Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 47


    "బస్" అన్నాను రామ్ సింగు మాటలకి అడ్డు వస్తూ.


    రామ్ సింగు నోరుమూసుకున్నాడు.


    "ముందు మనం ఈ టెలిఫోను బూత్ దగ్గరనుంచి దూరంగా వెళ్ళటం మంచిది పద" అన్నాను వేగంగా నడుస్తూ. మౌనంగా నాతోపాటు తనూ వేగంగా నడిచాడు రామ్ సింగు.


    అయితే ఐదు నిమిషాలలో చాలా దూరం వచ్చేశాము.


    "ఊ...ఇప్పుడు చెప్పు, ఈ రోడ్డు ఎలాగూ నిర్మానుష్యంగా వుంది. మనం మాట్లాడుకునేది ఎవరూ వినరు" పొట్ట ఉబ్బిపోతుంటే కుతూహలం ఆపుకోలేక అడిగాడు రామ్ సింగు.


    "చెపుతా! చెపుతా. వివరంగా చెపుతా. ఇందాక అన్నావ్ చూడు ఎప్పుడయినా ఖర్మకాలి మనం ఇన్ స్పెక్టర్ కి చిక్కితే అని... అలా చిక్కిననాడు నేను చెప్పే అబద్ధం నిజం అంత చిక్కగా వుండటానికి ఈ తిక్కిరి బిక్కిరి పనన్నమాట..."


    "నీవు చెప్పేది నాకు అర్థమై చావటంలేదు."


    "అర్థమై చచ్చేలా చెపుతాను విను. మనం ఒకరోజు పోలీసు స్టేషన్ కి వెళుతూ వుండగా బాస్ తాలూకా మనుషులు మనన్ని బంధించారు. ఈ రోజు బాస్ గాడి బంధిఖానానుంచి నేను తప్పించుకుని పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో దూరి కంగారు కంగారుగా ఇన్ స్పెక్టర్ కి ఫోను చేస్తూ వుండగా బాస్ మనుషులు నన్ను చుట్టుముట్టి నాలుగు ఉతికి లాక్కెళ్ళారు. నేను రక్షించండి ఇన్ స్పెక్టర్ సార్! అని అరిచాను.


    ఆ విధంగా నాటకం ఆడటానికి కారణం మనం మంచివాళ్ళం అని బాసు సజీవంగా ఈ ఊళ్ళోనే వున్నాడు. వాడి దగ్గర మేము బందీలం. బాసు దగ్గరే కోటీ యాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలు వున్నాయి. అని చెప్పి మన కథని పక్కదారి పట్టిస్తే ఇన్ స్పెక్టర్ దృష్టిలో మనం మంచివాళ్ళంగానే మిగిలిపోతాము.


    ఒకటి, రెండోది ఇన్ స్పెక్టరు మనని వెతకటం మానేసి బాసు గాడిని వెతకటంలో పడతాడు. దీనినే దృష్టిని మళ్ళించటం అంటారు. ఈ నాటకంలో బాగంగా నేనే రకరకాల కంఠస్వరాలు మార్చి మిమిక్రీ చేస్తూ మాట్లాడాను. అరిచాను. కొడుతున్నట్లు శబ్దాలు కూడా వినిపించాను. అర్థమైంది కదా."


    "ఇప్పుడు బాగా అర్థం అయింది" రామ్ సింగు అన్నాడు.


    "ఇంకా అర్థమయ్యేలా ఇంకో కొత్త విషయం చెపుతాను. ఇన్ స్పెక్టర్ గారికి బాసుగాడు ఫోను చేసి... కోటీ యాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలు మన దగ్గరే వున్నాయని నాలుగు ఉతికితే ఆ రహస్యం చెపుతారు. బాగా ఉతకమని...చెప్పాడట. మనం పారిపోయామని ఇన్ స్పెక్టర్ గారు గాడికి చెప్పలేదుట...


    "మిష అర్లా!" ఆశ్చర్యంగా నోరు తెరిచాడు రామ్ సింగ్.  


    "నా ఫోన్ కాల్ బాసుగాడి ఫోను కాల్ వల్ల ఇన్ స్పెక్టర్ గారి బుర్ర గిర్రున తిరిగి చివరికి మనం ఆపదలో వుందామని బాసుగాడు మోసగాడని గ్రహించి__మన విషయం వదిలేసి బాస్ గాడి కోసం వేట మొదలు పెడతాడు దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    "బాప్ రే బాప్!" మరోసారి ఆశ్చర్యంగా నోరు తెరిచాడు రాంసింగ్.


    "ప్రతి చిన్న విషయానికి అలా నోరు తెరవకు. మనం ఇంకా జైలులోనే వున్నామని బాస్ గాడు భ్రమపడుతున్నాడు. మనం ఎగిరిపోయామన్న నిజం తెలిసిన నాడు మనకోసం మళ్ళీ వేట మొదలు పెడతాడు. మన జాగ్రత్తలో మనం వుండటం మంచిది."


    "మరి ఆ వజ్రాల సంగతి..."


    "అవి బాస్ గాడి చేయి జారిపోయాయి. అవెక్కడో అక్కడ భద్రంగా వుండి వుంటాయి. ఏదో ఒకరోజు అవి...ఒక కోటి యాభై లక్షల రూపాయల విలువగల ఆ అమూల్యమైన వజ్రాలు మన చేతికి రావటం ఖాయం. నేను గట్టిగా అనుకున్నవి జరుగుతాయి. నా ఆత్మవిశ్వాసం అంత గట్టిది. గొప్పది. బలీయమైంది" అంటూ ముగించాను.


    "బాస్ గాడిని వెతకటం ఎలా?"


    "వాడు ఎక్కడో దాక్కుని ఇన్ స్పెక్టర్ గారికి ఫోను కొడుతున్నాడు. మనం ఇదే వేషాలలో వుండి అన్ని మూలలా గాలించి ఆ చుంచు ముఖంగాడిని పట్టుకుందాము. నేను గట్టిగా తలచుకుంటే సాథ్యం కానిది ఏదీలేదు."


    బాస్ గాడి రహస్య స్థావరాలు, అలవాట్లు, వాడి పద్ధతులు, ఎత్తులు నాకు కరతాలకమలమే. కాబట్టి వాడిని కనిపెట్టగలననే నా ఆత్మవిశ్వాసం నా చేత ఆ మాట అనిపింపచేశాయి.


    ఇరువురం అలా మాట్లాడుతూ నడుస్తుండగా రోడ్డుకవతల చిన్నకారు ఎక్కుతూ సుస్మిత కనిపించింది. సాదాసీదా దుస్తులతో కాన వచ్చింది.


    సూటూ బూటూ వేసుకున్న ఒక పెద్దాయన పక్కన వున్నాడు. ముందు ఆయన కారు ఎక్కాడు. వెనుకనే చిన్న బ్యాగ్ ఏదో ఫైల్ లాంటిది పట్టుకుని సుస్మిత కారు ఎక్కుతున్నది. సుస్మిత తల దించుకుని వుంది. అయినా గుర్తు పట్టాను.


    వేలమంది మధ్యలోవున్నా నా సుస్మితణు గుర్తుపట్టగలను.


    ఇన్నాళ్ళ తర్వాత కాదుకాదు. ఇన్నేళ్ళ తర్వాత నా ప్రాణం నా సుస్మిత నా కళ్ళ పడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS