Previous Page Next Page 
ఆలింగనం పేజి 48


    నా ఒంటికి చీర ఎంతగా అతుక్కుపోయిందంటే, నా ఒంపుసొంపులన్నీ కూడా ట్రేసింగ్ పేపర్ వెనకనుండి చూస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి!

 

    చిన్న చెట్టు కావడం మూలాన అతనికి ఊపిరి తగిలేటంత దగ్గరగా నిలబడాల్సి వచ్చింది.

 

    నెమ్మదిగా తల ఎత్తి అతనివేపు చూశాను.

 

    అతని కళ్ళు కూడా కాంక్షగా నా శరీరాన్ని చూస్తున్నాయి. నా హృదయం స్పందన వేగం పెరిగింది.

 

    అతని కుడిచెయ్యి నా నడుమ వెనకభాగాన్ని తడిమింది. ఇంకో చెయ్యి అతనికి దగ్గరగా నన్ను లాగింది.

 

    మొదటిసారి విమానం ఎక్కేముందు ఇంతే టెన్షన్ గా వుంటుందేమో అనిపించింది.

 

    అతను నా కళ్ళల్లోకి చూస్తూ "నేను ఇప్పుడు మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటే ఏమీ అనరు కదా!" అన్నాడు.

 

    అతను పర్మిషన్ అడిగిన తీరుకి నవ్వొచ్చింది!

 

    "ఉహు!" అన్నాను చిన్నగా.

 

    మెరుపువేగంతో అతను నా ముఖాన్ని దగ్గరకి తీసుకుని పెదవుల మీద ముద్దుపెట్టుకున్నాడు. ఎన్నో ఏళ్ళుగా నేను ఎదురుచూస్తున్న వరం దొరికినట్లుగా అనిపించింది. మోయలేని హాయిని మోసేశక్తి యీ కళ్ళకి లేదు. అవి మూసుకుపోతున్నాయి. అతను దూరం అయ్యాడు.

 

    తనువు తహతహలాడడం ఏమిటో అర్థమైంది.

 

    వర్షం బయటంతా తగ్గిపోయింది. కానీ చెట్టుక్రింద వున్న మా మీద మాత్రం ఆకులు టపటపా తలంబ్రాల్లా నీటిచుక్కలు రాలుస్తూనే వున్నాయి.

 

    కనుచీకటి పడుతోంది. అతను నన్ను వదిలిపెడుతూ, "ఇలా ఎంతసేపు ముద్దుపెట్టుకున్నా బావుండేటట్లుందే! మీకూ ఫస్టుటైమేనా" అన్నాడు.

 

    నాకు కాస్త కోపం వచ్చింది. కానీ ఆ కళ్ళల్లో సిన్సియారిటీ చూస్తే అది కరిగిపోయింది.

 

    మొట్టమొదటిసారి బాంబు పేల్చి థ్రిల్ అయిన కుర్రాడి కళ్ళల్లో కనిపించే ఒకరకమయిన తమాషా సందడి కనిపిస్తోంది ఆ కళ్ళల్లో.

 

    "ఔను" అన్నాను చిన్నగా.

 

    "పదండి" అతను నడక మొదలెట్టాడు.

 

    "కాళిందీ అని ప్రేమగా పిలవచ్చుగా!" అతనికి దగ్గరయిన ఫీలింగుతో అనుకున్నాను.

 

    అతని మీద మాత్రం ఈ సంఘటన ఏ ప్రభావం చూపించనట్లుగా, వెళ్ళగానే రషీద్ కి ఫోన్ చేసి కబుర్లలో మునిగిపోయాడు. ఆ తర్వాత పిల్లలతో కబుర్లు.

 

    నానమ్మకి అన్నం పెట్టి, అతనికోసం ఎదురుచూస్తూ అక్కడే కూర్చున్నాను.

 

    ఏవో లెక్కలు చూసుకుంటూ "నాకోసం వెయిట్ చెయ్యొద్దు. మీరు తినెయ్యండి" అన్నాడు.

 

    ఉసూరుమనిపించింది. తినకుండానే పడుకున్నాను!

 

    కాసేపటికి వంటగదిలో చప్పుడైంది. చూస్తే అతను అన్నం తింటూ కనిపించాడు.

 

    నేను వెనక్కి వచ్చి అతని గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. అతను అందర్నీ సమానంగా ప్రేమిస్తాడు. ఏ ఒక్కర్నీ ప్రత్యేకంగా ప్రేమించలేడు. ఒకవేళ టైంవేస్ట్ అనుకుంటాడేమో అనిపించింది.


                                   *  *  *


    నన్ను ఉదయం హాస్టల్ దగ్గర దింపేటప్పుడు చెప్పాడు. "మకాం హైద్రాబాద్ కి మార్చేద్దామనుకుంటున్నాను. బిజినెస్ పనులమీద అస్తమానం అక్కడికి వెళ్ళవలసి వస్తోంది. అంతమాత్రమేగాకుండా అక్కడైతే పిల్లల్ని డఫ్ అండ్ డమ్ స్కూల్లో చేర్పించి వారికి స్పీజ్ థెరపీ అదీ ఇప్పించవచ్చు" అన్నాడు.

 

    హైద్రాబాద్ అనగానే నాకూ తెలియని ఆనందం కలిగింది. నాన్న గారికి చంద్రని పరిచయం చెయ్యాలి. ఆయనైతే అర్థం చేసుకోగలుగుతాడు.

 

    నిన్నటి అనుభవం తర్వాత అతనితో మాట్లాడడం నాకు కొంచెం సిగ్గుగానే ఉంది. అతను మాత్రం ఏం జరగనట్లే మాట్లాడుతున్నాడు. మనసులో మాట స్త్రీగా ముందు నేనే ఎలా బయటపడడం? ఈ శతాబ్దంలో కూడా ఈ ఆలోచనేమిటి? చెప్పేస్తేనో అనిపిస్తోంది.


                                  *  *  *


    ఏది ఏమైనా అతనికి దూరంగా ఉండటం మాత్రం ఎంతో దుర్లభంగా ఉంటోంది!

 

    ఇంద్రాణి పాపకి చిన్న ఫ్రాక్ ఒకటి కొనుక్కుని ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళాను.

 

    రషీద్, ఇంద్రాణి నన్ను చూసి చాలా సంతోషించారు.

 

    "గులాబీ, అత్త వచ్చింది. చంద్రమావయ్య ముక్కుకి తాడు ఎప్పుడేస్తుందో నువ్వైనా అడుగు" అని పాపని అడ్డం పెట్టుకుని అడిగేసింది ఇంద్రాణి.

 

    నేను సిగ్గుపడ్డాను.

 

    "డాక్టరమ్మకి కూడా మామూలు ఆడపిల్ల మాదిరిగా సిగ్గేనా" అంది ఇంద్రాణి.

 

    ధైర్యం చేసి "నువ్వే మీ అన్నయ్యని అడుగు ఇంద్రాణి. ఆ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడటం కష్టం" అన్నాను.

 

    "నీకు ఇష్టమేనా!" నా చేతిని తన చేతిలోనికి తీసుకుని ఊపుతూ ఆనందంగా అడిగింది.

 

    "పూర్తిగా" అన్నాను.

 

    అతనిలాంటి పూర్ణపురుషుడు నాకు ఎక్కడ దొరుకుతాడూ? ఎటువంటి ఆటంకాలొచ్చినా తన లక్ష్యంవైపు నుండి దృష్టి మరల్చడు. సమస్యలొస్తే చింతపోడు. సంబరం వస్తే పొంగిపోడు. నిరంతరం శ్రమిస్తాడు. హృదయం నిండా పొంగిపొరలే ప్రేమ ఇతరులకి ఇవ్వడమేకానీ తను తీసుకోవడం అనేది ఉండదు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS