ఇంకో విషయం తెలుసా?
ఈ మధ్య కొందరు రైటర్స్ కి వున్న పాపులారిటీని చెడగొట్టడానికి కొందరు గొట్టాంగాళ్లు తాము ఫలానా రచయితకి ఘోస్ట్ చేస్తున్నామని చెప్పుకొంటూ ప్రచారం చేసుకొంటున్నారు అంకుల్. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం పాఠకులవేపునించి కూడా ఆలోచించాలి.
పాఠకులు తెలివి తక్కువవాళ్లు కారు అంకుల్. తమ అభిమాన రచయితలు ఏం రాస్తున్నారు?" ఎలా రాస్తారు అన్న విషయం ఆకళింపు చేసుకొనేవుంటారు. భాష, శైలి శిల్పం, వాళ్లు తీసుకొనే కథా వస్తువు దగ్గరనించి వాళ్లు చాలా జాగ్రత్తగా గమనిస్తారు.
ఘోస్ట్ రైటర్స్ పైన ఆధారపడిన రచయితల పుస్తకాల్లో పుస్తకం పుస్తకానికీ తేడా తెలుస్తుంది.
ఇక్కడ నేను తిరిగి ప్రశాంత్ గురించి మాట్లాడుతున్నాను.
ప్రశాంత్ కి చెందినంతవరకు అలాంటి గాలి వార్తలు లేవు."
"మరి అలాంటప్పుడు అతన్నెలా అనుమానిస్తున్నావ్?"అడిగాడు డి. డి. ఆర్.
"నేను ఆ పాయింట్ కే వస్తున్నాను.
ప్రశాంత్ వ్యక్తిగత జీవితం, అతని అలవాట్లు, ఎలాంటివో మనకి తెలుసు.
ఇన్నిపిచ్చలున్న వాడికి రాయడానికి టైం వుండదు.
రాయడం అనేది సామాన్యమైన విషయం కాదు.
అది తపస్సు.
అదో వరం.
గత జన్మ సుకృతం.
తెలుగు అక్షరాలు వచ్చిన ప్రతివాడూ రచయిత కాలేడు అంకుల్.
పోతే మరో విషయం....
రచయిత అనే వాడికి సమాజం పట్ల ఓ అవగాహన వుంటుంది.
సెంటిమెంట్స్ వుంటాయి.
లేకపోతే ఓ కమిట్ మెంటో వుంటుంది.
ఇవేమీ అతనిలో లేవు.
అందుకే అతను రైటర్ కాదు. కాలేడు.
అమ్మాయిల్ని పడగ్గదిలో పడుకోపెట్టడానికే ఇరవై నాలుగ్గంటలు చాలని వాడు ప్రశాంత్.
వాడిబొంద వాడింకేం రాస్తాడు?
ఇక్కడ నేను ప్రశాంత్ రచనల గురించి మాట్లాడుతున్నాను.
అతని నవలలన్నీ ఓ శైలిలోనే సాగుతున్నాయి. భాష ఒకటే!
అంటే ఎవరో ఒకరిపైనే ఇతను పూర్తిగా ఆధారపడి వుండాలి.
పాపం!
ఏ దురదృష్టవంతుడో ఈ పాపికి సమిధగా మారిపోయి ఈ ప్రశాంత్ అనే మాయగాడికి జీవితాన్ని ప్రసాదించి వుండాలి.
అతనెవరో మనం తెలుసుకోవాలి" అంది విజయ.
డి. డి. ఆర్. చప్పట్లు కొట్టాడు.
"వెరీగుడ్ అనలైజేషన్ బేబీ. నీ అవగాహనకి జోహార్ అనకుండా వుండలేక పోతున్నాను. దీన్ని బట్టి ప్రశాంత్ అనబడే మాయగాడు పెద్ద స్కీమర్ అని మనకి అర్దం అవుతోంది."
"ఇంత చెప్పగలిగిన దానివి ఇప్పుడేం చేయాలో కూడా నువ్వే చెప్పు!" అన్నాడు రంగారావు.
విజయ గర్వంగా చూసింది.
"వాడి పాపులారిటీని దెబ్బతీయాలి.
అతని వెనక వున్న అదృశ్యహస్తం ఎవరిదో తెలుసుకోవాలి.
ప్రశాంత్ నిజరూపాన్ని బయటపెట్టి పాఠకులతో, అభిమానులతో "ఛీ" కొట్టించాలి.
"ప్రశాంత్ డబ్బు పిచ్చి అని శిరీషచెప్పిందన్నావుకదూ మామయ్య!
అందుచేత డబ్బుమీద ఆశ కలిగించే బిజినెస్ లోకి వీడిని లాగి నాశనం చేయాలి!" అంది కసిగా. ప్రశాంత్ కారులో తన పెదవుల మీద పెట్టుకున్న దృశ్యం కళ్లముందు కదిలింది. ఆమె ఒళ్లు గగురుపొడిచింది. కసితో ఆ పెదిమని కొరుక్కొంది.
"వెరీగుడ్ ఐడియా!" అన్నాడు డి. డి. ఆర్.
"ఓ. కే. ఇక ఆట ప్రారంభిద్దాం" అన్నాడు రంగారావు.
"విష్ యూ ఆల్ సక్సెస్" అంది విజయ.
"ఇందులో నీకూ ఓ పాత్ర వుంటుంది" అన్నాడు రంగారావు.
"నాకా?" అంటూ ఆమె చేతుల్ని గుండెలమీద వేసుకొంది. డి.డి. ఆర్. గొల్లున నవ్వసాగాడు.
25
"సూరిబాబూ!" అని పిలిచాడు ప్రశాంత్.
సూరిబాబూ అతనికేసి కూడా చూడకుండానే "ఏమిటి?" అని అడిగాడు.
ప్రశాంత్ సిగరెట్ వెలిగించి అతనికెదురుగా కూర్చున్నాడు.
"సీరియల్ పార్టు పంపించాలని తెలుసు కదూ!"
"తెలుసు."
"మరెందుకు రాయలేదూ?"
"మూడ్ రాలేదు!"
అసహనంగా చూశాడు ప్రశాంత్. కోపంతో అతని కళ్లు ఎర్రజీరల్ని పలుముకొంటున్నాయి.
"చెప్తున్నాను జాగ్రత్తగా విను సూరిబాబూ! నువ్విలా మొండికేస్తే చాలా విపరీతమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. నా సీరియల్ కోసం పత్రికలు, పాఠకులు ఎలా ఎదురు చూస్తుంటారో నీకు తెలుసు. దాన్ని నిర్ణక్ష్యం చేస్తే నేను సహించలేను. అదీకాక పబ్లిషర్ కి డైరెక్ట్ నవల ఇవ్వాల్సి వుంది. దాన్నింకా ప్రారంభించలేదు.
