అంతవరకూ తుఫాను ముందు ప్రశాంతతని కొలుస్తూ కేబిన్ కూచున్న షిప్ కెప్టెన్ 'యమగూచీ' ఓమారు చేసుకున్న ల్యుమినిస్ వాచ్ చూసుకున్నాడు.
కేబిన్ డోర్ తెరుచుకుని డెక్ పై నిలబడి మరో అయిదు నిమిషాలు గడిపాడు_ చల్లని గాలికి సేద దీర్చుకుంటున్నట్టు.
నాలుగుంపావు.
చీఫ్ ఆఫీసరు యమగూచీ ముందు నిలబడ్డాడు.
సాయంకాలం ఆరు గంటల ప్రాంతంలోనే శశాంక అనబడే వ్యక్తి మరో అనుచరుడితో షిప్ లో అడుగుపెడుతున్నట్టు జయచంద్ర మనుషుల ద్వారా తెలుసుకున్న 'యమగూచీ' తన 'క్రూ' అంతటినీ పిలిచి జరగబోయేది వివరించాడు.
పోర్టులో ఏ మాత్రం రభస జరిగినా అసలు విషయం బయటపొక్కి తమకే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం వుంది కాబట్టి, స్మగ్లింగ్ చాలా అనుభవం గల కెప్టెన్ యమగూచీ రహస్యంగా ప్రత్యర్థులు అడుగు పెడుతున్నా చూసీ చూడనట్టు ఊరుకోమన్నాడు.
సముద్ర జలాల్లో సేఫ్ గా యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేక గాని శవాలుగా మార్చి సముద్రంలో పడవేయకూడదన్నది అతని ఆదేశం.
బంగాళాఖాతం నుంచి అప్సిఫిక్ ఓషన్ కి సాగే తన ప్రయాణం పైరేట్స్ (సముద్ర దొంగలు)తో ఇంతవరకూ అతడెలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోలేదు. అయినా షిప్ భద్రత కోసం చాలా కాలం క్రిందటే కొన్ని ఆయుధాల్ని సమకూర్చుకున్నాడు.
సరిగ్గా రాత్రి పది గంటలకి తన నలభై రెండు మంది 'క్రూ' విడివిడిగా ఆయుధాల్ని అందించాడు.
అర్థరాత్రి పన్నెండు గంటలు దాటిన అయిదు నిమిషాలకి వచ్చిన వ్యక్తులు ఓడ హేచెస్ (ఖనిజం నింపుకునే పిట్స్)కి సమీపంలోని ఓర్ హెండ్లింగ్ ప్లాంటు లోడర్సు ద్వారా డెక్ పై అడుగుపెడుతుంటే కేబిన్ లో నుంచి చూసీ చూడనట్టే ఊరుకున్నాడు.
అంత ధైర్యంగా డెక్ ని చేరిన ఆ ఇద్దరూ ప్లాంటు ఆపరేటర్స్ కి డబ్బిచ్చి రాగలిగారో లేక కునికిపాట్లు పడుతున్న ఆపరేటర్స్ ని మభ్యపెట్టి వచ్చారో పట్టించుకోలేదు.
యమగూచీ ధ్యేయమూ, జయచంద్ర కిచ్చిన మాటా ఒక్కటే. జయచంద్రకి శత్రువులైన ఆ వ్యక్తుల్ని చంపి సముద్రంలోకి నెట్టి షార్క్ లకి ఆహారం చేయడం.
ప్రత్యర్థుల ఆచూకీ ముందే తెలియడంతో, పైగా అది చాలా పరిమితమైన ప్రదేశం కావడంతో తప్పించుకోలేరన్నది అతడి బలమైన నమ్మకం.
ముందు ఎటాక్ వారి పరంగానే జరగాలని ఆలోచిస్తున్న అతడి ఆలోచనకి రూపమిస్తూ ఓ ఆకారం డెక్ అంచునుంచి నెమ్మదిగా ముందుకు ప్రాకుతోంది.
యమగూచీ చీఫ్ ఆఫీసర్ వేపు చూసాడు సాలోచనగా. సుమారు రెండు వందల అడుగుల పొడవున్న డెక్ మీది గేర్ బాక్స్ మూలనున్న ఓ గార్డు స్టెన్ గన్ తో కాస్త పక్కకి జరిగాడు_ప్రత్యర్థి తన రేంజ్ ని సమీపించేదాకా ఆగాలన్నట్టు.
చీఫ్ ఆఫీసరు నెమ్మదిగా జేబులోని రివాల్వర్ ని బయటికి తీసి, అడుగులో అడుగు వేస్తూ ఆకారాన్ని సమీపించడమూ, మరుక్షణం రివాల్వర్ అతడి వీపుపై బలంగా గుచ్చడమూ రెప్పపాటులో జరిగిపోయింది.
ఇది వూహించని సంఘటన అన్నట్టుగా జాకీ వణికిపోతున్నాడు.
గేర్ బాక్స్ సమీపంలో వున్న గార్డు రివ్వున దూసుకొచ్చి స్టెన్ గన్ తో బలంగా జాకీ మొహంపై కొట్టాడు.
'అమ్మా' సన్నని మూలుగు కన్నా వేగంగా రక్తం జాకీ నాసికా రంధ్రాల్లో నుంచి బయటికి చిమ్మింది.
యమగూచీ అరిచాడు ఏదో ఆదేశిస్తున్నట్టుగా.
నలుగురు గార్డులు ఓడకి ఓ మూలనున్న చిన్న పడవల్లాంటి 'జంక్స్'ని చేరుకున్నారు శశాంకని చుట్టుముట్టాలని.
** ** **
ఉలిక్కిపడి నిద్రలేచింది వినీల.
ఎవరో తలపై మోదినట్టయి ఫోన్ రింగవుతూంది.
శశాంక ఏ క్షణంలో ఎలాంటి ఆపదలో ఇరుక్కుంటాడో తెలీక కలవరపడుతూ ఓ గంట క్రితమే నిద్రలోకి జారిన వినీల పాలభాగం చెమటతో తడిసిపోయింది_ఆ నిశిరాత్రి ఫోన్ చప్పుడుతో.
ఈ వేళలో తనకు ఫోన్ రావటం అనూహ్యమైన విషయంగా భావిస్తూ, వణుకుతున్న చేతుల్తో రిసీవర్ని అందుకుంది.
"హల్లో... నేనే"
"......"
"వ్వాట్_శశాంకకేమైంది"
"ఈపాటికి సముద్రంలో చేపలు భోంచేస్తుంటాయి."
వినీల కళ్ళ నుంచి నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.
ఉదయం అతడ్ని తప్పించాక కలవాలని మూడు సార్లు ఇంటికి ఫోన్ చేసింది. ఎలాగన్నా కలుసుకోవాలని చివరికి ఇంటికెళ్ళి ఆపరాత్రి దాకా వెయిట్ చేసింది.
"నో" నమ్మశక్యం కానట్టు వినీల గొంతు తడబడిపోతూంది. "జయచంద్రగారూ... శశాంకకి ఏదన్నా ఆపద జరగడమే నిజమైతే మీకు రెండో ప్రత్యర్థిని నేనవుతాను. నేనెంత తెగించిన ఆడదాన్నో మీరు ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి అన్నప్పుడే శశాంకకి హాని తలపెట్టండి"
