హీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మేన్! ఆర్ధికంగా మా ఇద్దరి సంపాదనా కలిస్తే అతని కుటుంబంతో పాటు మా కుటుంబం కూడా హాయిగా ఉండగలదు. ఆముక్త బాధ్యత అతను ఎంతమాత్రం కాదనడు. ఇంత దూరం వెళ్ళాయి నా మనసులోని ఆలోచనలు!
"రేపు రాఖీ పండుగరోజు రాఖీకట్టి తోఫాగా వదినని అడిగేస్తాను. ఇవ్వక ఏం చేస్తాడు. తన మనసులో లేకపోతే కదా!" నవ్వుతూ అంది ఇంద్రాణి.
ఆ చివరి మాటకి నా గుండె ఝల్లుమంది.
ఎన్నిసార్లో ఈ పెదవులకి ఆ రుచి గుర్తొచ్చి కలవరంగా అనిపిస్తోంది. "ఆ అలజడి అతనికిలేదా?"
అంత మామూలుగా "మీ కర్చీఫ్ నేను ఒక్కసారి వాడుకుని ఇవ్వచ్చా?" అన్నట్లు నా పెదవులని ముద్దుపెట్టుకున్నాడా? ప్రేమలో కలిగే బాధ విరహం వల్ల వీస్తుంది. ఆ విరహాన్ని ఏ మాత్రం భరించలేని ప్రబంధనాయికలు నోటికొచ్చినట్లు తిట్టేవారుట!
నేను తిట్టలేను!
నేను ప్రేమించిన వ్యక్తి నేను ఇక్కడ అతని తాలూకూ విరహంలో వేగిపోతుంటే తను అక్కడ ఓ పసివాడి జీవితం నేలరాలిపోకుండా పందిరి వేస్తుంటాడు!
ఆ పందిరి క్రింద అందరితోపాటూ నేనూ సేదదీరాలి. పందిరంతా నాదే కావాలనుకోకూడదు!
రాఖీ పండుగ రోజు ఇంద్రాణి అతన్ని పెళ్ళి విషయం అడుగుతుందని నాకు తెలుసు. నేను ఆ రోజుకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.
* * *
చిన్నక్క డైరీ చదువుతున్న నా గుండె దడదడా కొట్టుకుంది. డైరీలో పుల్లముక్క గుర్తుగా పెట్టి మూసి మనసులోనే దేవుడ్ని ప్రార్థించాను.
"ఒకవేళ అతను అక్కని రిజెక్టు చెయ్యలేదు కదా! ఇంతగా ప్రేమించిన సున్నిత మనస్కురాలు అలాంటిది జరిగితే అసలు భరించలేదు."
మళ్ళీ ఆత్రంగా డైరీ చదవసాగాను.
"రాఖీ పండుగ రోజు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళి భక్తిగా నమస్కరించి నా మనసులో కోరిక ఆయనకి తెలియబరిచాను. జీవితంలో నేను చంద్రని తప్ప, ఇంత గాఢంగా ఏదీ కావాలని కోరుకోలేదు!"
చేతుల్లో చెమటలు పడుతున్నాయి. చాలా టెన్షన్ గా వుంది. ఫోన్ చేద్దామనుకుని కూడా విరమించుకున్నాను. అతను ఎలా రియాక్టు అవుతాడో, నాతో ఎలా మాట్లాడతాడో మనసులో ఊహించుకుంటూ రూమ్ కి వచ్చేశాను.
ఆలోచనలతో నాకు నిద్రపట్టేసింది.
"ఆయా రూమ్ తలుపు తట్టి మీ కోసం విజిటర్ వచ్చాడు" అని చెప్పి వెళ్ళింది.
ఆమె అన్న మాటలతో నాకు ఎక్కడలేని హుషారూ వచ్చేసింది. తప్పకుండా అతనే అని తెలుసు!
బాత్ రూమ్ లోకెళ్ళి మొహం కడుక్కున్నాను. ఒంటికేసి చూసి చీర మార్చుకున్నాను.
జడేసుకుందామా అనుకుని మళ్ళీ ఆలస్యం అవుతుందేమోనని పైపైన దువ్వేసుకున్నాను. బొట్టుబిళ్ళనోసారి సరిచేసుకుని బయటకి వచ్చాను.
అతను వరండాలో జేబులో చేతులు పెట్టుకుని బయటికి చూస్తూ నిలబడి ఉన్నాడు.
అడుగులు వేగంగా పడలేదు! నెమ్మదిగా వెళ్ళాను.
అతను సీరియస్ గా బయట ఉన్న చెట్లకేసి చూస్తున్నాడు. అతని భుజం మీద చెయ్యివేసి నావైపుకి తిప్పుకోవాలని ఎంతగానో అనిపించింది. ధైర్యం చాలక "హలో" అన్నాను.
తను నావైపు తిరిగి "హలో...మీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. నాతో బయటికి వస్తారా?" అని అడిగాడు.
ఏం మాట్లాడతాడో తెలిసి నా బుగ్గల్లో మంకెనలు వూశాయి. "వస్తాను" అన్నాను. మనసులో 'నీతో నరకానికైనా వస్తాను' అనుకున్నాను.
అతని వెనకాల అడుగులో అడుగు వేస్తుంటే నాకు కొత్తగా అనిపించింది.
ఇద్దరం గాంధీ పార్క్ కి వెళ్ళాం.
పక్షులన్నీ గూళ్ళకి చేరుతున్నాయి.
దూరంగా ఓ పిల్లవాడు నిలబడి గొంతెత్తి తనకి తెలియని రాగంతో అవ్యక్తమైనటువంటి భావంతో ఏదో పాడుకుంటూ పోతున్నాడు.
నేను అతనేం చెప్తాడా అన్నట్లు చూస్తూ కూర్చున్నాను.
అతను గంభీరంగా "నాకు రాబర్ట్ ఫ్రోస్ట్ పోయమ్ గుర్తొస్తోంది. ఐహేవ్...టూగో మెనీ మైల్స్...ఐ హేవ్ టూ కీప్ మెనీ ప్రామిసెస్...బిఫోర్ ఐస్లీప్! ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది" అన్నాడు.
నాకు అర్థంకాక "అంటే?" అన్నాను.
అతను నాకు దగ్గరగా జరిగి కూర్చుని చెయ్యిజాపి "నానమ్మకి చెప్పనని మాటివ్వండి" అన్నాడు.
అతని చేతిలో నా చెయ్యి వేశాను.
"నేను ఎక్కువ రోజులు బతకను" అన్నాడు.
నా చెయ్యి అతని చేతిలో ఒణికింది.
"ఏవిటీ?" భయంగా అడిగాను.
"ఔను! నా కిడ్నీలు రెండూ ఫెయిలయ్యాయిట." అన్నాడు చాలా మామూలుగా.
"ఒద్దు! హాస్యానికి కూడా అలాంటి మాటలు మాట్లాడొద్దు" ఏడుపు గొంతుతో అన్నాను.
"హాస్యాలాడడానికి నా దగ్గర టైంలేదు!" అన్నాడు.
"చంద్రా...ఏమిటిది?" అతని భుజం మీద ఏడుస్తూ వాలిపోయాను.
