Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 47

ఆపదలో వున్న ఆ పసివాడిని తలచుకుంటూంటే ఆయన ప్రాణం విలవిల లాడుతున్నది. భగవంతుడిని వేడుకోవటం మినహా ఆయన చేయగలిగింది అంటూ ఏమీలేదు కనుక భగవంతుడిని వేడుకుంటూ వ్యధ చెందుతూ ఉండిపోయాడు మౌనంగా.
మధ్యలో ఒకసారి లేచి కళ్ళుతెరిచి భర్తను చూసిన వకుళాంబ "ఏమిటి! అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దిక్కుమాలిన ఆలోచనా, మీకు ఎప్పుడూ వుండేదే. ఈ సమయంలోనైనా కాస్త విశ్రమించ కూడదా!" సాధింపుతో ఆయనకో సలహా ఇచ్చి, మళ్ళీ తాను నిద్రలోకి జారుకుంది.
సరిగ్గా పన్నెండు గంటలకి మధ్య దోవలో వచ్చే ఆ వూరిలో ప్రయాణీకులు భోజనం చెయ్యటానికి వీలుగా. బస్సును హోటల్ ముందు ఆపాడు బస్సు డ్రైవర్.
భోజనం చెయ్యటానికి చాలామంది బిలబిల లాడుతూ బస్సు దిగారు.
ముందు జాగ్రత్తతో పులిహోరా, అటుకులు లాంటివి భోజన సమయంలో తినటానికి వకుళాంబ మూట కట్టుకుని వచ్చింది.
"హోటల్లో భోజనం చేద్దామే అమ్మా!" అని ముద్దుల కొడుకు అడిగేసరికి, అప్పనంగా వచ్చిన డబ్బు చేతిలో ముద్దుల కొడుకు వుండటంతో కాదనలేక పోయింది వకుళాంబ.
హోటల్లో కుర్చీమీద కూర్చుని, ఆ కూడు ఒక్కసారి అయినా తినాలన్న కోరిక అసలు వకుళాంబకే ఎప్పటి నుండో వుంది. కుమార రత్నం అడగంగానే, "ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవి మధ్యాహ్నం ఫలహారంగానూ రాత్రికి భోజనంగానూ తిందాం. వీళ్ళతో పాటు మనం కూడా హోటల్ కి వెళ్ళి తిని వద్దాం పదండి." అంది వకుళాంబ.
"నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్ళి తినిరండి" రామానుజాచారి ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పేశాడు.
ఆయన హోటల్లో తినక పోయినంత మాత్రాన వచ్చిపడే ప్రమాదమేమీలేదు. "మీ ఖర్మ!" అనుకున్న వకుళాంబ పిల్లల్ని ఇద్దరినీ తీసుకుని బస్సు దిగింది.
బస్సు దిగుతూ ఒక హెచ్చరిక కూడా చేసింది. "ఎలాగూ ఇక్కడే వుంటానంటున్నారు కదా! ఓ కంట సామాను చూస్తూ వుండండి! పెదపకాలం పిదప బుద్ధులు. ఎవరినీ నమ్మటానికి లేదు. రోజు రోజుకీ దొంగలూ, మోసగాళ్ళూ ఎక్కువయి పోతున్నారు."
"అవునవును ఈ ప్రపంచమంతా వంచనా, దగా, మోసమూ, స్వార్ధమూ, ఎవరికివారు తమ గురించి ఆలోచించేవారే అప్పనంగా వస్తే అప్పడాల కర్రని కూడా పోనివ్వరు. వాళ్ళందరిలో మనమూ ఒకళ్ళం." ఈ మాట పైకి అనే ధైర్యంలేని రామానుజాచారి ఈసడింపుగా మనస్సులో అనుకొని వూరుకుండి పోయాడు.
బస్సు దిగిన వకుళాంబ, కూతురు శ్రీమహాలక్ష్మితోనూ, కొడుకు సుందరాచారి తోనూ భోజన హోటల్ వైపు నడుస్తూంటే...
"అమ్మా! అమ్మా! అందరూ ఈ చిన్న హోటల్లోకే పోతున్నారే! ఇది చూడటానికి ఏమీ బాగాలేదు. అదిగో ఆ పెద్ద హోటల్లోకి వెళదాం." గారాం చేస్తూ అడిగాడు సుందరాచారి.
"అవునే అమ్మా! అదే బాగుంది" అంది శ్రీమహాలక్ష్మి.
కూతురు, కొడుకుది కోరిక నెరవేర్చటానికి ఆవిడ ఆ పెద్ద హోటల్ వైపు బయలుదేరింది.
"బస్సు వాళ్ళకి, హోటల్ వాళ్ళకీ మధ్య ఒప్పందం వుంటుందనీ, భోజన సమయానికి వాళ్ళ హోటల్ ముందే బస్సుని ఆపుతారనీ, ఆ హోటల్ వాడు పెట్టిన గడ్డేదో గబగబా నోట, ముక్కున కుక్కుకుని, ఆదరాబాదరాగా మళ్ళీ వచ్చి బస్సులో పడాలని" ఇలాంటి విషయాలేమీ వకుళాంబకి తెలియవు.
హోటళ్ళలో తినటం, సినిమాలు చూడటం, ఆచమ్మ పోచమ్మ కబుర్లు చెప్పుకోవటమూ ఇలాంటివన్నీ ఆవిడకి చాలా ఇష్టం. స్థోమత లేకపోవటమూ, భర్త పల్లెటూరిలో గుళ్ళో పూజారి కావటముతో, ఇలాంటి కోరికలు ఆవిడవేమీ తీరలేదు. పిల్లలకి కూడా ఆవిడ పోలికే వచ్చింది.
హుషారుగా పిల్లలతో పెద్ద హోటల్ దగ్గరికి నడిచిన ఆమె డబ్బుల మాట గుర్తుకు రావటంతో, 'డబ్బులు పెట్టెలో పెట్టాను. జాగ్రత్తగా తాళం వేసి ఒక్క ఒక్క వందరూపాయలు మాత్రమే తీసుకురా! మీ నాన్న నిద్రపోతుంటాడేమో, పెట్టెని ఒక్కకంట జాగ్రత్తగా చూస్తుండమను' అన్న హెచ్చరికతో పాటు, తాళిబొట్టు తాడుకి కట్టుకున్న తాళం చెవిని విప్పి సుందరాచారి చేతిలో పెడుతూ చెప్పింది వకుళాంబ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS