Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 47


    "కనీసం ఇప్పటికైనా నా కక్షకి కారణాన్ని తెలుసుకో గలిగిన శశాంకా! ఇలాంటి ఒక నడ్డాలతో చావుదెబ్బ తీయగలిగితే జయచంద్ర ఆయువులో మూడో వంతు నీ చేతుల్తో తగ్గించినట్టవుతుంది.."


    "ఇలాంటి అతి ప్రమాదకరమైన పనికి నన్నే పురమాయించడంలో నీ ఉద్దేశ్యం"


    "అరుదుగా వచ్చే ఇలాంటి అవకాశాన్ని అరుదైన వ్యక్తిత్వం గల నీలాంటివాడికి అప్పచెప్పాలని" ఇప్పుడు సోఫియా కళ్ళలో కామంతో జ్వలించిపోయే కాంక్షల తీవ్రతకన్నా దక్షతగల వ్యాపారవేత్తలోని స్నిగ్ధత కనిపిస్తూంది... "అంతకు మించి ఓ అనుకోని దుమారంలో రేణువుగా కదిలిన ఓ అణువును మరింత విభజించే ప్రయత్నంచేసి ఆ మారణాయుధ విస్పోటనంతో ఈ దేశపు అండర్ వరల్డ్ రాకెట్స్ సిండికేట్ కి ప్రతినిధి అయిన జయచంద్రకి నీ ద్వారా నేను సింహస్వప్నం కావాలని"


    ఇక్కడ వినీలని మించి సోఫియా అతడిపై సైకిలాజికల్ గా గెలించింది. నష్టపోయిన ఆవేశపరుడ్ని ఎక్కువగా కదిలించగలిగేది ఆవేశం తప్ప సానుభూతి కాదు. ఈ న్యూటన్ థియరీ వస్తువులకే కాదు, మనుషులకీ వర్తిస్తుందని తెలుసుకోగలిగిన ఆడదామె.


    "వెల్... మరి దానికి నా వాటా ఎంత వుంటుంది."


    "నేనే నీదాన్నయినప్పుడు వాటాతో పనేముంది?" ఆర్తిగా అతడి కళ్ళలోకి చూసింది.


    "మనం ఆడుకునే  సమయంలో ఇలా మాటాడుకుందాం సోఫియా. ప్రస్తుతం బిజినెస్ డీల్ గురించి తేల్చుకుందాం..."


    శశాంక గొంతులో స్థిరత్వానికి కొద్దిగా ఖంగుతిన్న సోఫియా "వెల్... ఎంత కావాలి?" అడిగింది.


    "ఇప్పుడు నేను వెళుతున్నదాంట్లో నా వ్యక్తిగతమైన కక్ష అనే పాయింటు కూడా వుంది కాబట్టి..." అన్యమనస్కంగా బయటికి చూస్తూ అన్నాడు 'మొత్తం ఖరీదులో అయిదు శాతం నాకు వాటా యివ్వాలి. దానికి ముందుగా ఓ లక్ష అడ్వాన్స్ ఇవ్వాలి_అంగీకారమేనా"


    "ఓకె"


    సంతృప్తిగా నిట్టూరుస్తూ శరణాలయంలోని నాలుగేళ్ళ పాప 'రూప' గుర్తుకు రావడంతో గాలివాటుగా కొట్టుకుపోతూ ఆపదల్లో కూరుకుపోతున్న తనకు అణువంత సంతృప్తినివ్వగలిగేవి ఈ క్షణాలే. ఇది ఎప్పుడో నిర్ణయించుకున్నా జాకీ మూలంగా తన ఆలోచనలకి రూపమిచ్చే అవకాశం కలిగింది.


    డబ్బు వెంటనే పంపే ఏర్పాటు చేశాడు.


    "నా అనుచరుల అండ నీకు కావాలా?"


    "అక్కర్లేదు. వెంటనే వైజాగ్ వెళ్లడానికి రెండు టిక్కెట్లు ఏర్పాటు చెయ్యి."


    రెండో టిక్కెట్ ఎవరికి అని ఆమె అడగలేదు.


    వివాస్పదమైన ప్రశ్నలతో అతడు తనను అనుమానించేలా చేసుకోవడం సోఫియాకి ఇష్టం లేదు.


    కేవలం పది నిమిషాల వ్యవధిలో రెండు ఫ్లయిట్ టిక్కెట్స్ ఎరేంజ్ చేయగలిగింది.


    ద్వారం దాటబోతున్న శశాంక ఓ క్షణం ఆగేడు.


    "మిస్ సోఫియా... ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నది ప్రాణాలే కాబట్టి ఒకవేళ నేను తిరిగి రాకపోయినా నువ్వు చెల్లించిన లక్ష రూపాయలు నా జీవితానికి నాకు నేనుగా కట్టుకున్న ఖరీదుగా భావించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు వెనక్కి రప్పించే ప్రయత్నం చేయకు."


    సాలోచనగా చూసింది అతడ్ని.


    క్షణక్షణానికి మెరుపులా ఎదిగిపోతున్న శశాంక వెళుతుంటే తిరిగి రాగానే అతడ్ని పడక పైకి రప్పించుకునే ఓ తిరుగులేని ఏర్పాటు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు కూడా తనకు అవసరంగా మారని 'ధనుష్కోటి హత్య' ఫోటోని ఓమారు తదేకంగా చూసి రేక్ లో పడేసింది.


    సోఫియా ఇక్కడ కూడా పొరపాటు పడింది జయచంద్ర విషయంలో.


    శశాంక వైజాగ్ చేరిన అరగంటకే సోఫియా పథకం తెలిసిపోయింది జయచంద్రకి.


                                                      *    *    *    *


    తెల్లవారుఝాము నాలుగు గంటల వేళ...


    యోషిడా షిప్పింగ్ కంపెనీకి చెందిన సుమారు పదిహేను వేల టన్నుల బరువుగల "మసాకో టాక్చూచీ" బంగాళాఖాతంలో నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది అప్పుడే.


    దూరంగా డాల్ఫిన్స్ నోస్ కొండపై వున్న వైట్ హౌస్ కాంతి అస్పష్టంగా కనిపిస్తూంది.


    అనంతాకాశం నడుం విరిగిన యోధుడిలా సముద్ర జలాల్లో కలిసిపోతూ మరో దిక్కున రాలిన నక్షత్రాలు సరళరేఖలా కనిపిస్తున్నాయి.


    రివ్వున వీస్తున్న గాలి సద్దుమణిగిన రేయిలో గుండె పగిలిన దిక్కుల హోరును గుర్తుచేస్తుంటే వేగుచుక్క వెలుగును అద్దుకున్న సముద్రపు అలలు పగలబోయే ఏ కన్నె కలల్నో జ్ఞప్తికి తెచ్చుకుంటూ గడుసు దెయ్యాల్లా తలలూపుతున్నాయి.


    మరో పది నిమిషాలు గడిచాయి.


    నేల మాయమైంది నిగని తప్ప_చుట్టూ నీరు దిక్కుల్ని తాకుతున్నట్టు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS