"బావగారు అసలు మారలేదన్నారు. నువ్వు మారిపోయానంటున్నావు. ముందు మీ దంపతులు ఇద్దరూ ఒక అభిప్రాయానికి రండి! ఆ తర్వాత చర్చించుకుందాం" హాస్పిటల్ ముందు కారు దిగి వేరు వేరు గదుల్లోకి తీసుకుపోయారు. ఇద్దరిని కామన్ గా కొన్ని ప్రశ్నలు వేశారు.
సెక్స్ లో పార్టనర్ కి ఆసక్తి ఉందా? నీకు ఉందా?
పాల్గొంటున్న సమయాన ఇబ్బందులు సమస్యలు ఉన్నాయా?
దాంపత్యంలో ప్రత్యేకమయిన అలవాట్లు, ఫీచర్స్, అపార్ధాలు లాంటివి ఏమయినా ఉన్నాయా? వారి దాంపత్యం ఎలాంటి విపరీతాలు లేని సాధారణ దాంపత్యం అని డాక్టర్స్ ఉభయులూ తేల్చి రిపోర్ట్సు రాశారు.
వంశపారంపర్యంగా వేరు కారణాలను అన్వేషించాలి. సాధారణమయిన దంపతులు, సంతానం కలగపోవటానికి మాములు కారణాలు లేవు.
అసాధారణ మయిన లోపాలు ఏవో వుండి ఉండాలి!
పరీక్షలు చేయటం, అవసరమయితే చికిత్స చేయడం అనివార్యం అని దంపతులను వేరు వేరుగా పరీక్షించిన రెండు వైద్య బృందాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. అన్ని విభాగాలతో నడుస్తున్న హాస్పిటల్ అది.
దాని చీఫ్ రిపోర్టులు చదివి వారికి వివరించాడు.
"పిల్లలు కలగకపోవటానికి కారణం సాధారణమయినది కాదు. అసాధారణమయిన కారణం ఏదో వుంది. పరీక్షలు చేసి నిర్ణయిస్తారు.
అవసరమయితే రిపోర్టులు బొంబాయికాని అమెరికా కాని పంపి రిపోర్టు తెప్పిస్తారు. ఖర్చు మీరు పెట్టుకోదలిస్తేనే బిల్స్ మీద కన్సల్ట్ చేస్తారు.
సజెషన్స్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం వుందా? లేదా?
చికిత్స ద్వారా పిల్లలు పుట్టే అవకాశం వుందా? చికిత్స ఏమిటి?
పిల్లలు కలగటానికి వైద్య పరిధిలో ఈ దంపతులు అవకాశం అసలు పొందగలుగుతారా? అనే విషయాన్నీ కారణాన్ని మీకు వారంలోగా చెప్పగలుగుతాం" అని ముగించాడు చీఫ్.
"డాక్టర్! డబ్బు గురించి ఆలోచించవద్దు! ఎన్ని లక్షలయినా ఫరవాలేదు. మీరు వెంటనే ఏర్పాట్లు అన్నీ చేయండి!" అంటూ అడ్వాన్స్ గా లక్షరూపాయలకు చెక్కురాసి అందించింది ఆమని!
ఈ మాటలు విన్న తరువాత గాయత్రికి గుండెల్లో గాలం పట్టుకుంది.
మామూలు పరీక్షలు మామూలు చికిత్సలు అనుకుని వచ్చింది.
చీఫ్ అసాధారణమయిన అనే పదం ఉపయోగించినప్పుడే ఆమెలో దుఃఖం తాలూకు కెరటాలు లేచినాయి. కారిడార్ లోకి తీసుకువచ్చి వాల్మీకి ఆమని ఆమెను ఓదార్చారు. ఉపశమింపచేశారు.
"అక్కా! ప్రాబ్లంస్ కి పరిష్కారం ఏడుపులో దొరకదు. ఎదుర్కోవాలి! వైద్య శాస్త్రం శిఖరాగ్రాల మీదికి చేరుకున్న కాలం ఇది! దాన్ని అందుకోగల ధనం మనకు వుంది. ఎందుకా దిగులు! పరీక్షలకు వెళ్ళు" అంది ఆమని.
"వెడతాను చెల్లీ! వైద్యశాస్త్రం శిఖరాల మీదికి చేరినా దాన్ని అందుకోగలవచ్చు మనకి ఉన్నా మన కుల దైవం జగదీశ్వరుడు కరుణించకుండా పిల్లలు పుట్టరు" అంది.
15
"మీరు జరిపిన పరీక్షల సారాంశం ఏమిటి?" అని ప్రశ్నించాడు వాల్మీకి.
"పేషెంట్-అంటే మీరు కాదు. మీ భార్య గాయత్రి తల్లి అయేందుకు అవకాశం లేదు. ఈ విషయం నేను మీకు యిప్పుడే చెప్పకూడదు.
రిపోర్ట్స్ తిరిగి వచ్చాక మాత్రమే చెప్పాలి.
ఇలాంటి రిపోర్ట్స్ పంపటం, అవి తిరిగి వచ్చాక కామెంట్స్ చదవటం మాకు అలవాటే? మా పరిధిలో మేము తెలుసుకున్నదే అత్యంత అధునాతనమయిన యంత్ర పరికరాలు నిరూపిస్తాయి.
ఇలాంటి కేసులు నేను చాలా చూచాను! వీరికి పిల్లలు పుట్టరు" అని చెప్పాడు చీఫ్! "కారణం ఏమిటి?" అని ప్రశ్నించింది ఆమని!
అప్ సెట్ అయిపోతున్న గాయత్రిని వదిలేసి వారు ఇద్దరే వచ్చారు. డాక్టర్ మాటలు విని వాల్మీకి కూడా బాగా దెబ్బతిన్నాడు.
"ఆమని మా మనుమరాలికి క్లోజ్ ఫ్రండ్ అట! అది రికమెండ్ చేసింది అందువల్ల రిపోర్టులు వచ్చాక చెప్పవలసిన ఫలితాంశాన్ని ముందు సూచనప్రాయంగా వివరించుతున్నాను. ఆమె తల్లికాదు. కాలేదు! అబ్సర్డ్!
ఎందుకు అని అడుగుతున్నారు కదా!
అమెనించి రిలీజ్ అవుతున్న ఓవమ్ ఫెర్టెయిల్ అవదు. తెలుగులో చెప్పాలంటే గర్భాశయం విడుదల చేసే అండం ఫలదీకరణ పొందదు.
ఫలదీకరణం పొందని పూవు కాయ కాలేదు.
అది వ్యర్ధంగా రాలిపోతూ ఉంటుంది. అంతే!
బ్రహ్మ వ్రాసిన వ్రాత అది. ఎవరూ మార్చలేరు.
వైద్య శాస్త్రం పరిష్కరించలేని సమస్య ఇది.
స్త్రీ గర్భాశయం విడుదల చేసే అండంలో కొన్ని మినరల్స్, ఇమ్యూనిటీ వగైరాలు ఉంటాయి. ఆ వ్యవస్థ ఆమెలో అసలు వికసించలేదు. అండాశయం బాగుంది! అంటే చేను బాగుంది విత్తనాలు పుచ్చిపోయాయి.
ఈ భూమి మీద ఏ దేశంలోనూ దీనికి వైద్యం లేదు. ఆపరేషన్ ద్వారా గుండెను మార్చవచ్చు! మెదడు మార్చవచ్చు! మూత్రపిండాలు ఊపిరితిత్తులు మార్చవచ్చు. గర్భాశయాన్ని కూడా రిపేరు చేయవచ్చు.
కాని అండాన్ని విడుదల చేసే గ్రంధులు జన్మతః సమగ్రంగా ఉన్నాయి. దాన్ని ఆపరేషన్, మందులద్వారా మార్చటం అసాధ్యం!
ఆ గ్లాండ్స్ లోంచి ఫలదీకరణం పొందలేని అండాలు మాత్రమే విడుదల అవుతాయి. ఆత్మీయులుగా భావించి మీకు ఈ విషయం వివరించాను.
ఏ పరిస్థితిలోనూ ఆమె తల్లికాదు. ఇది నూరుశాతం రిజల్ట్! ఒక్క శాతం అవకాశం కూడా మిగిలి లేదు" అని వివరించాడు చీఫ్!
వాల్మీకి ముఖం నల్లగా అయిపొయింది.
"అమెరికా లండన్ లాంటి చోట్లకు తీసుకు వెడితే ఏమయినా ప్రయోజనం వుండవచ్చా."
"నో! అలాంటి అవకాశం వుంటే మీరు అడగకుండా సజెషన్ ఇచ్చేస్తాను. వెళ్ళగలరా లేదా అన్నది మీ సమస్య. అండాశయంలో లోపం వుంటే దాన్ని మార్చేయగల వైద్యం వచ్చింది. కాని అండాన్ని విడుదల చేసే గ్లాండ్స్ లో ప్రకృతి సహజమయిన లోపం ఉంది. ఆ గ్లాండ్స్ శరీరంలో ఒక అవయవం రూపంలో వుండవు. ప్రేరణకలిగించే శక్తులుగా కండరాలుగా ఉంటాయి.
అది వాటి లోపం అని కూడ చెప్పకూడదు.
వాటి స్వభావం ఆ స్థాయిలో ఉంది!
మీరు యాభై కిలోల బరువు ఎత్తగలరు.
మూడు వందల కిలోల బరువు ఎత్తలేరు. ఎత్తలేక పోవడం లోపమంటారా? కాదు అది లోపం కాదు. అదలా వుండడంవల్ల అండాశయానికి లోపం వచ్చింది. మీరు వెయ్యి కిలోల బరువుని చేతితో ఎత్తగలిగేలా ఎవరయినా చేయగలరేమోకాని ఆమె నించి విడుదలయే అండాన్ని ఫలింపచేయలేరు. అనుమానాలన్నీ విడిచిపెట్టండి!
ఆమె తల్లి కాదు కాలేదని ధృవీకరించుకోండి.
రిపోర్టులు అలాగే వస్తాయి. వాటిని మీకు పంపటం జరుగుతుంది!
ఇక వెళ్ళిరండి!" అన్నాడు హాస్పిటల్ చీఫ్!
ఆయన ఎంతో అనుభవం కలవారు.
ఏ విషయమూ నిర్ధారణగా చెప్పరని అంతా చెప్పికూడ అనుమానాలున్నాయంటూ నాన్చుతారని ఆయనకి పేరు. వైద్య శాస్త్రంలో ఎంత తెలిసిన వారికయినా తెలియని విషయాలు కొన్ని వుంటాయి. అందువల్ల సలహా యివ్వాలేకాని పూర్తి నెగెటివ్ గా తేల్చకూడదు అని ఆయన సిద్ధాంతం.
అలాంటి వ్యక్తి అంత దృఢంగా చెప్పారంటే ఇంక తిరుగులేదని అమనికి తెలుసు! ఆమె కూడ బాగా నిరాశతో కుంగిపోయింది.
గలగల మాటాడుతూ వుండే మనిషి గంభీరంగా అయింది.
"బావా మరదళ్ళ విహారం పూర్తి అయిందా?" అని అడిగింది గాయత్రి అపార్టుమెంట్స్ కి రాగానే, ఎవరూ బదులు చెప్పలేదు.
"కాఫీ తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది గాయత్రి.
"అనుమానం ఎందుకు చెప్పేద్దాం" అన్నాడు వాల్మీకి.
"ఇప్పుడే వద్దు బావా! అక్క గాయపడుతుంది. ఇంకా రిపోర్టు రావాల్సి వుంది కదా! అంతవరకూ వాయిదా వేద్దాం! ఇంటికి వెళ్ళాక నిదానంగా సరి అయిన సమయంలో చెప్దువులే!" అంది ఆమని.
ఆమె కాఫీ తెచ్చేసరికి మళ్ళా యిద్దరూ మూగ మనుషుల్లా కన్పించారు.
"మీ మూకీ యాక్షన్ చూడలేకపోతున్నాం బాబూ! టాకీ ప్రారంభించండి. ఎక్కడెక్కడ తిరిగొచ్చారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళారా? రిపోర్ట్స్ వచ్చాయా? మీరిద్దరూ మాటల్లోపడి అసలు నా సంగతే మర్చిపోయారా?" అంది గాయత్రి.
"డాక్టర్ దగ్గరినించే వస్తున్నాం" అన్నాడు వాల్మీకి.
"ఏమన్నారాయన?" అని అడిగింది ఎంతో ఆసక్తిగా.
"ఇంకా రిపోర్ట్సు రాలేదట! ఆ రిపోర్టులు ఎప్పుడొస్తాయో! అక్క ముఖంలో చిరునవ్వులు ఎప్పుడు కనిపిస్తాయో" అంది ఆమని.
"వస్తాయిలే తొందర ఎందుకు? ఇక్కడ కూర్చుని ఎదురుచూస్తూ వుంటే ఆలస్యం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంక వెళ్ళిపోతాం ఆమనీ! వచ్చి పది రోజులు అయిపొయింది కదా?" అంది గాయత్రి.
"వెళ్ళిపోతానని అనకే నాకు దిగులుగా వుంటుంది."
"అందుకే కదా రెండేళ్ళలో ఒక్కసారి కూడా రాలేదు. ముఖం ఎదుట వుంటే ప్రేమ ఒలికించేస్తావు, ముఖం చాటు అయితే మర్చిపోతావు. నీ సంగతి నాకు తెలియదా?" అని దబాయించింది గాయత్రి.
అక్క ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ జాలీగా వుండాలి. కాని బడబానలం లాటి డాక్టర్ రిపోర్టు ఆమెకు తెలిస్తే ఆ ముఖంలో నవ్వు అనేది శాశ్వతంగా మాయమవుతుంది కాబోలు అనుకుంది ఆమని.
