స్త్రీలలో కొందరికి రచయిత్రులుగా వెలిగే ప్రతిభ వుంటుంది. కొందరికి గొప్పగాయని అయ్యే ప్రతిభ వుంటుంది. మరికొందరికి గొప్ప నృత్య కళాకారిణి అయ్యే ప్రతిభ వుంటుంది. గొప్ప డాక్టరూ, గొప్ప నటీ అయ్యే ప్రతిభ వుంటుంది. ఆ ప్రతిభ అంతా ఆడదానికి ఇల్లు చక్కబెట్టుకోవడంకంటే కావలసిందేముంది? అన్న అంకుశంతో పొడిచి చంపేయడం దారుమం కదూ? ఇంటి పనులనే ఈ బాధ్యత కింద ఎందరు గాయనీమణులు, ఎందరు రచయిత్రులు, ఎందరు స్త్రీలు నలిగి నశించిపోయారో ఇంతవరకూ నేనూ వాళ్లలో చేరిపోలేను.
మగవాడు సంపాదించి తెస్తే ఇంట్లో వుండి ఇంత వండి పెట్టడం అన్న పద్దతికి నేను పూర్తిగా వ్యతిరేకిని. స్త్రీ కూడా సంపాదనా పరురాలు కావాలి. ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేసి సంపాదించాలి అన్న రూలులేదు. సంపాదనకు ఏ మంచి వృత్తినయినా స్వీకరించవచ్చు. బట్టలు కుట్టవచ్చు. సేల్స్ గర్ల్ చేయవచ్చు. ట్యూషన్ లు చెప్పవచ్చు. చివరికి మట్టితట్ట లెత్తవచ్చు. చేలకలుపు తీయవచ్చు. ఆఢపిల్ల సంపాదించాలి అనే అనుకొంటే గౌరవంగా అనుసరించడానికి సవాలక్ష మార్గాలున్నాయి, సంసారంలో ఇద్దరు సంపాదించగలిగినప్పుడు ఇంటిపనులు ఇద్దరూ సమంగా పంచుకోవడం న్యాయంగా వుంటుంది. అతడు ఆఫీసునుండి వచ్చి వాలుకుర్చీలో వాలిపోతే ఆమె అలసటను ఓ పక్కకిపెట్టి చెంగు నడుమునదోపి ఇంటిపనులు చేసే ఈ స్త్రీ శ్రమదోపిడి పద్దతి పోవాలి.
నా రిజల్ట్సు రాగానే నేను ఉద్యోగ ప్రయత్నంలో పడతాను. గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ఫర్వాలేదు. ఆర్దికంగా ఒకరిమీద ఆధారపడిలేను అన్న తృప్తి కలిగించేది అయితే ఇంటింటికీ తిరిగి సుబ్బులమ్మేపని అయినా చేస్తాను. కాని నేను ఉద్యోగం చెయ్యడంగాని, నాలో వున్న కళాత్మక ప్రతిభకు వన్నె పెట్టుకోవడం గాని, పరువు తక్కువగా, ఇంటి మర్యాద మంటగలుపుతున్నట్టుగా భావిస్తున్న మనిషి ఆయన. మనిషినయినా మాయంచేసి ఇంటిమర్యాద కాపాడుకోవాలి అనే పట్టుదల మనిషికూడా. ఈ సంకుచితానికి తోడు మా నాన్న లక్షరూపాయలు కట్నంగా ఇస్తామని చెప్పి డెబ్బయివేలే ఇచ్చారట. మిగతాడబ్బులు వసూలుచేసుకురమ్మని తగాదా ఒకటి.
నన్ను చంపి నా పీడ విరగడ చేసుకొంటానని ఆయన నోటి నుండే వచ్చింది. బహుశా నన్ను చంపి ఆత్మహత్యగా చిత్రించవచ్చు. కాని ఎట్టి పరిస్థితిలోనూ నేను ఆత్మహత్య చేసుకోను. రేపు ఏదైనా జరిగి నేను చనిపోవడమే జరిగితే అది ఖచ్చితంగా హత్యేననినమ్ము! మీనాన్న డి. ఎస్. పి. కదా? న్యాయం కోసం పోరాడి నీ స్నేహితురాలికి ఆత్మ శాంతి కలుగజేయగలవని నమ్ముతున్నాను. ఈ విషయం సి. బి. సి. ఐ. డి. లో మహిళా సంరక్షక విభాగానికి కూడా తెలియజేశాను. నాకేదైనా జరిగితే నాలుగు దిక్కులనుండి అతడికి వురిబిగించుకోక తప్పదు, జలజకూ, రాధికకూ కూడా వుత్తరాలు రాస్తున్నాను. నాకేదైనా జరిగితే తప్పకుండా పోరాటం సాగిస్తావు కదూ? ఇట్లు నీ హరిత"
సబితకు రాసిన లేఖకు నకలు అది తేదీ వారంరోజుల క్రితం వ్రాసినట్టుగా వుంది. చదవడం ముగించే సరికి కమలాకర్ కి ముచ్చెమటలు పోశాయి.
"నీ చేతిలో ఒక కోడిలాగో, మేకలాగో చావను!" అన్న హరిత అన్నంత పనీ చేసింది. తనకోసం నాలుగు దిక్కులనుండి వురిత్రాడు తయారుచేసి పెట్టింది. ఆమెను తిట్టినా, కొట్టినా పోలీస్ కంప్లయింట్ ఇస్తుంది. తన వుద్యోగం ఊడగొట్టిస్తుంది. జైలు శిక్షకూడా వేయిస్తుంది. ఎంత అవమానం తనకు! భర్త కొట్టినా, తిట్టినా పడివుండాల్సిన అవసరంలేదు ఆమెకు వుద్యోగం చేసుకు బ్రతుకుతుంది. లేకపోతే నాట్య ప్రదర్శనలిచ్చో. సంగీత కచేరీలు చేసోవుద్యోగంచేసిన దానికంటే బాగానే బ్రతుకుతుంది. డబ్బుకుడబ్బు! పేరుకుపేరు.
అంధకారంలోకి వెళ్లిపోయేది తనే.
కోరలు పీకిన పాములా ఒక నిట్టూర్పు విడిచికూల బడిపోయాడు కమలాకర్.
(సమాప్తం)
AGNI KERATALU
By -Polkampalli santhadevi
"నీ చెల్లెలికి నువ్వైనా నచ్చజెప్పవయ్యా! బొట్టూ గాజులు తీసేయనంటుంది భర్త చనిపోయినా?"
"శంకరీ! ఏమిటమ్మా ఇది?' అంటూ వచ్చాడు అన్నయ్య.
"నాకు భర్తపోయిన దానికంటే నేను వేయబోయే వేషం గురించే కదన్నయ్యా. నువ్వింత బాధపడేది? ఇంత బాధ పడుతూ నాకీ వేషం వేయించాలని ఎందుకు తాపత్రయ పడతావు?" సూటిగా అడిగింది.
"ఏ పద్దతి ఎందుకేర్పడిందో ఇప్పుడనవసరం గాని ఈ పద్దతి మాత్రం..... భర్త మరణంతోనే సగం చచ్చే స్త్రీని, మిగతా సగం కూడా ఆమె బ్రతికుండగానే చంపేయడం అన్నయ్యా! కొంచెం సహృదయంతో ఆలోచించిచూడు! ఈ ఆచారాలు, శాస్త్రాలు పద్దతులు, ఇవన్నీ పురుష పరంగా ఏర్పడ్డవే! స్త్రీ పట్ల అతడెంత సంకుచితంగా, స్వార్దంగా ఆలోచించాడో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తను చస్తే తన శవంతోపాటు తన భార్యని కూడా సజీవంగా తగలేసేంత వరకూ వెళ్లాయి అతడి ఆలోచనలు! అతడి ఆలోచనలే శాస్త్రాలుగా, ధర్మాలుగా రూపుదిద్దుకొన్నాయి! అవి స్త్రీని అధః పాతాళానికి త్రొక్కేశాయి! కొందరు సంఘ సంస్కర్తల పుణ్యమా అని సహగమనం పేరుతో స్త్రీ సజీవ దహనం ఆగిపోయినా, బ్రతికి వున్న ఆమె మీద కసి దీర్చుకుంటున్నట్టుగా ఈ ఆచారాన్ని సృష్టించారు! ముండమొయ్యడం అనే పేరుతో ఆమెకు ప్రేతరూపం వచ్చేట్టు చేస్తారు. తల గొరిగించారు! ఆమె నుండి అలంకరణలన్నీ దూరం చేసారు. ఇదంతా, తను పోయాక మరో పురుషుడు ఆమెకేసి కన్నెత్తి చూడకూడదని! తన భార్య మరెవరికీ చెందకూడదని! కొంచెం చదువుకొని, విచక్షణగల ఆడది వీటి గురించి ఆలోచిస్తే తప్పేమిటనయ్యా!" ఆవేశంగా అడిగింది శంకరి.
తనకంటూ ఒక ప్రత్యేకత వున్న శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి కలం నుండి వెలువడిన సస్పెన్స్ నవల "అగ్ని కెరటాలు"
Sri Vijayalakshmi publications
** శుభం **
