనించారు. ఈ వూరికి ఏ మనిషి కొత్తో, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది వాళ్ళు మొదటి చూపులోనే గ్రహించగలరు.
శ్రీమహాలక్ష్మికి ఆకారం గుమ్మటంలాగా వున్నా, ముఖం అందంగా వుండటంతో, ఆ అమ్మాయి మీ వాళ్ళ చూపులు పడ్డాయి.
శ్రీమహాలక్ష్మికి నోరు తెరుచుకుని సినిమా పోస్టర్స్ ని చూడటం చూసి వాళ్ళు అప్పటికప్పుడే మంచి ప్లాన్ వేశారు.
శ్రీమహాలక్ష్మి వెనుకనే చేరారు. కాస్త గట్టిగానే మాట్లాడుకోసాగారు. వాళ్ళ మాటల్లో శ్రీదేవి అన్న పేరు విని జాగ్రత్తగా చెవులు వగ్గి వాళ్ళ మాటలు వినసాగింది శ్రీమహాలక్ష్మి.
శ్రీదేవి మన మేనత్త కూతురు కాబట్టి, ఒక్కసారి మా అందరినీ చూసి పోదామని, గప్ చిప్ గా మా యింట్లో దిగింది. అదేనా యీ ప్రక్క పల్లెటూరిలో షూటింగ్ వుండబట్టీ ఇక్కడదాకా వచ్చి, రాత్రి మా యింటికి రావటం అజ్రిగింది. శ్రీదేవి మా యింట్లో దిగినట్లు తెలిస్తే ఊరి జనం అంతా మా యింటి మీద పడతారు. పైగా ఇప్పుడు ఆమె పెద్ద హిందీ యాక్టరు కూడా అయింది. నీవు నా స్నేహితురాలివి కాబట్టి శ్రీదేవిని చూపిస్తానూ అంటున్నాను. నిన్నిప్పుడు మా యింటికి తీసుకు వెళతాను. అయిదే అయిదు నిమిషాలు మా యింట్లో వుండి ఆమెని చూసి వెళ్ళిపోవాలి. అలా అయితేనే నిన్ను మా యింటికి తీసుకు వెళతాను." అందులో ఒకామె అంది.
"బాబ్బాబు అయిదు నిమిషాలు కూడా అక్కరలేదే! శ్రీదేవిని ఒక్కసారి కళ్ళతో చూసినా చాలు జన్మ తరించిపోతుంది. తొందరగా వెళదాం పదవే!" అంది రెండో ఆమె.
ఆ రెండు ముక్కలూ వినంగానే, శ్రీమహాలక్ష్మి మనస్సు మనస్సులో లేకుండా పోయింది.
"ఏవండీ!" అని మొదటి ఆమెను పిలిచింది.
శ్రీమహాలక్ష్మిని అప్పుడే చూసినదానిలా ముఖంపెట్టి 'నన్నేనా పిలిచింది!' అంది ఆమె.
వాళ్ళకి దగ్గరగా వస్తూ 'మిమ్మల్నే' అంది శ్రీమహాలక్ష్మి.
"ఏం కావాలి?"

"ఏమీ అక్కరలేదు."
"మరెందుకు పిలిచావ్?"
"నేనొకటి అడుగుతాను మీరేమీ అనుకోరుగా!"
"ఏమీ అనుకోను అడుగు!"
"శ్రీదేవి మీ మేనత్త కూతురాండీ!"
"అరె! నీకెలా తెలుసు" ఆమె ఆశ్చర్యపోతున్నట్లుగా ముఖంపెట్టి అడిగింది.
"ఇంతకుముందే మీరు మాట్లాడుకుంటూంటే విన్నాను. మీ ఇల్లు దగ్గరా, దూరమాండీ?"
"ఈ సందులో మూడో యిల్లే మాది."
వాళ్ళిల్లు అక్కడే అని తెలియంగానే శ్రీమహాలక్ష్మి కళ్ళు ఆనందంతో చమక్ మని మెరిశాయి.
"నాక్కూడా ఒక్కసారి శ్రీదేవిని చూపించరాండీ! నాకు శ్రీదేవి అంటే చాలా యిష్టం." అంటూ తన మనస్సులో కోరిక బయటపెట్టింది శ్రీమహాలక్ష్మి.
"ముందు ఒక్కళ్ళే అంటారు ఆ తరువాత వందమంది తయారవుతారు. మీ యింటికి వచ్చినందుకు బాగా అయిందే అని శ్రీదేవి ఆ తరువాత నన్ను తిట్టినా తిడుతుంది." తిప్పుకుంటూ అంది ఆమె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS