కడివెడు పాలలో ఒక్క చుక్క విషం చాలదా పాలు విరిగిపోవడానికి.
ఆ పాపాన్ని ఒడికట్టడానికి ఇరువైపులా ఉన్నారు కర్తలు!
* * * *
అనూష మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తను అనుకున్నది సాధించానన్న సంతృప్తి మిగిలింది. జర్నలిజంలో మంచి పేరు తెచ్చుకుంది.
తనకు తనవాళ్ళు దూరమయ్యారనే బాధ తప్పించి జీవితంలో ఏ లోటూ కనిపించడంలేదు. కాని ఒంటరితనం క్రుంగదీస్తున్నది.
ఫోన్ మోగడంతో రిసీవరు తీసింది అనూష. అవతలి నుంచి ఆనంద్ గొంతు వినగానే అనూష ముఖంలో ఆనందం చోటుచేసుకుంది.
చాలా రోజుల తరువాత తను, ఆనంద్ మాట్లాడుకోబోతున్నారు. సమ్రాట్ తనకు కరపత్రాలను చూపి, అతని గురించి చెడుగా చెప్పిన తరువాత తను మనస్తాపానికి గురై ఆనంద్ తో మాట్టాడటం మానేసింది. ఇవాళ అతనే తనను పలకరించడంతో సంతోషంలో వెంటనే మాటలు పెగలలేదు.
"హలో అనూషా! రిసీవర్ పక్కన పెట్టి ఏదన్నా ఎడిట్ చేసుకున్నావా, లేక పగటికలలేమన్నా కంటున్నావా?....హలో! నిన్నే!" ఫోన్ లో ఆనంద్ హడావుడి చేస్తున్నాడు.
ఇన్నాళ్లూ తను ఎందుకు మౌనంగా ఉన్నట్టు? అర్థంకాని ప్రశ్న అది. కేవలం సమ్రాట్ మాటలు నమ్మి తను ఆనంద్ ను అనుమానించినట్టా? తను నిజానిజాలను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు.
ఆనంద్ ఫోన్ లో మళ్ళీ హడావుడి చేయడంతో ఆలోచనల నుంచి వాస్తవంలోకి వచ్చింది.
"వింటున్నా, వింటున్నా? నీ సంభాషణ అంతా వింటున్నాను. ఇంకా ఏమైనా నిష్టూరాలు వేస్తావేమోనని వేచి చూస్తున్నా" అంది కవ్వింపుగా.
"అమ్మాయిగారు కలం చేపట్టిన తరువాత రాతలతోపాటు మాటలలో కూడా వూహించని మార్పు కనిపిస్తున్నదే!"
"అదేం లేదు, ఆనంద్! నాలో ఏ మార్పూ లేదు, రాదు కూడాను. అప్పుడూ, ఇప్పుడూ నేను నేనే! చెప్పు ఆనంద్ చాలా రోజులయింది మనం కలుసుకుని. ఏమిటి విశేషం?" అనూష గొంతు ఆర్ద్రమయింది.
"నన్ను పూర్తిగా మరచిపోయావేమో, ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. ఎలా ఉన్నావు అనూషా?"
"ఎంతవరకు వచ్చింది నీ చదువు?" అనూష ముందుగా తేరుకుని అడిగింది.
"ప్చ్!" అతను నిట్టూర్చాడు.
"అదేమిటి, చదువు గురించి అడుగుతుంటే సమాధానం చెప్పవేం?"
"ఏమో, అనూషా! అసలు చదవాలనిపించడం లేదు. అయినా, చదువుకుని ఎంతమంది బాగుపడ్డారంటావు?" వేదాంత ధోరణిలో అన్నాడు!
"ఏమైంది ఆనంద్ నీకివాళ? వేదాంతం మాట్టాడుతున్నావు!"
"మనిషి తన కాళ్ళమీద తను నిలవాలంటే ఈ చదువులే కావాలంటావా అనూషా!" నవ్వుతూ అన్నాడు.
అనూషకు అతని భాష, అందులోని భావం అర్థమయ్యింది. తన గురించే అతను అన్నాడని తెలుసుకుంది.
"అబ్బ! ఎంత సీరియస్ జోక్ వేశావు! నిజంగానే చదువు మానేస్తావేమోనని హడలి చచ్చానంటే నమ్ము!" అంది కాస్త ఊపిరి పీల్చుకుని.
"హలో, ఎడిటర్ గారూ! మనుషుల ఆంతర్యం తెలుసుకోలేకపోతే ఎలా? మీరింకా ఇంకా వృద్ధిలోకి రావలసినవారు."
"సరిసరి_నీ మాటలు ఎప్పుడూ ఉండేవేగా! ఫోనులో మాట్లాడి వదిలించుకోవడమేనా? ఇక్కడకు దయచేసేదేమన్నా ఉందా!" నిష్టూరంగా అంది అనూష.
"నేనే వ్యక్తిగతంగా వచ్చి మాట్టాడదామనుకున్నాను. అనూషా! ఉంటావో, వుండవోనని ఫోన్ చేశాను. లక్కీగా దొరికావు."
"మరయితే రావొచ్చుగా?"
"ఇక రావడం ఎందుకు? ఫోన్ లో దొరికావుగా? అయినా పెద్ద విశేషం అంటూ ఏమీలేదు. మీ నాన్నగారు వచ్చారు. ఆయన నీ గురించి చాలా బాధపడుతున్నారు. ఒక్కసారి...." అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు.
"క్షమించు, ఆనంద్! ఈ విషయం చెప్పడానికేనా వద్దామనుకుంది?" మధ్యలోనే కల్పించుకుని అంది.
"అదే వద్దంది! ఆవేశం తగ్గించుకుంటే మంచిదని నీకెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఒకసారి ఇంటికి వెళ్లి మీ వాళ్ళను చూసి వస్తే ఏం తరిగిపోతుంది?"
అనూష క్షణం ఆలోచనలో పడింది. నిజమే. తన తండ్రికోసం కాకపోయినా, అక్కను చూడటానికైనా ఒకసారి తను ఇంటికి వెళితే బాగుంటుందేమోననిపించింది.
"ఏం, అనూషా! చనువు తీసుకుని నీ వ్యక్తిగత విషయాలలో తలదూరుస్తున్నానని కోపం వచ్చిందా?" ఆమె మౌనం అతనిని కలవర పరిచింది.
"లేదు, లేదు ఆనంద్! నేనలా అనుకోవడం లేదు. ఏదో ఆలోచనలో పడి పరధ్యానంగా ఉన్నానంతే! నీ సలహా తప్పక పాటిస్తాను."
"అనూషా! నువ్వు నిజంగా మీ యింటికి వెళతావా? నన్ను నమ్మమంటావా?"
"వెళ్తాను అన్నాక వెళ్ళకుండా ఉంటానా? వెళ్ళకపోతే నువ్వు వూరుకుంటావా? ఇక నా బుర్ర తినవూ?" అంది నవ్వుతూ.
"ఆల్ ద బెస్ట్ అనూషా!"
"థాంక్స్!"
ఇద్దరూ ఫోన్ పెట్టేశారు.
ఇంటికి వెళ్ళాలనుకోగానే ఆమె మనస్సంతా అదోలా అయిపోయింది.
ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అన్నట్టు మనసు ఆరాటపడుతుంటే, అప్రయత్నంగానే ఆమె కాళ్ళు ఇంటిదారి పట్టాయి.
* * * *
అనూషను చూస్తూనే ఉమాదేవి ఒక్కసారిగా వచ్చి కౌగలించుకుంది.
"ఏమే! ఇన్నాళ్ళకు గుర్తుకువచ్చామా?" కళ్ళనీళ్లు తిరుగుతుండగా అంది ఉమ.
