Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 47

తానే తెలివితక్కువ తనంతో... వెర్రి ఆవేశంతో ఏదేదో చేయాలనే తొందరపడింది.
"బేబీ.... వీరేష్ పూర్తి చేయకుండా మిగిలిపోయిన పనులను నువ్వు పూర్తి చేయాలి. జర్నలిస్టుగానే నీ పరిధిలో నువ్వూంటూ జయచంద్ర ఆటకట్టించే భాధ్యత ఇక నుంచి నీదే. ఈ విషయంలో ప్రధానమంత్రిగారితో ఇంతకుముందే మాట్లాడి వస్తున్నాను. ఎంత ఖర్చు అయినా వీరేష్ ను బతికించే బాధ్యత నాది. అండర్ స్టాండ్... ఒకే బేబీ గుడ్ బై..." అంటూ ఫోన్  పెట్టేశాడు ఛటర్జీ.
ధీరజకు తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది.
   
                       *    *    *    *
వసుమతి మనసు కీడును శంకిస్తుంది.
అభినయ్ గురించిన ఆలోచనలు ఒక పక్క... తన గత జీవితానికి సంభందించిన రహస్యం మరోపక్క ఆమెకు చాలా రోజులుగా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.
"వీటికితోడు రవితేజ జైలునుంచి తప్పించుకున్న వార్త కూడా ఆమెను కలవర పెడుతుంది.
సరిగ్గా అదే సమయంలో ఫోన్ మోగింది.
అంత అర్దరాత్రి వేళ తనకు ఫోన్ చేసేది ఎవరు అనుకుంటూనే ఫో ఎత్తింది. మరుక్షణం ఆమె చేతిలోని రిసీవర్ జారిపోయింది.
అభినయ్ ను చంపటానికి రవితేజ యమకింకరునిలా వస్తున్నాడు.
తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ... పురిటి పొత్తిళ్ళలోనే  దూరమైపోయిన పసికందు... చెట్టంత మనిషిగా ఎదిగి మొదటిసారిగా ఈ ఇంటికి వస్తున్నాడు.
ఆమెలో పుత్ర వాత్సల్యం పొంగిపొర్లింది.
ఎప్పుడో అంతరించిపోయింది అనుకున్న మమకారపు కెరటం ఒక్కసారిగా పొంగి వెల్లుబికింది. కానీ అతను వస్తుంది తనను తల్లిగా గౌరవించడానికి కాదు తన పేగు తెంచుకుని పుట్టిన సోదరుడిని చంపడానికి.
అభినయ్ గదిలో నిద్రపోతున్నాడు.
వసుమతి నిశ్చబ్దంగావెళ్ళి బయటనుంచి తాళంవేసి... ఆ భవంతిలోని లైట్లన్నీ వేసి అతని గదిముందు కుర్చీవేసుకుని కూర్చుంది.
కొద్దిసేపటికి రివాల్వర్ తో రవితేజ అడుగుపెట్టాడు.
"నీకు ఎంత ద్రోహం చేశానురా తండ్రీ....నిన్ను తల్లి మమకారానికి దూరం చేశాను. నీతో ప్రేమానురాగాలను పంచుకొనలేక పోయాను. నీ తప్పటడుగులు, ముద్దు ముద్దు మాటలు, అల్లరి చేష్టలు చూడలేకపోయిన దౌర్భాగ్యురాలిని నేను... నన్ను క్షమించు బాబూ..."
మూగాగా రోదిస్తుంది ఆ మాతృత్రూ హృదయం!
రవితేజ కన్నులలో వాత్సల్యం తొంగి చూస్తుంది.
రవితేజ ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు.
ఇంత రాత్రివేళ లైట్లన్నీ వేసుకుని, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు కూర్చున్నది అభినయ్ తల్లి అయివుండి వుండవచ్చుననుకున్నాడు.
తన రక్తాన్ని పంచుకుపుట్టిన బిడ్డను ఆ తల్లి తనివితీరా చూసుకుంటుంది. మమ్మూర్తులా తన పోలికలతో పుట్టాడు.
"బాబూ... నీ కోసమే ఎదురు చూస్తున్నాను."
రవితేజ వింతగా చూశాడామెవైపు....
"మీరు అభినయ్ తల్లిగారనుకుంటా..."'
గుండెలో బల్లెపుపోటు పొడిచినట్టు కలుక్కుమంది ఆమెకు.
"అర్దమయిందమ్మా__ జైలు నుంచి తప్పించుకున్నానని తెలిసి మీ బిడ్డను చంపడానికి వస్తానని ముందే వూహించి నన్ను పోలీసులకు పట్టివ్వడానికి సిద్దంగా ఎదురు చూస్తున్నారన్నమాట" అన్నాడు రవితేజ.
"లేదయ్యా__ నన్ను అపార్దం చేసుకోకు. ఇది నీ ఇల్లే అనుకో. నేను నీ  కన్న తల్లినే అనుకో... వక్రమార్గంలో నడుస్తున్న అభినయ్ ను నీ సోదరునిగా భావించి విడిచిపెట్టు బాబూ__"
"బిడ్డను రక్షించు కొనడానికి తల్లిగా మీరు తాపత్రయపడుతున్నారు. చేయని నేరానికి ఉరికంబం ఎక్కబోతుంటే నా కన్నతల్లి హృదయం ఎంతగా కుమిలిపోయిందో మీకు గుర్తుకు రాలేదా?"
"నేనేరా నీ కన్నతల్లిని... అందుకేరా ఇంత వ్యధ చెందుతున్నాను" ఆమె మనసు మూగగా రోదించింది.
"ఎవరు బాబూ నీతల్లీ" వసుమతి ప్రశ్నించింది.
"నన్ను కని అంతిమ శ్వాస విడిచిన ఒక పుణ్యమూర్తి నా తల్లి. ఆమె సజీవంగా లేకపోయినా ఆమె అంతరాత్మ ఎప్పుడూ నా వెంటే శ్రీరామ రాక్షలా వుంటుంది" అన్నాడు రవితేజ.
వసుమతి కనులనుంచి కన్నీరు జలజల రాలింది.
"నీ తల్లిని నేనే__ బతికే వున్నానురా" అని చెప్పాలని వుంది ఆమెకు.
కానీ గొంతు పెగలలేదు... ఏ అదృశ్య శక్తో అడ్డుపడినట్టయింది.
నీ తల్లిగా అడుగుతున్నాను. అభినయ్ ను వదిలి పెట్టుబాబూ... నీ తల్లే యిలా అడిగితే నువ్వేం  వ్వెం చేస్తావో చెప్పు. నీ తల్లికి గర్బశోకం కలిగిస్తావా!"
కేవలం అభినయ్ మీదనున్న ప్రేమ వల్లనే తనను ఇంతగా ప్రాధేయపడుతుందా?  తన తల్లి కూడా బ్రతికివుంటే ఇలానే తపన పడి పోయేదేమో... జైలుపాలు అయినప్పుడు తన తండ్రి కూడా అభినయ్ ను చంపవద్దు... అతను తన శత్రువు కాదు అన్నట్టు మాట్లాడాడు. ఎందుకు అలా చెప్పాడో? అందరూ అభినయ్ ప్రాణాలను కాపాడటానికే ప్రయత్నిస్తున్నారు.
కానీ... అందరకూ తెలుసు. తను నిర్దోషినని... అసలు దోషి అతనేనని... అయినా అతనని చంపవద్దు అంటున్నారు ఎందుకు?
"సరేనమ్మా... తల్లిలాంటి నువ్వున్ను ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి తన నేరాన్ని పోలీసులకు లొంగిపోయిన పక్షంలో అభినయ్ ను ఏమీ చేయను" అన్నాడు రవితేజ
సరిగ్గా అదే సమయంలో....
అభినయ్ కు మెలుకువ వచ్చి కిటికీలోనుంచి బయటకు చూశాడు.
ముందుగా రవితేజ... తరువాత తల్లి కనిపించటంతో బయటకు రాబోయాడు. కానీ బయట తాళంవేసి వుండడంవలన తలుపు తెరుచుకోలేదు. అదంతా రవితేజ కావాలనే చేశాడు అని భావించి పోలీసులకు ఫోన్ చేశాడు.
ఈలోపు అతను పారిపోకుండా వుండడానికై రివాల్వర్ తో కిటికీలోనుంచి గురి పెట్టాడు.
"రవితేజా... మా అమ్మకు ఏదయినా అపకారం తలపెట్టావో షూట్ చేస్తాను"
వసుమతి ఉలికిపడి తలతిప్పి చూసింది.
"బాబూ... తొందర పడవద్దు... రవితేజ నీ శత్రువు కాదు"
ప్రమాదం ముంచుకు వచ్చింది అని అర్ధం కావడంతో తప్పించుకునే ప్రయత్నం చేయబోయాడు రవితేజ. అది గమనించి అభినయ్ రివాల్వర్ పేల్చాడు.
"వద్దు... వద్దు" అంటూనే రవితేజకు అడ్డు వెళ్ళింది వసుమతి.
బుల్లెట్ ఆమె కుడిభుజంలో జొరబడింది.
కెవ్వున కేక... రక్తం చివ్వున బయటకు చిమ్మింది.... అది గమనించిన రవితేజ ఆమెను పడిపోకుండా పొదవి పట్టుకున్నాడు.
రెండవసారి రివాల్వర్ ను ప్రయోగించటానికి అభినయ్ చేయిరాలేదు. కన్నతల్లి పడిపోవడంతో షాక్ కులోనయ్యాడతను.
అప్పటికే పోలీసుల జీప్ బంగళా ముందు ఆగింది.
"బాబూ... పోలీసులు వస్తున్నట్టున్నారు. ఇంటి లోపలినుంచి వెనక్కి పారిపోయి ప్రాణాలు దక్కించుకో.... త్వరపడుకురా తండ్రీ" అంత బాధలోనూ ఆమె రవితేజ ను రక్షించుకోవాలని తాపత్రయ పడిందామె.

 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS