"ఒక ఆడదానికి కొడుకును పెంచడం చేతకాక చెడగొడితే ఇంకో ఆడది భార్యగా వచ్చి దిద్దుకోవాలా? మగవాడికి లక్ష వ్యవహారాలుంటాయట. తానూ ఒక ఆడదై వుండి ఒక మగవాడిని ఎలా సమర్దిస్తుందో! కూతురిగా భార్యగా పురుషుడి వల్ల పడ్డకష్టాలు, అవమానాలు తల్లి అయ్యేసరికి ఒక్కసారిగా మరిచిపోయి అతడిని క్షమించడమే కాదు, సమర్దిస్తుంది కూడా! నీ ఇంటికి వచ్చే కోడలు ఏ మచ్చాలేని కడిగిన ముత్యంలా వుండాలి! మీ కొడుక్కి మాత్రం లక్ష వ్యవహారాలుండొచ్చు! ఇదేం, న్యాయం అత్తగారూ?"
"చూశారు కదా? ప్రతీదానికి ఇదీ కుతర్కం! ఇదసలు కాపురం చేసే ఆడదా? దీనికసలు పెళ్లెందుకు చేశారు? దీనివల్ల నా కొడుకు జీవితం నాశనమైపోయేట్టుంది! ఇంట్లో సుఖశాంతులు కరువైతే మగవాళ్లు ఎలా తయారవుతారో, చదువుకొన్నది కదా, ఆ మాత్రం ఆలోచించక్కరలేదా?"
"ఒక్క నావల్లే సుఖ శాంతులు కరువు కావడం లేదని మీరు గ్రహించాలి! సహృదయతా, సంస్కారం లోపించిన అతడి ప్రవర్తనవల్లే ఈ ఇంట్లో సుఖశాంతులు లోపిస్తున్నాయిగాని నా వల్ల కాదు! రేపు ఈ కాపురం కూలిపోవడమే జరిగితే ఈ మంటకు రెండు సమిధలు వేసిన పుణ్యం మీకూ దక్కుతుంది లెండి!"
"అయ్యో, అయ్యో! నాకెందుకమ్మా ఈ అపవాదు? నీ కాపురం వుంచుకుంటావో, ఏట్లో కలుపుకుంటావో నాకెందుకు? రేపే మా వూరెళ్లిపోతాను!" ధుమధుమ లాడుతూ కదలబోతూ వియ్యపురాలికేసి తిరిగి, "ఆడపిల్లను ఇలాగేనా పెంచడం? కూతురిచేత కాపురం చేయించాలనుకొంటున్నావా? విడిపించి ఇంట్లో వుంచుకోవాలనుకుంటున్నావా? ఇంట్లో వుంచుకోవాలనుకొంటే నేను చెప్పేదేమీ లేదు! నీ ఖర్మకు నువ్వే అనుభవిస్తావు! కాని, కాపురం చేయించాలనుకొంటే మాత్రం ఆమెకింత గడ్డిపెట్టి పో!" అని, తన గదిలోకి వెళ్లిపోయింది.
హేమలతకు కూడా కూతురు కాపురం చేసేలా కనిపించలేదు! ఇంతా చేసింది కూతుర్ని కాపురం విడిపించి ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా? "ఆడపిల్లను ఇలాగేనా పెంచడం?" అని ఇవాళ వియ్యపురాలు అన్నట్టే రేపు అందరూ అంటుంటే ఆ అవమానం తను భరించలేదు!
"వ్యక్తిత్వమూ, స్వేచ్చా అన్నవి కాపురం నిలబెట్టుకొని తరువాత ఉపాయంగా అవి సాధించుకోవాలిగాని వాటి కోసమే కాపురం వదిలేసుకోవడం ఏం విజ్ఞత? ఇదే నీ చదువు, సంస్కారం చెప్పేట్టయితే వాటిని తగలేయాలి!" అంది హేమలత కోపంగా.
"నా వ్యక్తిత్వాన్నే స్వేచ్చనూ బలిపెడితే తప్ప ఈ కాపురం నిలిచేస్థితి కనిపించడంలేదు! ఆలోచనలు లేకుండా ఒక మృగంలాగానో,ఒక బొమ్మలాగానో నేను కాపురం చేయలేను!" ఖండితంగా చెప్పింది హరిత. "కాపురం ఇబ్బందుల్లో పడి అసహాయంగా రోదించే ప్రతి ఆడపిల్లకూ ప్రతి తల్లీ యుగయుగాలుగా ఇదే వార్నింగ్ ఇచ్చి వుంటుందని నా నమ్మకం! ఇవాళా నిన్న ఆడపడుచులకు జరుగుతున్న ఇన్ని అవమానాలూ, ఇన్ని దారుణ మరణాలూ, హత్యలూ, ఆత్మహత్యలూ జరుగుతున్నాయంటే వాటి వెనుక వాళ్ల తల్లి రాతిగుండె తప్పకుండా వుంటుంది! ఇంత అపురూపంగా పెంచి పెద్దచేసి వీళ్ల చేతుల్లో పెట్టింది రాక్షసుల్లా బలి తీసుకోవడానికా అని ఒక్క నిముషం ఆలోచించగలగితే, పరువు, ప్రతిష్ట, సంప్రదాయం అన్నవి కొంచెం పక్కకు పెట్టి ఆలోచించ గలిగితే, ఆడపడుచుల ఆత్మహత్యల, హత్యల సంఖ్య ఎంతో తగ్గిపోయేదని నా నమ్మకం." విరక్తిగా నవ్వింది హరిత. "కాపురం వదిలేసి వచ్చి నేను మీ ఇంట్లో తిష్టవేస్తానని భయపడకు మమ్మీ. స్త్రీకి పుట్టిల్లు అత్తిల్లు లేకపోయినా మరోవిధంగా కూడా గౌరవంగా తన జీవితం తను గడపగలదు అని నిరూపిస్తాను!"
"బ్రతకొచ్చే! పిడికెడు ముద్దా, జానెడు గుడ్డా సంపాదించుకోవడం అదో ఘనకార్యంకాదు. మొగుడూ మొద్దు లేని జీవితం అదీ ఒక జీవితమేనా?"
"ఆ మొగుడే ఒక రాక్షసుడైనప్పుడు, ఆ మొగుడు లేకుండా తన జీవితం తను జీవించడం నేరమెలా అవుతుంది? సంప్రదాయ శృంఖలాలు త్రెంచుకుని నీ కూతురున్న పరిస్థితిని వాస్తవంగా చూడటం నేర్చుకో మమ్మీ! వరకట్నం లేని ఆదర్శవివాహాన్ని నేను కోరాను. మీరు ఏంచేశారు? లోపల్లోపల లక్ష కట్నం మాట్లాడుకొని నా ఆదర్శన్ని దారుణంగా అవమానించారు! నన్ను మోసం చేశారు. మీరిచ్చింది డెబ్బైవేలేనట! మిగతా ముప్పైవేలు నేను అడిగి తీసుకురాకపోతే ఆయన నన్ను చంపేస్తానన్నారు. ఆడపిల్లల్ని కని చితిలోకి నెడుతునన్నది మీరమ్మా! శక్తికి మించిన కట్న కానుకలు ఒప్పుకోవడం - ఇవ్వలేక అత్తింట్లో నరకం కల్పించడం! ఆమె జీవితంలో నిత్యాగ్ని రగిలించడం! ఆడపిల్లల చావుల వెనుక వున్నది నిజానికి మీ తల్లిదండ్రులు, మీ సంప్రదాయాలు -మీ కుటుంబ గౌరవాలు మీరూ, మీ కుటుంబ గౌరవాలూ నన్ను నిస్సహాయురాల్ని చేసి చంపేయకముందే నేను ఈ చితిలోంచి, ఈ నరకంలోంచి బయటపడాలనుకొంటున్నాను! మగడ చస్తే బతికున్న వాడి భార్యను కూడా వాడితోపాటు చితిలోకి నెట్టి బలవంతంగా చంపేసే ఆచారం వుండేదట! ఇప్పుడు మగడు బ్రతికివుండే ఆమెకోపం చితి రగిలిస్తున్నాడు. సమాజం. తలిదండ్రులు, సంప్రదాయాలు ఈ సతిని బలవంతంగా చితిలోకి నెట్టి కాల్చివేస్తున్నారు. అది కనిపించే చితి అయితే ఇది కనిపించని చితి! ఆ చితిలో సతి ఒక్కసారిగా తగలబడి చనిపోతే ఈ చితిలో రోజురోజుకింత చొప్పున తగలబడుతూ, చస్తూ వుందన్నమాట! నాకీ సతీత్వమొద్దు. ఈ చితిలో నేను చావను. నన్ను నన్నుగా బ్రతకనివ్వండి!" ఆవేశంతో, దుఃఖంతో మాట్లాడుతున్న కూతుర్ని మ్రాన్పడినట్టుగా చూడసాగారు కృష్ణారావు దంపతులు.
* * * *
