Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 48


    ఇంక నేనేం ఆలోచించలేదు. "సుస్మీ! సుస్మితా!" అంటూ కారు వేపు చేయిచాచి గట్టిగ పిలిచాను.


    చిన్నకారు కదిలి చాలా వేగంగా వెళ్ళిపోయింది.


    నా గావుకేక విని బజారులో అటూ ఇటూ వెళుతున్న అందరూ నన్నో వెర్రివాడిని చూసినట్లు చూశారు.


    "ఏమయింది యార్! ఆ కారులో వెళ్ళినవాళ్ళు ఎవరు?" నా భుజం మీద చేయివేసి రాంసింగ్ అడిగాడు.


    "నా సుస్మిత నా ప్రాణం నా సర్వం. ఇంతవరకు నేనెందుకు జీవించి వున్నానంటే ..." నా కళ్లలో పల్చటి కన్నీటి పొర నా ఎదురుగ వున్న రాంసింగ్ రూపం మసకమసకగ కనిపించింది. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియకుండా పోయింది.


    "అంత ఆందోళన దేనికి యార్! నీకంటపడిన దేదీ చేజారిపోదని నీవే చెపుతుంటావు కదా?"


    "అవకాశాలు అప్పుడప్పుడు వస్తాయేమోగాని, జీవితాంతం రావు."


    "ఇప్పుడు వచ్చింది కదా!"


    "వచ్చినట్లేవచ్చి ఇప్పుడు చేజారి పోయింది. ఇన్ స్పెక్టర్ బారి నుంచి తప్పించుకోనా! బాస్ గాడి కంటపడకుండా వుండగలనా! యీ రెండూ నా ప్రాణాంతక విషయాలు. ఎప్పుడు వెతకను నా సుస్మితను? ఎక్కడని వెతకను! కనీసం ఆ కారు నెంబరు కూడా చూడలేదు..."


    "బస్ నీపక్కన నేనున్నది ఎందుకు యార్! ఎందుకు! నీ కష్టంలోను సుఖంలోను పాలుపంచుకోటానికి అవునా! నేనా కారు నెంబరు చూశాను."


    రాంసింగ్ చెప్పేది సాంతం వినకుండానే పట్టరాని ఆనందంతో రాంసింగ్ ని చేతులమీదకి అమాంతం ఎత్తుకుని గిరగిర గాలిలోతిప్పి కిందకి జారవిడిచాను. అంతేకాదు ముఖమంతా ముద్దులతో నింపేశాను. ఆ క్షణంలో నిజంగా పిచ్చివాడినే అయ్యాను.


    "అమ్మ అబ్బ, ఇదేం ఆనందం, ఇదేం ఆవేశం రా, నీది భాయ్. చంపిపారేశావ్ కాదుకాదు చంపి పాతిపెట్టి పూడ్చావ్? బుర్రకే భూగోళంగ తిరిగి పోతుంది ఉక్కిరిబిక్కిరి బిక్కిరి ఉక్కిరి...


    రాంసింగ్ నెత్తిమీద ఠింగ్ అని వక్కటిచ్చాను చిట్టి మొట్టికాయ.


    "చాలు బుర్ర తిరగటం ఆగింది." రాంసింగ్ నెత్తి తడుముకుంటూ అన్నాడు.


    "ఇచ్చిన షాక్ పనిచేసిందన్నమాట. ఊ...ఇప్పుడు చెప్పు కారు నెంబరు!"


    "9696. తిరగతిప్పి ఎటుచూసినా వకేలా కనపడుతుంది."


    "గుడ్ వెరీగుడ్" అభినందన పూర్వకంగా రాంసింగ్ భుజం తట్టాను.


    "నీ కథ సగమే చెప్పావు. సమయం వచ్చినప్పుడు సాంతం చెపుతానని మాటయిచ్చావు. కారుఎక్కి తుర్రుమన్న ఆ అమ్మాయి నీ ప్రాణం అంటే నీ ప్రేమ దేవతన్న మాట?... ఆ కథ చెప్పు."


    "పద మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాము." ముందుకు నడుస్తూ అన్నాను.


    "నీ కథ అక్కడ చెపుతావా?" నాతోపాటు నడుస్తూ ఆతృతగ అడిగాడు రాంసింగ్.


    "జరిగినంతవరకు చెపుతాను. అసలైన చివరి పార్టు తప్ప."


    "ఎందుకలా?"


    "సస్పెన్స్ కోసం."


                                             23


    "పచ్చబొట్టు పొడుస్తాం."


    "పచ్చపచ్చగ పదిలంగ పదికాలాలపాటు వుండేలా పచ్చబొట్టు పొడుస్తాం."


    బజారులో...కాస్త పొట్టిగ లావుగ వున్నా మనిషి సన్నగా బారు ఊచలా వున్న తను విచిత్ర వేషధారణతో నెమ్మదిగా నడుస్తూ పచ్చబొట్టు పొడుస్తాం అంటూ అరుచుకుంటూ వెళుతున్నారు. పచ్చబొట్టు ఎలా పొడవాలో వాళ్ళిద్దరికీ తెలియదు.


    ఎందుకంటే...!


    వాళ్ళిద్దరూ పచ్చబొట్లు పొడిచేవాళ్ళు కాదు. పంగనామాలు పెట్టేవాళ్ళు అంతకన్నా కాదు. అందులో దిట్టంగ లావుగ వున్నాయన దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు. నీటి గొట్టంలా యింత పొడుగున్నతను హెడ్ కానిస్టేబుల్ అహోబిలం.


    చాలా కేసుల్లో గతంలో చాలారకాల వేషాలు వాళ్ళు ధరించారు. ఆ మారువేషాల వల్ల సక్సెస్ అయ్యారు. ఈ కేసులో ఏ రకం మారువేషం వేయాలో వాళ్ళకి బుర్రకాయని జైలు గోడలకేసి కొట్టుకున్నా అర్థం కాలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS