Previous Page Next Page 
రామాయణము పేజి 47



                                  అగ్నిప్రవేశము
    అగ్నిహోత్రుడు: (మందలింపు ధోరణిలో) రామచంద్రా అగ్నితుల్యయగు ఈ పతివ్రతా శిరోమణి కపచారము చేయుటకు రావణుడు సాహసించలేదన్న సత్యము నీకు తెలియదా? ఈ నిష్కళంకకీ అగ్నిపరీక్ష దేనికి?
    పట్టమహిషి సరమాదేవి జానకికి అభ్యంగన స్నానమును చేయించినది; నూతన వస్త్రములను కట్టించినది; ఆభరణములతో అలంకరించినది; శిబికలో మైథిలిని ఎక్కించి ఆమెకెదురుగా తాను ఆసీనయైనది. లంకేశ్వరుడు విభీషణుడు రాజ చిహ్నములను ధరించి సపరివారుడై పల్లకి ననుసరించి వచ్చినాడు.
    శిబిక (పల్లకి) లంకాపురి ప్రాకార సింహద్వారమును దాటినది. ద్వార ప్రాంగణమున వానర యోధులు తండోప తడములుగ వచ్చి మూగియున్నారు. వారు సీతాదేవిని అది వరలో చూడలేదు. ఆమె శ్రీరాముని వద్దకు వచ్చుచున్నదని తెలిసి ఆమెను దర్శించుటకు అచ్చట చేరినారు. విభీషణుని పరివారములోని వేత్రహస్తులు 'అడ్డముగా నున్నారు, తొలగుడు! తొలగుడు!' అని వానరులను తన వేత్రము (బెత్తము)లతో బెదరించసాగినారు. అచ్చట చెలరేగిన కలకాలము సమీపమున గుడారములందున్న రామ లక్ష్మణులకును, సుగ్రీవునకును, అంగద హనుమంతులకును వినపడినది. వారు తమ డేరాల నుండి బయటకు వచ్చినారు. రాముడు బిగ్గరగా, "వానరులను నిరోధించకుడు. వారి తోడ్పాటు వలననే కదా నేను రావణుని వధించి, జానకికి చెఱవిముక్తిని కలిగించ కలిగినాను? జానకి పల్లకిని దిగి పాదచారియై రావలెను. అప్పుడామెను తిలకించుటకు వారికి వీలుగా నుండును" అన్నాడు.
    రాముని కంఠస్వరము వైదేహికి వీనులవిందుగా నున్నది. 'అడుగో నా రాముడు! నా ప్రాణనాథుడు!' అనుకొనుచు ఆమె ఉప్పొంగినది.
    హనుమంతుడును అంగదుడును వానరులను ఇరువంకల బారులుగా తీర్చినారు. ఆ బారుల నడుమ ఏర్పడిన మార్గమున ముందు విభీషణుడును అతని వెనుక సరమయు సీతయు పాడచారులై ప్రవేశించినారు. ఇరువైపులా నుండియు వానరులు 'స్వాగతము, వందనములు!' అని కేకలు వేయుచు తమ ఆనందమును వెలిపుచ్చినారు.
    రాముడు రాజలాంఛనములను ధరించియున్న విభీషణుని అభినందించినాడు. విభీషణుడు 'ఈమె నా పట్టమహిషి సరమాదేవి' అని ఆమెను పరిచయము చేసినాడు. సరమ 'రామప్రభూ నేడు నీ దర్శనము వలన ధన్యనైనాను!' అని నమస్కరించినది.
    పిమ్మట సరమ "చెఱ నుండి విముక్తయైన నీ ధర్మపత్ని సీతాదేవిని తీసుకొని వచ్చినాము. నిన్ను చేరుటకీ సాధ్వి తహతహలాడుచున్నది" అన్నది. అప్పుడు రాముడు ఎవ్వరును ఊహించని విధముగ ప్రవర్తించినాడు.
    రాముడు: (గంభీరముగ౦ జానకి నిన్నపహరించి తీసికొని పోయిన రావణుని వధించి చెఱ నుండి విడిపించి నీ భర్తగా నా విధిని నెఱవేర్చినాను. నీవింక నీ యిచ్చవచ్చిన చోటునకు పోవచ్చును.
    రాముని మాటలు విన్న వారందరును నివ్వెర పడినారు. లక్ష్మణుడు తనలో 'అగ్రజుడు వియోగమున     సీతాదేవి జ్ఞప్తికి వచ్చినపుడు శోకార్తుడయ్యెడివాడు. అంతయు సుఖాంతమైనదని సంతోషించవలసిన సమయమున నిట్లనుచున్నాడేమి?' అని విచారించినాడు. సరమ విభీషణునితో 'అర్ధాంగిని వీక్షించుటతోనే అక్కున జేర్చుకొని ఆదరించుననుకొన్నాను. నాకు ఆశాభంగమును  కలిగించినాడు!' అన్నది. హనుమంతుడు "నేను  విభీషణుని పట్టాభిషేకము అనంతర మీమెను దర్శించి 'తల్లీ నీ కష్టములు అంతమైనవి' అని చెప్పగా సంతోషించినది. నా మాట మిథ్యయైనది! నా శతయోజన సముద్ర లంఘనము వృథాయేనా?" అని వ్యధను చెందినాడు!
    రాముని మాటలు విన్నవైదేహికి నెత్తిపైన పిడుగు పడినట్లైనది. ఆమె దుఃఖముతోనూ అగ్రహాముతోనూ ఇట్లన్నది.
    "నా యిచ్చ వచ్చినచోటునకు పోమ్మంటివి. నా యిచ్చ వచ్చినచోటు నీ సాన్నిధ్యమె కదా? కైకేయి తన వరములో నన్ను చేర్చకపోయినను నిన్ను విడిచియుండలేకనె కదా నేను నీతో వనమునకు వచ్చినాను? నన్ను త్యజించదలచియున్నట్లు అంగుళీయకముతో హనుమంతుని పంపినప్పడే అతనికి  చెప్పియున్నచో నాడే ప్రాణములను విడిచియుండెడి దానను.... మఱదీ లక్ష్మణా. 'మగడు వదలిన యాడుది!' అన్న అపవాదును భరించలేను. నాకు తోడ్పడుము; చితిని పేర్చి అగ్నిని రగుల్చుము. అగ్నిప్రవేశమును చేసి అసువులను వదలెదను"
    లక్ష్మణుడు ఏమీ చేయవలెనో తోచక రాముని వైపు చూచినాడు.
    రాముడు: ఆమె చెప్పినట్లు చేయుము.
    లక్ష్మణుడు విషాదభరితుడై చితిని పేర్చి నిప్పునురగిల్చినాడు. సీత శ్రీరామునకు ముమ్మరు ప్రదక్షిణ మొనరించి అగ్నిప్రవేశమును చేసినది. ప్రేక్షకుల హరవములు మిన్నుముట్టినవి.
    చితిలోని కష్టములు కాలినవి. చితి నుండి వీతిహొత్రుడొక మహావుపురుషుని రూపమున వెలువడినాడు. అతని హస్త ద్వందమున సీతాసాధ్వి యున్నది. ఆమె అగ్ని ప్రవేశమును చేయుటకు ముందేట్లున్నదో ఇప్పుడును అటులనె యున్నది; అనలము (అగ్ని) వలన ఆమెకెట్టి కీడును కలుగలేదు! అతడామెను రాముని ముందుంచినాడు.
    అగ్నిహొత్రుడు: (మందలింపు ధోరణిలో) రామచంద్రా అగ్నితుల్యయగు ఈ పతివ్రతా శిరోమణి కపచారము చేయుటకు రావణుడు సాహసించలేదన్న  సత్యము నీకు తెలియదా? ఈ నిష్కళంకకీ అగ్నిపరీక్ష దేనికి?
    రాముడు: స్వాహవధూ వల్లభా నాకా సత్యము  తెలియును. ఈమె నిష్కళంకయని ప్రజలకు తెలియవలెను. అప్పుడే  ఈమెకు సంఘమున తలనెత్తికొని జీవించుట సాధ్యమగును... ఈమె నిష్కళంకయని ప్రజలు తెలిసికొనుట పాలకునిగ నాకునూ అవసరము. నేను నీతిమంతునిగ పరిగణింపబడుటకు సీత  నిష్కళంకయన్న సత్యము వెల్లడి కావలెను.
    ఆ సమాదానమును విన్న సీతకు రామునిపై కోపము పోయినది. అతడామెను "ప్రాణేశ్వారీ నన్ను  మన్నించుము" అని ఆదరముతో చేర్చుకొన్నాడు. లక్ష్మణుడును, విభీషణుడును సరమాదేవియూ సుగ్రీవఅంగద  హనుమంతులును, వానర యోధులేల్లరును సంతసించినారు.
                   *        *       *                     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS