"రుక్మిణీ అమ్మాళ్ దగ్గరే నాకు చిన్న ఉద్యోగం దొరికింది. ఆమె ఎప్పటినుండో డాన్సు క్లాసెస్ రన్ చేయాలనుకొంటూందట. నాకు డాన్సు వస్తుందని తెలిసి తన దగ్గర వర్క్ చేయమంది. ప్రస్తుతం నెలకి అయిదువందలిస్తానంది. గవర్నమెంట్ జాబ్ దొరికే వరకు చేద్దామనుకొంటున్నాను." హరిత చాలా మామూలుగా, తమ మధ్య బేధాబిప్రాయాలేవీ లేనట్టుగా చెప్పింది కమలాకర్ తో.
"నాకెందుకు చెబుతున్నావు?" పెడసరంగా అడిగాడతను.
"మంచిచెడ్డలు మీతో చర్చించక ఇంకెవరితో చర్చిస్తాను?"
"అంత గౌరవంకూడానా భర్తమీద?"
"చూడండి! ఆ ఊరుకు ఈ వూరెంత దూరమో, ఈ వూరికి ఆవూరు అంతేదూరం అన్న సూత్రం మీద ఆధారపడి వుంది మన దాంపత్యం. మిమ్మల్ని నేను గౌరవించాలంటే మీరూ నన్ను గౌరవించాలి. మీ మనసును నేనర్దం చేసుకొని నడవాలంటే మీరూ నా మనసును అర్దం చేసుకొని నడవడానికి ప్రయత్నించాలి. ప్రేమా, స్నేహం, గౌరవం, నమ్మకం పరస్ఫరం కలిగివుండాలి. కేవలం అవి నేను మాత్రమే మీ మీద గుమ్మరించాలంటే అది దురాశ! అసంభవం కూడా!"
"భర్తను! మగవాడిని! నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలిగాని, నువ్వు చెప్పినట్టు నేను నడుచుకోవడం ఎప్పటికీ జరగదు!
"అయితే మనం కాపురం చేస్తామనే ఆశ వదులుకోండి! నేను మిమ్మల్ని వదిలేస్తాను!"
"ఆడది మగవాడిని వదిలిపెట్టడమేమిటి? ఆడదాన్నే మగవాడు వదిలెయ్యడం జరుగుతూన్న చరిత్ర!"
"ఇప్పటి వరకు జరుగుతున్న చరిత్ర అదే! కాని, ఇకముందు జరగదు. మనవిషయంలో అసలు జరగదు. నాలాంటి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం గల ఆడపిల్లలు ఈ చరిత్రను తిరగరాసేందుకు తోడ్పడతారు! మీలాంటి పురుష దురహంకారులమీద తిరగబడడానికి ఉద్యమరూపం దాలుస్తారు."
"నీకసలు కాపురం చేసే లక్షణాలుగానీ,అసలు ఆడ లక్షణాలుగానీ లేవు. పెళ్లెందుకు చేసుకొన్నావు? నా జీవితంలో శాంతి లేకుండా ఎందుకు చేస్తున్నావు?"
"ఆడ లక్షణాలు, కాపురం చేసే లక్షణాలు నాలో లేకేం? దండిగా వున్నాయి! వాటిని చూడగలిగే సహృదయత, స్నేహభావం లేకపోతే నేనేం చేయను?"
"నువ్వు చేసేదంతా చూస్తూ వుండడానికి నేనంత చవటను కాదు! నీకు తగిన శాస్తి చేసిగాని వదలను" రౌద్రంగా హరితమీదికి వచ్చాడు కమలాకర్.
"కొడతారా?"
"కొట్టడం కాదు?చంపి పాతేస్తాను."
"ఆగండక్కడే! నామీద ఒక్క దెబ్బపడినా ఇప్పుడే వెళ్లి పోలీస్ కంప్లెయింటిస్తాను!"
"ఏమిటీ? పోలీస్ కంప్లెయింటిస్తావా?" ఖంగుతిన్నాడు కమలాకర్.
"కంప్లెయింటివ్వడమే కాదు! నీ ఉద్యోగం వూడగొట్టిస్తాను! నిన్ను జైలుపాలు చేస్తాను నీ కెవరూ మళ్లీ పిల్లనివ్వకుండా చేస్తాను! నీకొక సంసారం చట్టబండలు ఏమీ లేకుండా చేస్తాను. అప్పుడు మీ అమ్మ చెప్పినట్టు త్రాగుతావో, తిరుగుబోతువై ఒళ్ళు కుళ్ళ బెట్టుకుంటావో - అన్నీ కసిదీరా చూస్తాను."
"నువ్వు అన్నీ చూసేదాకా నిన్నుంచుతాననుకోకు!" రెండు చేతుల్ని ఎత్తి హరిత గొంతుమీదికి తెస్తూ ముందు ముందుకు వచ్చాడు.
హరిత చటుక్కున వెనక్కి వెళ్లి తన హాండ్ బాగ్ లోంచి ఓ కాగితం తీసి అతడిమీదికి వేసి, "నేను అరుణ వాళ్లింటికి వెళుతున్నాను. నేను మళ్లీ ఈ ఇంటికి తిరిగి రావాలనుకొంటే అరుణ నాన్నగారి ముందు నా ప్రాణానికి హాని లేదని భరోసా ఇస్తే తప్ప రాను!" అనేసి, చెప్పులు తొడుక్కొని చకచకా వెళ్లిపోయింది.
కాగితం విప్పి చదవసాగాడు కమలాకర్.
"డియర్ సబితా!"
వైవాహిక జీవితంలో పడిన తొలిఅడుగులు కొందరికి తీపి జ్ఞాపకాలుగా మిగులుతాయి. మరికొందరికి చేదు జ్ఞాపకాలుగా వుండిపోతాయి.
కమలాకర్ తో నా పెళ్లి నన్ను రెండవకోవకు చెందిన దాన్ని చేశాయి.
ఇక్కడ ఒక సంగీత విద్వాంసురాలి దగ్గర సంగీతం నేర్చుకొంటాననడంతో ప్రారంభమైంది గొడవ. సంగీతం తన కిష్టం లేదంటాడు. నృత్యం తనకిష్టంలేదంటాడు. అవన్నీ సంసార పక్షం వాళ్లకి సరిపోనివి అంటాడు.
లలితకళలంటే నాకెంత ఆరాధనో, ఓ వైపు చదువు కొంటూనే ఆటల్లో, పాటల్లో ఎన్ని బహుమతులు తెచ్చుకొన్నానో నీకు తెలుసు కదా? ఇప్పుడు అవేవీ లేకుండా నేను బ్రతకలేను. కేవలం ఆయన నన్ను ఒక్క చక్కటి గృహిణిగా మాత్రం చూడగోరుతున్నారట. అంటే ఇల్లు నీట్ గా సర్దుతూ, ఆయన కిష్టమైన వంటలు చేస్తూ, ఆయన ఆఫీసు నుండి వచ్చేసరికి తెల్లచీరా, మల్లెపూలూ పెట్టుకొని చక్కటి చిరునవ్వుతో, పకోడీ ప్లేట్, టీ కప్పుతో ఎదురెళ్లే పెళ్లాంగా మారాలన్నమాట! నాకెందుకో అలా రంగులు పులుముకునే కృత్రిమ గృహిణులకూ, వేశ్యలకూ బేధం లేదనిపిస్తుంది! ఇల్లు దిద్దుకోవచ్చు. భర్తకి వండిపెట్టవచ్చు. అది నిత్యకృత్యాల్లో ఒక భాగం కావాలిగాని, అందుకోసమే శరీరాన్ని, మనసునూ అంకిత చేయనక్కర లేదు. భార్య అంటే ఒక దాసి, ఒక వేశ్య కాకూడదు.
