రాత్రిపూట పర్మిట్ చెయ్యరని ప్రొద్దుటిదాకా ఆగాను. థ్యాంక్ యూ!" అన్నాడు.
"ఏవిటీ మనిషి? తన కోసమంటూ ఏమీ మిగుల్చుకోడా"! అనుకున్నాను.
అతనికి ఇష్టమైన పనులు చేస్తే అతను ప్రేమిస్తాడని నాకు అర్థమైంది. అందమైన స్వార్థం! ఇంకోరోజు ఫోన్ చేశాడు. రషీద్ భార్యకి నెప్పులొస్తే ఇంటిదగ్గర నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేశాడట. దగ్గర ఎవరూ లేరు. మీరు రాగలరా?" అని.
నేను పర్మిషన్ తీసుకుని వెంటనే వెళ్ళాను.
రషీద్ హిందువుల అమ్మాయిని ఇంటర్ కాస్ట్ మేరేజ్ చేసుకున్నాడు. వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టంలేడు. ఆ అమ్మాయిని పుట్టింటివాళ్ళు రానివ్వరు. రషీద్ కి తండ్రి తప్ప అయిన వాళ్ళు ఎవరూ లేరు!
ఆ రాత్రంతా ఇంద్రాణి నెప్పులు పడి తెల్లవారు ఝామున ఆడపిల్లని ప్రసవించింది. నేను లేబర్ రూంలో ఆమె తల దగ్గరే ఉన్నాను. కాళ్ళు లాగేస్తున్నాయి. కానీ అతను నిర్దేశించినపని. అతనికి ఆనందం ఇవ్వడం ద్వారా నేను ఆనందంపొందే ప్రక్రియ! దీన్ని ప్రేమ అనక ఏవంటారు?
నా చేతుల్లో గులాబీ మొగ్గలాంటి చిన్నారిని పొదివి పట్టుకుని బయటికి తీసుకెళ్ళాను. రషీద్ ఇంద్రాణిని మొదట చూడాలని లోపలికి పరిగెత్తాడు.
నేను చంద్ర దగ్గరకి పాపని తీసుకెళ్ళి చూపించాను. ఎంతో కాలంగా ఎదురు రాసిన ఆప్తమిత్రుడ్ని చూసిన ఫీలింగ్ అతనికళ్ళల్లో కనిపించింది. వేలితో పాప పెదవులమీద సుతారంగా చూశాడు.
పాప కనులు విప్పి మొదటిసారిగా అతన్నే చూసింది. అతని వేలిని చేత్తో పట్టుకుంటున్నట్లు ఆడించింది.
"హే...య్..." అంటూ అతను అరిచి నవ్వాడు!
నాకు వెన్నెలవాగులో స్నానం చేసినట్లు అనిపించింది. అతని 'నవ్వు' చూస్తుంటే రాత్రల్లా నేను పడిన అలసట చేత్తో తీసినట్లు పోయింది!
అది అంత అద్భుతంగా వుంటుందని అప్పుడే తెలిసింది! అది అలానే నిలవాలంటే... ఏం చెయ్యాలీ?
రషీద్ నాకు కృతజ్ఞతలు చెప్పాడు.
చంద్ర నాతో "మీకు క్యారేజ్ తెస్తాను" అన్నాడు.
"అంత దూరంనించి మళ్ళీ ఏం వస్తారు? నేను ఇక్కడ ఏదో ఒకటి తినేస్తాలెండి!" అన్నాడు.
"సరే!" అన్నాడు.
చిన్న ఆశాభంగం కలిగింది! కానీ అతనిలో ఆ గుణాన్నే కదా నేను ప్రేమిస్తున్నదీ. హిపోక్రసీ లేకుండా స్వచ్చంగా ఉండగలగడం అలవాటు చేసుకోవాలి.
రషీద్ కూతురికి చంద్ర 'గులాబీ' అని పేరు పెట్టాడు. పాపకి తగ్గ పేరుగా అనిపించింది.
ఇంద్రాణి చంద్రని 'అన్నయ్యా' అంటుంది.
చంద్ర ఆమెతో మాట్లాడినట్లు కనిపించలేదు కానీ, ఏం చెప్పినా సీరియస్ గా వింటూ వుంటాడు.
"గులాబీ! అత్తని తీసుకురమ్మని మామకి చెప్పు" అంటూ ఇంద్రాణి కూతురిచేత అడిగించింది.
చంద్ర పాపబుగ్గని వేలితోరాసి అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిపోయాడు.
ఇంద్రాణికీ నాకూ మంచి స్నేహం అయింది.
అందరిలో పొడజూపే భావన ఒకటే!
నన్నూ, చంద్రనీ జంటగా చూడాలని! కానీ ఎవరికీ సూటిగా ఆ విషయం కదిపే ధైర్యం లేనట్లుంది.
* * *
నానమ్మకి ఒంట్లో బాలేదు.
నేను రెండు రోజులు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అతని సమక్షంలో నేను పరవశించని క్షణంలేదు.
"కాళిందీ...మీరు మంచం మీద పడుకోండి. నేను ఇక్కడే క్రింద చాపవేసుకుని పడుకుంటాను" అన్నాడు.
"నేనూ క్రింద పడుకోగలను" అన్నాను.
"రాత్రిపూట నత్తగుల్లలూ, ఇంకా రకరకాల క్రిమికీటకాలూ ఇంట్లోకి వచ్చి మాతో సహజీవనం చేస్తాయి. మీకు అలవాటు లేదుగా" అన్నాడు.
ఇంక నేనేం మాట్లాడలేదు.
సాయంత్రం ఇద్దరం కలిసి మార్కెట్ కి వెళ్ళాం. తిరిగివచ్చేటప్పుడు వాన పడింది.
ఆ విధంగా అతనితో కలిసి వానలో నడిచి వస్తుంటే నాకు చాలా బావుంది.
కుంకుమ కరిగి నా ముక్కుమీదకి కారుతోంది. జుట్టు వీపుమీద తడికి అతుక్కుపోయింది. చీరకుచ్చిళ్ళు చుట్టుకుపోతూ అడుగుతీసి అడుగు వెయ్యనియ్యడంలేదు. నిర్మానుష్యంగా వుంది.
"కాసేపు ఆగుదాం" అంటూ ఓ చెట్టుక్రిందకి తీసుకెళ్ళాడు. నీళ్ళు కారుతూ అంత దగ్గరగా అతనికి నిలబడడం నాకు సిగ్గో, మైమరుపో ఏదో కలిగిస్తోంది.
అతను చూపు మరల్చుకోకుండా నావైపే చూస్తున్నాడు. నేను తల క్రిందకి వాల్చుకున్నాను.
"తల ఎత్తండి" అన్నాడు.
నేను ఆశ్చర్యంగా చూశాను.
అతను ఎంతో మామూలుగా నాముక్కుపైనుండి జారుతున్న కుంకుమని తన వేలితో సవరించాడు.
నాకు అద్భుతంగా అనిపించింది.
