Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 48

" అమ్మా... నీకు"
"నాకేంకాదు... అభినయ్ వున్నాడుగా...నన్ను చూసుకుంటాడు. ముందు నువ్వు పారిపో" బాధను దిగమింగుతూ అన్నది.
రవితేజ కనులు తుడుచుకుంటూ వెనకవైపు తెరుచుకుని వెళ్ళిపోయాడు.
పోలీసులు బిలబిల మంటూ లోనికి వచ్చారు.
వాళ్ళ కంటికి  బాధతో మూల్గుతున్న వసుమతి రక్తపు మడుగులో కనిపించింది.
"బాస్టర్డ్...ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. అతనని వదలొద్దు... షూట్ హిమ్" అంటూ ఆర్డర్స్ జారీ చేశాడు సిబ్బందితో వచ్చిన ఇన్ స్పెక్టర్.
సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి అత్యుత్సాహంగా వెనక్కు పరుగు తీశాడు.
రవి తేజ అప్పుడే ప్రహరీని జంప్ చేస్తూ కనిపించాడు.
"పైర్_"
ఒక్కసారిగా పోలీసుల చేతులలోని రైఫిల్స్ బుల్లెట్ల వర్షం కురిపించాయి.
రవితేజ దిక్కులు పిక్కటిల్లేలా అరచి ఎగిరి అవతల పడ్డాడు.
అతని చూట్టూ రక్తపు మడుగు కట్టింది.
దగ్గరకు వెళ్ళిన సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి ఆనందంతో గంతులు వేసినంత పని చేశాడు.
రవితేజ చనిపోయినట్టు సి ఐ తో చెప్పగానే... ఫోలీసు సిబ్బంది అంతా అతని శవంచుట్టూ చేరారు.
వెంటనే శవాన్ని  పోస్ట్ మార్టమ్ కు పంపడం జరిగి పోయింది.
   
                                                   *    *    *    *
హాస్పిటల్ లోని వీరేష్ మంచాన్ని వదలడం లేదు ధీరజ.
లాభం లేదని పెదవి విరిచిన డాక్టర్లు మృత్యు ముఖంలోనుంచి వీరేష్ బయట పడవేయడంలో విజయం సాధించారు.
అతని ప్రాణాలకు వచ్చిన భయం ఏమీ లేదనీ... కాకపోతే లేచి తిరగటానికి ఎంతకాలం పడుతుందో... శరీరంలో దెబ్బతిన్న భాగాలలో ఏవి వుంటాయో, ఏవి తీసివేయవలసి వస్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేమని తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు.
ప్రాణాలు దక్కినందుకే సంతోషించిన ధీరజ వాళ్ళ మాటలను పట్టించుకోలేదు.
వీరేష్ కోలుకునేటంతవరకూ అతనికి ఆ స్థితి కల్పించింది ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు.
అతను కూడా పెదవి విప్పి ఆ రోజు జరిగిన సంఘటనను గురించి చెప్పలేదు.   

                     *    *    *    *
జయచంద్ర భవంతి.
లాయర్ సత్యమోహన్ ముఖంలో కత్తివేటుకు చుక్కకూడా రక్తం లేనట్టు పాలిపోయి వుంది.
"ఏ సి పి వీరేష్ చనిపోలేదు..." ఎలాగో గొంతు పెకలించుకుని చెప్పాడతను.
"నాకూ తెలిసింది ఆ విషయం.... ఆ రోజు చచ్చాడనే శవాన్ని అలా వదిలేశాం కదా."
"అవును... కానీ మొండి మనిషి కావడంవల్ల వెంటనే చావలేదు. కొన ప్రాణాలతో వున్నప్పుడు ఎవరో పోలీసులకు ఇన్ ఫామ్మ చేశారు.డాక్టర్లు అతనని బ్రతికించినా ప్రయోజనం లేనట్టే. శరీరంలో ఏయే  పార్ట్ లు తీసివేయాలో  డాక్టర్లు ఇంకా నిర్ణయించుకోలేదు" సత్యమోహన్ చెప్పుకుపోతున్నాడు.

    "ఉండవయ్యా... మనమే ఆ పని చేసి వుంటామని చెప్పాడంటావా?"
"చెప్పలేదు... చెప్పినా ప్రయోజనం లేదని ఊరుకుండి వుండవచ్చు. మనమే అతన్ని చంపే ప్రయత్నం చేసి వుంటామని ప్రాణాధికంగా ప్రేమించే ధీరజకు కూడా చెప్పలేదు."
"ఎందుకయినా మంచిది... ఆ హాస్పటల్  స్టాఫ్ లో మన వాళ్ళను వుంచు... వీరేష్ అఖండుడు... అతని విషయంలో మనం అశ్రద్ధ చూపకూడదు. ఒకవేళ అతను మనల్ని ఏదయినా చేయాలని ప్రయత్నించినా కోలుకుని మామూలు మనిషి కావడానికి చాలా నెలలు పడుతుంది. అప్పటికీ అతని కాళ్ళు చేతులు సరిగా వుంటాయో లేదో కూడా తెలియదు. ఒకవేళ అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ అతను ఉద్యోగంలో ఉంటాడనీ గ్యారంటీ లేదు."
"అదేంటి బావా... డిపార్ట్ మెంట్ లో అతనిపై సింపతీ వుంటుంది కదా... అందువల్ల నయినా అతనని తొలగించక పోవచ్చు" అన్నారు సత్యమోహన్.
"నిజమే... కానీ మనం అప్పటికి ముఖ్యమంత్రి పదవిలోకి మారి  ఉంటాం. అతన్ని ఎలా ఆడించాలో మనమే అప్పుడు నిర్ణయిస్తాం... అంతవరకూ అతను బ్రతికున్నా జీవశ్చవం కిందే లెక్క..."
జయచంద్ర మాటలకు లాయర్ సత్యమోహన్ పడీ పడీ నవ్వాడు.
ఇద్దరి నవ్వులతో ఆ గది ప్రతిధ్వనించింది.
మాటలను కట్టి పెట్టి వుస్కీ గ్లాసులతో ఎంజాయ్ చేయడం ప్రారంభించారు ఇరువురూ!
 
                                                 *    *    *    *
పోలీసుల బుల్లెట్లకు రవితేజ బలయ్యాడన్న వార్త అప్పటికప్పుడే నగరమంతా వ్యాపించింది.
జర్నలిస్ట్ ధీరజ మ్రాన్పడిపోయింది.
రజని స్పృహా కోల్పోయింది__
ఆనందరావు గుండె ముక్కలయింది.
జయచంద్ర మౌనం వహించాడు_
సత్యమోహన్ సానిభూతి ప్రకటించాడు_
అభినయ్ వికటాట్టహాసం చేశాడు_
"బాబూ... నేను విన్నది నిజేమేనా... రవితేజ మరణించాడా" బెడ్ మీద వున్నన వసుమతి కొడుకుని అడిగింది.
డాక్టర్ల ఆపరేషన్ చేసి భుజంలో దిగబడిన బుల్లెట్ ను తొలగించారు.
ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడింది.
తన శత్రువు ఇక లేడనే విషయం తెలిసేసరికి అభినయ్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది.
"అవునమ్మా... పోలీసులు కుక్కను కాల్చినట్టు కాల్చి చంపారు."
మరుక్షణం అతని చెంప చెళ్ళుమంది.
అభినయ్ బొమ్మలా నిలబడిపోయాడు. తల్లి ఎందుకు కొట్టిందో అతనికి అర్ధం కాలేదు.
"ఒరేయ్... ఈ తల్లి మీద ఏ మాత్రం గౌరవం వున్నా నా ఇంటి నుంచి వెళ్ళిపో... నువ్వే హంతకుడవని పోలీసులకు లొంగిపో.... నీ రక్తం పంచుకు పుట్టిన అన్న రవితేజకు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించు..."
ఆమె గొంతు మూగబోయింది.
ఆ మాటలు విన్న మరుక్షణం అభినయ్ గుండె వేయి శకలాలైపోయింది.
"అమ్మా.. రవితేజ నా తోడ బుట్టినవాడా" అంటూ అభినయ్ తల్లి వేపు చూశాడు.
అప్పటికే గుప్పెడు నిద్రమాత్రలను గ్లాసులో వేసుకుని ఆ నీటిని తాగుతూ కనిపించింది.
అమ్మా.." అంటూ ఆమెను సమీపించేసరికే గ్లాసులోని నీటిని గట  గటా తాగింది.
అరగంట తర్వాత_
"డోంట్ ఎక్సయిట్ మెంట్ మిస్టర్ అభినయ్... షి విల్ బి ఆల్ రైట్... అయితే..."
అర్ధోక్తిలో చెప్పడం ఆపాడు డాక్టర్.
"వాట్ హేపెండ్ డాక్టర్... సందేహింస్తున్నారేం చెప్పండి..."
ఎన్నో రోజులుగా నిద్ర మాత్రలు తీసుకోవడం వలన జీర్ణకోశం దెబ్బతిన్నది. అంటే ఆమె ఏదో మానసిక వత్తిడికి తట్టుకోలేక పిల్స్ కు అలవాటు పడింది. మళ్ళీ ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడింది. సవ్యంగా మారాలంటే కొన్ని రోజులు పట్టవచ్చు. ఇక నుంచి ఆమెను టెన్షన్ కు గురిచేయ నివ్వవద్దు ఎక్కువుగా ఆలోచించకుండా ప్రశాంతంగా వుండేలా చూసుకోవాలి..."
అభినయ్ నిశ్చలంగా తల్లినే చూస్తుండిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS