"ఎందుకే అలా మింగేసేలా చూస్తావు నా వంక?" గాయత్రి అడిగింది.
"నా వంక చూస్తే నిముషానికి ఇంత పన్ను కట్టాలని టాక్స్ వెయ్యి" అంది ఆమని.
"అలాగే వేసుకోవచ్చు. వచ్చే డబ్బంతా నాకు యివ్వొచ్చు కాని ఆ టాక్స్ నించి నన్ను మాత్రం మినహాయించాలి" అన్నాడు వాల్మీకి.
అబ్బ ఎంతాశబాబూ! ఎప్పుడూ రెప్పవేయకుండా అక్కవంకే చూస్తూ కూర్చుండి పోదామనా? పన్నులు తప్పుకునే ప్రతాపం మీ వ్యాపారాల్లో ఉంటుంది కాని పెళ్ళాం విధించే పన్నుల నించి ఎంత ప్రతాపవంతుడయినా తప్పించుకోలేడు. మినహాయింపు అనేది ఏదైనా ఉంటే అది నాకే ఇవ్వవే అక్కా! చిన్నతనం నించి మనిద్దరం స్నేహం కదా!
మధ్యలో ఈ బావగారొకరొచ్చి చీల్చేశారు. పాత స్నేహం మర్చిపోకు" అంది ఆమని! ముగ్గురూ హాయిగా నవ్వుకున్నారు.
ఆ రాత్రికి వారి ప్రయాణం నిర్ణయమయింది.
సోదరీమణుల గుండెలు బరువెక్కాయి.
వాస్తవానికి వాల్మీకి కూడ ఆమని మీద చాల ఎఫెక్షన్ పెంచుకున్నాడు. ఆమె వ్యక్తిత్వంలో నిర్మలతా తెలివితేటలలో చురుకూ అతనిని ఆకర్షించటం కాదు దిగ్భ్రాంతి పరిచినాయి.
"ఈ చిన్నారి చిట్టి తల్లి నా బిడ్డ! నాకు బిడ్డలు కలిగే ఆశ ఇకలేదు. కాబట్టి ఆమెను బిడ్డగా చూచుకోవాలి. ప్రాణమిచ్చి పెంచుకోవాలి.
ఆమని కలెక్టర్ గా కావాలని జీవితాశయంగా పెట్టుకుంది.
ఆ కోర్కెను తీర్చటమే మా దంపతుల జీవితాశయం కావాలి!
ఎప్పుడయినా ఆమె పెళ్ళాడి బిడ్డల్ని కంటే ఓ బిడ్డని యాచించి తెచ్చి పెంచుకోవాలి! మరో చిన్ని ఆమని మచ్చలేని చందమామలా ఆ ఇంటిలో పెరగాలి అని ఎంతో వాత్సల్య పూరితంగా ఆలోచించాడు వాల్మీకి.
మళ్ళీ మొత్తం పటాలాన్ని కదిలించి అయిదు కార్లలో సెండాఫ్ ఇవ్వటానికి వస్తోంది ఆమని. రైలు కదిలేంతవరకూ అంతా కోలాహలం!
వెండి జరీ పోగులతో ఎంబ్రాయిడరీ చేసిన ఆకుపచ్చ కాశ్మీర్ షాల్ మమ్మీకి కానుకగా పంపించింది ఆమని!
"కలెక్టరై వచ్చాకనే కాళ్ళకి మొక్కుతానని మమ్మీకి చెప్పు" అంది.
చిత్తడి అవుతున్న చెంపల్ని తుడుచుకుంటూ రైలు కదిలే సమయాన చేతులు ఊగించింది! క్రమంగా ఆ రూపం కలలాగ కరిగిపోయింది.
"ఈ పిచ్చిపిల్ల చాలా ప్రతిభాశాలి! విడిచి వెళ్ళాలంటే వెక్కిళ్ళు వస్తున్నాయి" అంది గాయత్రి! వాల్మీకి అదొకలా చూచాడు.
"ఆడవాళ్ళు అదృష్టవంతులు. కష్టం కలిగినప్పుడు మనసువిప్పి మగవాళ్ళతో చెప్పుకోగలరు!" అన్నాడు. గాయత్రి భుజం చుట్టూ చేయి బిగించి ఓదార్చాడు.
ఆమని అంటే ఒక కల! అడిగినప్పుడు రాదు.
ఆమని అంటే ఒక అల! వచ్చిపోవటమే దాని స్వభావం.
ఆమని అంటే ఒక వల! పట్టిలాగటమే కాని పడిపోవటం ఎరుగదు!
రైలు శబ్ధంతో వారి ఆలోచనలు లయబద్ధం అయినాయి!
రిపోర్ట్సు వచ్చినా ఈ విషయం గాయత్రికి చెప్పకూడదు.
ఎప్పుడూ గాయత్రి ముఖంలో ఈ చిరునవ్వే చూడాలి అనుకున్నాడు వాల్మీకి!
* * *
కాలం అప్రతిహతం! అది దురతిక్రమం!
ఎవరికోసమూ ఆగకుండా దొర్లిపోవటం దాని స్వభావం.
సంవత్సరానికి పైగా గడిచిపోయింది.
ఓ అందమయిన ఉదయం సుమిత్ర లాన్ చెయిర్ లో గులాబి మొక్కల మధ్య కూర్చుని ఉంది. ఆమని వ్రాసిన ఉత్తరాన్ని నిన్నటినించి అయిదుసార్లు చదివింది. ఇంకా అర్ధం కాలేదు.
గాయత్రి ఫాంహౌస్ లో పనులు చూచుకుంటోంది. రెండురోజులుగా రాలేదు. వాల్మీకి అక్కడికే వచ్చి వెడుతున్నాడని వార్తలు వచ్చాయి.
ఒంటరితనాన్ని జయించేందుకు ఇంకా మనవడు రాలేదు.
వచ్చే సూచనలు కూడ కన్పించలేదు.
ఇంకా అందరి ఆలోచనల్లో ఆ యింటిలో పసిపాపగానే ఉన్నాయి ఆమని జ్ఞాపకాలు! ఆ మనస్సులో తన చిన్న పాపాయి రూపాన్ని చెరిపేస్తూ ఆమని వ్రాసిన ఉత్తరం అది. ఎన్నిసార్లు చదివినా ఆ వాక్యం అర్ధం కాలేదు.
మళ్ళీ మరోసారి మడతలువిప్పి చదువుతోంది సుమిత్ర!
మమ్మీ! నమస్తే! అక్కకు బావకు మీకు ఓ హాపీన్యూస్!
డిగ్రీ డిస్టింక్షన్ తో పూర్తిచేశా! ఐఏఎస్ కి అప్లయ్ చేశా! ముందుగా కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్స్ సంపాదించటం మంచిదంటున్నారు.
హార్స్ రైడింగ్ సర్వసాధారణం అయిపొయింది.
అర్సియరీ నేర్చుకోమన్నారు. వద్దన్నాను గోల్ఫ్ కూడ యమబోర్!
నాకు మౌంటెనీరింగ్ లో ఆసక్తి ఉంది. డార్జిలింగ్ లో ఈ ఎండాకాలం గుడుపుతా! మాస్టర్ డిగ్రీకి కూడ అప్లయ్ చేశా! ఐఏఎస్ కి మౌంటెనీరింగ్ డిప్లమాతోడయితే మంచి ఉద్యోగాలు వస్తాయంటున్నారు.
క్రీడలలో ప్రత్యేక టాలెంట్ సంపాదించుకుంటే మనలాంటి ఒ.సి.లకి ఉద్యోగం సంపాదించటం సులభమవుతుందని న ఐడియా!
నేను కూడా బచేంద్రిపాల్ కాలేకపోయినా ఏదో ఒకనాడు కైలాస శిఖరం ఎక్కేస్తా మమ్మీ! హిమాలయాలు నన్ను కౌగిలించుకుంటాయి!
అక్క డాక్టర్ రిపోర్ట్ గురించి ఇంకా బాధపడుతోందా? వద్దని చెప్పు!
పిల్లోస్ మీద వ్రాసిన లవ్ లీ ఆమని అనే అక్షరాలు ఇంకా ఉన్నాయా? చెరిగిపోయాయా? డార్జిలింగ్ నించి ఫీనట్స్, ఆ క్రూట్ వగైరాలు తెచ్చి పంపిస్తా. ఒక్కసారి మీ పాదాలు తాకాలని మనసు దురపిల్లుతోంది మమ్మీ!
కాని నేనింకా కలెక్టర్ని కాలేదు కదా?
అంత పౌరుషం తక్కువదాన్నేం కాదు. మాట తీర్చుకునే వస్తాను.
"సీయూ! బై!" అంటూ ఉత్తరాన్ని ముగించింది.
ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకుని ఒడిలో దాచుకుంది సుమిత్ర.
డాక్టరుగారి రిపోర్టు విషయం బాధపడుతోందా అక్క అని వ్రాసింది అదేమిటో మాత్రం ఆ తల్లికి అర్ధం కాలేదు.
నగరానికి వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత డాక్టర్ పరీక్షలు చేయించినట్టు చెప్పారు. కాని ఫలితాంశాన్ని స్పష్టంగా చెప్పకుండా దాటవేశారు.
గాయత్రికి కూడా తెలియదేమో! వాల్మీకి అదొకలా వుంటున్నాడు.
పిల్లల ప్రస్తావన వచ్చినప్పుడల్లా "ఆమని చిన్నపిల్ల! అన్ని ముచ్చట్లు తీర్చేస్తోంది కదా" అంటూ దాట వేస్తున్నాడు.
అక్కడ డాక్టర్ రిపోర్టు గాయత్రికి తెలిసి ఉంటుందని ఆమని ఊహ. కాని తెలియదు. అదేమిటో తెలుసుకోవాలి అని నిర్ణయించుకుందామె. డాక్యుమెంట్స్ అన్నీ ఫాంహౌస్ సేఫ్ లో దాచుకుంటాడు వాల్మీకి. వాటిని చూడాలనుకుంది. వెంటనే ఫాంహౌస్ కి వెళ్ళింది.
"ఈ రోజు నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను. అబ్బాయిగారు ఇంటికే వస్తారు వెళ్ళు గాయత్రీ!" అంది కీ బంచెస్ అన్నీ ఆమెకు హాండోవర్ చేస్తూ ఐరన్ సేఫ్ తాళాలు కూడా ఇచ్చి వెళ్ళిపోయింది గాయత్రి.
అలవాటు ప్రకారం ఆరు గంటలు దాటిన తరువాత వాల్మీకి వచ్చాడు.
గాయత్రిగారు వెళ్ళిపోయారని, పెద్దమ్మగారు ఉన్నారని పనివాళ్ళు వార్త అందించారు.
"అత్తాయమ్మగారూ! మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడిగాడు.
"నేను ఎలా ఉన్నా వక్కటే! కాని బాబూ! నేనొక విషయం అడుగుతాను చెప్తావా?"
"అదేమిటి? మీరు మాకు పెద్దలు ఆజ్ఞాపించండి."
"నిజం చెప్తానని మాట యివ్వు బాబూ!"
"ఓ గాడ్! ఏనాడయినా మీకు అబద్ధం చెప్పానా ఒక్కటయినా? ఎందుకు అలాంటి అనుమానం వచ్చింది మీకు?"
"అబద్ధం చెప్పలేదు కాని నిజాన్ని దాచావు బాబూ! రెండు ఒక్కటే"
ఆ మాట విని అతడు షాక్ అయాడు.
"ఆమని ఉత్తరం వ్రాసిందా?" అన్నాడు అప్రయత్నంగా.
"అవును బాబూ! అక్క ఇంకా దిగులుగా ఉందా?" అని అడిగింది.
"దిగులు పడేందుకు అసలామెకు వాస్తవం తెలియదు"
"నాకూ తెలియదు, ఏమిటా వాస్తవం?"
"డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ ఫైల్ చేశాను. కీస్ కూడ గాయత్రి దగ్గరే ఉన్నాయి. కాని నేను లేకుండా ఎప్పుడూ సేఫ్ తీయదు? కావాలంటే మీరు చూడండి. గాయత్రికి మాత్రం చెప్పవద్దు అనుకున్నాం.
"సరే! అమ్మాయి ఇంటి దగ్గర నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది వెళ్ళు!"
"అత్తాయమ్మగారూ! మీరు నాకు ఒక మాట యివ్వాలి."
"ఏమిటి బాబూ అది---?"
"ఆ రిపోర్టు చదివి మీరు కూడా అప్ సెట్ అవకూడదు"
"భర్త చనిపోయి ఇద్దరు బిడ్డల్ని పెంచాల్సి వచ్చినప్పుడే నేను బండరాయిగా మారాను. ఇంకా నాకు బాధలేముంటాయిలే వెళ్ళిరా!" అన్నదామె!
అతడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చాల పరధ్యానంగా ఉన్న వాల్మీకిని చాలాసార్లు హెచ్చరించింది గాయత్రి. కవ్వించాలని ప్రయత్నించింది.
"ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది" అన్నాడు.
"అదేమిటి డిగ్రీ పరీక్షా ఫలితాలు వచ్చాయట?"
"ఆమని డిస్టింక్షన్ లో వచ్చింది. చాలారోజులు అయింది. ఈరోజు ఉత్తరం వచ్చింది. మౌంటునీరింగ్ డిప్లమా ఉంటే ఐఏఎస్ ఉద్యోగాలకి రిజర్వేషన్ కోటాలో యిస్తారట! క్రీడల కోటా అది. మంచి తెలివి ఉపయోగిస్తుంది."
"తెలివితేటలు డానికి స్వంతం కదండీ!"
"మరి నీకు స్వంతాలేమయినా ఉన్నాయా?"
"మీరే నాకు స్వంతం. మీలోనే ప్రపంచం అంతా చూచుకుంటాన్నేను. తాంబూలం అందుకోండి." అంటూ చిలకలు చుట్టి అందించింది గాయత్రి.
