Previous Page Next Page 
పరిహారం పేజి 47


    "మొదటిది ఏమంటే అత్తకు నామీద ఎలాంటి అభిప్రాయం ఉన్నా నాకు ఆశ్రయమిచ్చి నన్ను రుణపడేలా చేసింది. ఆవిడ మాట నిలబెట్టడం నాకు ధర్మం. రెండు నువ్వు రజనివల్ల అవమానం పొంది ప్రతీకారంగా ఆవిడకంటే అందమైనదాన్ని భార్యగా పొందాలనే స్వార్ధంతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నావు! ఇది వలపూ కాదు. ప్రేమా కాదు"
    "పారూ!"
    "నీ మీదున్న గౌరవం ఈ క్షణంలో మాసిపోయేలా చేశావు. మనూ! నీకంటే నాకు గిరిధర్ ఉన్నతంగా కనిపిస్తున్నాడు. నా మీద ఉన్న నిందలన్నీ తెలిసీ కూడా నన్ను పెళ్ళి చేసుకోడానికి సిద్దపడ్డాడు. నీ దగ్గర కంటే నేను గిరిధర్ దగ్గర ఎక్కువ సుఖపడతాను!"
    అందంగా, అమాయకంగా కనిపించే పారు ఎంత ధీమాగా మాట్లాడుతోంది! మనోహర్ నివ్వెరపాటుతో చూశాడు. గాయపడిన స్వరంతో,  "నువ్వు కూడా నన్ను అవమానించడానికే సిద్దపడ్డావా, పారూ?" అని అడిగాడు.
    "ఉన్నమాట చెప్పాను! అవమానిస్తున్నాననుకొంటే నేనేం చేసేది?"
    ఒక నిట్టూర్పు విడిచాడు మనోహర్. మనిషి తన సర్వస్వం కోల్పోయానని తెలుసుకొన్న క్షణంలో అతడి మనసు లోతుల నుండి ఇలాంటి నిట్టూర్పే వెలువడుతుందేమో! అక్కడినుండి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు దభాలున మూసుకొన్నాడు.
    "ఈ బాధలో ఏమైనా చేసుకుంటాడేమో!" పారిజాతకు హఠాత్తుగా భయం పుట్టుకొచ్చింది.  "మనూ! మనూ!" అంటూ తలుపులు బాదసాగింది.  "తలుపుతీయ్! లేకపోతే తల బద్దలు కొట్టుకు చస్తానిక్కడే!"
    "నీకోసం చచ్చేంత ప్రేమ నాకేం లేదు. నేనేం చావను, వెళ్ళు నన్ను కాస్సేపు ప్రశాంతంగా ఉండనివ్వు!"
    తెల్లవారుతూనే రజని కారు డ్రైవరు వచ్చాడు. "కోమలమ్మ గారు ఉందా?" అని అడిగాడు.
    "లేదు. ఊరికి వెళ్ళింది"
    "రజని అమ్మగారు ఈ పాకెట్ ఇచ్చి రమ్మన్నారు!"
    ఆ పాకెట్ చేతికి తీసుకొని చూసింది పారిజాత. అందులో ముత్యాల నక్లెస్, ప్రదానం చేసిన పట్టు చీరా ఉన్నాయి.
    ఆ సాయంత్రం వచ్చింది కోమలమ్మ. పారిజాత వల్ల సంగతి తెలుస్తూనే కుప్పకూలిపోయినట్టుగా అయింది. గొప్ప సంబంధంతో వియ్యమందు తున్నానని ఎంత మురిసిపోయింది? ఎంత గర్వంగా కలిసిన వాళ్ళందరితో చెప్పుకొంది! ఈ సంబంధం ఇలా తప్పిపోయిందని తెలిస్తే ఎంత అవమానం! ఎంత హేళన?
    నవనాడులూ క్రుంగిపోయాయి కోమలమ్మకు. ఎవరికి ముఖం చూపాలన్నా చెల్లనట్టుగా అయింది. అందరూ తనను చూసే నవ్వుతూన్నట్టు సిగ్గుపడింది.
    మనోహర్ ఉదయమే సూటుకేసు సర్దుకొని మనశ్శాంతి కోసమని ఊళ్లు తిరిగి రావడానికి వెళ్లిపోయాడు.
                                     19
    ఒక నెల రోజులు గడిచాయి.
    మనోహర్ తిరిగివచ్చి మామూలుగా కాలేజీకి వెళ్లి వస్తున్నాడు. కాని, అతడిలో చాలా మార్పు వచ్చింది. సరదాలూ, సంతోషాలు మచ్చుకైనా లేవు. మనిషి చాలా గంభీరంగా మారిపోయాడు. గతం తాలూకు విషాదఛాయ ఎప్పుడూ అతడి ముఖంమీద కదులుతూ ఉంటుంది.
    అసలు కోమలమ్మ ఇంటి వాతావరణమే గ్రహణం పట్టినట్టుగా తయారైంది. కోమలమ్మ కూడా ఏమిటో దిగులుగా ఉంటూంది అనుకొన్న సంబంధం తప్పిపోయింది. కొడుకు ఎలాగో అయిపోతున్నాడీమధ్య! రజనికంటే ఇంకాస్త మంచి సంబంధమే చూసి వాడి పెళ్ళి చేస్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పురావడానికి వీలుపడదు - అనుకుంటూంది.
    ఒకటి రెండు సంబంధాలు వచ్చాయికూడా. అందులో ఒక సంబంధం కోమలమ్మకు నచ్చింది. సిరి సంపదల్లో జగన్నాధరావుకు తూగే సంబంధమైనా రజనిలా ఒకే ఒక్కకూతురు కాదు. ఇద్దరు మగపిల్లల తరువాత ఈ అమ్మాయి. ఈ పిల్ల తరువాత ఇద్దరు ఆడపిల్లలూ. అయినప్పటికీ కట్నం కానుకలూ దండిగా ముట్టజెప్పుతామని కబురు చేశారు వాళ్ళు.
    ఈ సంబంధం గురించి కొడుకుతో ప్రస్తావించింది కోమలమ్మ.
    వివరాలు సాంతం వినకుండానే మనోహర్ కస్సుమన్నాడు. "ఈ జన్మకిక పెళ్లి ప్రసక్తి లేదు. మళ్ళీ మళ్ళీ ఈ సంగతి గురించి ఎత్తావో నీకంట బడకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాను."
    కొడుకు మనసిలా విరగడానికి కారణం ఒక రజనే కాదు. పారిజాత భాగంకూడా వుంది. ముందు ప్రేమించినట్టు పుకార్లు పుట్టింది ఆ పిల్లమూలంగానే. రజని అవమానం చేశాక పెళ్లాడాలనుకున్నదీ ఆ పిల్లనే.
గొప్పసంబంధంతో వియ్యమందాలన్న తన ఆశను ఈ విధంగా నేలకూలుస్తోంది పారిజాత! ఆ పిల్ల కావాలని చేయకపోయినా ఈ అనర్ధాల కన్నిటికీ కారణభూతురాలవుతోంది. అందుకే ఆ పిల్లను త్వరగా గిరిధర్ కిచ్చి పెళ్ళిచేసి ఈ ఇంటినుండి పంపిస్తే తప్ప కొడుకు దారికి రాడని ఓ రోజు గిరిధర్ కు కబురు చేసింది కోమలమ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS