డైరెక్ట్ నవలకి అడ్వాన్స్ కూడా తీసుకొన్నానని నీకు చెప్పాను"
"అవచ్చు. నేను యంత్రాన్నికాదు. నేను మానసికంగా చచ్చిపోయాను. వ్యక్తిగా ఆత్మహత్య
చేసుకొన్నవాడిని. 'నా' అన్నవాళ్లకి దూరం అయిపోయిన దురదృష్టవంతుడిని.
తోడబుట్టిన చెల్లిని, కన్నతల్లినీ కంటితో చూసుకొని నాలుగేళ్లయింది. వాళ్లెలా వున్నారో!"
ఇంత జీవితాన్ని పోగొట్టుకున్న వాడిని కాగితాల మీద కలాన్ని ఎలా పరిగెత్తించగలన్రా!దీనంతటకి కారణం ప్రశాంత్ అనే ఓ మేధావి కారణం. నిన్ను నేను క్షమించినా ఆ దేవుడు క్షమించడ్రా రాస్కేల్."
ప్రశాంత్ కసిగా చూస్తూ అన్నాడు.
"ఇంతకాలం ఎలా పరిగెత్తించావో అలాగే పరుగెత్తించి రాయి. రాయాలి"
"లాభం లేదు.
నాలానే నా కలంకూడా నిర్వీర్యమైపోయింది.
నేను బతుకుతున్న శవాన్ని.
కళ్లముందే కాలి బూడిదైపోయిన నా బతుకుని చూసి క్షణం క్షణం కుళ్లి కుళ్లి ఏడుస్తోన్న శవాన్ని నేను.
రాయడం నువ్వనుకొన్నంత తేలిక కాదు.
ఆదొక యజ్ఞం.
ఈరోజున రచయిత చచ్చిపోయాడు.
ఆ తల్లి సరస్వతీదేవి కటాక్షించి ఇచ్చిన వరాన్ని నేను దుర్వినియోగం చేసినందుకు అలిగి వెళ్ళిపోయింది.
నా నుంచి నువ్వేం ఆశించినా వ్యర్దం.
నేనొక అక్షరంకూడా ఇక రాయను. నన్ను విడిచిపెట్టి మరో తిండికి గతిలేని నాలాంటి బలి పశువుని వెదుక్కో" ఈసడింపుగా ధ్వనించింది సూరిబాబు గొంతు.
ప్రశాంత్ చేతిలోని సిగరెట్ పీకని విసిరి నేలకేసి కొట్టాడు.
"ఒరేయ్ సూరిగా!
నాకు కోపం తెప్పించకు.
నాకు సహనం పోతే పిచ్చికుక్కనై పోతాను" అరిచా డతను.
సూరిబాబు సజావుగా నవ్వాడు.
"కొత్త విషయం చెపుతావనుకొన్నాను. కానీ నీలో నేనెప్పుడూ పిచ్చి కుక్కనే చూశాను. అనవసరంగా నన్నింకా నమ్ముకొని నీ టైమ్ వేస్ట్ చేసుకోకు.
నన్ను విడిచిపెట్టు. నీకు ఏవిధమైన భయం అవసరం లేదురా! నీ గురించి నేనెవ్వరికీ చెప్పను" అన్నాడు సూరిబాబు.
"నాన్సెన్స్! నీ హరికథలు వినడానికి నేను చెవిలో పువ్వు పెట్టుకోలేదుగా ఇడియట్.
నవల రాయగలిన కాలిబర్ వున్న ఏ అనామకుడినీ నాలాంటి పాపులర్ (సూడో) రైటర్ విడిచి పెట్టడు.
ఒక్క విషయం.
నిన్ను విడిచి పెడితే తిరిగి నువ్వు రాయవనే నమ్మకం ఏమిటి?
నన్ను విడిచి వెళ్లి నువ్వు తిరిగి రాయటం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి?
నా పేరుపైన నువ్వు రాసిన నవలల స్థాయి, శైలీకూడా పాఠకులకి తెలుసు.
నేను మరో అనామకుడిని చేరదీస్తే వాడి భాష, శైలి, శిల్పం మారిపోతాయి. అదే సమయంలో నువ్వు బయట విజృంభిస్తే నీ శైలిని పాఠకులు గుర్తిస్తారు.
అది నాకు ప్రమాదం.
నా ప్రత్యర్దులు దీన్ని గమనిస్తే నాకు సమాధి కట్టడానికి చక్కని వ్యూహం పన్నేస్తారు.
నేను పిచ్చివాడిని కాదు.
స్కీమ్ ని ఎలా ఆచరణలో పెట్టాలో తెలిసినవాడిని.
రేపో మాపో చిత్రరంగంలో స్థిరపడబోతున్న డైనమిక్ రైటర్ని. ఈ ప్లానంతా నీపైన ఆధారపడి నేను వేసుకున్న స్కీమ్.
అనవసరంగా నన్ను తినడానికి ప్రయత్నించకు.
నీ పని నువ్వు చేసి తీరాలి?" అన్నాడు ప్రశాంత్.
"చేయను." నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు సూరిబాబు.
"యూ మస్ట్ డూ ఇట్
"చేయను"
"చేయాలి?"అరిచాడు ప్రశాంత్.
"చేయకపోతే ఏం చేస్తావ్?"
"చంపేస్తాను" ఆ మాట అంటున్నప్పుడు అతని దవడ ఖండరం బిగుసుకుంది.
సూరిబాబు నవ్వేశాడు.
"ఆఖరికి డబ్బుకోసం, గ్లామర్ని కాపాడు కోడానికీ హత్యలు చేసే స్థాయికి కూడా దిగజారా వన్నమాట"
"డబ్బు కోసం ఏం చేసినా తప్పులేదు."
సూరిబాబు నిశితంగా చూసి మెల్లగా అన్నాడు.
"పాపం, నీకో నలుగురు అక్క చెల్లెళ్లు వుంటే తెలుసుండేది!"
"దేనికి?"
