Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 48

    ఇన్ కమ్ టాక్స్  కోసం  ఆవిడ పేరు పెట్టారు. బైజుకి సూది మోపినంత జాగా  అయినా ఆ ఇంట్లో దక్కుతుందని ఆశించారు. అది వారికి పెద్ద డిసప్పాయింట్  అయ్యింది.

    'శ్రీ రంగం' అన్న యింటి పేరుతో, పెద్దగేటు పిల్లర్సుతో బోర్డు  రాయించింది కూడా అందుకే.

    "సరోజా! నువ్వు బాధపడుతున్నావా?" అని అడిగారు.

    'దేనికండీ?" అని అడిగాను.

    "బైజుకి  ఆ ఇంట్లో వాటా రానందుకు" అన్నారు.

    "భలేవారండీ. మీ పెంపుడు కూతురు మాత్రం  పరాయిదా? కన్న ప్రేమకన్నా పెంచిన ప్రేమ హెచ్చంటారు. మీరు రెండిళ్ళు  సంపాదించారు. అయితే ఆ ఇల్లు కేవలం  మీ కష్టార్జితమే. చిల్లి గవ్వ కూడా ఎవరూ సాయం చెయ్యలేదు. పోతే_ ఈ ఇల్లు  నా పెళ్ళికిముందే కొనుక్కున్నాను.

    నేను కష్టపడి  సంపాదించినదైనా  మీరివ్వబట్టేకదా  కొనగలిగాను" అన్నాను.

    "అదికాదు సరోజా!" అన్నాను.

    "చూడండి. అనవసరంగా  మనస్సు పాడుచేసుకోవద్దు. మందవల్లిలో  మనకున్న  ఈ ఇల్లు  దక్కించుకుంటే  చాలు. ఆ ఇంటి సంగతి మరచిపొండి. నాకేమీ బాధలేదు.

    మీకు తెలిసి  ఈ అన్యాయం జరిగితే  కొంచెం  బాధపడేదాన్ని. మీ కళ్ళే కట్టేసి  చేసిన అన్యాయానికి ఏం చేస్తారు? ఆ ఇల్లు  పరాయివాళ్ళకి పోలేదు. అనుభవించనీయండి. మీరేం బాధపడకండ"ని అన్నాను.

    తర్వాత  గిట్టనివాళ్ళు  చిన్న చిన్న గొడవలు  తెచ్చి, మమ్మల్ని కదుపుదామని చూసినా ఆ వైపు నేను తిరిగి చూడలేదు. ఒకసారి మాత్రం  వారి మాట కాదని సహృదయంతో  ఆ ఇంటికి వెళ్ళాను. దానికి తగిన  అనుమానాల అవమానం పొంది, వెనక్కి వచ్చేశాను. మళ్ళీ నేటిదాకా  ఆ వైపు తిరిగి చూడలేదు. ఎవరి బాధ వాళ్ళు పడుతున్నాం. ఎక్కడి దొంగలు అక్కడే  గప్ చుప్  అన్నట్టు  అయిపోయింది.

    ఒకరోజు_నేనూ మా వారూ  గూడూరులో  ఒక పిక్చర్ పూజ&షూటింగ్ కి వెళ్ళాం. అక్కడ రెండు రోజులుండి, మళ్ళీ రైలులో  బయలుదేరాం. రాత్రి రెండున్నర  గంటల తర్వాత బండిలో ఎక్కాం. సిటింగ్ మాత్రమే. బెర్త్ లు లేవు. మేమిద్దరం కూర్చున్నాం.

    తోటి  ప్రయాణీకుల్లో  ఒకాయన  శ్రీశ్రీగారిని  చూసి, "మీ అమ్మాయా" అని నన్ను చూపించి అడిగారు.

    ఆయనను  నోరెత్తనివ్వకుండానే, "ఇంకా నయం. భలేవారండీ_ఈయన మావారండీ" అన్నాను.

    శ్రీశ్రీగారు ఏమనుకున్నారో ఏమో!

    "మాకు నలుగురు పిల్లలు" అని కూడా చెప్పాను.

    అతను శ్రీశ్రీగారిని  చూసి, "ఏవండీ, ఆ అమ్మాయి  అంటున్నది  నిజమేనా? నలుగురు పిల్లలని అంటోంది. చూస్తే అలా అనిపించటంలేదు" అని అడిగారు.

    "అవునండి. నా భార్యే. నాకన్నా ముప్పయ్యేళ్ళు చిన్న" అని అన్నారు, నవ్వుతూ  నన్ను చూసి.

    తరువాత నాతో మాట్లాడుతూ, "నీకింకో  విషయం  చెప్పేనా?" అని అడిగారు.

    "లేదే. ఏమిటి?" అని అడిగారు.

    'నేనూ, ముసల్దీ  కలిసి  రైల్లో  ప్రయాణం చేసేటప్పుడు  తోటి ప్రయాణీకులు నన్ను చూపించి, 'ఇతను మీ అబ్బాయా' అని అడిగేవారు. వాళ్ళు అలా అడగడం దానికి కష్టంగా వుండేది.

    నలభై ఏళ్ళకే  జుత్తు పూర్తిగా  నెరిసిపోయింది. రైలు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం  నా జుత్తుకి తెల్లరంగు వేసుకుంటానని  అంటే దానికి ఒళ్ళుమండేది. 'ఏమీ అక్కర్లేద'ని  ఒప్పుకొనేది కాదు. వీళ్ళు ఈ మాట అడిగితే నాకు ఆ మాట జ్ఞాపకం  వచ్చింద"ని  చెప్పారు.

    "అంటే ఇప్పుడు నేను మీకు నల్ల రంగు పూస్తానంటే  మీరు ఒప్పుకుంటారా" అని అడిగాను.

    "దేనికి? నా జుత్తు ముగ్గుబుట్టలా  తయారైపోయిందేమిటప్పుడే" అని అడిగారు.

    నేను నవ్వుతూ  "లేదండీ. అయినప్పుడు మాటే" అన్నాను.

    "నీకూ  అలాంటివి ఇష్టంలేదని  నాకు తెలుసులే" అన్నారు.

    "అవునూ_మనకీరోజు  జాగారమేనా?" అన్నాను.

    "పోన్లెద్దూ. అప్పుడే మూడు గంటలైపోయింది. తెల్లవారకుండా  ఇంటికి చేరుకుంటాము. ఏమైనా మాటలు చెప్పు" అన్నారు.

    "నేను చెప్పడం కాదు. అడుగుతాను. మీరు చెప్పండి" అన్నాను.

    "సిగరెట్ పేకట్లు  వున్నాయా?" అని అడిగారు.

    "ఆఁ వున్నాయి. చిన్నప్పుడు  హరికథా  కాలక్షేపం  నేర్పిన  గురువు శ్రీపాద సన్యాసరావుగారి  చుట్టల కట్టలు మోసేదాన్ని. ఇప్పుడు మీ సిగరెట్ పేకట్లు మోస్తున్నాను" అన్నాను.

    "వాటికన్నా  ఇవి కంపు  తక్కువే" అంటూ సిగరెట్ ముట్టించారు.

    ఆ రైలుపెట్టె  గుడ్డి  దీపంలో  కుడిచేతి చూపుడువేలు  పాము  మెలికలతో షంటింగ్  చేస్తోంది. కళ్ళు మూసుకొని కూర్చున్నారు.

    "ఏవండీ_ఏవండీ" అని పిలిచాను.

    ఉలకలేదు. పలకలేదు.

    'ఏమిటి' అన్నట్టు  కళ్ళు విప్పి చూశారు.

    "నేను  అడిగినదానికి  సమాధానం చెప్తానన్నారుగా" అన్నాను.

    "నువ్వడగందే" అన్నారు.

    "చాలా కాలంగా_ఏళ్ళంటే  ఇంకా బాగుంటుందేమోనండి_అడగాలనుకుంటూనే  వెనకాడడమో  లేక మరచిపోవడమో  జరుగుతోంది. ఇప్పుడు అడుగుతున్నాను. ఏమీ అనుకోరుగా" అని అడిగాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS